మానసిక వ్యాధి పోవాలంటే ఏం చేయాలి?

mental stress relief
Photo by Zoltan Tasi on Unsplash

మానసిక ఆందోళన లక్షణం మన ముందున్న పరిస్థితి మనకు కష్టంగా ఉండడం. ఈ కష్టం నుంచి బయటపడే మార్గం కనిపించకపోవడం. అది ఆర్థికపరమైన కష్టం కావొచ్చు. వృత్తిపరమైన కష్టం కావొచ్చు. రిలేషన్‌షిప్స్‌కు సంబంధించిన కష్టం కావొచ్చు. శారీరక సమస్యలు కూడా అయి ఉండొచ్చు.

మానసిక వ్యాధిని యోగ పరిభాషలో చెప్పాలంటే.. నాడులు, చక్రాలలో ఉండే ప్రాణ ప్రవాహంలో మార్పులు సంభవించడం. మానసిక వ్యాధి పోవాలంటే దాని మూలాలు తెలుసుకోవాలి.

మనకు కంటికి కనపడే భౌతిక శరీరంతో పాటు ప్రతి మనిషికీ సూక్ష్మ శరీరం ఉంటుంది. దీనిలో నాడులు ఉంటాయి. ఇలా ప్రధానంగా 27 వేల నాడులు ఉంటాయి. ఈ నాడులలో ప్రాణము ప్రవహిస్తూ ఉంటుంది.

ప్రాణము అంటే ఇక్కడ ఆక్సిజన్‌ అని కాదు. ప్రాణములో మళ్లీ పది రకాలు ఉంటాయి. వాటి పేర్లు 1.ప్రాణ 2.ఆపాన 3.ఉదాన 4.సమాన 5.వ్యాన 6. కూర్మ 7. క్రూకర 8. దేవదత్త 9.ధనుంజయ 10.నాగ

ఈ ప్రాణము అనేది చాలా సూక్ష్మంగా ఉంటుంది. మైక్రోస్కోప్‌ లాంటి వాటితో కూడా కనపడదు. ప్రత్యేకమైన సెన్సార్‌తో లేదా కిర్లయన్‌ ఫొటోగ్రాఫ్‌ అనే పరికరంతో కూడా కొంతమేర ఈ ప్రాణమును చూడగలుగుతున్నారు.

ప్రాణము ప్రవహించడానికి ఉపయోగపడే నాడులు, వాటి కేంద్రాల్లో ఏదైనా ఇబ్బంది తలెత్తినప్పుడు ప్రాణము అపసవ్య దిశలో ప్రయాణించడం లేదా నెమ్మదిగా ప్రవహించడం వంటి పరిణామాలు ఎదురవుతాయి.

ఈ మార్పుల వల్లే శారీరక, మానసిక సమస్యలు

ఇలా ప్రాణ ప్రవాహంలో మార్పుల వల్ల మనలో శారీరక, మానసిక మార్పులు సంభవిస్తాయి. వ్యాధులు రావడం లేదా మనలో ఆత్మవిశ్వాసం తగ్గడం, ఆలోచించే విధానంలో మార్పులు వంటివి చోటు చేసుకుంటాయి.

చెదిరిపోయిన లేదా చెడిపోయిన ఈ ప్రాణ ప్రవాహాల దిశను సరిచేయడం వల్ల మళ్లీ మనసు, శరీరం పూర్తి ఆరోగ్యకరంగా, ఉత్తేజకరంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా తయారవుతుంది.

ప్రాణ ప్రవాహాల దిశ సరిచేయాలంటే?

ప్రాణ శరీరాన్ని సరిచేయడానికి మహర్షులు అనేక ఉపాయాలు ఇచ్చారు. వాటిలో మొట్టమొదటిది ఆహారం. అంటే మనం లోపలికి తీసుకునేది.

అంటే మనం నోటి ద్వారా తీసుకున్నదే కాకుండా, కంటి ద్వారా చూసి మనసులో ముద్రించుకునే దృశ్యం. చెవి ద్వారా విని గుర్తుంచుకునే మాట.

ముక్కు ద్వారా పీలుస్తున్న వాసన, వాయువులు. చర్మ స్పర్శ ద్వారా పొందుతున్న అనుభూతి. ఇవన్నీ కూడా ఆహారం కిందికే వస్తాయి.

రెండోది మన శరీరంతో చేసే ఆసనాలు, శ్వాస క్రియ (తీసుకోవడం, వదిలేయడం, ఆపడం వంటి క్రియలు). దీనినే ఒక క్రమపద్ధతిలో ఆచరిస్తే ప్రాణాయామం అంటారు.

ప్రాణ శక్తికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

ఆహారం విషయానికి వస్తే ఎలాంటి ఆహారం తీసుకున్నాం అన్నదానితో పాటు ఎవరి కష్టార్జితం అనేది కూడా ముఖ్యమైనది. ఎవరు వంట చేశారన్నది కూడా మన ప్రాణ గతిని మార్చుతుంది. అందుకే సన్యాసులు, ఆధ్యాత్మికవేత్తలు, దీక్షధారణలో ఉన్నవారు కూడా స్వయంగా వంట చేసుకుని తింటారు.

ఎలాంటి ఆహారం తీసుకోవాలన్న విషయానికి వస్తే మొక్కలు సూర్యరశ్మిని వాడుకుని కిరజన్య సంయోగ క్రియ ద్వారా అవి శక్తి సంపాదిస్తాయి. మొక్కలను తినడం ద్వారా మనుషులు, జంతువులు శక్తిని పొందుతున్నాయి. అంటే మనం సూర్యుని శక్తిని పరోక్షంగా పొందుతున్నాం. (ప్రత్యక్షంగా సూర్యుని నుంచి శక్తి పొందుతూ మరే ఆహారం స్వీకరించని యోగులు ఇప్పుడు కూడా ఉన్నారు).

మనం జంతువులు, పక్షులను తినడం ద్వారా పొందే ప్రాణశక్తి చాలా తక్కువ. మాంసం తిన్నప్పుడు భౌతిక శక్తి వస్తుంది. కానీ ప్రాణశక్తి హరించుకుపోతుంది. అందుకే యోగ సాధకులకు మాంసాహారం నిషేధించారు.

ఇలా మనం ఎటువంటి ఆహారం స్వీకరించాలనేది తెలుసుకుని శరీరానికి, మనకు మేలు చేసేది మాత్రమే స్వీకరించాలి. మనం తినే ఆహారంపైన మన రుషులు ఒక శాస్త్రాన్ని అందించారు. అదే ఆయుర్వేదం.

sprouts
Photo by Sumeet B on Unsplash

మన దేవాలయాల్లో, పూజల్లో ఉపయోగించే పంచామృతం, కొబ్బరి, బెల్లం, పులిహోర, దద్దోజనం, తేనె, ఆవు నెయ్యి .. అన్నీ కూడా మనలో ప్రాణమయ శరీరాన్ని శుద్ధి చేయడానికి ఉద్దేశించినవే.

పచ్చి మొలకలు, సజ్జలు, జొన్నలు, రాగులు, గోధుమ నారు మొదలైనవి మనకు మంచి ప్రాణ శక్తి ఇచ్చే ఆహార పదార్థాలు.

చెవి ద్వారా ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

మనం చెవి ద్వారా తీసుకునే ఆహారం శబ్దం. ఒక క్రమపద్ధతిలో లయబద్ధంగా వచ్చే శబ్దం ఉత్సాహాన్ని, ప్రశాంతతను ఇస్తుంది. కొన్ని రకాల శబ్దాలు మనలో భయాన్ని, ఉద్రేకాన్ని పెంచుతాయి.

ప్రస్తుతం వినోదరంగం మొత్తం మనలో ఉద్రేకాన్ని కలిగించే శబ్దాలను ఉత్పత్తి చేస్తూ బ్రతుకుతోంది. కేవలం ‘రామ’ అనే శబ్దాన్ని పలకడం ద్వారా కిరాతకుడైన ఒక వేటగాడు మహర్షిగా మారాడని మనకు పురాణాలు చెబుతున్నాయి.

దీనిపై మను మహర్షులు ఒక శబ్ద శాస్త్రాన్ని, మంత్ర యోగమును, నాద యోగమును సృష్టించారు. మన సంస్కృత భాష అంతా కూడా మన భావనలను వ్యక్తంచేయడంతో పాటు ప్రాణ ప్రవాహాన్ని సవ్యంగా సాగేందుకు ఉద్దేశించింది. అందుకే దీనిని దైవ భాష అంటారు.

దైవ భాష అంటే దేవతలు మాట్లాడే భాష అని అర్థం కాదు. ఈ భాష పలికిన వాళ్లకు దైవ లక్షణాలు వస్తాయని అర్థం.

దృశ్యం… గాలి, వాసనలు

ఇక దృశ్యం విషయానికి వస్తే, ఒక మంచి ప్రకృతి రమణీయ దృశ్యం. సెలయేరు, అడవి, పంట పొలాలు చూసినప్పుడు ఆహ్లాదకరంగా ఉంటుంది. శవం, లేదా కొన్ని రకాల జంతువులు, జంతువుల వ్యర్థాలు, మనుషుల వ్యర్థాలు చూసినప్పుడు జుగుప్సాకరంగా ఉంటుంది.

ఇక గాలి, వాసన విషయాలకు వస్తే గాలి, ఆక్సిజన్, కార్బన్‌ డై యాక్సైడ్, ఇతర వాయువుల ప్రభావం మన శరీరంపై ఎలా ఉంటుందని ఆధునిక వైద్య శాస్త్రం స్పష్టంగా వివరిస్తుంది.

అలాగే దీని ప్రభావం సూక్ష్మ శరీరంపై కూడా ఉంటుంది. ప్రాణ ప్రవాహాల గతిపై ప్రభావం ఉంటుంది.

ఇక వాసన విషయానికి వస్తే చెడు వాసన, దుర్గంధ పూరిత వాసన రాగానే మనకు తలనొప్పి, వాంతులు సహజంగా వస్తాయి. అదే ఒక గులాబీ పూల వాసన, మల్లె పూల వాసన, ఇతర పుష్పాల వాసన మనకు మంచి అనుభూతి ఇస్తుంది.

దైవానికి అగరు బత్తులు, ధూపం, పుష్పాలంకరణ అనేది మనలోని ప్రాణమయ శరీరాన్ని శుద్ధి చేసుకోవడం కోసమే.

ఇక ఆసనాల విషయానికి వస్తే శరీరంలో ఏ ప్రదేశంలో ఏ నాడులు ఉంటాయి.. ఎలాంటి కదలికలు చేసినప్పుడు ఏయే నాడులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది.. అనేది శ్రద్ధగా గమనించి మహర్షులు మనకు 72 వేల ఆసనాలు అందించారు.

Ranga Reddy

వ్యాస కర్త : చాడ రంగారెడ్డి, యోగ గురువు

Previous articleEarn money from Instagram: ఇన్‌స్టాగ్రామ్‌‌తో డబ్బు సంపాదన ఎలా?
Next articleపచ్చిబఠానీలతో టేస్టీ వడ గారెలు