White Hair home remedies: ఈ రోజుల్లో జుట్టు తెల్లబడటం అనే సమస్య అందిరినీ వేధిస్తుంది. చిన్న వాళ్ల దగ్గర నుంచి యువకులు, టీనేజ్ అమ్మాయిలు, అందరిదీ ఇదే సమస్య. ఇది వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరినీ ఆవేదనకు గురిచేస్తుంది. మరి తెల్ల జుట్టు సమస్య నుంచి బయటపడాలంటే కొన్ని చిట్కాలను పాటించక తప్పదు.
తెల్ల జుట్టు ఎందుకు వస్తుంది?
తెల్లజుట్టు రావడానికి ఎన్నో కారణాలు చెప్పుకోవచ్చు. ఇప్పుడు మారుతున్న జీవనశైలి, వాతావరణంలో మార్పులు, సరైన పోషకాహారం లేకపోవడం, కల్తీ ఆహారం, జన్యుపరమైన లోపాలు, ఒత్తిడి, థైరాయిడ్, శరీరంలో అధిక వేడి వంటివి తెల్లజుట్టు రావడానికి కారణమవుతాయి. ఇప్పుడన్న ఉరుకుల పరుగుల జీవితంలో జుట్టును సంరక్షించుకునే తీరిక లేకపోవడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. దీనివల్ల మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడిన హెయిర్ కలర్స్‌ను ఎక్కువగా వాడేస్తున్నారు. ఇది జుట్టును రానురాను జీవంలేని జుట్టుగా తయారుచేస్తుంది.
కనుక తాత్కాలికంగా రంగును ఇచ్చే కలర్స్ వాడేబదులు కొంచెం సమయం తీసుకుని ఎక్కువకాలం జుట్టును ఆరోగ్యంగా ఉంచే సహజమైన వాటిని ప్రయత్నించడం ఉపయోగకరం. అసలు మనం తినే ఆహారాలే జుట్టును ప్రభావితం చేస్తాయి. కనుక మంచి పోషకాలు ఉండే ఆహారపదార్థాలను తీసుకుంటే చాలు జుట్టు ఊడకుండా, తెల్లబడకుండా అందమైన జుట్టును సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని చిట్కాలను ఇక్కడ తెలసుకుందాం.
1. ఉసిరికాయతో తెల్లజుట్టుకు చెక్:
ఉసిరి జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి జుట్టు నెరిసిపోకుండా కాపాడడంలో సహాయపడుతుంది. అలాగే జుట్టుకు మంచి పోషణ ఇచ్చి ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. ఈ ఉసిరి యాంటీ ఆక్సిడెంట్-రిచ్, యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. తలస్నానం చేసేముందు ప్రతీసారీ జుట్టుకి గోరువెచ్చని ఉసిరి నూనెను సున్నితంగా మసాజ్ చేయడం ద్వారా జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ అంది పట్టుకుచ్చులా జుట్టు మెరిసిపోతుంది. అదేవిధంగా ఉసిరి రసాన్ని కండీషనర్‌లా ఉపయోగించవచ్చు. దీని వల్ల తెల్ల జుట్టు రాకుండా లేదా తెల్లగా ఉన్న వెంట్రుకలను నల్లగా మార్చేందుకు సహాయపడుతుంది. అలాగే జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి తెల్ల వెంట్రుకలు రాకుండా ఉండడానికి ఉసిరిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఉసిరికాయలను ఏదోక రూపంలో తీసుకుంటూ ఉండాలి.
ఉసిరి చిట్కా: ఉసిరి పొడిలో కొంచెం నిమ్మరసం కలిసి తలకు పట్టించి రెండు గంటల తర్వాత గాఢత లేని షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉండడంతో పాటు జుట్టు తెల్లబడకుండా మంచి నిగారింపును ఇస్తుంది. ఇది కనీసం వారానికి ఒకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
2. బ్లాక్ టీ:
తెల్లజుట్టును అధిగమించడంలో బ్లాక్ టీ అనేది చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. రెండు టీ స్పూన్ల బ్లాక్ టీ ఆకులను ఒక కప్పు నీళ్లలో వేసి మరిగించాలి. ఇది చల్లారిన తర్వాత మిశ్రమం మొత్తాన్ని జుట్టుకు బాగా పట్టించాలి. దీన్ని ఒక గంట పాటు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రంగా షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి లేదా రెండు వారాలకొకసారి పెట్టుకుంటే జుట్టుకు సహజమైన కలర్ వస్తుంది.
3. బియ్యం నీళ్లు:
బియ్యం నీరు జుట్టు నిగారింపును అందిస్తుంది. అంతేకాకుండా ఇది సహజమైన షాంపూగా ఉపయోగపడుతుంది. ఇది మీ స్కాల్ప్ యొక్క pH స్థాయిలను సమతుల్యం చేస్తుంది. సహజ నూనెలను చెక్కుచెదరకుండా ఉంచుతుంది. బియ్యం నీరు జుట్టు చిట్లిపోకుండా అలాగే జుట్టును సహజంగా ఒత్తుగా మార్చడానికి సహయపడుతుంది. జుట్టు కుదుళ్లు బలంగా తయారవడానికి బియ్యం నీరు తోడ్పడుతుంది. ఇందులో మినరల్స్, విటమిన్లు మరియు అమినో యాసిడ్స్ ఉంటాయి. ఇవన్నీ జుట్టు తెల్టగా అయ్యే సమస్యను తగ్గించేవే.
చిట్కా: రెండు స్పూన్ల బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి అందులో కొద్దిగా నీరు పోసుకుని రాత్రి పులియబెట్టుకోవాలి. ఉదయాన్నే ఈ పులిసిన బియ్యం నీళ్లను తలకు, స్కాల్ప్‌కు అప్లయ్ చేసుకుని గంట పాటు ఆరనివ్వాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి ఖచ్చితంగా చేస్తే జుట్టు ఊడకుండా, తెల్లబడకుండా చక్కటి ఫలితాన్ని అందిస్తుంది.
4. ఉల్లిపాయ రసం:
ఉల్లిపాయ రసం జుట్టుకు పోషకాలు అందిస్తుంది. ఇది యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాల వల్ల స్కాల్ప్‌ను ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. సల్ఫర్‌ను అధికంగా కలిగి ఉండడం వల్ల జుట్టు పెళుసుగా మరియు విరిగిపోకుండా చేస్తుంది. ఇది యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. తద్వారా జుట్టు తెల్లబడకుండా ఉండేందుకు సహాయపడుతుంది. ఉల్లిపాయ రసాన్ని క్రమం తప్పకుండా జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు కుదుళ్లను బలంగా తయారుచేస్తుంది. కారణం ఇందులో కేటలీస్ అనే హెయిర్ ఎంజైమ్ ఉంటుంది. ఇది జుట్టుకు అద్భుతమైన యాంటీ ఏజింగ్ ప్రయోజనాలను అందిస్తుంది.
చిట్కా: కొన్ని ఉల్లిపాయ ముక్కలను తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వడకట్టుకోవాలి. వచ్చిన రసాన్ని వెంటనే తలకు పట్టించి, నూనె లేదా సీరమ్ లాగా మసాజ్ చేయండి. ఇది 15-20 నిమిషాలు ఉంచి ఆపై సాధారణ షాంపూతో తలస్నానం చేయండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
5. కరివేపాకు:
జుట్టుకు మంచి పోషణ ఇవ్వడానికి, అలాగే సహజమైన రంగును ఇచ్చేందుకు కరివేపాకు ఉపయోగపడుతుంది. జుట్టు ఊడకుండా, ఒత్తుగా ఉండడానికి ముఖ్యంగా తెల్లబడకుండా ఉండడానికి కరివేపాకు మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఇది బెస్ట్ హోం రెమిడీ. మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెలో ఒక గుప్పెడు కరివేపాకులను తీసుకుని వేడిచేయాలి. దీన్ని బాగా మరిగించిన తర్వాత స్కాల్ప్ నుంచి జుట్టు చివరి వరకూ అప్లయ్ చేయండి. తర్వాత సున్నతంగా మసాజ్ చేయండి. గంట తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
విటమిన్ బి ఆహరాన్ని తీసుకోండి
విటమిన్ బి జుట్టు మరియు చర్మ ఆరోగ్యానికి చాలా అవసరం. విటమిన్ బి1 లో థయామిన్, బి2 లో రైబోఫ్లావిన్ మరియు విటమిన్ బి5లో ఉండే పాంతోతేనిక్ యాసిడ్ ఇవన్నీ ఆరోగ్యానికి మంచివి. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బయోటిన్ లేదా విటమిన్ బి7 చాలా అవసరం. అయితే, ఫోలిక్ యాసిడ్ లోపం కూడా తెల్ల జుట్టుకు కారణం కావచ్చు. బి విటమిన్ల మోతాదు కోసం గుడ్లు ఎక్కువగా తినండి. ఎక్కువ పోషకాహారం గుడ్ల నుంచే వస్తుంది. అలాగే బీన్స్, తాజా చేపలు, ఓట్ మీల్, పెరుగు, చికెన్ ఉపయోగపడుతాయి.
అయితే, తెల్ల వెంట్రుకలు ఏర్పడకుండా నిరోధించడానికి మరొక ముఖ్యమైన పోషకం రాగి. రాగి లోపం తెల్ల జుట్టుతో ముడిపడి ఉందని అధ్యయనాలు తేల్చాయి. రాగి జుట్టులో మెలనిన్ ఉత్పత్తిని నిర్వహిస్తుంది. ఫ్రీ రాడికల్ డ్యామేజ్‌ను నివారించడంలో సహాయపడుతుంది. రాగితో మీ శరీరాన్ని బలపరుచుకుంటే, తెల్ల వెంట్రుకలు అకాలంగా ఏర్పడే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. పుట్టగొడుగులు, నువ్వులు, జీడిపప్పు, చిక్పీస్, అవకాడోలు మీ ఆహారంలో భాగం చేసుకోవాలి.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్