భీష్మ మూవీ రేటింగ్ : 3.25/5
మూవీ : భీష్మ (తెలుగు) విడుదలః 21.02.2020
నటీనటులుః నితిన్, రష్మిక మందన, అనంత్‌నాగ్, జిషు సేన్ గుప్త, రఘుబాబు, వెన్నెల కిషోర్, సీనియర్ నరేష్, హెబ్బాపటేల్
నిర్మాతః సూర్యదేవర నాగవంశీ
బ్యానర్ః సితార ఎంటర్టైన్మెంట్స్
దర్శకుడుః వెంకీ కుడుముల
సంగీతంః మహతీస్వరసాగర్
భీష్మ మూవీ రివ్యూ :
భీష్మ మూవీ రివ్యూ రాసేముందు సినిమా ట్రయిలర్ గురించి ఒక మాట చెప్పాలి. త్రివిక్రమ్ శ్రీనివాస్ సూచనల మేరకు కథ మొత్తం ట్రైలర్లోనే చెప్పేసానని డైరెక్టర్ వెంకీ కుడుముల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
నిజానికి ట్రైలర్లోనే కథ అర్థమయ్యేలా చూపించడంతో కథ గురించి ఎక్కువగా ఊహించుకోవాల్సిన పని లేకుండా థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకుడికి వినోదం అందించడంలో దర్శకుడు వెంకీ కుడుముల సఫలీకృతమయ్యాడు.
సేంద్రీయ సాగు చుట్టూ తిరిగే ఈ కథలో బలమైన ప్రేమ, భావోద్వేగాలు ఏవీ లేకపోయినప్పటికీ కామెడీ, స్క్రీన్ ప్లే కాపాడడంతో భీష్మ సినిమా ఫీల్ గుడ్ మూవీలా మిగిలిపోనుంది.
భీష్మ మూవీ స్టోరీః
భీష్మ (నితిన్) డిగ్రీ ఫెయిలైన కుర్రాడు. గర్ల్ ఫ్రెండ్ ఉండాలని ప్రయత్నాలు చేసి విఫలమవుతుంటాడు. ఇలాంటి ఓ సందర్భమే భీష్మకు చైత్ర (రష్మిక) తండ్రి దేవా (సంపత్)ను పరిచయం చేస్తుంది. ఆ తరువాత చైత్రను తొలి చూపులోనే ఇష్టపడిన భీష్మ చైత్ర ప్రేమ కోసం పడే ఆరాటంలో చైత్ర తండ్రి అడ్డుపడుతాడు.
మరోవైపు సేంద్రీయ సేద్యాన్ని నిలబెట్టాలన్న భీష్మ ఆర్గానిక్ కంపెనీ యజమాని భీష్మ (అనంతనాగ్) ప్రయత్నాలను అడ్డుకుని ప్రమాదకరమైన రసాయనాలతో ఈ కంపెనీని దెబ్బతీయాలని రాఘవన్ (జిషు సేన్ గుప్తా) ప్రయత్నిస్తాడు.
క్వాలిఫికేషన్ లేకపోయినా క్వాలిటీ ఉంటే చాలనే పెద్దాయన భీష్మకు కథానాయకుడు భీష్మకు సంబంధం ఏంటి? కథానాయకుడి ప్రేమ నిలబడిందా? రాఘవన్ ప్లాన్ సఫలమైందా? అనేదే సినిమా.
భీష్మ నటీనటుల పర్ఫార్మెన్స్ః
అద్భుతమైన నటన ఉండే పాత్రలేవీ ఈ సినిమాలో లేవు. అయితే ఆయా పాత్రల మేరకు అందరూ అలవోకగా నటించేశారు. అఆ సినిమా తరువాత ఆస్థాయి హిట్ దక్కని నితిన్‌కు ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ కలిసొచ్చింది. కామెడీ సన్నివేశాల్లో నితిన్ అలరించాడు.
సరిలేరు నీకెవ్వరూ సినిమా కంటే ఈ సినిమాలో రష్మికకు మెరుగైన పాత్ర లభించింది. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్, మాస్ స్టెప్లతో అలరించింది. సంపత్, అనంత్‌నాగ్, జిషు సేన్ గుప్తాల అభినయం ఈ సినిమాకు మరిన్ని మార్కులు తెచ్చిపెట్టింది.
వెన్నెల కిషోర్, రఘుబాబు తమ పాత్రలకు న్యాయం చేశారు. హెబ్బా పటేల్ పాత్ర రెండు మూడు నిమిషాలకే పరిమితమైంది.
మెప్పించిన భీష్మ
ప్రేమ, సందేశాత్మక కథ, డాన్సులు, ఫైట్స్.. అన్నీ కలగలసిన సినిమా భీష్మ. దీనికి గోల్డెన్ లెగ్ రష్మిక మందన తోడైంది. రష్మిక పాత్రకు మరిన్ని మెరగులు దిద్దాల్సింది. చైత్ర భీష్మకు ప్రపోజ్ చేసిన సందర్భం కొంత బలహీనంగా ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రాల తరహాలో కామెడీ మూవీలో అంతర్లీనంగా ఉండడం ఈ చిత్రం బలం.
భీష్మ, చైత్ర తొలిసారిగా కలిసినప్పుడు భీష్మ చైత్రకు కనెక్టయ్యేలా మాట్లాడుతుండగా చైత్ర స్నేహితురాలు పులిహోరా తయారు చేయడం ఎలా అనే యూట్యూబ్ వీడియో చూపిస్తుండడం వంటి కామెడీ సన్నివేశాలు అలరిస్తాయి. ‘అక్క అటుకులు లేక చస్తుంటే చెల్లి వచ్చి చికెన్ బిర్యానీ అడిగిందట..’ వంటి రీమిక్స్ సామెతలు కడుపుబ్బా నవ్విస్తాయి.
త్రివిక్రమ్ శ్రీనివాస్ తరహా డైలాగులు కూడా సినిమాకు బలాన్నిచ్చాయి. ‘బడి ప్రారంభమయ్యే సమయంలో, ముగిసే సమయంలో వినిపించే బెల్ సౌండ్ ఒకటే. కానీ ఏర్పడే అభిప్రాయం వేరు..’ వంటి డైలాగులు కూడా సినిమాకు బలాన్నిచాయి. ఇక కథానాయకుడు చెప్పే మీమ్స్ కూడా నవ్వించేవిగా ఉంటాయి.
భీష్మ సాంకేతిక విభాగం పనితీరు
స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ ఈ సినిమా విజయంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఒక్కోసారి బోర్ కొడుతున్నట్టు అనిపిస్తున్న దశలోనే తిరిగి కామెడీ సన్నివేశాలు సినిమా విజయాన్ని పదిలపరిచాయి. పల్లెటూర్లను అందంగా చూపించడంలో కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ అందించిన పాటలు పరవాలేదనిపిస్తాయి. మొత్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అందరి సినిమా ఇది.
ఇవీ చదవండి