వెజ్ బిర్యానీ అంటే చాలా మంది చేయడం కష్టమేమో.. హోటల్లో చేసినట్టు మనం చేయగలమా? అన్న అనుమానంతో ప్రయత్నించడం కూడా మానేస్తుంటారు. కానీ హోటల్ కంటే చాలా టేస్టీగా, చాలా సులువుగా చేయగలిగే వంటకం ఇది. హోటల్ లో డబ్బులు తగలేయడం కంటే.. అన్నం వండినంత సింపుల్ గా ఇంట్లో వెజ్ బిరియానీ చేసుకోవచ్చు.
డబ్బులు ఊరికే రావుగా మరి.. పైగా మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు చక్కటి వెజ్ బిరియానీ అతి తక్కువ సమయంలో చేసి పెడితే వారికి రుచి దక్కుతుంది.. మనకు సంతృప్తి దక్కుతుంది.
పైగా ఇప్పుడు మార్కెట్లో బాస్మతి బియ్యం విరివిగా దొరుకుతున్నాయి. గతంలో ఒకటి రెండు బ్రాండ్లు మాత్రమే ఉండడంతో అత్యధిక నాణ్యత కలిగిన రకం కిలోకు రూ. 200 వరకు వెచ్చించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు నాణ్యత కలిగిన బాస్మతి కిలోకు రూ. 130 నుంచి రూ. 170లలో లభిస్తున్నాయి. అమెజాన్ ప్యాంట్రీ వంటి ఆన్ లైన్ స్టోర్లలో ప్రతి నెలా ఆరంభంలోగానీ, పండగ ఆఫర్లలో గానీ తక్కువ ధరకే లభిస్తున్నాయి.
ఒక కిలో ప్యాకెట్ బాస్మతిలో ఆరు కప్పుల బియ్యం ఉంటాయి. ఒక కప్పు బియ్యం ఒక్కరికి సరిపోతుంది. కాస్త ఎక్కువ లాగించేవారుంటే కిలో ఐదుగిరికి సరిపోతుంది. ఒకటి రెండుసార్లు ప్రయత్నించండి.. ఆ తరువాత మీరే వెజ్ బిర్యానీ సూపర్ గా వండేస్తారు.
వెజ్ బిర్యానీ కి కావాల్సిన పదార్థాలు:
- బాస్మతి బియ్యం 3 కప్పులు
- నీళ్లు 4 కప్పులు
- నెయ్యి 4 టీస్పూనులు
- బిర్యానీ ఆకులు 3
- లవంగాలు 6
- యాలకులు 6
- దాల్చిన చెక్క 1 పెద్దది
- సాజీరా 1 టీస్పూన్
- మిరియాలు ఐదారు
- పచ్చి మిర్చి 3
- ఉల్లి పాయ 1 పెద్దది
- అల్లం పేస్ట్ 1 స్పూన్
- ఫుడ్ కలర్ కొద్దిగా
- క్యారెట్ ముక్కలు అర కప్పు
- క్యాప్సికం ముక్కలు అర కప్పు
- బీన్స్ ముక్కలు అరకప్పు
- పచ్చి బఠానీ అర కప్పు
- ఉప్పు సరిపడా
- కొత్తి మీర కొద్దిగా
- పుదీనా కొద్దిగా
గమనిక: జీడిపప్పు, బ్రకోలి, తదితర పదార్థాలు కూడా ఇష్టాయిష్టాలను బట్టి వాడుకోవచ్చు.
వెజ్ బిర్యానీ తయారీ విధానం స్టెప్ బై స్టెప్
-
- ముందుగా బాస్మతి బియ్యాన్నిశుభ్రంగా కడిగి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి.
- తరువాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని అందులో నెయ్యి వేసుకోవాలి.
- నెయ్యి వేడెక్కాక బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా, మిరియాలు వేసి వేయించాలి.
- తరువాత పచ్చి మిర్చి, ఉల్లి పాయ వేసి బాగా వేగనివ్వాలి.
- ఇప్పుడు పుదీనా వేసి ఆ తరువాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, క్యాప్సికం, బీన్స్, పచ్చి బఠానీ వేసి ఫ్రై చేయాలి.
- తరువాత ముందుగా నానబెట్టిన బియ్యాన్ని వేసి నీళ్లు పోయాలి.
- ఇప్పుడు ఫుడ్ కలర్, ఉప్పు వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. అన్నం ఉడికిన తరువాత పైన కొద్దిగా కొత్తిమీర వేసికోవాలి. అంతే వెజ్ బిర్యానీ రెడీ. వడ్డించేసి మీరూ లాగించేయండి.
– కిరణ్మయి, ఫ్రీలాన్స్ రచయిత
ఇవి కూడా చదవండి
♦ షీర్ ఖుర్మా సిద్ధం చేద్దాం ఇలా..