బాలీ టూర్ మన బడ్జెట్ లోనే వెళ్లొద్దామిలా

bali beach view
Photo by Aleksandar Pasaric from Pexels

బాలీ.. ఆగ్నేయాసియా దేశమైన ఇండోనేషియాలో ఉన్న చిన్న ఐలాండ్‌. ఏరియా చిన్నదే అయినా.. ప్రకృతి అందాలకు కేరాఫ్‌ అడ్రెస్‌. ఇప్పటికే నార్త్‌, సౌత్‌ ఇండియాల్లోని మొత్తం టూరిజం ప్లేసెస్‌ను చూసేశాం.. ఇక అలా దేశం దాటి బయటకు వెళ్లొద్దాం అనుకునే వాళ్లకు ఇది బెస్ట్‌ డెస్టినేషన్‌ స్పాట్‌. అమ్మో విదేశీ టూరా.. ఖర్చు తడిసి మోపెడవుతుంది అని టెన్షన్‌ పడాల్సిన పని లేదు. పక్కాగా ప్లాన్‌ చేసుకుంటే.. మీ బడ్జెట్‌లోనే బాలీ టూర్‌ మొత్తాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇంటర్నెట్‌లో సరిగ్గా వెతకాలే కానీ.. ఇలాంటి టూర్లకు మిమ్మల్ని తీసుకెళ్లడానికి చాలా ప్యాకేజీలే ఉన్నాయి.

సొంతంగా ఎలాంటి ప్యాకేజీ, ప్లాన్‌ లేకుండా వెళ్లాలంటే ఖర్చు ఎక్కువ అవుతుందేమోగానీ.. ఇలా ఓ మంచి టూరిజం కంపెనీని పట్టుకొని వెళ్తే ఖర్చూ తగ్గుతుంది. అక్కడున్న అన్ని ప్రదేశాలనూ చూడగలుగుతారు. పైగా బాలిలాంటి ఇండియా చుట్టుపక్కలే ఉండే ప్రాంతాలకు ఈజీగా వెళ్లి రావచ్చు. కల్చర్‌ పరంగా ఇండియా ఎంత భిన్నంగా ఉంటుందో.. ప్రకృతి పరంగా బాలి కూడా అలాగే ఉంటుంది. భయపెట్టే అగ్నిపర్వతాలు ఉంటాయి. పచ్చని అడవులు ఉంటాయి. ఆహ్లాదం కలిగించే బీచ్‌లూ ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? బాలీపై ఓ లుక్కేద్దాం పదండి.

అక్కడ చూడదగిన ప్రదేశాలు, ఎలా వెళ్లాలి, ఎలాంటి ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.. ఎన్ని రోజులు పడుతుంది వంటి అంశాలపై డియర్‌అర్బన్‌.కామ్‌ అందిస్తున్న స్పెషల్‌ స్టోరీ ఇది.

బాలీకి ఎలా వెళ్లాలి?

బాలీకి ఇండియాలోని అన్ని ప్రధాన నగరాల నుంచి నేరుగా విమానాలు ఉన్నాయి. హైదరాబాద్‌ సహా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు నగరాల నుంచి ఎన్నో అంతర్జాతీయ, దేశీయ విమానాలు ఉన్నాయి. ప్రతి విమానం మలేషియా రాజధాని కౌలాలంపూర్‌ మీదుగానే వెళ్తుంది.

ఈ ఐలాండ్‌కు ప్రతి ఏడాది టూరిస్టుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో విమాన సర్వీసుల సంఖ్య కూడా పెరుగుతోంది. దక్షిణ బాలీలోని నూరా రాయ్‌ లేదా డెన్‌పసార్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో దిగాల్సి ఉంటుంది.

bali culture

బాలీకి హైదరాబాద్‌ నుంచి సుమారు తొమ్మిది నుంచి పది గంటల ప్రయాణం ఉంటుంది. ఎయిరిండియా, ఎయిర్‌ ఏషియా, ఎమిరేట్స్‌, మలేషియన్‌ ఎయిర్‌లైన్స్‌, థాయ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాలు అందుబాటులో ఉన్నాయి.

ఇక ఇండియన్‌ పాస్‌పోర్ట్‌ ఉన్న వాళ్లకు వీసా ఆన్‌ అరైవల్‌ అవకాశం ఉంటుంది. బాలీలో దిగిన తర్వాత వీసా తీసుకోవచ్చు. ఈ వీసాపై గరిష్ఠంగా 30 రోజుల వరకు అక్కడ ఉండొచ్చు.

చూడదగిన ప్రదేశాలు

ఇంతకుముందు చెప్పినట్లే బాలీ పర్యాటకుల స్వర్గధామం. ఐలాండ్‌ కావడంతో బీచ్‌లకు కొదవ లేదు. వీటికి తోడు అడవులు, కొండలు, మ్యూజియాలు, ప్రముఖ ఆలయాలు కూడా ఉన్నాయి. వాటర్‌ రాఫ్టింగ్‌, సర్ఫింగ్‌లాంటి అడ్వెంచర్లు కూడా చేసుకోవచ్చు.

1. బీచ్‌లకు కేరాఫ్‌ బాలీ

బీచ్‌ అంటే ఇష్టపడని వాళ్లు ఎవరుంటారు. అందుకే బీచ్‌ డెస్టినేషన్లకు ఎప్పుడూ ఫుల్‌ డిమాండ్‌ ఉంటుంది. ఇండియాలో గోవా కూడా ఇలాగే ఫేమస్‌ అయింది. ఇప్పటికీ మనకు బీచ్‌లంటే గుర్తొచ్చేది గోవానే. కానీ బాలీలో అంతకు మించిన బీచ్‌లు ఎన్నో ఉన్నాయి.

bali beaches

– అందులో ఒకటి కుటా బీచ్‌. సర్ఫింగ్‌ నేర్చుకోవాలి అనుకున్న వాళ్లు, తక్కువ ధరలో అకామడేషన్‌, కేఫ్స్‌, బార్లు ఉండాలని అనుకునేవాళ్లు ఇక్కడి కుటా బీచ్‌కు వెళ్లొచ్చు.

– ఇక అందమైన సూర్యోదయాన్ని ఎంజాయ్‌ చేయాలని అనుకుంటే.. ఇక్కడి సనూర్‌ బీచ్‌కు వెళ్లాలి. ఎక్కడ చూసినా తెల్లటి ఇసుకతో చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ సైక్లింగ్‌ కూడా చేసుకోవచ్చు. బీచ్‌ వెంబడి ఉండే రిసార్ట్స్‌, కేఫ్స్‌, పాతకాలం విల్లాలు ఆకర్షిస్తాయి. హనీమూన్‌ కపుల్‌కు ఈ బీచ్ పర్ఫెక్ట్‌ స్పాట్‌.

– ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్‌ చేయాలని అనుకుంటే సెమిన్యాక్‌, నుసా దువా బీచ్‌లు ఉన్నాయి. వాటర్‌ స్పోర్ట్స్‌ ఇష్టపడే వాళ్లకు నుసా దువా బీచ్‌ బెస్ట్‌. స్థానిక వస్తువులు కొనాలనుకుంటే.. ఇక్కడ షాపింగ్‌ కూడా చేసే వీలుంది. ఇక కాస్ట్‌లీ బార్లు, ఫైవ్‌ స్టార్‌ హోటళ్లు, మంచి మంచి రెస్టారెంట్లు కావాలని అనుకుంటే.. సెమిన్యాక్‌ బీచ్‌కు వెళ్లొచ్చు.

2. అడ్వెంచర్‌

సాహస క్రీడలంటే ఇష్టపడే వాళ్లకు కూడా బాలీ మంచి వినోదాన్ని పంచుతుంది. ట్రెక్కింగ్, సర్ఫింగ్‌, వోల్కనో హైకింగ్‌, వాటర్‌ రాఫ్టింగ్‌లాంటి అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ ఆడుకోవచ్చు.

– మంచి సర్ఫింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ కావాలని అనుకుంటే.. పడాంగ్‌ పడాంగ్‌ బీచ్‌కు వెళ్లాలి. బాలీకి వాయవ్య దిశలో ఉన్న బుకిట్‌లో ఈ బీచ్‌ ఉంటుంది. ఇక్కడి పెద్ద పెద్ద అలలు ప్రపంచంలోని బెస్ట్‌ సర్ఫర్లను ఆకర్షిస్తాయి. రెగ్యులర్‌గా ఇంటర్నేషనల్‌ సర్ఫింగ్‌ ఈవెంట్లు కూడా జరుగుతుంటాయి. కాకపోతే ఇది పక్కాగా ప్రొఫెషనల్‌ సర్ఫర్లకు మాత్రమే. కొత్తగా నేర్చుకోవలని అనుకునే వాళ్లకు ఇంతకుముందు చెప్పినట్లు కుటా బీచ్‌ బాగుంటుంది.

bali sites

– మీకు ట్రెక్కింగ్‌ ఇష్టమైతే ఇక్కడి మౌంట్‌ బటూర్‌ ఎక్కొచ్చు. ఇది ఇండోనేషియాలో యాక్టివ్‌గా ఉండే ఓ అగ్నిపర్వతం. అయితే స్థానికంగా సర్టిఫైడ్‌ గైడ్‌ సాయంతో ట్రెక్కింగ్‌ చేయొచ్చు. తెల్లవారుఝామునే ట్రెక్కింగ్‌ ప్రారంభిస్తే.. ఈ పర్వతంపై నుంచి అద్భుతమైన సూర్యోదయాన్ని చూడొచ్చు. చివరిసారి 2000వ ఏడాదితో ఈ అగ్నిపర్వతం పేలింది. దీని ఎత్తు 5600 అడుగులు.

– ఇక ఇక్కడి అయుంగ్‌ రివర్‌లో వాటర్‌ రాఫ్టింగ్‌ చేసుకోవచ్చు. దట్టమైన అడవి, ఎత్తయిన లోయల మధ్య ఇక్కడ రాఫ్టింగ్‌ మంచి థ్రిల్‌ అందిస్తుంది.

3. ప్రకృతి అందాలు

– బీచ్‌లు, అడ్వెంచర్లే కాదు.. అందరమైన ప్రకృతి అందాలకు నెలవు బాలీ. నుసా పెనిడా ఐలాండ్‌, వెస్ట్‌ బాలీ నేషనల్‌ పార్క్‌, మంకీ ఫారెస్ట్‌లాంటి వాటిని కూడా తప్పుకుండా విజిట్‌ చేయాలి. డైవింగ్‌ చేయాలనుకునేవాళ్లు నేషనల్‌ పార్క్‌లో ఉన్న మెన్‌జంగన్‌ ఐలాండ్‌కు వెళ్లొచ్చు. నేషనల్‌ పార్క్‌ నుంచి బోట్‌లో ఈ చిన్న దీవికి తీసుకెళ్తారు.

bali sites

– ఇక వీటికితోడు వేల కొద్దీ ఆలయాలు కూడా బాలీలో ఉన్నాయి. వీటికి వేల ఏళ్ల చరిత్ర ఉంది. తనా లాట్‌ టెంపుల్‌, ఉలువాటు టెంపుల్‌, బెసాకి టెంపుల్‌, పురా తీర్థ ఎంపుల్‌ టెంపుల్‌ ఇక్కడ ప్రధానమైనవి.

– ఘనమైన సంస్కృతికి నెలవైన బాలీలో మ్యూజియాలూ ఎక్కువే. ది అగుంగ్‌ రాయ్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్‌ ప్రముఖమైంది. ఇక స్థానిక సంస్కృతి, కళ గురించి తెలుసుకోవాలంటే.. అక్కడి కళాకారుల గ్రామాలకు వెళ్లొచ్చు. మంచి మంచి ఆభరణాలు కావాలనుకుంటే.. సెలూక్‌ గ్రామానికి వెళ్లాలి. ఇక్కడ నాణ్యమైన ఆభరణాలు లభిస్తాయి. పైగా వాటిని ఎలా తయారు చేయాలో కూడా ఇక్కడ మీరు నేర్చుకోవచ్చు.

ఎప్పుడు వెళ్లాలి?

బాలీకి సాధారణంగా మే నుంచి అక్టోబర్‌ మధ్య వెళ్తే బాగుంటుంది. అప్పుడు అక్కడ ఎండాకాలం. ఇక వర్షాకాలంలో వెళ్లాలి అనుకుంటే.. నవంబర్‌ నుంచి మార్చి మధ్యలో అయితే బెటర్‌. స్థానికంగా ఇండోనేషియన్‌ రుపయ్య కరెన్సీ ఉంటుంది. బాలినీస్‌, ఇండోనేషియన్‌ భాషలు మాట్లాడతారు.

బెస్ట్‌ ప్యాకేజెస్‌ తెలుసుకోండి.

తక్కువ బడ్జెట్‌లో బాలీ టూర్‌ను పూర్తిగా ఎంజాయ్‌ చేయాలని అనుకుంటే.. ప్యాకేజీ బుక్‌ చేసుకొని వెళ్లడం బెస్ట్‌. తక్కువ ధరలో కనీసం ఐదు రోజులకు తక్కువ కాకుండా వివిధ టూరిజం కంపెనీలు బాలీ ట్రిప్‌ ప్యాకేజ్‌ అందిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

– బాలీ హాలీడే ప్యాకేజెస్‌లో భాగంగా ప్రస్తుతం (05-09-2019) ప్రముఖ ఆన్‌లైన్‌ ట్రావెల్‌ ఏజెన్సీ యాత్ర.కామ్‌ రూ. 11,990 నుంచి రూ. 58,000 వరకు వివిధ ప్యాకేజీలు అందిస్తోంది. https://www.yatra.com/international-tour-packages/holidays-in-bali వెబ్‌సైట్‌లోకి వెళ్తే ఈ టూర్‌కు సంబంధించి మొత్తం అందుబాటులో ఉన్న ప్యాకేజీలన్నీ చూడొచ్చు.

– మరో ఆన్‌లైన్‌ ట్రావెల్‌ ఏజెన్సీ మేక్‌మైట్రిప్‌.కామ్‌ కూడా బాలీ టూర్‌ కోసం ప్రస్తుతం 46 రకాల ప్యాకేజీలను అందిస్తోంది. ఇందులో హనీమూన్‌, బాలీ బీచ్‌, ఫ్యామిలీ, క్రూజ్‌, లీజర్‌ ప్యాకేజీలు ఉన్నాయి. ఇందులో కనిష్ఠంగా రూ. 12 వేల నుంచి గరిష్ఠంగా రూ. 70 వేల వరకు ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.

మీ బడ్జెట్‌తోపాటు ఎన్ని రోజులకు, ఏ థీమ్ అంటే బీచ్‌, హనీమూన్‌, క్రూజ్‌ ఇలా.. ఎవరితో వెళ్లాలని అనుకుంటున్నారు వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని మీకు అనువైన ప్యాకేజీ ఈ ఏజెన్నీ అందిస్తోంది. https://www.makemytrip.com/holidays-international/bali-vacation-tour-packages.html# లోకి వెళ్లి ఈ ప్యాకేజీలను చూడొచ్చు.

bali tea
– థ్రిలోఫిలియా అనే మరో ట్రావెల్ ఏజెన్సీ కూడా రూ. 16,499 నుంచి బాలీ టూర్‌ ప్యాకేజ్‌లు అందిస్తోంది. కనీసం 50 రకాల ప్యాకేజ్‌లు ఇందులో అందుబాటులో ఉండటం విశేషం. గరిష్ఠంగా రూ. 62 వేల వరకు ప్యాకేజ్‌లు ఉన్నాయి. https://www.thrillophilia.com/states/bali-state/tours సైట్‌లోకి వెళ్తే అందుబాటులో ఉన్న మొత్తం ప్యాకేజ్‌లను చూడొచ్చు.

– మరో ప్రముఖ ట్రావెల్‌ ఏజెన్సీ థామస్‌కుక్‌.ఇన్‌ కూడా 18 రకాల బాలీ ప్యాకేజ్‌లను అందిస్తోంది. మిగతావాటితో పోలిస్తే ఇవి కాస్త కాస్ట్‌లీయే. విల్లా, క్రూజ్‌, వాటర్‌స్పోర్ట్స్‌లతో కూడి స్పెషల్‌ ప్యాకేజ్‌లు ఇందులో ఉన్నాయి. https://www.thomascook.in/holidays/international-tour-packages/bali-tour-packages వెబ్‌సైట్‌లో టూర్‌కు సంబంధించిన అన్ని ప్యాకేజ్‌ల గురించి తెలుసుకోవచ్చు. 

ఇవి కూడా చదవండి

♦ విమానంలో గోవా వెళ్లొద్దామా?

♦ హైదరాబాద్ లో థీమ్ రెస్టారెంట్లు ఎక్కడ ఉన్నాయి?

Previous articleప్రైమ్‌‌, నెట్‌ఫ్లిక్స్‌, హాట్‌స్టార్‌.. ఏ ఓటీటీ బెస్ట్
Next articleఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌.. బెస్ట్‌ వెబ్‌సైట్స్‌, యాప్స్‌ ఇవే..