వేస‌విలో పిల్ల‌ల‌కు చ‌ల్ల‌ని పానీయాలు త‌యారుచేయండిలా..

drink, glass, lime
వేసవిలో పండ్ల రసాలు Photo by PhotoMIX-Company on Pixabay

వేస‌వి వేడి నుంచి ఉప‌శ‌మ‌నం పొందేందుకు ఆరోగ్య‌క‌ర‌మైన చ‌ల్ల‌ని పానీయాలు తీసుకోవ‌డం చాలా అవ‌స‌రం. ముఖ్యంగా పిల్ల‌లు ఎక్కువ‌గా డీహైడ్రేష‌న్‌కు గుర‌వుతుంటారు. అలాంట‌ప్పుడు వారికి త‌రుచూ ఇంట్లోనే ప‌ండ్ల ర‌సాల‌ను ఇవ్వ‌డం వల్ల శ‌రీరానికి త‌గిన శ‌క్తి ల‌భిస్తుంది. బాడీ హైడ్రేట్‌గా ఉండ‌డానికి ఉపయోగపడుతుంది. అందులోనూ పిల్ల‌లు ఎప్పుడూ రుచికరమైన, తీపి పదార్థాలను ఎక్కువ‌గా తిన‌డానికి, తాగడానికి ఇష్ట‌ప‌డతారు. వాతావ‌ర‌ణంలో  పెరిగిపోతున్న వేడి కారణంగా పిల్లలు చల్లని ఐస్ క్రీమ్‌లు, కూల్‌డ్రింక్‌ల కోస‌మే పరుగులు తీస్తారు. క‌నుక వేస‌విలో మ‌న ఆరోగ్యంతో పాటు పిల్ల‌ల ఆరోగ్యంపై శ్ర‌ద్ద చూపాల్సి ఉంటుంది. ఈ స‌మ‌యంలో  కూల్ కూల్‌గా ఉండే పండ్ల ర‌సాల‌ను అందిస్తే ఇక వాళ్లు ఎంతో ఉత్సాహంతో ఉర‌క‌లు వేస్తారు.  తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలతో ఉన్న ఈ పానీయాలు పిల్ల‌ల‌కు ఎంతో మ‌జానిస్తాయి. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం వెచ్చ‌ని వేస‌విలో చ‌ల్ల‌ని పానీయాలు తయారు చేసి మీ పిల్ల‌ల‌కు ఆరోగ్యాన్ని అందించండి.  

1. ఆరెంజ్ జ్యూస్:

దీనికి కావలసిన పదార్థాలు:

తాజా  ఆరెంజ్ తొనలు – ఒక  కప్పు

తరిగిన ఆపిల్ ముక్కలు –  ఒక కప్పు

ఐస్ క్యూబ్స్ –  రెండు లేదా మూడు

పంచ‌దార – ఒక టేబుల్ స్పూన్ (తేనె వేసుకోవ‌చ్చు)

తయారీ విధానం:

బ్లెండర్ కానీ జ్యూస్ జార్ కానీ తీసుకుని పైన చెప్పిన పదార్థాలన్నింటిని వేసి బాగా గ్రైండ్ చేయండి. ఐస్ క్యూబ్స్ వాడడం ఇష్టం లేనివాళ్లు ముందుగా క‌ట్ చేసిన ఫ్రూట్స్ ముక్క‌ల‌ను ఫ్రిజ్‌లో పెట్టుకుని త‌ర్వాత‌  జ్యూస్ త‌యారీకీ వేసుకుంటే ఐస్ క్యూబ్స్ వేయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. అంతే చ‌ల్ల చ‌ల్ల‌ని ఆరెంజ్ జ్యూస్ రెడీ.. పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేస్తే అదిరిపోతుంది.

2. పుచ్చకాయ మరియు నిమ్మకాయ జ్యూస్:

కావలసిన పదార్థాలు:

పుచ్చకాయ ముక్కలు –  రెండు కప్పులు

నిమ్మరసం –  ఒక టేబుల్ స్పూన్

తేనె –  ఒక స్పూన్

సాల్ట్ –  చిటికెడు

తరిగిన పుదీనా ఆకులు –  కొన్ని

తయారీ విధానం:

ముందుగా పుచ్చకాయను చిన్న ముక్కలుగా క‌ట్ చేసుకుని ఉంచుకోవాలి. అందులో గింజలను తొలగించి ఒక గంట సేపు ఫ్రిజ్లో ఉంచండి. ఇప్పుడు బ్లెండర్‌లో కానీ మిక్సీ జార్‌లో కానీ పుచ్చకాయ ముక్కలు, నిమ్మరసం, తేనె, ఉప్పు మరియు పుదీనా ఆకులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. జ్యూస్ కొంచెం చిక్కగా ఉన్నట్లయితే కొంచెం నీటిని కలుపుకోవ‌చ్చు. అంతే  కూల్‌గా పుచ్చ‌కాయ జ్యూస్ రెడీ. ఇది రోజులో ఏ స‌మ‌యంలో తాగినా మంచి శ‌క్తిని ఇస్తుంది.

3. కర్బూజ జ్యూస్:

కావలసిన పదార్థాలు :

క‌ర్బూజ ముక్క‌లు – ఒక క‌ప్పు

నారింజ రసం –  ఒక కప్పు

తేనె –  ఒక్క స్పూన్

నిమ్మరసం  – ఒక స్పూన్

తయారీ విధానం:

ముందుగా కర్బూజ‌ను శుభ్రం చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఆ తరువాత మిగతా పదార్థాలు అన్నింటిని అందులో కలిపి బ్లెండర్‌లో గానీ జ్యూస్ జార్లో గానీ వేసి గ్రైండ్ చేసుకోండి. కావాలనుకుంటే అందులో రెండు లేదా మూడు ఐస్ ముక్కలను వేసుకోండి. ఇష్ట‌మైన వాళ్లు కొంచెం కాచి చ‌ల్లార్చిన పాల‌ను కూడా క‌లుపుకోవ‌చ్చు. అంతే క‌మ్మ‌ని క‌ర్భూజ జ్యూస్ రెడీ. ఇది వేస‌వికి చాలా మంచి పానీయం. క‌ర్భూజ‌లో నీటిశాతం ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల వేస‌విలో శ‌రీరం డీహైడ్రేష‌న్ నుంచి ఉప‌శ‌మ‌నం పొందుతుంది. ఇది ఎండ‌వేళ‌లో ఎక్కువ‌గా తీసుకోవ‌డం మంచిది.

4. ద్రాక్ష పండ్లు మరియు పైనాపిల్ జ్యూస్:

కావలసిన పదార్థాలు :

ద్రాక్షపండ్లు – రెండు కప్పులు

పైనాపిల్ ముక్కలు  – రెండు కప్పులు

లెమన్ జ్యూస్ – ఒక  టేబుల్ స్పూన్

సాల్ట్ – చిటికెడు

బ్రౌన్ షుగర్  – (లేదా తేనె వేసుకోవ‌చ్చు) –  ఒక టేబుల్ స్పూన్

తయారీ విధానం:

ముందుగా ద్రాక్షపండ్లను శుభ్రంగా కడిగి గింజలను తొలగించి ఉంచుకోండి. త‌ర్వాత పైనాపిల్ ముక్క‌లు, లెమ‌న్, షుగ‌ర్, సాల్ట్ యాడ్ చేసుకుని ఆపై మొత్తం అన్నీ బ్లెండ్  చేసి 20 లేదా 30 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచితే  చల్లని  ద్రాక్ష పానీయం సిద్దం. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. క‌నుకు పిల్ల‌లు బాగా ఆస్వాదిస్తారు.

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Previous articleWeekend Releases: ఈ వీకెండ్ థియేట‌ర్, ఓటీటీలో సంద‌డి చేయ‌నున్న సినిమాలివే!
Next articleBitter gourd pickle Recipe: కాక‌ర‌కాయ నిల్వ ప‌చ్చ‌డి.. ఎప్పుడైనా చేశారా! ఇలా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది