ప్రస్తుత వేసవి వేడిలో బార్లీ గింజల నీళ్లు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. ఎండలు మండిపోతున్న సమయంలో చాలా మందికి శరీరంలో అధిక వేడి కారణంగా శక్తిని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా శరీరం డీహైడ్రేషన్‌కు లోనవుతుంది. ఇలాంటి సమయంలో ఎక్కువగా చలువ చేసే ఆహార పదార్థాలు, పానీయాలు తీసుకోవడం తప్పనిసరి. అందులో బార్లీ కీలకంగా పని చేస్తుంది.
పోషకాల గని
బార్లీలో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది అనేక పోషక విలువలతో కూడి ఉంటుంది. దీనిలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. మాంగనీస్, సెలీనియం, విటమిన్ బి, మెగ్నీషియం శరీరానికి సమృద్దిగా అందుతాయి. బార్లీని నానబెట్టి దానితో జావ తయారు చేసుకుని తాగితే రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ఎనర్టీ లెవెల్స్ పెరుగుతాయి. అంతేకాదు ఇది బరువు తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు దీనిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచవచ్చు. రోగనిరోధకతను పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
బార్లీ జావ ఎలా తయారు చేసుకోవాలంటే:
ఒక కప్పు బార్లీ గింజల్ని తీసుకుని వాటిని రెండు మూడు సార్టు బాగా కడిగి ఆపై గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే స్టౌ మీద గిన్నె పెట్టుకుని రెండు గ్లాసులు నీటిని పోసుకోవాలి. నీళ్లు వేడెక్కగానే నానబెట్టిన బార్లీ గింజలను అందులో వేసుకుని పది నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇలా మరిగిన నీటిని వడకట్టుకుని రోజూ ఒక గ్లాసు తాగితే చాలు. అలా తాగలేని వాళ్లు అందులో కొంచెం నిమ్మరసం, తేనెను కూడా యాడ్ చేసుకుని తాగొచ్చు.
బార్లీ నీటితో మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు:
- బార్లీలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండడం వల్ల ఆకలిని తగ్గించి క్రమంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు బార్లీ అద్భుతంగా పనిచేస్తుంది. కాళ్ల వాపుల నుంచి మంచి ఉపశమనాన్ని అందిస్తుంది.
- బార్లీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె జబ్బులను కూడా నివారించవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి ఇన్పులిన్ మెరుగపరిచే స్వభావం ఉంటుంది. డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు బార్లీని తరచూ తాగవచ్చు. శరీరంలో తక్షణ శక్తిని ఇస్తుంది.
- మూత్ర నాళాలలో వచ్చే ఇన్ఫెక్షన్లను రాకుండా చూస్తుంది. ఈ నీటీని తీసుకోవడం వల్ల మూత్రంలో వచ్చే వివిధ రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఇది సూపర్ డ్రింక్‌గా పనిచేస్తుంది.
- బార్లీలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది శరీరంలో జీర్ణక్రియ సాఫీగా ఉండేలా చేస్తుంది. ఉదయాన్నే బార్లీ నీళ్లు సేవించడం వలన పొట్టలోని మలినాలను సైతం మూత్రం ద్వారా బయటకు పంపిస్తుంది.
- బార్లీ గింజలు అధిక రక్తపోటును తగ్గించి కొలెస్ట్రాల్‌ను దూరం చేస్తుంది. అలాగే మలబద్దకం సమస్యలు కూడా తగ్గుతాయి.శరీరంలో అనవసరపు నీరు వెలివేయడంతో బార్లీ దివ్యౌషధంగా పనిచేస్తుంది. అలాగే జలుబు ఇతరత్రా సమస్యలు దరిచేరవు.
- బార్లీలో ఉన్న ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్స్, ఫాస్పరస్ వంటివి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాదు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కడుపులో మంట, అజీర్తీ, అలసట, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
- అలాగే కిడ్నీలో రాళ్లు కరగడానికి బార్లీ సహాయపడుతుంది. బార్లీలో ఆల్కలైన్ వంటి యాంటీ ఆక్సిడెంట్, ప్లేవనాయిడ్లు క్యాన్సర్ కణాలను నివారించడంలో సహాయపడుతాయి. రోజూ బార్లీ నీళ్లు తాగడం వలన మహిళల్లో రొమ్యు క్యాన్సర్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.
- చర్మాన్ని కాపాడడంలో బార్లీ అద్భుతంగా పనిచేస్తుంది. చర్మం హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. దీనిలో జింక్, సెలీనియం, వంటి ఖనిజ లవణాలు చర్మాన్ని ఎంతో ఆరోగ్యంగా, అందంగా మార్చడంలో సహాయపడతాయి. చర్మంపై ఉండే ముడతలు, మొటిమలను దూరం చేస్తాయి.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్