Carrot sago Payasam: క్యారెట్ సగ్గుబియ్యం పాయసం చేస్తారనే విషయం ఎంతమందికి తెలుసు? క్యారెట్‌తో ఎంతో రుచికరమైన హాల్వా చేస్తారు. అదే క్యారెట్‌తో పాయసం కూడా క్షణాల్లో రెడీ చేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పిల్లలకు చాల హెల్తీ కూడా. మరి కమ్మని పాయసం రెడీ చేసేద్దాం రండి.
క్యారెట్ అనగానే పిల్లలు తినడానికి అస్సలు ఇష్టపడరు. అదే క్యారెట్ హల్వానో లేక క్యారెట్ జ్యూస్ లేక ఇలా క్యారెట్ పాయసమో అయితే పిల్లలు ఇంకా కావాలని అడుగుతారు. పైగా సగ్గుబియ్యం కూడా తినడానికి రుచిగానే అనిపిస్తాయి. మామూలుగా ఏదైనా పండగ వస్తేనో లేక ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్‌కి పాయసం చేయడం సర్వసాధారణం. అలాంటప్పుడు ఎప్పుడూ చేసే సగ్గుబియ్యం పాయసం మాత్రమే కాకుండా ఇలా క్యారెట్‌ను కలిపి సగ్గుబియ్యం పాయసం చేస్తే అటు ఆరోగ్యమూ అందుతుంది. ఇటు ఎంతో టేస్టీగా ఉంటుంది.
సగ్గుబియ్యాన్ని ఆంగ్లంలో ‘సాగో’ అని, హిందీలో ‘సాబుదానా’ అని అంటారు. వీటిని ఉపయోగించి పాయసమే కాకుండా రకరకాల పిండివంటలు తయారుచేస్తారు. అలాగే క్యారెట్‌ను తప్పనిసరిగా రోజూ ఆహరంలో భాగం చేసుకోవాలి. క్రమం తప్పకుండా క్యారెట్ జ్యూస్ తాగడం వలన రక్తహీనత రాకుండా కాపాడుకోవచ్చు. అలాగే వీర్య వృద్ది జరుగుతుంది. ఈ స్పెషల్ రెసిపీని పిల్లలు మరియు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తినొచ్చు. ఈ రెసిపీలో కొంచెం వెరైటీగా క్యారెట్ మరియు కొన్ని డ్రై ఫ్రూట్స్ జోడించి పాయసం తయారుచేస్తే మరింత టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా రుచి చూడాలంటే ఒకసారి ప్రయత్నించి చూడండి. ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూసేయండి.
క్యారెట్ సగ్గుబియ్యం పాయసానికి కావలసిన పదార్థాలు:
- సగ్గుబియ్యం – ఒక కప్పు
- పాలు – రెండు కప్పులు
- పంచదార – 250 గ్రాములు
- క్యారట్ తురుము – ఒక కప్పు
- డ్రైఫ్రూట్స్ – కొద్దిగా
- ఏలకుల పొడి – ఒక టీ స్పూన్
- నెయ్యి – రెండు టీ స్పూన్లు
క్యారెట్ సగ్గుబియ్యం పాయసం తయారు చేయు విధానం:
- ముందుగా సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక కప్పు నీటిలో సుమారు రెండు గంటలపాటు నాననివ్వాలి.
- తర్వాత స్టౌ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని ముందుగా తీసుకున్న డ్రైఫ్రూట్స్‌ని వేసుకుని కొద్దిసేపు వేపుకోవాలి.
- అవి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి.
- తర్వాత అదే ప్యాన్‌లో క్యారెట్ తురుము వేసుకుని పచ్చివాసన పోయేవరకూ వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు అందులో మూడు కప్పుల నీరు పోసుకుని మరుగుతున్న సమయంలో ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి.
- సగ్గుబియ్యం కాస్త ఉడికిన తర్వాత పాలను పోసుకుని కొద్దిగా మరిగించి అందులో క్యారెట్ తురుమును వేసుకోండి.
- క్యారెట్ తురుము కొద్దిగా ఉడికిన తరువాత పంచదారను జోడించి బాగా కలుపుకోవాలి.
- ఏలకులపొడి వేసి బాగా కలిపి 10 నిముషాలు ఉంచాలి.
- చివరగా వేయించి ఉంచుకున్న జీడిపప్పులు, కిస్మిస్లు వేసి కలిపి దించేయాలి. అంతే క్యారెట్ సగ్గుబియ్యం పాయసం రెడీ. ఎంతో టేస్టీగా, కమ్మగా ఉండే ఈ హెల్తీ రెసిపీని ఎప్పుడైనా చేసుకుని తినేయచ్చు.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్