ప్రైమ్‌‌, నెట్‌ఫ్లిక్స్‌, హాట్‌స్టార్‌.. ఏ ఓటీటీ బెస్ట్

OTT
ఈవారం ఓటీటీ, థియేటర్ సినిమాలు Image by Mudassar Iqbal from Pixabay

ది డిజిటల్‌ యుగం.. సినిమాలు, సీరియల్స్‌, స్పోర్ట్స్‌ చూడటానికి ఓ టీవీ, కేబుల్‌ లేదా డీటీహెచ్‌ కనెక్షనే అవసరం లేదు. ఇంటర్నెట్‌ ఉంటే చాలు. మిమ్మల్ని అన్‌లిమిటెడ్‌ ఫన్‌తో అలరించడానికి అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, ఎక్స్ ట్రీమ్, జీ 5 వంటి ఓటీటీ (ఓవర్‌ ద టాప్‌) స్ట్రీమింగ్‌ సర్వీసులు బోలెడు ఉన్నాయి.

ఇలాంటివి ప్రస్తుతం మన దేశంలో 40 సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అయితే అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌, హాట్‌స్టార్‌, ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ (Airtel Xstream)లాంటివి కాస్త ఫేమస్‌. సగటున రోజుకు ఒక్కో సబ్‌స్క్రైబర్‌ ఓటీటీ సర్వీస్‌ మీద 30 నుంచి 50 నిమిషాలు గడుపుతున్నట్లు లేటెస్ట్‌ సర్వే ఒకటి తేల్చింది.

ఓవర్‌ ద టాప్‌.. సింపుల్‌గా ఓటీటీ అంటే ఏమీ లేదు. ఇంటర్నెట్‌ ద్వారా స్ట్రీమింగ్‌ చేసే సర్వీసులను ఈ పేరుతో పిలుస్తున్నారు. ఓటీటీ స్ట్రీమింగ్‌లోకి ఎయిర్‌టెల్‌ రూపంలో మరో టెలికాం కంపెనీ కూడా కొత్తగా అడుగుపెట్టింది. ఇప్పుడు ఒకే సర్వీస్‌ ఇస్తే మార్కెట్‌లో మనుగడ సాగించడం కష్టం. అందువల్ల ఈ ఓటీటీ స్ట్రీమింగ్‌లోకి చాలా కంపెనీలు వస్తున్నాయి. వీటిని సబ్‌స్క్రైబ్‌ చేసుకుంటే చాలు. కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, ఇతర టీవీ షోలను చూడొచ్చు.

ప్రస్తుతం మార్కెట్‌లో నాలుగు ఓటీటీ స్ట్రీమింగ్‌ సర్వీసులకు ఎక్కువ డిమాండ్‌ ఉంది. ముందు వీటిలో ఏది బెస్ట్‌ అన్నది తేల్చుకోవాల్సి ఉంటుంది. ఇవి అందించే ధరలు, స్ట్రీమింగ్‌ రెజల్యూషన్‌, డౌన్‌లోడ్‌ ఆప్షన్స్‌, చూడగలిగే స్క్రీన్ల సంఖ్యను తెలుసుకుంటే మన బడ్జెట్‌కు ఏది బెస్ట్‌ అన్నది తెలిసిపోతుంది. వీటికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని డియర్‌అర్బన్‌.కామ్‌ మీకోసం అందిస్తోంది.

ఓటీటీ సర్వీసుల ప్లాన్స్‌

ఇంట్లో కేబుల్‌ లేదా డీటీహెచ్‌ కనెక్షన్‌ ఉంటే నెలకు కొంత డబ్బు చెల్లిస్తాం కదా. అలాగే ఓటీటీ సర్వీసులకు కూడా చెల్లించాల్సి ఉంటుంది. నెల లేదా ఏడాది సబ్‌స్క్రిప్షన్ ఒకేసారి తీసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్‌లో ఉన్న టాప్‌ స్ట్రీమింగ్‌ సర్వీస్‌లలో ఏది ఏ ధరకు అందుబాటులో ఉందో ఒకసారి చూద్దాం.

1. ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ 

– సబ్‌స్క్రిప్షన్‌

ఎయిర్‌టెల్‌ టీవీనే ఆ సంస్థ ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ పేరుతో కొత్తగా తీసుకొచ్చింది. ఈ సర్వీసులను ఎయిర్‌టెల్‌ పోస్ట్‌పెయిడ్‌, ప్రీపెయిడ్‌, బ్రాడ్‌బ్యాండ్‌, డీటీహెచ్‌ వాడుతున్న వారికి పూర్తి ఉచితంగా అందిస్తోంది. ఇందులో ప్రీమియం కంటెంట్‌ కూడా ఉంది. దీనికింద లేటెస్ట్‌ టీవీ షోలు, సినిమాలు, వీడియోలు, లైవ్‌ టీవీ చూడొచ్చు.

ఈ ప్రిమియం కంటెంట్‌ కూడా ఎయిర్‌టెల్‌ పోస్ట్‌పెయిడ్‌, బ్రాడ్‌బ్యాండ్‌, డీటీహెచ్‌ సబ్‌స్క్రైబర్లకు ఫ్రీగా అందిస్తున్నారు. ప్రీపెయిడ్‌లో మాత్రం అందరికీ అందుబాటులో లేదు. కేవలం రూ. 199, ఆపైన రీచార్జ్‌లు చేసుకునే కస్టమర్లే ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ సర్వీసులను ఉచితంగా చూసే అవకాశం ఉంటుంది.

అసలు ఎయిర్‌టెల్‌ సర్వీసులను వాడని వాళ్లు కూడా ఎక్స్‌ట్రీమ్‌ను చూడొచ్చు. వీళ్లకు మొదట 30 రోజుల పాటు ఫ్రీ ట్రయల్‌ ఉంటుంది. ఆ తర్వాత ఈ సర్వీసులను కొనసాగించుకోవాలంటే ఏడాదికి రూ. 999 చెల్లించాల్సి ఉంటుంది. ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ సర్వీసుల కోసం కొత్తగా ఎక్స్‌ట్రీమ్‌ స్టిక్‌, ఎక్స్‌ట్రీమ్‌ బాక్స్‌ 4కేలను ఎయిర్‌టెల్‌ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ రెండింటి ధర రూ. 3999.

– స్ట్రీమింగ్‌ రెజల్యూషన్‌

సాధారణంగా ఓటీటీ సర్వీసుల్లో స్ట్రీమింగ్‌ రెజల్యూషన్‌ను ఎంపిక చేసుకునే అవకాశం యూజర్లు ఉంటుంది. అయితే ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ మాత్రం అలాంటి ఆప్షన్‌ ఇవ్వలేదు. ఆటో రిజల్యూషన్‌ మాత్రమే అందుబాటులో ఉంది.

– ఎక్కడ చూడొచ్చు?

ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ సర్వీసులను ప్రస్తుతం వెబ్‌, ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌లలో చూడొచ్చు. తాజాగా ఎక్స్‌ట్రీమ్‌ స్టిక్‌, ఎక్స్‌ట్రీమ్‌ బాక్స్‌ 4కేలను కూడా సంస్థ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. 

– డౌన్‌లోడ్‌ ఆప్షన్స్‌, స్క్రీన్స్‌

ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ సర్వీస్‌ ప్రస్తుతానికి డౌన్‌లోడ్‌ లేదా వాచ్‌ లేటర్‌ ఆప్షన్లను ఇవ్వలేదు. ఈ ఎక్స్‌ట్రీమ్‌ సర్వీస్‌ను ఒకేసారి యాప్‌లో, వెబ్‌లో చూసే వీలుంది. 

2. నెట్‌ఫ్లిక్స్‌ 

– సబ్‌స్క్రిప్షన్‌

పాపులర్‌ ఓటీటీ సర్వీసుల్లో అమెరికాకు చెందిన నెట్‌ఫ్లిక్స్‌ ముందుంటుంది. నిజానికి ఇది మన దేశంలోకి లేట్‌గా ఎంటరైనా లేటెస్ట్‌గా వచ్చింది. హాలీవుడ్‌ సినిమాలను తలదన్నే రీతిలో ఉండే వెబ్‌సిరీస్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈ నెట్‌ఫ్లిక్స్‌ మొబైల్‌ నుంచి 4కే వరకు వివిధ ధరల్లో అందుబాటులో ఉంది. కేవలం మొబైల్‌లో మాత్రమే నెట్‌ఫ్లిక్స్‌ కావాలంటే నెలకు రూ. 199 చెల్లించాల్సి ఉంటుంది. దీనిద్వారా మొబైల్‌లో ఎస్‌డీ కంటెంట్‌ చూడొచ్చు. ఇది కాకుండా రూ. 499, రూ. 649, రూ. 799 ప్లాన్స్‌ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్నాయి. రూ. 499 చెల్లిస్తే.. ఒక స్క్రీన్‌పై నెలపాటు ఎస్‌డీ కంటెంట్‌ను చూసే అవకాశం ఉంటుంది.

ఇక రూ. 649 ప్లాన్‌లో రెండు స్క్రీన్లపై హెచ్‌డీ కంటెంట్‌ను చూడొచ్చు. అదే రూ. 799 చెల్లిస్తే నాలుగు స్క్రీన్లపై అల్ట్రా హెచ్‌డీ కంటెంట్‌ను చూసే అవకాశం నెట్‌ఫ్లిక్స్‌ కల్పిస్తోంది.

మిగతా ఓటీటీ సర్వీసులతో పోలిస్తే ఇందులోనే ఎక్కువ ప్లాన్స్‌ ఉన్నాయి. పైగా కాస్త కాస్ట్‌లీ కూడా.

– స్ట్రీమింగ్‌ రెజల్యూషన్‌

నెట్‌ఫ్లిక్స్‌లో రెజల్యూషన్ విషయానికి వస్తే.. ప్లాన్‌ను బట్టి ఉంటుంది. రూ.199, రూ.499 ప్లాన్స్‌లో కేవలం ఎస్‌డీ కంటెంట్‌.. అంటే 480 పిక్సెల్‌ రెజల్యూషన్‌లో మాత్రమే చూడొచ్చు. ఇక రూ.649 ప్లాన్‌లో 720 పిక్సెల్‌, రూ.799 ప్లాన్‌లో అల్ట్రా హెచ్‌డీ కంటెంట్‌ను చూసే వీలుంటుంది. 

– ఎక్కడ చూడొచ్చు?

ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌ వెబ్‌, ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌, విండోస్‌ ఫోన్‌, స్మార్ట్‌ టీవీలు, ప్లేస్టేషన్‌, ఎక్స్‌బాక్స్‌, బ్లూరే ప్లేయర్స్‌, ఆపిల్‌ టీవీ, ఫైర్‌ టీవీ స్టిక్‌, క్రోమ్‌క్యాస్ట్‌లలో అందుబాటులో ఉంది. 

– డౌన్‌లోడ్‌ ఆప్షన్స్‌, స్క్రీన్స్‌

నెట్‌ఫ్లిక్స్‌లో కంటెంట్‌ను యూజర్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఒకే వీడియోను ఎన్నిసార్లయినా డౌన్‌లోడ్‌ చేసే వీలు కూడా ఉంటుంది. ఇక తర్వాత చూసే ఆప్షన్‌ను కూడా ఎంపిక చేసుకోవచ్చు. అయితే డౌన్‌లోడ్‌ చేసుకున్న కంటెంట్‌ వారం రోజుల వరకే ఉంటుంది. ఇక ఆఫ్‌లైన్‌లో చూడాలంటే ప్లే బటన్‌ నొక్కినప్పటి నుంచి 48 గంటల్లోనే దానిని పూర్తి చేయాలి. నెట్‌ఫ్లిక్స్‌ను ఒక సమయంలో కేవలం ఒకే స్క్రీన్‌పై మాత్రమే చూసే వీలుంటుంది. ఒకేసారి మల్టీపుల్‌ స్క్రీన్స్‌ లాగిన్‌ అవకాశం ఉండదు. 

3. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

– సబ్‌స్క్రిప్షన్‌ 

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో రెండు ప్లాన్స్‌ మాత్రమే ఉన్నాయి. అది నెలకు రూ.129 లేదా ఏడాదికి రూ.999. ఇందులో ఏ ప్లాన్‌ తీసుకున్నా.. అందులో 4కే అల్ట్రా హెచ్‌డీ కంటెంట్‌ను చూడొచ్చు. దీనికి ప్రత్యేకంగా డబ్బు చెల్లించాల్సిన పనిలేదు. ఈ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకుంటే.. అమెజాన్‌ మ్యూజిక్‌ సర్వీస్‌, అమెజాన్‌లో వస్తువుల ఫాస్టర్‌ డెలివరీ సౌకర్యాలను కూడా అందుకోవచ్చు. 

– స్ట్రీమింగ్ రెజల్యూషన్‌

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఫుల్‌ హెచ్‌డీ, 4కే అల్ట్రా హెచ్‌డీ కంటెంట్‌ అందుబాటులో ఉంది. ఏ ప్లాన్‌కి సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నా.. మీకు వీలున్న రెజల్యూషన్‌లో వీడియోలను చూడొచ్చు. 

– ఎక్కడ చూడొచ్చు?

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోను కూడా వెబ్‌, ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌, స్మార్ట్‌ టీవీలు, ఫైర్‌ టీవీ స్టిక్‌, ప్లేస్టేషన్‌, ఎక్స్‌బాక్స్‌లలో చూసే వీలుంది.

– డౌన్‌లోడ్‌ ఆప్షన్స్‌, స్క్రీన్స్‌

అమెజాన్‌ ప్రైమ్‌లోనూ ఓ వీడియోను ఎన్నిసార్లయినా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్‌ చేసుకున్న వీడియోను 30 రోజుల వరకు ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఇక ఆఫ్‌లైన్‌ వ్యూయింగ్‌ విషయానికి వస్తే.. ప్లే బటన్‌ నొక్కిన తర్వాత 48 గంటల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రైమ్‌ వీడియో ఒక అకౌంట్‌తో ఎన్ని స్క్రీన్లపై అయినా లాగిన్‌ అవచ్చు. అయితే ఒకే వీడియోను ఒకేసారి రెండు డివైస్‌లలో మాత్రమే చూసే వీలుంటుంది. 

4. హాట్‌స్టార్‌ 

–  సబ్‌స్క్రిప్షన్‌

ఇక హాట్‌స్టార్‌ ఓటీటీ సర్వీస్‌ కూడా రెండు రకాల ప్లాన్స్‌ను అందిస్తోంది. ఒకటి హాట్‌స్టార్‌ ప్రిమియం కాగా మరొకటి హాట్‌స్టార్‌ వీఐపీ. ప్రిమియం ప్లాన్‌ తీసుకుంటే హాట్‌స్టార్‌లోని అన్ని వీడియోలను ఎలాంటి పరిమితులు లేకుండా చూడొచ్చు.

వీఐపీలో మాత్రం కేవలం స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌, హాట్‌స్టార్‌ సొంత కంటెంట్‌ను మాత్రమే చూసే వీలుంటుంది. హాట్‌స్టార్‌ ప్రిమియం నెలకు రూ. 299, ఏడాదికి రూ. 999 వసూలు చేస్తోంది. అదే వీఐపీ కావాలంటే ఏడాదికి రూ. 365 చెల్లించాలి. 

– స్ట్రీమింగ్‌ రెజల్యూషన్‌

హాట్‌స్టార్‌లో కేవలం 1080 పిక్సెల్‌ రెజల్యూషన్‌ వీడియోలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఏ యూజరైనా ఇవే వీడియోలు చూడొచ్చు. 

– ఎక్కడ చూడొచ్చు?

హాట్‌స్టార్‌ ప్రస్తుతం వెబ్‌, ఆండ్రాయిడ్‌, ఐవోస్‌, క్రోమ్‌క్యాస్ట్‌, ఫైర్‌ టీవీ, ఆండ్రాయిడ్‌ టీవీ, ఆపిల్‌ టీవీలలో అందుబాటులో ఉంది. 

– డౌన్‌లోడ్‌ ఆప్షన్స్‌, స్క్రీన్స్‌

హాట్‌స్టార్‌ కూడా వీడియోలను డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ వీడియోలను ఏడు రోజుల్లోపు చూడాలి. ఒకసారి ప్లే బటన్‌ నొక్కితే 48 గంటల్లోపే దానిని చూడటం పూర్తి చేయాలి. కంటెంట్‌ను ఒకేసారి మాత్రమే డౌన్‌లోడ్‌ చేసే వీలుంటుంది. హాట్‌స్టార్‌ను ఒకేసారి రెండు డివైస్‌ల కంటే ఎక్కువ వాటిలో చూడలేము. 

ఇవి కూడా చదవండి

♦  వెబ్ సిరీస్ లలో తప్పకుండా చూడాల్సినవి ఇవే

♦  విమానంలో గోవా టూర్ వెళ్లొద్దామా?

Previous articleబ్రెగ్జిట్‌.. ముగ్గురు ప్రధానులు ఔట్‌.. అసలేంటిది?
Next articleబాలీ టూర్ మన బడ్జెట్ లోనే వెళ్లొద్దామిలా