భద్రాచలం పర్ణశాల కిన్నెరసాని .. ఒక్క రోజులో మరిచిపోలేని ట్రిప్

godavari at parnasala
పర్ణశాల వద్ద గోదావరి అందాలు

భద్రాచలం రామాలయం, గోదావరి అందాలు, పర్ణశాల, కిన్నెరసాని అభయారణ్యం, కిన్నెరసాని రిజర్వాయర్‌లో బోటింగ్.. సరిగ్గా టూర్ ప్లాన్ చేసుకుంటో ఇవన్నీ ఒకే రోజులో చుట్టేయొచ్చు. ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని చేసి ఆలసిపోతూ ఉంటాం. ఈ బిజీ జీవితం నుంచి విశ్రాంతి తీసుకోవటానికి మనకి ఉన్న సమయం కేవలం వారాంతాలు మాత్రమే.

వీకెండ్‌ వస్తుంది అంటే చాలు హమ్మయ్య ఇక విశ్రాంతి తీసుకోవచ్చు అనుకుంటారు. మరికొందరు అయితే లెట్స్‌ పార్టీ అంటారు. ఇంకా కొందరు టూర్‌కి వెళ్లొచ్చు అని లెక్కలేస్తుంటారు. దాంట్లో నేను మూడో కోవకు చెందిన దాన్ని..

ఆదివారం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తు ఉంటాను. ఆదివారం వస్తుందంటే చాలు ఎక్కడికి వెళదామా అని ప్లాన్‌ చేసుకుంటా. ఒకరోజు దొరికినా చాలు.. అలా బయటికి వెళ్లి కొత్త ప్రదేశాలను చుట్టి రావాలనిపిస్తుంది.

అక్కడి ఉండే వాతావరణం, సంస్కృతి, మనుషులు, వాళ్ల అలవాట్లు.. ఇలా ఒక్కటేంటి అలా మొత్తం అ ప్రాంతం గురించి తెలుసుకుంటా. అలా ఒకరోజు ఎక్కడికి వెళ్లాలని అనుకుంటే వచ్చినే ఆలోచనే భద్రాచలం టూర్.

భద్రాచలం అంటే దేవుడిని దర్శించుకోవడంతో పాటు మరికొన్ని ఆహ్లాదం పంచే ప్రదేశాలని చూడొచ్చని తెలుసుకున్నాను. నేను ఎక్కడికి వెళ్లాను.. ఏం చూసాను అని తెలుసుకోవాలంటే చివరి వరకు చదవాల్సిందే..

భద్రాచలం టూర్ ప్లాన్ చేశామిలా..

భద్రాచలం వెళ్లాలని చాలాసార్లు అనుకున్నప్పటికీ వెళ్లడం కుదరలేదు. ఈసారి ఎలాగైనా వెళ్లాల్సిందేనని ప్లాన్ చేశా. వెంటనే భద్రాచలం… భద్రాచలం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల గురించి క్షణం ఆలస్యం చేయకుండా గూగుల్‌ తల్లిని అడిగేసా.

భద్రాచలం పుట్టుపుర్వోత్తరాల దగ్గర నుంచి ఎలా వెళ్లాలి..  ఎక్కడికి వెళ్లాలి.. ఏయే ప్రాంతాలను చూడాలో కూడా తెలుసుకున్నాను. భద్రాచలంతో పాటు పర్ణశాల, కిన్నెరసాని అభయారణ్యం, కిన్నెరసాని రిజర్వాయర్‌లో బోటింగ్.. అబ్బో చూడాల్సినవి చాలా ఉన్నాయని తెలుసుకుని తప్పకుండా వెళ్లాల్సిందే అని గట్టిగా ఫిక్స్ అయిపోయాం నేను, నా స్నేహితులు.

దాంతో ఇక ఎలా వెళ్లాలి? ఏం చేయాలి?  ఏం చూడాలి? ఎంత ఖర్చు అవుతుంది?  ఎక్కడ తినాలి? అనే ప్రణాళికను సిద్ధం చేసుకున్నాం. దానికోసం దాదాపు ఒకరోజు సమయాన్ని కేటాయించాను అంటే అర్ధం చేసుకోండి.

భద్రాచలం ఎలా వెళ్లాలి?

హైదరాబాద్‌ నుంచి భద్రాచలం 310 కి.మీ. దూరం ఉంటుంది. డైరెక్ట్‌ బస్సు సౌకర్యం ఉంది. టికెట్ ధర కేవలం రూ. 500 మాత్రమే ఉండటం.. ఒక్కరోజు ట్రిప్‌ అవ్వటంతో బస్సునే ఎంచుకున్నాం.
చూడాల్సినవి చాలా ఉండటంతో శనివారం రాత్రికి బస్‌ టికెట్‌ బుక్‌ చేసుకొని మా ప్రయాణాన్ని ప్రారంభించాం. రాత్రి ప్రయాణం కావటంతో ఉదయాన్నే భద్రాచలం చేరుకున్నాం. హోటల్‌ రూం ముందుగా బుక్‌ చేసుకోని ఉండటంతో నేరుగా హోటల్‌కి వెళ్లాం.

అక్కడే ఫ్రెష్‌ అయి దేవుడిని దర్శించుకోవటానికి ముందుగా దేవాలయానికి వెళ్లాం. ఆ రోజు ఆదివారం కావడంతో గుడి చాలా రద్దీగా ఉంది. ఇంకా ఫ్రీ దర్శనానికి అంటే టైం ఎక్కువగా అవుతుందని స్పెషల్‌ దర్శనానికి టికెట్లు తీసుకోవాలని నిర్ణయించుకున్నాం.

ramalayam
భద్రాచలం రామాలయం

అక్కడ పెద్ద క్యూ ఉండటంతో మాకు టికెట్లు దొరకాటానికి దాదాపు 15 నిమిషాల సమయం పట్టింది. అప్పటికి దేవుని అలంకరణ అవుతుండటంతో దాదాపు క్యూలో మరో 45 నిమిషాలు వెయిట్‌ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత దేవుడిని దర్శించుకున్నాం. శ్రీరామనవమికి, హనుమాన్ జయంతికి రామభక్తులు, హనుమాన్ దీక్ష తీసుకునే భక్తులు లక్షలాదిగా ఇక్కడికి వచ్చి రాముడిని దర్శించుకుంటారు.

దైవ దర్శనం తర్వాత లడ్డూ ప్రసాదం తీసుకొని.. అక్కడి నుంచి గోదావరి ఘాట్‌కు వెళ్లాం. గోదావరి ఘాట్‌ వద్ద చాలా నీళ్లు ఉంటాయనుకున్న మాకు ఊహించని పరిణామం ఎదురైంది. వర్షాకాలంలో ఉధృతంగా ప్రవహించే గోదావరి వేసవి దగ్గర పడుతుండడంతో చిన్న పాయలుగా ప్రవహిస్తోంది. ప్రవాహం ఎక్కువగా లేదని తెలిసి బాధపడ్డాం. ఇక చేసేది ఏమి లేక ఉన్న నీళ్లతోనే కాసేపు ఎంజాయ్‌ చేశాం.

godhavari river
పాయలుగా ప్రవహిస్తున్న గోదావరి నది

ఆ తర్వాత అక్కడే ఉన్న ఒక హోటల్‌ దగ్గర టిఫిన్‌ చేసి తిరిగి హోటల్‌ రూంకి వచ్చేశాం. హోటల్‌ రూమ్‌కు తిరిగి వచ్చేసిన వెంటనే లగేజి సర్దుకొని హోటల్‌ రూమ్ ఖాళీ చేశాం. లగేజి బ్యాగ్‌లను తీసుకొని ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం ఆటో స్టాండ్‌ దగ్గర ఆటో మాట్లాకుని పర్ణశాలకు పయనం అయ్యాం.

పర్ణశాల .. గంట ప్రయాణం..

భద్రాచలం నుంచి పర్ణశాల 32 కి.మీ. దూరం ఉంటుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెంలో ఉండే గ్రామమే పర్ణశాల. ఇక్కడికి బస్సు సౌకర్యం ఉంది కానీ ఎక్కువగా బస్సులు ఉండవని కొందరు చెప్పడతో ఆటో మాట్లాడుకొని అక్కడ నుంచి పర్ణశాలకు పయనమయ్యాం.

భద్రాచలం నుంచి పర్ణశాలకు వెళ్లే మార్గ మధ్యలో కనువిందు చేసిన ఆ ఆద్భుతమైన దృశ్యాలు ఇప్పటికి మా ముందు కదలాడుతున్నాయి. పచ్చని వరి పొలాలు, గిరిజన ప్రాంతాలు, ఊరి వాతావరణం ఎంతగానో ఆకర్షిస్తుంది. అలా ఒక గంట ప్రయాణం తర్వాత పర్ణశాల చేరుకున్నాం.

పర్ణశాల గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్‌ చేసుకుంటాను. రామాయణ మహాకావ్యంలో పర్ణశాల గురించి ప్రస్తావన ఉంది. రాముడు వనవాసానికి వెళ్ళినపుడు ఇక్కడ నివసించారని, బంగారు లేడి రూపంలో వచ్చిన మారీచుని ఇక్కడే చంపాడని రామాయణం చెబుతోంది. రావణాసురుడు సీతను అపహరించగా నేలపై ఒక గుంట ఏర్పడిందని, పర్ణశాలలో ఉన్న గుంట ఈ కారణంగా ఏర్పడిందేనని చెబుతారు.  

అలా పర్ణశాలలో దాదాపు 20 నిమిషాల వరకు టైం స్పెండ్చేశాం. అలా అక్కడి నుంచి మరో ప్రాంతానికి ప్రయాణం ప్రారంభించాం.

సీతమ్మ వాగు

పర్ణశాల నుంచి సీతమ్మ వాగుకు ఎక్కువ దూరం ఉండదు. సీతమ్మ వాగును చేరటానికి మాకు 10 నిమిషాల సమయం పట్టింది. సీతమ్మ వాగు గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలేంటంటే.. వాగు వద్ద సీతమ్మ స్నానం చేసిన తరువాత ఇక్కడే ఉండే రథంగుట్ట పై నారచీర ఆరవేశారట. అందుకే దానిపై ఆ చీరల ఆనవాళ్ళు ఏర్పడ్డాయని ఒక కథనం.

అక్కడ పసుపు కుంకుమ రాళ్లు ఉండేవట. వాటితోనే సీతమ్మ పసుపు, కుంకుమ పెట్టుకుందని పురాణాల్లో ఉందని స్థానికులు చెప్పారు. అలా ఆ ప్రదేశాన్ని చూడటానికి మాకు 10 నిమిషాల సమయం పట్టింది. అక్కడి నుంచి కిన్నెరసానికి వెళ్లాలంటే తిరిగి భద్రాచలం మీదుగా పాల్వంచ చేరుకోవాలి. ముందుగా భద్రాచలానికి తిరుగు పయనమై గంటలో చేరుకున్నాం.

కిన్నెరసానికి ముందు లంచ్ బ్రేక్

భద్రాచలం బస్టాండ్‌లో పాల్వంచ బస్సు బయలుదేరటానికి సిద్ధంగా ఉండటంతో ఆ బస్సులో ప్వాలంచకు ౩౦ నిమిషాలలో చేరుకున్నాం. మధ్యాహ్నం కావటంతో అక్కడ ఉన్న ఒక హోటల్‌లో భోజనం బాగుంటుంది అని తెలియడంతో భోజనం చేసి.. తిరిగి మా ప్రయాణాన్ని మొదులుపెట్టాం. ఆ తర్వాత మా ప్రణాళిక ప్రకారం ఆటోలో కిన్నెరసాని వన్యప్రాణుల ఆభయారణ్యానికి చేరుకున్నాం.

పాల్వంచ నుంచి కిన్నెరసాని వన్యప్రాణుల ఆభయారణ్యం 12 కి.మీ. దూరంలో ఉంటుంది. ఇది చేరుకోవటానికి దాదాపు 30 నిమిషాల సమయం పడుతుంది. మేము అక్కడికి వెళ్లటానికి కారణం భద్రాచలానికి దగ్గరగా ఉండటం మొదటిదైతే.. బోటింగ్ సదుపాయం ఉండటం రెండో కారణం.

kinnerasani abhayaranyam
కిన్నెరసాని అభయారణ్యం

కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం, జలాశయం రెండూ పక్కపక్కనే ఉంటాయి. మొదట కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం వెళ్లాం. దాంట్లోకి ప్రవేశించగానే మాకు కొన్ని వందల జింకలు, కోతులు  కనిపించాయి. వాటిని చాలా దగ్గరగా చూడొచ్చు. కొంతమంది వాటికి బిస్కెట్లు కూడా వేస్తున్నారు. అవి చక్కగా నోట్లో పెట్టించుకుని మరీ తింటున్నాయి.

ఆ దృశ్యాలు టూరిస్టులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అక్కడి నుంచి కొంచెం ముందుకు పోతే జలాశయం బోటింగ్‌ పాయింట్‌ మరియు డ్యాం దర్శమిస్తాయి.

కిన్నెరసాని జలాశయంలో బోటింగ్

జలాశయంలో బోటింగ్‌ పర్యాటకులను ఆకట్టుకుంటుంది. బోటింగ్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎత్తైన కొండల మధ్య.. చుట్టూ నీరు.. మధ్యలో చిన్న చిన్న ఐలాండ్‌లు ఇలా ఆ ప్రదేశాన్ని చూస్తుంటే ప్రకృతిలో ఓలలాడుతున్నట్టు ఉంటుంది.

kinnerasani project
కిన్నెరసాని జలాశయం అందాలు

ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో బోటింగ్‌ అంటే మాటాలా.. ఈ బోటింగే మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చింది. బోటింగ్‌ చేస్తూ ఆ ఆద్భుతమైన దృశ్యాలను ఫోన్లలో బంధించాం. ఆ కొండల మధ్య ఉన్న దృశ్యాలు మనస్సుకు ప్రశాంతతనిచ్చాయి అంటే అతిశయోక్తి కాదు.

అలా అక్కడ నుండి డ్యాంపైకి వెళ్లాం. అక్కడి నుంచి జలాశయం కనిపించే తీరు మాటల్లో వర్ణించలేనిది. సూర్యాస్తమయ సమయంలో ఎంతో రమణీయంగా ఉంటుంది. అక్కడ కాసేపు ఉండి ఫోటోలు తీసుకొని.. మరికొంత సేపు జింకలను చూసి కాసేపు వాటితో ముచ్చేటిసి పాల్వంచ బస్టాండ్‌కు వచ్చేశాం.

ముందుగా టికెట్‌ బుక్‌ చేసుకొని ఉండటంతో ఆ రోజు రాత్రి బస్సు ఎక్కి హైదరాబాద్‌కు ఉదయాన్నే చేరుకున్నాం.

భద్రాచలం సహా ఇన్ని ప్రదేశాలు చూసినా మాకు అయిన ఖర్చు కూడా తక్కువే. బస్సు టికెట్లతో కలిపి ఒక్కొక్కరికి కేవలం రూ. 2 వేల కంటే తక్కవే ఖర్చయ్యాయి. ఇలా ఒక్క రోజులో భద్రాచాలం, పర్ణశాల, సీతమ్మ వాగు, కిన్నెరసాని జలాశయం, వన్యప్రాణుల అభయారణ్యాన్ని చుట్టేసాం. ఇంత చెప్పిన… తక్కువే చెప్పినట్లు అనిపిస్తుంది. అంతగా ఎంజాయ్‌ చేశాం.

షార్ట్ ట్రిప్ తో అందమైన, ఆహ్లాదమైన అనుభూతులు సొంతం చేసుకోవాలనుకుంటే ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రదేశాలకు మీరూ మీ స్నేహితులతో కలిసి వెళ్లి ఎంజాయ్‌ చేయండి. ట్రిప్ రెండు మూడు రోజులు వెళ్లాలనుకుంటే పాపికొండలు, మారేడుమిల్లి వంటివి కూడా ప్లాన్ చేసుకోవచ్చు.

– స్వాతి యాపాల, జర్నలిస్టు

ఈ టూర్ ప్లాన్లూ చదవండి

గోవా టూర్ విమానంలో వెళదామా?

అనంతగిరి హిల్స్ టూర్ ఇలా

Previous articleవీరయ్య : తెలుగు గడ్డపై మరో ఏడు తరాల కథ
Next articleజాతి రత్నాలు మూవీ ఎందుకు హిట్ అయ్యింది?