Ramappa Temple: రామ‌ప్ప టెంపుల్‌.. ల‌క్న‌వ‌రం ఉయ్యాల వంతెన‌

laknavaram
laknavaram

Ramappa Temple రామప్ప టెంపుల్ .. లక్నవరం సరస్సు.. ఉయ్యాల వంతెన ఇవన్నీ ఒకేసారి చూసొద్దామా.. ఒకటి, రెండు రోజులు గడిపేలా తెలంగాణలోనే అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో ఈ రామప్ప టెంపుల్, లక్నవరం సరస్సు, రామప్ప చెరువు.. ప్రముఖంగా ఉంటాయి.

ఈ ప్రదేశాలు మొత్తం ములుగు జిల్లాలో ఉన్నాయి. ములుగు జిల్లాలో ఉన్న ఈ ప్రదేశాలు చూడడానికి కేవలం రెండు రోజుల సమయం సరిపోతుంది. ఉద్యోగాలకు వెళ్లే వారు తిరిగి సోమవారం ఉదయం ఆఫీసుకు కూడా వెళ్లొచ్చు. ములుగు జిల్లాలో ఉన్న ఈ పర్యాటక ప్రదేశాలను చేరుకోవాలంటే ముందుగా వరంగల్‌ చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ఈ ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రదేశాలను చేరుకోవటానికి విరివిగా బస్సు సౌకర్యాలు ఉన్నాయి. సొంత వాహనాలైతే తొందరగా చేరుకోవచ్చు. ఎక్కువ సమయం ఇక్కడే గడపడానికి కూడా కుదురుతుంది.

ములుగు జిల్లాలో చూడవలసిన పర్యాటక కేంద్రాలైన లక్నవరం సరస్సు, రామప్ప దేవాలయం, రామప్ప చెరువులలో ముందుగా ఏది చూడాలి అనే విషయాలు చూసేద్దాం.

లక్నవరం Laknavaram సరస్సు

ఎటు చూసినా పచ్చని చెట్టు.. చుట్టూ కొండలు.. మధ్యలో సరస్సు. సరస్సు నడుమ రెండు వేలాడే వంతెనలు. తనివితీరా బోటింగ్‌, పర్యాటకులను ఆకర్షించేందుకు ఇంతకంటే ఇంకేం కావాలి. సహజ సిద్ధ అందాలను నెలవైన లక్నవరం.. నిజంగా పర్యాటకుల స్వర్గధామం. తెలంగాణలోని ములుగు జిల్లా లక్నవరం సరస్సు అందాలు వీక్షించాలే కానీ.. మాటల్లో వర్ణించలేనివి.

చుట్టూ ఎత్తైన కొండలు, చెట్లు మధ్య మధ్యలో చిన్న ఐలాండ్స్‌ను కలుపుతూ ఉయ్యాల వంతెన (సస్పెన్షన్‌ బ్రిడ్జి)తో కూడిన లక్నవరం సరస్సు చాలా ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఆహా.. చెరువు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సందర్శకుల మనస్సును ఇట్టే దోచేస్తుంది. కొండల మధ్య దాక్కున్న లక్నవరం సరస్సు కాకతీయ పాలన నుంచి ఉంది. కొన్ని వేల ఎకరాల్లో ఉన్న ఈ చెరువు ప్రస్తుతం పర్యాటకులను ఆకట్టుకుంటున్న బాగా ఆకట్టుకుంటోంది. ఈ ప్రాంతంలో కాసేపు గడిపితే మనస్సుకు దగ్గరై పోతుంది. అంత నిర్మలంగా ఉంటుంది. లక్నవరం సరస్సుకు అదనపు ఆకర్షణ సస్పెన్షన్‌ వంతెన.

ఈ ఉయ్యాల వంతెన (సస్పెన్షన్‌ బ్రిడ్జి) మిమ్మల్నిసరస్సులోని మినీ ద్వీపానికి తీసుకెళుతుంది. చిన్న చిన్న ఐలాండ్స్‌ కలుపుతూ చెరువు పైన 160 మీటర్లు మేర ఈ సస్పెన్షన్‌ బ్రిడి ఎంతో సుందరంగా ఉంటుంది. అయితే ఇక్కడే బస చేయడానికి అనుకూలంగా కాటేజ్‌ల సౌకర్యం కూడా ఉంది. రెండు ఐలాండ్‌లో నిర్మించిన కాటెజ్‌లలో సాధారణ కాటేజ్‌లతో పాటు గ్లాస్‌ కాటేజ్‌లు కూడా ఉన్నాయి. ఇక్కడి నుంచి చెరువు వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది. ఊయల వంతెన సరస్సుకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. ఈ వేలాడే వంతెన పై నడుస్తూ చుట్టూ చూస్తే మరో లోకంలో ఉన్నట్టు ఉంటుంది. ఈ చెరువులో బోటింగ్‌ సౌకర్యంతో పాటు కయాకింగ్‌, సెల్ఫ్‌ బోటింగ్‌, జిప్‌ సైక్లింగ్‌ ఉన్నాయి. లక్నవరానికి వచ్చే సందర్శకులు ఇవి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నా.. తనివి తీరదు.

లక్నవరం Laknavaram ప్రయాణం ఎలా

తెలంగాణలో ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బుస్సాపురం సమీపంలో గుట్టల మధ్య ఉన్న ఈ చెరువు వరంగల్‌ నుంచి 80 కి.మీ ఉంటుంది. ఇక్కడకు చేరుకోవాలంటే ప్రభుత్వ వాహనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ట్రావెల్‌ కంపెనీ యజమానులు వాహనాలను అద్దెకు నడిపిస్తున్నారు. ఎక్కువ మంది ఉంటే బస్సులో వెళితే బాగుంటుంది.

రామప్ప టెంపుల్‌ Ramappa Temple

పచ్చిక బయళ్ళ గుండా రామప్ప ఆలయానికి చేరుకోవచ్చు. ఈ ఆలయ నిర్మాణం సందర్శకులకు ఖచ్చితంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది ఎందుకంటే శిల్పకళ. గోడల నుంచి స్తంభాల వరకు ఎక్కడ చూసినా పురాణాలకు సంబంధించిన అనేకానేక ఘట్టాలను శిల్పాల రూపంలో తీర్చిదిద్దారు. రామప్ప టెంపుల్‌ చుట్టూ వివిధ చిన్న చిన్న దేవాలయాలు కటేశ్వర ఆలయం, కామేశ్వర ఆలయం దర్శనమిస్తాయి.

ramappa temple
ramappa temple

ఇక్కడ పరమశివుడు సహా ఇతర దేవతా విగ్రహాలు కొలువుదీరాయి. ఆలయానికి ఎదురుగా నల్ల రాతితో చెక్కిన ఒక పెద్ద నంది విగ్రహం ఉంటుంది. ఈ నందిని ఎటు నుంచి చూసినా అది మన వైపే చూస్తున్నట్టు కనిపిస్తుంది. మరో అద్భుతం ఏంటంటే ఈ ఆలయ కట్టడానికి ఉపయోగించిన ఇటుకలు నీటిలో తేలుతాయని చెబుతారు.

రామప్ప టెంపుల్ చరిత్ర

వరంగల్‌ ప్రాంతాన్ని ఒకప్పుడు కాకతీయ రాజులు పాలించేవారు. గణపతిదేవ పాలన సమయంలోని సైన్యాధిపతి రేచర్ల రుద్ర పర్యవేక్షణలో ఈ అద్భుత దేవాలయాన్ని రామప్ప నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. అందుకే ఈ ఆలయానికి ప్రధాన దైవం పేరు కాకుండా దానిని రూపొందించిన శిల్పి పేరును పెట్టారు. దక్షిణ భారతదేశంలో ఇలా శిల్పి పేరుతో ఉన్న ఏకైక ఆలయం ఇదే.

రామప్ప టెంపుల్‌కు యునెస్కో గుర్తింపు

ఇటీవల యునెస్కో రామప్ప దేవాలయాన్ని వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చింది. తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడం రామప్ప. ఈ ఆలయానికి దగ్గర్లోనే మానవ నిర్మిత సరస్సు ఒకటుంది. చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములకు సాగునీరు అందించేందుకు ఈ సరస్సును నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ సరస్సే రామప్ప చెరువు.

రామప్ప చెరువు

కంటికి కనిపించినంత దూరమంతా ఆకుపచ్చని చెట్లు, ఎత్తైన కొండలు మధ్యలో నీరు. వింటుంటేనే చూడాలనిపిస్తుంది కదా. రామప్ప గుడికి కేవలం 1 కి.మీ దూరంలో ఉంటుంది ఈ చెరువు. మానవ నిర్మితమైన ఈ చెరువు ద్వారా ఇప్పటికీ వ్యవసాయ భూములకు సాగునీరు అందుతుంది. ఇది అధికారికంగా 6 వేల ఎకరాలకు, అనధికారికంగా 5 వేల ఎకరాలకు సాగునీరందిస్తోంది. అలాగే నాలుగు మండలాల గ్రామాలకు మిషన్‌ భగీరథ కింద తాగునీరు అందిస్తోంది. అయితే ఈ ప్రదేశంలో మోటార్‌ బోటింగ్‌ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఈ అందమైన ఈ సరస్సు ఇప్పుడు తెలంగాణలో అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా మారింది.

రామప్ప చెరువు చారిత్రక నేపథ్యం

రామప్ప చెరువును గణపతి దేవుడి సేనాని రేచర్ల రుద్రుడు క్రీ.శ. 1213లో నిర్మించినట్లు చెరువు పక్కనే ఉన్న శివాలయంలోని శాసనం తెలుపుతుంది. రెండు గుట్టల మధ్యలో ఆనకట్ట నిర్మించడం వలన ఇది కాకతీయుల కాలంలో లోతైన చెరువుగా నిలిచిందంట.

రామప్ప టెంపుల్ ఎలా వెళ్లాలి

ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలంలోని పాలంపేట గ్రామానికి దగ్గర్లో ఉన్న రామప్ప ఆలయం హైదరాబాద్‌ నుంచి 200 కి.మీ. దూరంలో ఉంటుంది. వరంగల్‌ నుంచి 65 కి.మీ దూరంలో ఉంటుంది. ఇక్కడకు చేరుకోవాలనుకుంటే హైదరాబాద్‌ నుంచి హనుమకొండకు, అక్కడి నుంచి రామప్ప ఆలయానికి బస్సులు ఉంటాయి. లేకపోతే హైదరాబాద్‌ నుంచి వరంగల్‌, అక్కడి నుంచి రామప్ప ఆలయానికి చేరుకోవచ్చు. టీఎస్‌ఆర్టీసీ బస్సులు నిరంతరం అందుబాటులో ఉంటాయి. సౌకర్యాన్ని బట్టి ప్రయివేటు వాహనాలు, సొంత వాహనాల ద్వారానైనా చేరుకోవచ్చు.

ఈ మూడు పర్యాటక ప్రాంతాలను అన్నింటిని చూడాలనుకునేవారు ముందుగా లక్నవరం చూసి, మధ్యాహ్నం రామప్ప ఆలయంలో దర్శనం చేసుకుని సాయంత్రం రామప్ప చెరువులో సూర్యాస్తమయాన్ని చూస్తే చాలా బాగుంటుంది. లేకపోతే లక్నవరాన్ని ఒక రోజు పెట్టుకుని, రామప్ప టెంపుల్‌, చెరువును ఒక రోజులో ముగించవచ్చు. ఈ ప్రాంతాలను ఒక రోజు లేదా రెండు రోజుల్లోనే చూడొచ్చు. శీతాకాలంలో సందర్శిస్తే ఎంతో ఆహ్లాదభరితంగా అనిపిస్తుంది. ముఖ్యంగా డిసెంబర్‌ నుంచి ఫిబ్రవరి మాసాల మధ్య వాతావరణం చల్లగా, పర్యటనకు అనుకూలంగా ఉంటుంది.

పర్యాటక కేంద్రాలైన రామప్ప ఆలయం, రామప్ప సరస్సు, లక్నవరం సరస్సులను ప్రస్తుతం పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే సందర్శకులతో అద్భుతమైన పర్యాటక కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. వివిధ జిల్లాల నుంచి పర్యాటకులు వచ్చి ఆహ్లాదం పొందుతున్నారు. వారాంతపు సెలవుల్లో కుటుంబంతో, స్నేహితులతో కలిసి ఇక్కడ అమూల్యమైన సమయాన్ని గడపవచ్చు చిన్నపిల్లల మరింత మెచ్చే ఆహ్లాదకరమైన ప్రదేశం. పెద్ద వాళ్ళు సైతం పిల్లల్లా మారి.. సరదాగా గడుపుతున్నారు. ఆడుతూ పాడుతూ.. బోటు షికారు చేస్తూ.. ఉల్లాసం పొందుతున్నారు.

– నక్షత్ర, ట్రావెల్ జర్నలిస్ట్

Previous articlepalak chutney: పాలకూర చట్నీ.. పావుగంటలో రెడీ
Next articleబెస్ట్ సెల్లర్ వెబ్ సిరీస్ రివ్యూ : థ్రిల్లర్ పండిందా?