సొంతిల్లు ఉండాలని ఎవరికి ఉండదు? కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో భూముల ధరలు ఆకాశాన్ని అంటడంతో కేవలం ధనికులకే సొంతింటి కల పరిమితమైంది. రూ. 50 వేలకు అటు ఇటుగా వేతనం ఉన్న ఉద్యోగులు, మధ్య తరగతి జీవులు సొంతింటి కోసం కల కనడం లేదు. కొనాలన్న ఆశ ఉన్నా.. నిట్టూర్పులతో వదిలేస్తున్నారు.
నిజానికి అద్దె ఇంట్లో ఉంటే తక్కువ ఖర్చవుతుందని, సొంత ఇల్లు ఆర్థిక భారాన్ని మిగుల్చుతుందని చాలా మంది అంటుంటారు. మరి అద్దె ఇంట్లో ఉండడం ఆర్థికంగా మేలా? లేక సొంతింట్లో ఉండడం ఆర్థికంగా మేలా? ముందుగా సొంతింట్లో ఉంటే ప్రయోజనాలేంటో చూద్దాం..
సొంతింట్లో ఉంటే ప్రయోజనాలు
1. మన ఇల్లు అన్న ఫీలింగ్‌లో కంఫర్ట్‌గా ఉంటుంది.
2. స్వేచ్ఛ ఉంటుంది. అంటే ఆంక్షలు ఉండవు
3. సొంత ఇల్లు ఉండడం ఒక సోషల్ స్టేటస్‌గా భావిస్తున్నారు.
4. పొదుపు.. ఒక క్రమబద్ధమైన దీర్ఘకాలిక పొదుపుగా మారుతుంది.
5. పన్ను ప్రయోజనాలు.. అసలుపై, వడ్డీ చెల్లింపులపై పన్ను ఆదా చేసుకోవచ్చు.
6. దీర్ఘకాలంలో ఆస్తి విలువ పెరుగుతుంది.
సొంతిల్లు అయితే ఉండే ప్రతికూలతలు
1. అప్పు చేయాల్సి రావడం
2. ఈఎంఐ చెల్లించాల్సి రావడం
3. ఉద్యోగంలో రాజీపడాల్సి రావడం
4. బిల్డింగ్ మెయింటేనెన్స్
5. లొకేషన్ చేంజ్ చేయలేం.
6. ధరలను బట్టి మనం పనిచేస్తున్న కార్యాలయానికి దూరంగా కొనాల్సి రావొచ్చు.
అద్దె ఇంట్లో ఉండే ప్రయోజనాలు
1. అప్పు కట్టాల్సిన పనిలేదు. అంటే ఈఎంఐ లేకపోవడం. అంటే ఎలాంటి ఒత్తిడి ఉండదు.
2. జాబ్ కంఫర్ట్‌గా లేకపోతే రాజీపడాల్సిన అసవరం లేదు. మానేయొచ్చు.
3. జాబ్‌కు దగ్గర్లో, స్కూల్‌కు దగ్గర్లో తీసుకోవచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకోవచ్చు.
4. బిల్డింగ్ మెయింటేనెన్స్ భారం మనపై ఉండదు
5. హెచ్ఆర్ఏ ద్వారా పన్ను ప్రయోజనం
6. ఈజీగా ఇల్లు మారొచ్చు.
అద్దె ఇల్లు కష్టాలు..
1. మనకు నచ్చినట్టు మనం ఉండలేం. ఓనర్‌కు నచ్చేలా ఉండాలి.
2. ఇంకా ఇల్లు కొనలేదా అన్న సామాజికి ఒత్తిడి.
3. అద్దెలు తరచుగా పెరుగుతుండడం.
4. ఇంట్లో మార్పులు చేసుకోలేం
5. ఓనర్‌కు నచ్చకపోతే ఎప్పుడంటే అప్పుడు ఖాళీ చేయాల్సి రావడం.
అప్పు చేసి ఇల్లు కొనాలంటే ఏం కావాలి?
1. ఆర్థిక లక్ష్యాలు (పిల్లల చదువు, పెళ్లిళ్లలకు అయ్యే ఖర్చుల కోసం సేవింగ్స్) మరిచిపోకూడదు.
2. భవిష్యత్తు జీవన శైలి వ్యయాలను కూడా బేరీజు వేసుకోవాలి.
3. కుటుంబ ఆదాయంలో కనీసం 30 శాతం మిగులుతుందనుకుంటే ఆలోచన చేయాలి
4. ఈఎంఐ మొత్తం వేతనంలో 40 శాతం మించకుండా చూసుకోవాలి.
5. జాబ్ పోతుందనే భయం ఉంటే ఇల్లు కొనొద్దు.
6. జాబ్ చేసే సిటీ మారుతుందనుకుంటే ఇల్లు కొనొద్దు. కేవలం ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే కొనుక్కోవచ్చు.
7. భవిష్యత్తులో ఏదైనా స్టార్టప్ గానీ, వ్యాపారం చేద్దామనుకున్నప్పుడు గానీ అప్పు చేసి ఇల్లు కొనొద్దు.
అపార్ట్మెంట్ లేదా ఇంటికి ఎంత వ్యయం అవుతుంది?
ఉదాహరణకు రూ. 60 లక్షల అపార్ట్మెంట్ కొనుగోలు చేయాలనుకున్నప్పుడు మనం 20 శాతం డౌన్‌పేమెంట్ చేయాలి. అంటే రూ. 48 లక్షలు లోన్ తీసుకోవాలి. రూ. 12 లక్షలు మనం చెల్లించాలి.
రూ. 48 లక్షల లోన్‌కు 20 ఏళ్లకు .. వడ్డీ రేటు 6.90 శాతం ఉందనుకుంటే.. అసలు వడ్డీ కలసి రూ. 88,62,426 అవుతుంది. ఇందులో వడ్డీ రూ. 40,62,426 అవుతుంది. అంటే మీరు ముందే చెల్లించాల్సిన మార్జిన్ మనీ రూ. 12 లక్షలతో కలిపితే మొత్తంగా రూ. 1 కోటికి పైగా అవుతుంది.
ఇంకా రిజిస్ట్రేషన్ ఛార్జీలు, జీఎస్టీ, మెయింటేనెన్స్ ఇతరత్రా ఇంకా ఎక్కువే అవుతుంది. ఇవన్నీ కలిపి మొత్తంగా అపార్ట్మెంట్ కొనడానికి అయ్యే వ్యయం అసలు, వడ్డీ కలిపి 20 ఏళ్లలో రూ. 1 కోటి 10 లక్షలు అవుతుందనుకుందాం.
అద్దె ద్వారా ఎంత సేవ్ అవుతుంది..
రెంట్ ఉదాహరణకు 20 వేలు పే చేస్తున్నారు. రెంటల్ ఇంక్రిమెంట్ 5 శాతం అనుకుందాం.. 20 ఏళ్ల వరకు ఎంత చెల్లించాల్సి వస్తుందంటే.. రూ. 1 కోటి 26 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. అంటే మీరు కొంటే అయ్యే వ్యయం కంటే మీరు చెల్లించే అద్దె ఎక్కువ అవుతుంది.
మరి ఏ నిర్ణయం తీసుకోవాలి?
సొంత ఇల్లయితే ఎంత ఖర్చు.. అద్దె అయితే ఎంత ఖర్చో చూశారు గా.. ఇక్కడ ఇంకో అంశం కూడా ఉంది. అపార్ట్మెంటు విలువ పదేళ్ల వరకు పెరుగుతూనే ఉంటుంది. కానీ అపార్ట్మెంట్ వయస్సు పదేళ్లు దాటిన తరువాత దాని విలువ పెరగడం ఆగిపోతుంది.
భూముల విలువ బాగా పెరిగినప్పుడు మాత్రం స్వల్పంగా అపార్ట్మెంటు విలువ కూడా పెరుగుతూ వస్తుంది.
అపార్ట్మెంటు విలువ వేగంగా పెరుగుతున్నప్పుడు లెక్కలు వేయకుండానే.. అపార్ట్మెంట్ కొనుగోలు చేయడం మేలని సులువుగా అర్థమవుతుంది.
అయితే ఉదాహరణకు ఓ 7 శాతం వృద్ధి రేటు ఉందని అంచనా వేస్తే.. 10 ఏళ్లు మీరు అక్కడ ఉండేట్లయితే ఇల్లు అద్దెకు తీసుకోవడం కంటే కొనుక్కోవడం మేలు.
అదే అపార్ట్మెంట్ విలువ ఏటా 9 శాతం వృద్ధి రేటు ఉందని అంచనా వేస్తే…. కేవలం నాలుగు ఏళ్లు మీరు ఆ ప్రాంతంలో ఉన్నా.. అద్దె ఇంటి కంటే సొంతిల్లే మేలు.
సో మీరు సొంతిల్లయితే ఎంత చెల్లించాల్సి వస్తుంది.. అద్దె ఇల్లయితే ఎంత చెల్లించాల్సి వస్తుంది.. ఆ ప్రాంతంలో మీరు ఎన్నేళ్లు ఉంటారు? ఎంత విలువ పెరుగుతుంది.. ఈ అంశాలు చూసి నిర్ణయం తీసుకోండి.