muthyala dhara waterfalls: ముత్యాల ధార జలపాతం .. తెలంగాణ టూరిజంలో ఓ ఆణిముత్యం

muthyala dhara waterfalls
muthyala dhara waterfalls

muthyala dhara waterfalls: ముత్యాల ధార జలపాతం.. ముత్యం ధార జలపాతం (muthyam dhara waterfalls).. వీరభద్రమ్ జలపాతం.. గద్దెల సరి.. పేరేదైనా తెలుగు రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాల్లో ఇదో అద్భుతం. చుట్టూ పచ్చని చెట్లు.. పక్షుల కిలకిల రాగాలు.. ఎత్తైన కొండలు.. వాటి మధ్యలో నుంచి పాలలాగా జాలూవారే జలపాతం. విటుంటేనే చూడాలని అనిపిస్తుంది కదూ.. అవునులే జలపాతం, పచ్చని చెట్లు అంటే ఎవరు ఇష్టపడరు. ఈ జలపాతం తెలంగాణలోనే ఉంది.

ప్రకృతి ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంటున్న బొగత, కుంతల, గుండాల జలపాతలతో పాటు మరో ఆద్భుతమైన జలపాతం తెలంగాణలో ఉంది. కానీ ఆ జలపాతం చాలా మందికి తెలియదు. అది జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఉన్న రహస్య జలపాతం. దాన్ని కొందరు ముత్యాలధార జలపాతమని మరికొందరు వీరభద్రమ్‌ జలపాతం అని ఇంకొందరు ముత్యం ధార జలపాతమని పిలుస్తుంటారు.

ఈ అద్భుతమైన జలపాతాన్ని చూడటానికి రెండు కళ్లు చాలవు. ఈ జలపాతాన్ని చూడాలంటే కాస్తంత అడ్వెంచర్ చేయాల్సి ఉంటుంది. ఈ జలపాతం విశేషాలేంటి? ఎలా చేరుకోవాలి? అనే విషయాలు చూసేద్దాం.

ముత్యం ధార జలపాతం (mutyam dhara waterfall) విశేషాలు

తెలంగాణ, చత్తీస్‌గడ్‌ రాష్ట్రాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలోనున్న భారీ జలపాతం ఇదీ. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం(కే) మండలంలో ఈ జలపాతం ఉంది. వెంకటాపురం – భద్రాచలం ప్రధాన రహదారికి వీరభద్రవరం నుంచి సుమారు 8 కి.మీ. దూరం అడవిలో కాలినడన ప్రణాణిస్తే ఈ ముత్యం ధార జలపాతం వద్దకు చేరుకోవచ్చు. రామచంద్రాపురం నుంచి వాగులు దాటుకుంటూ వెళ్లినా ఈ జలపాతాన్ని చూడవచ్చు.

దట్టమైన అడువుల్లోని ఎత్తైన గుట్టల నడుమ నుంచి సాక్షాత్తు ఆకాశ గంగే కిందకు దిగివస్తున్నట్లుగా కనిపిస్తున్న జలపాతం పర్యాటకులను కనువిందు చేస్తోంది. అంత ఎత్తు నుంచి పడటం వలన జల ధార ముత్యాల్లా మెరుస్తుంటాయి. ఓ మోస్తరు వర్షానికే జాలువారే నీటి ప్రవాహంతో కిందున్న రాతి పొరలు కోతకు గురై జలాశయంగా ఏర్పడింది.

కొండల నడుమన 700 అడుగల ఎత్తు నుంచి ధారలగా జలపాతం జాలువారుతోంది. అంతపై నుంచి నుంచి నీరు జాలువారుతుంటే చూడటానికి ఎంతో బాగుంటుంది. ఇక దాని దగ్గరికి వెళ్తే ఆ అద్భుతాన్ని మాటల్లో వర్ణించలేం. ఎగువనున్న మూడు, నాలుగు కొండలను దాటుకుంటూ పాలనురగలా కిందకు ప్రవహిస్తూ సుమారు 10 కి.మీ మేర ప్రయాణిస్తోంది. 2016-17 సమయంలో ఈ జలపాతం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ జలపాతం సోయగం పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంది.

ముత్యం ధార ఎలా చేరుకోవాలి?

ముత్యం ధార జలపాతాన్ని (muthyam dhara waterfalls) చేరుకోవాలంటే పర్యాటకులు కాస్త కష్టపడాల్సి ఉంటుంది. ట్రెక్కర్స్‌ వెళ్లే సాహసయాత్రనే చెప్పాలి. హైదరాబాద్‌ నుంచి ముత్యాల ధార జలపాతం దాదాపు 310 కి.మీ దూరంలో ఉంటుంది. ఇక ఖమ్మం నుంచి 200 కి.మీ దూరంలో ఉంటుంది.

వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రం నుంచి ములుగు మీదుగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని ఏటూరునాగారం మండలం ముల్లకట్ట..  వాజేడు మండలం పూసూరు మధ్యనున్న బ్రిడ్జిని దాటుకుంటూ అంటే ఏటూనాగారం దాటాక రైట్‌ తీసుకుని వెంకటాపురం మండలం కేంద్రానికి వెళ్లాలి.

కొత్తగూడెం నుంచి భద్రాచలం మీదుగా అయినా వాజేడుకు చేరుకోవాలి. ఏటూనాగారం నుంచి కేవలం 40 కి.మీ. దూరంలోనే ఉంటుంది. వాజేడు నుంచి 10 కిలోమీటర్ల దూరంలో వీరభద్రపురం గ్రామానికి చేరుకోవాలి. వీరభద్రపురం నుంచి జలపాతం దాదాపు 7 నుంచి 8 కి.మీ ఉంటుంది. అయితే వీరభద్రపురం నుంచి జలపాతాన్ని చేరుకోవాలంటే పర్యాటకులకు రెండు మార్గాలు ఉన్నాయి. 

ఒకటి ట్రాక్టర్. నడవలేం అనే పర్యాటకులు అభయారణ్యం నుంచి సులువుగా జలపాతం వద్దకు చేరుకునేందుకు ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లను నమ్ముకోవాల్సిందే. ట్రాక్టర్‌పై వెళితే జలపాతం వరకు చేరుకోలేం. ఈ ట్రాక్టర్‌ కొంత దూరం మాత్రమే తీసుకెళుతుంది. అక్కడి నుంచి దాదాపు 2 కి.మీ కాలినడకన వెళితే జలపాతం చేరుకుంటాం. జలపాతాన్ని చేరుకోవటానికి విరివిగా ట్రాక్టర్లు అందుబాటులో ఉంటాయి. జలపాతం చేరుకోవడానికి ఒక్కో మనిషికి 500 – 1000 చొప్పున చార్జీలు వసూలు చేస్తున్నారు.

మరొకటి చెట్ల మధ్యలో నుంచి కాలినడకన ట్రెక్కింగ్‌ చేస్తూ కూడా muthyala dhara waterfalls చేరుకోవచ్చు. కాకపోతే కాలినడకన చేరాలంటే కొంచం అడ్వెంచర్ చేయాల్సిందే. కచ్చితంగా నడవగలం అనుకుని, నడవటం బాగా అలవాటు ఉన్నవారే ఇలా చేయాలి.

muthyala dhara route
ముత్యాల ధార వెళ్లే మార్గంలో వాగులు

ఎందుకంటే బాగా వాన పడితే మోకాలి లోతు నీళ్లలో.. అది కూడా అటవీ ప్రాంతంలో గంట సేపు నీటిలో నడుచుకుంటూ వెళ్లాల్సిన వస్తుంది. ఆ విచిత్రమైన అనుభూతిని అస్వాధించాలంటే ఖచ్చితంగా ట్రెక్కింగ్‌ చేయాలి.

ట్రెక్కింగ్ ప్రియులకు ఇది అమితంగా నచ్చుతుంది. సుమారు 6 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణిస్తే జలపాతం వద్దకు చేరుకోవచ్చు. కొంతదూరం వెళ్లిన తర్వాత రాలేం అంటే ఎవరు సహాయం చేయరు. ట్రాక్టర్‌ నడిపే వారు కూడా మొదటి నుంచి ప్రయాణం చేసిన వారినే తీసుకువెళతారు

హైదరాబాద్‌ నుంచి ఈ ప్రాంతానికి డైరక్టుగా టీఎస్‌ఆర్టీసీ బస్సు సౌకర్యాలు లేవు. ప్రైవేటు బస్సు సౌకర్యం ఉంది. ఏటూరు నాగారం వరకు ప్రైవేటు బస్సులో వెళ్లవచ్చు. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులను లేదా ఆటోలను నమ్ముకోవాల్సిందే. ఒకవేళ ఆర్టీసీ బస్సులో వెళ్ళాలి అనుకునే వారు వివిధ బస్సులు మారుతూ ఉండాలి.

ముత్యాల ధార జలపాతం వెనక పెద్ద చరిత్రే..

చెవులకు వినసొంపుగా రాగాలు తీస్తూ కిందకు జాలువారుతున్న muthyala dhara waterfalls చాటున పెద్ద చరిత్రే దాగి ఉంది. జలపాతం దగ్గర ఉన్న కాలువ నీటిని ఆధారంగా చేసుకుని ఆదిమానవులు జీవిచారనేది ప్రచారంలో ఉంది.

స్థానికులు చెప్పినట్లుగా జలపాతం నుంచి వచ్చే నీటి ప్రవాహానికి అడ్డంగా చిన్న, చిన్న ఆనకట్టలు ఉన్నట్లు కనిపిస్తాయి. అక్కడే బంకమన్ను తయారీ వస్తువులు, రాతి ఆయుధాలు ఉన్నట్లు చెబుతారు.

మరోవైపు కొండపైన ఇప్పటికి కొంతమంది మనషులు జీవిస్తున్నారు కానీ వారికి తెలుగు రాదని, ఏడాదికి ఒకసారి కిందకి వచ్చి కావల్సిన వస్తువులను తీసుకువెళ్తారని స్థానికులు చెబుతున్నారు. వారికి ఏమి తెలియదని, వారు వ్యవసాయం చేసుకుని బ్రతుకుతున్నారని, ఆ వ్యవసాయాన్ని కూడా ప్రాచీన పద్ధతుల్లో చేస్తారని స్థానికులు చెబుతున్నారు.

హోటల్స్‌, రెస్టారెంట్స్‌

ముత్యాలధారకు వెళ్లేవాళ్లు దగ్గర్లో ఎక్కడైన స్టే చేయాలంటే ఉంటే ఒక ఆప్షన్‌ హరిత రిసార్ట్స్‌, కాటేజస్‌ మాత్రమే. అవి తప్పించి ఎలాంటి సౌకర్యాలు ఉండవు. ఇక ఫుడ్‌ విషయానికి వస్తే చిన్న చిన్న హోటల్స్‌ కనిపిస్తాయి. కానీ రెస్టారెంట్స్‌ చాలా తక్కువ. చిరుతిళ్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

నాలుగేళ్ల కిందట స్థానికులు గుర్తించిన ఈ muthyala dhara waterfalls ప్రస్తుతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఎంతో ఎత్తులోంచి నీటి ధార పడుతుండటంతో దీన్ని గద్దెల సరి అని స్థానికులు పిలుస్తున్నారు. ఎత్తు విషయంలో దేశంలోని అత్యంత ఎత్తైన జలపాతాలు కర్ణాటకలోని జోగ్‌ జలపాతం, మేఘాలయలోని జలపాతాల సరసన ఇది నిలుస్తుందని పర్యాటకులు చెబుతున్నారు. దేశంలో మూడో ఎత్తైన జలపాతంగా దీన్ని కొందరు అభివర్ణిస్తున్నారు.

muthyam dhara ఈ జలపాతాన్ని చూసేందుకు గ్రామీణ ప్రాంతంతో పాటు పట్టణ ప్రాంతం నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. ముఖ్యంగా వరంగల్‌, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు వర్షాకాలంలో ఎక్కువగా వస్తుండటంతో పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి.

పచ్చదనానికి చిరునామాగా ఉన్న దట్టమైన అడవుల్లో సహజ సిద్ధంగా ఏర్పడిన ముత్యాల ధార జలపాతాన్ని (mutyala dhara waterfall) పర్యాటక ప్రాంతంగా తెలంగాణ టూరిజం శాఖ అభివృద్ధి చేయగలిగితే గద్దల సరి జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని స్థానికులు చెబుతున్నారు.

సో మీరు కూడా ఈ జలపాతాన్ని చూసి నేను చెప్పిన అనుభూతి పొందండి.

– స్వాతి యాపాల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Previous articleLadakh Trip: లద్దాఖ్ బైక్ ట్రిప్ .. మేఘాలలో తేలిపోదామిలా..
Next articleఈ టూల్స్ ఉంటే మీ డిజిటల్ వర్క్ సులువు