Vaginal Problems During Pregnancy: గర్భధారణ సమయంలో యోని పరిశుభ్రతతపై మరింత శ్రద్ధ వహించాలి అంటున్నారు వైద్యులు. తల్లి, బిడ్డ ఆరోగ్యం యోని శుభ్రతపై ఆధారపడి ఉంటుంది అంటున్నారు. అందుకే గర్భధారణలో వచ్చే యోని సమస్యలను తేలికగా తీసుకోకూడదని.. వాటికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ.. వైద్యుల సూచనలు ఫాలో అవ్వాలంటున్నారు.
ప్రెగ్నెన్సీ సమయంలో శరీరంలో అనేక మార్పులు వస్తాయి. గర్భం అనేది స్త్రీ జీవితంలో ఓ అందమైన ప్రయాణంగా చెప్పవచ్చు. అయితే కొన్నిసార్లు గర్భధారణ వల్ల లేదా పరిశుభ్రతలో లోపాల కారణంగా యోని సమస్యలు వస్తాయి. అందుకే యోని శుభ్రతపై మరింత శ్రద్ధ వహించాలి. ఇది తల్లి, శిశువు ఆరోగ్యానికి చాలా మంచిది. లేదంటే కొన్ని ఇన్ఫెక్షను మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతాయి. అయితే గర్భధారణ సమయంలో యోని శుభ్రతపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డియర్ అర్బన్ మీకు అందిస్తోంది.
వైట్ డిశ్చార్జ్..
గర్భధారణ సమయంలో వచ్చే అత్యంత సాధారణ మార్పులలో వైట్ డిశ్చార్జ్ ఒకటి. సాధారణంగా ఇది అందరిలోనూ ఉంటుంది. అయితే గర్భం ధరించిన వారిలో ఇది కాస్త ఎక్కువగా ఉంటుంది. తెల్లగా, తేలికపాటి వాసనతో విడుదలయ్యే డిశ్చార్జ్‌ను ల్యూకోరియా అంటారు. ఇది హార్మోన్లలో మార్పులు, పెరిగిన రక్త ప్రసరణ కారణంగా విడుదలవుతుంది. ఇది ఒక్కోసారి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి గాలి ప్రసరణ ఉండేలా కాటన్ లోదుస్తులను ధరించండి. దీనివల్ల అసౌకర్యం కాస్త తగ్గుతుంది. సువాసన కలిగించే ఉత్పత్తులను ఉపయోగించడం మానుకోండి. యోనిని శుభ్రం చేయడం కోసం సున్నితమైన, సువాసలేని సబ్బులను వినియోగించండి. డిశ్చార్జ్‌లో రంగు మార్పు, దుర్వాసన, దురద ఉంటే డాక్టర్ని సంప్రదించండి.
ఈస్ట్ ఇన్ఫెక్షన్లు
గర్భధారణ సమయంలో రోగనిరోధక వ్యవస్థ కాస్త బలహీనంగా ఉన్నప్పుడు లేదా హార్మోన్ల ప్రభావం వల్ల శరీరంలో ఈస్ట్ పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. ఇది కాన్డిడియాసిస్ వంటి ఈస్ట్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. తద్వారా యోని వద్ద దురద, మంట, ఎరుపు, మందపాటి వైట్ డిశ్చార్జ్ అవుతుంది. ఈ ఇన్ఫెక్షన్లను నివారించడానికి యోని ప్రాంతాన్ని వీలైనంత శుభ్రంగా ఉంచాలి. మీ జననేంద్రియ ప్రాంతానని పొడిగా, శుభ్రంగా ఉంచుకోవాలి. యోని శుభ్రం చేసే వాష్‌ల వినియోగాన్ని ఆపేయండి. ఎందుకంటే వీటి వల్ల మీ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశముంది. సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోండి. అవసరమైతే సురక్షితమైన యాంటీ ఫంగల్ చికిత్స కోసం వైద్యుని సంప్రదించండి.
యూటీఐ సమస్యలు
మూత్రాశయం మీద పెరిగే గర్భాశయం ఒత్తిడి కారణంగా యూటీఐ సమస్యలు వస్తాయి. అందుకే గర్భాధారణ సమయంలో ఈ అంటువ్యాధులు చాలా సాధారణం. అయితే ఈ సమస్య వల్ల మూత్ర ప్రవాహాం నెమ్మదించేలా చేస్తుంది. ఈ సమయంలో మూత్రనాళం నిండుగా ఉన్న విసర్జన చేసిన సమయంలో తక్కువగా విడుదలవుతుంది. దీనివల్ల తరచుగా మూత్రవిసర్జన్ చేయాలనే ఫీల్ ఉంటుంది. కానీ మూత్ర విసర్జన కాక యోనిలో మంటగా అనిపిస్తుంది. ఇది పొత్తికడుపులో నొప్పిని కలిగిస్తుంది.
యూటీఐ సమస్యను నివారించడానికి, మూత్రనాళం నుంచి బ్యాక్టీరియాను ఫ్లష్ చేయడానికి, తరచుగా మూత్రవిసర్జన చేయడానికి పుష్కలంగా నీరు తాగాలి. టాయిలెట్ ఉపయోగించిన తర్వాత యోనిని ముందు నుంచి వెనుకకు తుడుస్తూ నీటితో కడగండి. ఇలా చేయడం వల్ల మూత్రనాళానికి బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా నిరోధిస్తుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే.. ఇది తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. సమస్య చేయి దాటిందనిపిస్తే వెంటనే వైద్యునితో మీ సమస్య గురించి చర్చించండి.
హెమోరాయిడ్స్
గర్భధారణ సమయంలో వచ్చే మరో సమస్య హెమోరాయిడ్స్. దీనివల్ల మల ప్రాంతంలో రక్తనాళాల వాపు ఉంటుంది. ఇది పేగు కదలికల సమయంలో నొప్పి, దురద, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కటి రక్తనాళాలపై పెరిగిన ఒత్తిడి, హార్మోన్ల మార్పుల వల్ల ఈ సమస్య కలుగుతుంది. ఈ సమయంలో మలబద్ధకాన్ని నివారించడానికి అధిక ఫైబర్ కలిగిన ఆహారాన్ని తీసుకోండి. లేదంటే ఇది హెమోరాయిడ్స్‌ను తీవ్రతరం చేస్తుంది. మూత్ర విసర్జన అనంతరం సువాసన లేని వైప్ లేదా నీటిని వినియోగించి శుభ్రం చేయండి. మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం మరచిపోవద్దు. సమస్య ఎక్కువైతే వైద్యుడిని సంప్రదించండి.
సున్నితమైన చర్మానికి..
గర్భధారణ సమయంలో హార్మోన్లు జననేంద్రియ ప్రాంతాన్ని మరింత సున్నితంగా మార్చగలవు. కాబట్టి కఠినమైన సబ్బులు, బట్టలు మీకు చికాకు కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మీకు చికాకు, దురద, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అందుకే దీనిని శుభ్రం చేసుకోవడానికి సువాసన, గాఢత ఎక్కువగా లేని ఉత్పత్తులను ఎంచుకోండి. వదులుగా, మెత్తగా ఉండే లో దుస్తులు ధరించండి. ఇవి మీ సమస్యను తగ్గిస్తాయి. పరిస్థితి మరింత ఇబ్బంది పెడితే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించి మెరుగైన చికిత్స తీసుకోండి.