ది గర్ల్ (నాట్) ఆన్ ది ట్రైన్! రీమేక్ తీసి చూడు! !

the girl on the train
[yasr_overall_rating size=”medium” postid=”2493″]

మూవీ: ది గర్ల్ ఆన్ ది ట్రైన్

రేటింగ్‌ : 2.0/5 (ది గర్ల్ ఆన్ ది ట్రైన్ (2016) రేటింగ్‌ : 4.0/5)

నటీనటులు : పరిణీతి చోప్రా, అవినాశ్ తివారీ, కీర్తి కుల్హరి, అదితి రావ్ హైదరీ

నిర్మాత : రిభు దాస్‌ గుప్తా

దర్శకుడు: రిభు దాస్‌ గుప్తా

విడుదల : ఫిబ్రవరి 26, 2021

నిడివి : 120నిమిషాలు

ఓటీటీ : నెట్‌ఫ్లిక్స్

ఆడియో: హిందీ (ఒరిజినల్), తెలుగు, తమిళ్

సబ్‌టైటిల్స్: ఇంగ్లిష్, హిందీ

“మీరు కొద్దిగా రాజీ పడటానికి అంగీకరిస్తే, ఆ తరువాతి రోజు లేదా తరువాతి వారం మీరు ఇంకొంచెం రాజీ పడటంగా అది ముగుస్తుంది. ఆ తరువాతి వారం తలెత్తి చూసేసరికి హఠాత్తుగా మీరు నిజంగా చేరాలనుకున్న చోటికి అతి దూరంగా ఉంటారు.”

ఎక్కడైనా, ఎప్పుడైనా రీమేక్‌లు లాభసాటి సినిమా వ్యాపారమే. తక్కువ పెట్టుబడితో, తక్కువ వ్యయప్రయాసలతో గ్యారంటీ హిట్‌ను కొట్టడానికి రీమేక్ అడ్డదారి కాదు, దగ్గరి దారి! ఎంచుకునేది ఎలాగూ బాక్సాఫిస్ హిట్‌నే కాబట్టి నోటెన్షన్!

నెట్‌ఫ్లిక్స్ తాజా హిందీ చిత్రం ది గర్ల్ ఆన్ ది ట్రైన్ .. 2016లో అదే పేరుతో వచ్చిన హాలీవుడ్ హిట్‌కు రీమేక్. అది కూడా అదే పేరుతో 2015లో వెలువడ్డ పాలాహాకిన్స్ బెస్ట్ సెల్లర్ నవలకు అనుసరణ లేదా అడాప్టేషన్.

ఇటీవల వచ్చిన ది వైట్ టైగర్ కూడా అరవింద్ అడిగ అదే పేరుతో వెలువరించిన 2008 నవలకు అనుసరణే. నవలలను, కథలను సినిమాలుగా మలచడం కూడా రీమేక్‌లా లాభసాటి వ్యవహారమే గానీ రిస్క్ ఎక్కువ. బాక్సాఫీస్ హిట్‌నే రీమేక్ చేసినా విమర్శలకు గురైన వారికి కొదవ లేదు.

అయినా కలెక్షన్లు కళకళలాడితే చాలు, విమర్శకుల గోల ఎవడికి కావాలి? కాసులు, ప్రశంసలు కూడా రాలక చతికలబడ్డ చిత్రాలూ ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ పరిణీతి చోప్రా తాజా చిత్రం ఆ కోవకు చెందుతుంది.

సైకలాజికల్ థ్రిల్లర్ కాదు… బాలీవుడ్ మార్క్ మర్డర్ మిస్టరీ

రీమేక్ అన్నాక పోలికలు తప్పవు. ఇదేమీ అవతార్(2009) వంటి చిత్రానికి రీమేక్ కాదు. కాబట్టి అది హాలీవుడ్, ఇది బాలీవుడ్ అంటే కుదరదు. పాలా హాకిన్స్ నవల రాకేల్, అన్నా, మెగాన్ అనే ముగ్గురు మహిళల విడివిడి కథనాలుగా సాగే సైకలాజికల్ థ్రిల్లర్.

ది హెల్ప్ (2011) దర్శకుడు టెట్ టేలర్ ముగ్గురికి బదులుగా ప్రధాన పాత్రగా రాకేల్ (హిందీలో మీరా) తో కథనం మలిచారు. వివాహం విఫలమై, ఉద్యోగం కోల్పోయి, తాగుడుకు బానిసైన రాకేల్ (ఎమిలీ బ్లంట్) సబర్బన్ ఏరియాలోని నివాసం నుంచి న్యూయార్క్ నగరానికి రోజూ ట్రైన్‌లో పోయి వస్తూ ఉంటుంది. మాజీ భర్తను అతని రెండో భార్యనూ, ఆ దగ్గరలోనే ఉండే పర్‌పెక్ట్ కపుల్‌గా భావించే మెగాన్ (నస్రత్ హిందీలో) జంటను చూస్తూ ఏవేవో ఊహించుకోవడం రాకేల్‌కు తాగుడుని మించిన వ్యసనం.

రాకేల్ లాగానే మీరా కపూర్ (పరిణీతి చోప్రా) కూడా తప్ప తాగి తిరుగుతూ మాజీ భర్త శేఖర్ (అవినాశ్ తివారీ)ని, అతని రెండో భార్య అంజలి (నటాషా బాంటన్) ని వేధిస్తుంటుంది. కాకపోతే మీరా ఒకప్పుడు గొప్ప లాయర్.

ఒకరోజున నస్రత్ (అదితి రావ్ హైదరీ) ఎవరో కొత్త వ్యక్తితో సన్నిహితంగా ఉండటం చూసి ఆమె భర్తను వంచిస్తున్నందుకు మీరా ఆగ్రహంతో రగిలిపోతుంది. ఆమె ఇంటికి వెళ్లి చావగొట్టేయాలని కూడా అనుకుంటుంది.

ఆ మరుసటి రోజునే నస్రత్ అదృశ్యమైపోతుంది. శవమై దొరుకుతుంది. ఇక అప్పటి నుంచి ఈ రీమేక్‌లోని సైకలాజికల్ థ్రిల్లర్ కనుమరుగవుతూ మరో నాసిరకపు బాలీవుడ్ మర్డర్ మిస్టరీని మనం చూడాల్సిన వస్తుంది.

దారి తప్పిన రీమేక్ ట్రైన్

2016 చిత్రంలో మూడు మహిళా పాత్రల మధ్య కనిపించని అనుబంధాన్ని ఆవిష్కరించడం ముఖ్యమైనది. ఈ హిందీ వెర్షన్ బాలీవుడ్ మసాలా అద్దిన మూల కథకు అనుసరణే అనిపించినా, ఆ తర్వాత పూర్తిగా దారి తప్పిందని అర్థమౌతుంది.

నస్రత్ మొదటే హత్యకు గురవుతుంది. శేఖర్ రెండో భార్య అంజలి పాత్ర నామమాత్రం. కాబట్టి అంతా మీరానే. స్టార్‌డమ్ ఇతర పాత్రలను, కథలను కబళించేస్తుదనేది నిజమే. కానీ అలా జరిగినట్టు లేదు. అంజలి పాత్ర నిజానికి ముఖ్యమైనది. 2016 చిత్రం క్లైమాక్స్‌లో అది కీలకమైనది.

ఆ పాత్రను మింగేసిన దర్శకుడు రిభు దాస్‌గుప్తా ఇన్‌స్పెక్టర్ దల్బీర్ (కీర్తి కుల్హరి) పాత్రను ప్రవేశపెట్టి, రెండో హత్యను చేర్చి, ప్రతీకారాన్ని దట్టించి మరీ ఈ చిత్రానికి ఉభయభ్రష్టత్వాన్ని సంపాదించి పెట్టడానికి నానాపాట్లూ పడ్డారు.

మైఖేల్ (2011), తీ3న్‌ (2016) వంటి చిత్రాలు తీసిన దర్శకుడు ఇలాంటి రీమేక్ చేయడానికి కారణం ఏమిటి? మూల చిత్రాన్ని తలదన్నేదిగా ఈ చిత్రాన్ని మలచడాలనుకోవడమే కారణం కావచ్చు.

ది గర్ల్ అన్ ది ట్రైన్‌ లాంటి వాస్తవానికి కల్పనకు, గతానికి వర్తమానానికి మధ్య సరిహద్దులు చెరిగిపోతున్నమానసిక స్థితి ముఖ్య పాత్రను పోషించే కథను చెప్పడం టెట్ టేలర్‌కు కూడా కష్టమే అయింది. సగటు సినిమాగా మిగిలిపోవాల్సిన చిత్రాన్ని 2016 బాక్సాఫిస్ హిట్లలో ఒకటిగా నిలిచేలా చేసిన ఘనత ఇంగ్లిష్ నటి ఎమిలీ బ్లంట్(రాకేల్‌)దే.

Rosamund pike
Rosamund pike from Gone girl

ఆమెలా పరిణీతి మొత్తం చిత్రాన్ని తన భుజాలకు ఎత్తుకోగలదని ఎవరూ అనుకోరు. క్లోజ్‌-అప్‌ షాట్లలో శూన్యంలోకి చూస్తున్నట్టుండే ఎమిలీ బ్లంట్ చూపులు, విషాదానికి మారుపేరులా కనిపించే ఆమె ముఖం, మౌనంతో ఎన్నో భావాలను పలికించగల, సంభాషణ సాగించగల సామర్థ్యం ఈ చిత్ర తారాగణంలో ఒక్క అదితి హైదరీకి మాత్రమే ఉండి ఉండొచ్చు. అందుకు సూఫీయుమ్ సుజాతయుమ్ (2020) మళయాళ చిత్రమే నిదర్శనం.

అదితినే కాదు, టాబూ, విద్యా బాలన్‌ల వంటివారైనా ఈ చిత్రాన్ని మాత్రం గట్టెక్కించలేరు. ఎందుకంటే ఈ చిత్రం పేరులో తప్ప ది గర్ల్ ఆన్ ది ట్రైన్ ఎక్కడా కనిపించదు. మీరాను ఏ పొరుగింటిలోనో లేక మరెక్కడైనా ఉంచి ఇదే కథను లాగించేయొచ్చు. అవసరమైనప్పుడల్లా మీరా పక్కా తాగుబోతు, డిప్రెషన్‌కు గురై, సైకలాజికల్‌గా గందరగోళంలో ఉన్నమనిషిలా, లేక గొప్ప లాయర్‌లా మారిపోగలదు. చివరికి తుపాకీ పట్టి, మర్డర్ మిస్టరీని ఛేదించే డిటెక్టివ్‌గానూ మారిపోగలదు!

ది గర్ల్ ఆన్ ది ట్రైన్? గాన్ గర్ల్‌?

నిజానికి ఇది రెండు సినిమాలను అడ్డగోలుగా కలగలిపి, పాత్రలను తారుమారు చేసి, బాలీవుడ్ మసాలా దట్టించి వండి వడ్డించిన చిత్రం. పాలా హాకిన్స్ నవలకు, చిత్రానికి మూలం లేదా లేదా స్ఫూర్తి 2013 నాటి సైకలాజికల్ థ్రిల్లర్ గాన్ గర్ల్ నవలనే విమర్శలున్నాయి.

సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రాలకు పేరు మోసిన డేవిడ్ ఫించర్ దర్శకత్వంలో ఆ నవల అదే పేరుతో 2014లో హాలీవుడ్ చిత్రంగా వచ్చింది. పరిణీతి చిత్రం ది గర్ల్ ఆన్ ది ట్రైన్ ఆ చిత్రం డొల్లను మాత్రం తీసుకుని, గాన్ గర్ల్‌లోని అమీ (రోజ్‌మండ్ పైక్) సైకో-క్రిమినల్ మైండ్‌ను మగ విలన్ పాత్రలోకి చొప్పించగా రూపొందింది.

ది గర్ల్ ఆన్ ది ట్రైన్(2016) చిత్రం క్లైమాక్స్‌ను హిందీ చిత్రం క్లైమాక్స్‌తో పోల్చి చూడండి. రెండూ వేరు వేరు సినిమాలని అర్థం అవుతుంది. హిందీ వెర్షన్‌లోని విలన్ చేసే పక్కా ప్లానింగ్ అంతా గాన్ గర్ల్‌ నుంచి స్వీకరించినది. మూలంలో లేని పోలీసుల ఆర్భాటం, అనుమానాలు అన్నీ గాన్ గర్ల్‌ను (అమెజాన్ ప్రైమ్) పోలివుంటాయి. కాదు, ఆ ఘనత అంతా దర్శకుడిదే అంటారా? కావచ్చు.

రీమేక్ తీయడం కష్టమా?

దృశ్యం రీమేక్‌లు అన్నీ హిట్‌లే. కారణం చాలా సింపుల్. పెద్ద మార్పులు ఏమీ చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా తీయడమే. ఒక భారతీయ భాష చిత్రాన్నే ఇతర భారతీయ భాషలలో రీమేక్ చేస్తే గొప్పేముంది? అనొచ్చు.

2016 స్పానిష్ మిస్టరీ థ్రిల్లర్ ఇన్‌విసిబుల్ గెస్ట్‌కి హిందీ రీమేక్ అయిన బద్‌లా (2019) అంత పనీ చేసి చూపింది. అది బాక్సాఫీస్ హిట్ కావడమే కాదు, విమర్శకుల మన్ననలను అందుకుంది. స్పానిష్ చిత్ర కథను మౌలికంగా మార్చకపోవడం అందుకు ముఖ్య కారణం.

అలా అని మార్పులు చేయకపోలేదు. హిందీలో తాప్సీ పోషించిన ప్రముఖ వ్యాపారవేత్త పాత్ర స్పానిష్‌లో మగ పాత్ర. ఇది హిందీలో చేసిన సాహసోపేతమైన మార్పు. కాబట్టి ఆమె ప్రియుడ్నిహత్య చేస్తుంది. అమితాబ్ చేసిన పాత్ర మూలంలో యాక్సిడెంట్‌లో చనిపోయిన డేనియల్ తల్లి పాత్ర. ఈ మార్పు అన్నిటిలోకి కీలకమైనది.

కాబట్టి బద్‌లా స్పానిష్ చిత్రం కంటే ఎత్తున నిలిచింది. కాగా అమృతా సింగ్ మరో ప్లస్ పాయింట్. బద్‌లాకి తెలుగు రీమేక్‌ ఎవరు?(2019) పేరుతో వచ్చింది. హీరో అడవి శేషు కోసం కొంత మార్చినా బద్‌లా మూల కథను మార్చకుండా తీశారు. అమితాబ్‌ని శేషుతో పోల్చలేం. అలాగే బద్‌లాతో ఎవరు? ను పోల్చలేం. శేషు కాస్త అతిగా నటించినా అది కూడా సక్సెస్ అయింది.

తాప్సీ కంటే మిన్నగా రెజీనా కాసాండ్రా ఆ పాత్రలో రాణించారు. రీమేక్‌ల సక్సెస్‌కి కీలకమైన ముఖ్య సూత్రం ఒక్కటే… మూలం ఎందుకు హిట్ అయిందో ఆ మౌలిక కథావస్తువును, కథనాన్నిమార్చకపోవడమే! హిందీ చిత్రం ఆ గోల్డెన్ రూల్‌ని ఉల్లంఘించడమే. ప్రధాన పాత్ర స్వభావాన్నే మార్చింది. ఇక పరిణీతి చోప్రాను ఎమిలీ బ్లంట్‌తో పోల్చకపోవడమే మంచిది.

రివ్యూ : పీవీఆర్

Previous articleదృశ్యం 2 మూవీ రివ్యూ : ముగింపు ఉత్కంఠభరితం
Next articleస్టార్‌లింక్‌ శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది?