వేసవి తాపాన్ని తగ్గించే పండ్లను తినడం ద్వారా వేడి నుంచి ఉపశమనం పొందవచ్చు. విపరీతమైన ఎండలు, వేడి గాలులతో సతమతమయ్యే పరిస్థితి నుంచి కాస్త ఊరట పొందవచ్చు. మండే ఎండలను తట్టుకోలేక రకరకాల పానీయాలను, రసాయనాలతో తయారుచేసిన కూల్‌డ్రింక్‌లతో కడుపు చల్లబరుచుకునేందుకు ప్రయత్నిస్తే ఆరోగ్యం ఇంకా దెబ్బతింటుంది.
వేసవిలో సాధారణంగా శరీరం బాగా డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది. చెమట ఎక్కువగా పట్టడంతో శరీరంలో ఉన్న నీరంతా బయటకు పోయి తద్వారా ఎంతో అలసట, నీరసనానికి గురవుతుంది. తరుచూ నీటిని ఎక్కువగా తీసుకోవడం చాలా అవసరం. అయితే ఒక్క నీరు తాగడం మాత్రమే కాదు. నీటితో పాటు వివిధ రకాల పండ్లను మన రోజువారీ డైట్‌లో భాగంగా తీసుకోవడం వల్ల ఎండ వేడి నుంచి ఉపశమనం కలగడమే కాక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.
సీజనల్‌గా దొరికే పండ్లను తినడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. వేసవిలో శరీరాన్ని ఎంత కూల్‌గా ఉంచుకుంటే అంత మేలు జరుగుతుందని శరీరం డీహైడ్రేషన్‌కు గురి కాకుండా ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరి ఈ వేసవిలో ఎండ తాపాన్ని తగ్గించే పండ్లు ఏమిటి? ఎలాంటి పండ్లతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ పండ్లతో మేలు
1. పుచ్చకాయ:
వేసవిలో పుచ్చకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో నీరు పుష్కలంగా ఉంటుంది. పైగా వేసవిలో ఎక్కువగా దొరుకుతుంది. వేడి తాపం నుంచి తక్షణ ఉపశమనాన్ని పొందాలంటే తప్పకుండా పుచ్చకాయను తరచూ తీసుకోవాలి. ఇందులో శరీరానికి కావలసిన విటమిన్స్, మినరల్స్ కూడా లభిస్తాయి.
2. బొప్పాయి:
వేసవిలో తినాల్సిన పండ్లలో మరొక ముఖ్యమైన పండు బొప్పాయి. దీనిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే విటమిన్ సి రోగనిరోధకాన్ని పెంచుతుంది. అంతేకాకుండా ఫైటోకెమికల్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఆరోగ్యానికి మంచిదే కాని మితంగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో వేడి చేసే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.
3. మామిడి:
మామిడి వేసవిలో లభించే సీజనల్ ఫ్రూట్. ఎండ వేడి నుంచి తట్టుకునేలా తక్షణ శక్తిని అందిస్తుంది. దీనిలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. అంతేకాక పోటాషియం, విటమిన్ ఎ, సి వంటివి ఉంటాయి. తద్వారా శరీరాన్ని వేసవి తాపం నుంచి కాపాడుకోవచ్చు.
4. జామకాయ:
ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో జామకాయ అతి ముఖ్యమైనది. దీనిలో వివిధ రకాల పోషకాలు లభించడంతో పాటు మధుమేహంతో బాధపడేవారికి ఇది సూపర్ మెడిసిన్ అని చెప్తారు. జామకాయ చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. జీర్ణసంబంధ సమస్యలు తలెత్తవు.
5. కర్భూజ:
వేసవిలో మాత్రమే లభించే పండ్లలో కర్భూజ (మస్క్ మెలన్) ఒకటి. ఇది సీజనల్‌గా లభించే పండు కనుక తప్పనిసరిగా రోజూ ఏదో ఒక రూపంలో దీనిని తీసుకోవాలి. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. ఎక్కువ నీటిశాతాన్ని కలిగి ఉంటుంది. విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటుంది. కర్భూజ వివిధ చర్మ సంబంధ సమస్యల నుంచి కాపాడుతుంది. దాహాన్ని తీరుస్తుంది. కర్భూజలో బీటాకెరోటిన్, యాంటీఆక్సిడెంట్ ఉండడం వల్ల శరీరంలో ఉండే అనేక రకాల ఫ్రీరాడికల్స్‌ను దూరం చేస్తుంది.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్