Sexual Health : శారీరక లేదా మానసిక కారణాల వల్ల పురుషుల్లో, మహిళల్లో లైంగిక కోరికలు తగ్గిపోతూ ఉంటాయి. మీరు కూడా ఆ లిస్ట్‌లో ఉంటే మీరు తినే ఫుడ్‌లో కొన్ని మార్పులు చేసుకోవాలి అంటున్నారు నిపుణులు. ఇవి మీలో ఒత్తిడి, ఆందోళన తగ్గించి లిబిడో, లైంగిక కోరికలు పెంచుతాయంటున్నారు.
సాధారణంగా శరీరంలో లైంగిక కోరికలు తగ్గిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. మానసిక, శారీరకంగా జరిగే కల్లోలం కచ్చితంగా లైంగిక కోరికలపై ప్రభావం చూపిస్తుంది. మీరు తీసుకునే ఆహారం, మీ నిద్ర విధానం, జీవనశైలి వంటి ప్రతి అంశం దీనిపై కచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తాయి. అయితే మీ లిబిడోను మెరుగుపరచుకోవడం కోసం మీరు వైద్యుడిని సంప్రదించవచ్చు. అయితే దీనితో పాటు మీరు తీసుకునే ఆహారంలో పలు మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి మీ మొత్తం ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు.. లైంగిక పనితీరును మెరుగుపరుస్తాయి. ఇంతకీ ఏయే ఆహారాలు తీసుకుంటే మీలో కోరికలు పెరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
దానిమ్మ రసం
దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది లైంగిక కోరికను పెంచుతుంది. ఇది సహజమైన టెస్టోస్టెరాన్ బూస్టర్. ఎందుకంటే తక్కువ టెస్టోస్టెరాన్ తక్కువ లిబిడోకు సమానం. ఇది ఎల్లాజిటానిన్‌లను కలిగి ఉంటుంది. ఇది టెస్టోస్టెరాన్‌ను ఈస్ట్రోజెన్‌గా మార్చడాన్ని పరిమితం చేసి.. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. తద్వారా అంగస్తంభనను నయం చేస్తుంది.
పుచ్చకాయ జ్యూస్
పుచ్చకాయలో ఉండే సిట్రులిన్ శరీరంలో నైట్రిక్ యాసిడ్‌గా మారుతుంది. ఇది పురుషాంగంలో రక్త ప్రవాహాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. తద్వారా అంగస్తంభనను సమస్యను దూరం చేస్తుంది.
క్యారెట్ జ్యూస్
క్యారెట్‌లలో చాలా బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది శక్తిని, లైంగిక కోరికను పెంచుతుంది. పొద్దున్నే దీనిని తీసుకుంటే మెరుగైన ఫలితాలుంటాయి.
కుంకుమపువ్వు
ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్, యాంటీ డిప్రెసివ్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది పురుషుల్లో, స్త్రీలలో లైంగిక సంతృప్తిని పెంచుతుంది. పాలతో కలిపి తీసుకోవచ్చు.
ఖర్జూరం
ఖర్జూరం స్పెర్మ్ నాణ్యత, పరిమాణం పెంచుతుంది. ఇది పురుషుల్లో సంతానోత్పత్తికి అత్యంత మెరుగైన ప్రయోజనాలు అందిస్తుంది.
అవకాడోస్
అవకాడోస్ హెల్తీ ఫ్యాటీ యాసిడ్, బోరాన్, విటమిన్ ఇతో నిండి ఉంటుంది. దీనిలోని బోరాన్ టెస్టోస్టెరాన్ క్షీణతను నిరోధిస్తుంది. ఇది అంగస్తంభనను సమస్యను తగ్గిస్తుంది.
ఇవే కాకుండా తాజా పండ్లు, కూరగాయలు తీసుకుంటూ ఉండాలి. వాటిలో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అధిక ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ డోపమైన్ సంశ్లేషణను, లిబిడోను పెంచుతుంది. ఇది రక్తప్రవహాన్ని ప్రేరేపించి.. సంతానోత్పత్తి పెంచుతుంది.