బుక్ రివ్యూ : దోసిట చినుకులు (తెలుగు)
రచయిత : ప్రకాష్ రాజ్ (సినీ నటుడు)
ప్రచురణ : మిసిమి
ధర : 150
రేటింగ్ : 4/5
రైతు అంటే ఐదేళ్లకోసారి ఓటు వేసే మిషన్. నాన్న తోటలో పని చేయడం వదిలి ఎక్కడో మైదానంలో పిచ్చిమూర్ఖుల ఉపన్యాసానికి చప్పట్లు కొడుతుంటే కొడుక్కు ఏమనిపిస్తుంది? అందుకే కరవు.. రాజకీయానికి రైతుల్ని సరఫరా చేసే సప్లయిర్ అయింది. ఇవి ఓ తత్వవేత్త మాటలు కావు. ఓ నటుడివి. ఆయనెవరంటే నేను మోనార్క్‌ని.. నన్నెవరూ మోసం చేయలేరంటూ అప్పుడెప్పుడో ఇరవైయ్యేళ్ల క్రితం వచ్చిన సుస్వాగతం సినిమాతో ప్రతి ఒక్కరిని తన నటనా ప్రపంచంలోకి లాక్కుపోయిన ప్రకాష్ రాజ్‌వి.
కథా నాయకుడు, ప్రతి నాయకుడు, ముఠా నాయకుడు, కుట్రలు, కుతంత్రాల కుప్ప, విలువలు, మమతలు పంచే కుటుంబ పెద్ద… ఈ తరంలో ఉన్న పెద్ద ప్రతి నాయకుడు… ఇవన్నీ వెండి తెర మీద ఆయన పోషించిన పాత్రలు. నవ రసాలను అలవోకగా అభినయించగల్గిన మంచి నటుడు. ఆయన పోషించిన విభిన్న పాత్రలు.. ఆయన బహుముఖ ప్రజ్ఞకు ప్రతీకలు.
కానీ ఆ వెండి తెరను ఒకింత పక్కకు తొలగించి ఒక్కసారి చూస్తే.. ఆ గుండె గొంతుకలో కొట్లాడే ఆవేదనను పరికిస్తే, మనిషీ మమతా.. చెట్టూపుట్టా.. నీరూఏరు, సాగూ రైతు బాగు, అనుబంధాలూ ఆప్యాయతలు, అవమానాలు, అభినందనలు.. కన్నడ కవి కువెంపు మొదలు టాల్‌స్టాయ్ వరకు రచనల సారం.
ఒక్కటేమిటి.. ప్రతి అంశాన్నిఎంతో భిన్నంగా, మరెంతో స్పష్టంగా స్పర్శించే తీరును పరిశీలిస్తే.. నటుడిగా మనకు ఆయనపై ఉన్న అభిప్రాయం, గౌరవం వెయ్యి రెట్లు పెరుగుతుంది. మరి ప్రకాష్ రాజ్ మనకు ఎక్కడ దొరకుతాడు ఆయన నటనలోనా.. కాదు.. ఆయన అక్షరాల్లో. ఆయన అంతరంగ ఆవిష్కరణలో.
ఆ అక్షరామృతాన్ని (అమృతంపై నమ్మకం లేకుంటే వోడ్కా… అదీ కష్టమనుకుంటే స్ప్రైట్ అనుకొని తాగండి.. ప్రకాష్ రాజ్‌కు దైవంపై నమ్మకం లేదు. అప్పుడు అమృతంపై లేనట్లే కదా అందుకు ఇలా…)
సేవించాలంటే ’దోసిట చినుకులు‘ పట్టుకోవాలి.
దోసిట చినుకులు .. పట్టుకుందాం రండి..
మృత్యువు గురించి నాకు ఆలోచన లేదు. అది ఒక్కసారి మాత్రమే వస్తుంది. జీవితం గురించిన ప్రేమ ఎక్కువ. ప్రతి రోజు, ప్రతి క్షణం బతికి తీరాలి కదా అంటారు ఓ సందర్భంలో ప్రకాష్ రాజ్. ప్రకాష్ రై అనే ఓ నాటకాల మనిషి.. ప్రకాష్ రాజ్ అనే విలక్షణ నటుడిగా మారి సినీ ప్రపంచపు ఎత్తులు, లోతులు చవిచూశాడు. ఆ క్రమంలోనే తర్వాత ఏమిటి అనే ప్రశ్న ఆయన్ను మార్చివేసింది. ఫలితమే జీవితాన్ని మరో కోణంలో నుంచి చూడడం ప్రారంభించాడు.
ప్రకృతికి విరుద్ధంగా కృత్రిమ జీవితాలు జీవిస్తున్న తీరు నుంచి తనను తాను మార్చుకోవాలనుకున్నారు. ఫలితమే చెట్లు, నదులు, రైతులు, కుటుంబ ఆప్యాయతలు అన్నింటిని తడిమారు. తాను తినే తిండి తానే పండించాలనుకున్నారు. ఆ క్రమంలో రైతు జీవితాలను దగ్గరగా గమనించారు. తాను విశ్వసించిన దానిని ఆచరించడం మొదలుపెట్టారు.
ఈ క్రమంలో తన అనుభవాలు, ఆలోచనలుగా అక్షరాలుగా మార్చి మన దోసిట చినుకులుగా మార్చారు. బావిలో నాచు పేరుకుపోయింది. యువకులు లేని పల్లెటూళ్లు వృద్ధాశ్రమాలవుతున్నాయి.. కన్నడ కవి లంకేశ్వర్ మాటలు ఇవి. వీటి లోతు ఎంతో తెలియాలంటే ఇప్పడు ఉన్న పల్లెలను చూడాలి. యువకులు ఉంటే బావుల్లో ఈత కొడతారు. అప్పుడు నాచు చేరే అవకాశమే లేదు.
కానీ జీవనోపాధికి తల్లిదండ్రులను వదిలి పిల్లలు దేశాలు పట్టి పోవడంతో బావుల్లో నాచు పేరుకుపోతోంది. ఊళ్లు వృద్ధాశ్రమాలవుతున్నాయని వివరించే తీరు మనకు తెలిసిన విషయమైనా ఆలోచనలో పడేస్తుంది. ఒక్క ఈ వాక్యమే కాదు పుస్తకంలోని ప్రతి వాక్యం మనల్ని వెంటాడుతుంది. ఆలోచనలో పడేస్తుంది.
పురుగు మందులమయమైన సాగును లాభసాటిగా ఎలా మార్చుకోవాలో చెబుతారు ప్రకాష్ రాజ్. ఆయన మాటలు మాత్రమే చెప్పడం లేదు. స్వయంగా తాను సాగు చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ ఓ గుడిసె వేసుకొని జీవిస్తున్నారు.
30 రూపాయలకు కిలో చొప్పున రైతు బియ్యం వ్యాపారికి అమ్మితే అతనికి కిలోకు రూ. 5 లాభం వస్తుంది. అదే వ్యాపారి దానిని నగరంలో రూ. 70కు అమ్ముతాడు.. అమ్మే రైతుకు దక్కేది రూ. 5 మాత్రమే. కొనే వినియోగదారుడు చెల్లించేది రూ. 70. మిగతా 40 రూపాయలు ఏ కష్టం పడనివాడు దళారి తన్నుకుపోతున్నాడు. అందుకే ఈ దేశంలో పులి, సింహంలా వినాశపు అంచుల్లో ఉన్న జాతి రైతు జాతి అంటాడు ప్రకాష్‌రాజ్.
తాను రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడు కాదు. రైతు కష్టాలు తెలిసిన వాడు కాదు. కానీ అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు.. అందుకే ఇప్పుడు వ్యవసాయం వాతావరణంతో జూదం కాదు మధ్యవర్తులతో ఆడబడుతున్న గేమ్ అని వర్ణించాడు.
రైతు ఒక మార్కెటింగ్ మేనేజర్, అకౌంటెంట్, వాతావరణ నిపుణుడు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాడు. రైతో రక్షతి రక్షిత: అంటున్నాడు. రైతుల పేరుతో కర్ణాటక-తమిళనాడులో సాగే కావేరి జలాల వివాదం మూలాలను ఆయన మన కళ్లకు కడతారు.
కావేరికి నీళ్లు మోసుకొచ్చే కొండలను కాఫీ తోటలుగా మార్చి.. విష రసాయనాలతో అక్కడి నీటిని విషతుల్యం చేసి.. చుక్క నీరు రాకుండా కావేరి ఎండిపోవడానికి కారణమై తమిళ రైతుల కష్టాలకు కారణమైన కర్ణాటక నేతలే రాష్ట్రం, భాష బూచి చూపి రెండు రాష్ట్ర ప్రజలను వెర్రివాళ్లను చేస్తున్న తీరును కళ్లకు కడతారు..
తల్లిదండ్రులకు గది కట్టిస్తున్నారా?
మనం పిల్లలకు ఈత, భరతనాట్యం, పాటలు నేర్పిస్తున్నాం.. మరి పెద్దలను గౌరవించడం నేర్పిస్తున్నామా అంటూ ప్రశ్నిస్తారు. బిడ్డల కోసం విశాలమైన గదులు కట్టించే సంతానం తల్లిదండ్రులను ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీస్తారు. బతికున్నప్పుడు పట్టించుకోని వాళ్లు చనిపోయిన తర్వాత ఆడంబరంగా కార్యక్రమాలు చేపట్టడాన్ని నిరసిస్తారు.
తల్లిదండ్రులు, భార్య, పిల్లల విషయంలో ఉండాల్సిన తీరు.. మనం ఉంటున్న తీరును ఎత్తిచూపుతారు. ప్రయోజకుడైన బిడ్డ కన్నా దారి తప్పిన పిల్లలని తల్లిదండ్రులు ఎందుకు ప్రేమిస్తారో చెప్పే ఉదాహరణ మనలో కొత్త ఆలోచనలు రేకేత్తిస్తుంది.
సొంత భాష నేర్చకోకుండా పట్టుమని పది మాటలు చెప్పకుండా పొరుగు భాషల వ్యామోహంలో పడి అదే గొప్ప అనుకునే వాళ్లకు వాతలు పెడతారు. నువ్వు ఉంటున్న ప్రాంతంలో ఉన్న వారి భాషను నేర్చుకొని వారితో అదే భాషలో మాట్లాడడం సంస్కారం. లేకపోతే వారిని అవమానించడమే అని చెబుతారు.
కన్నడీగుడైన ఆయన ఇప్పడు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడతారు. అయితే కన్నడ రావడంతోనే తాను ఇన్ని భాషలు నేర్చుకోగలిగానంటారు. ఇంగ్లీష్ రావడమంటే నాలుగు ముక్కలు మాట్లాడడం కాదు షేక్స్‌పియర్‌ను, మిల్టన్‌ను చదివి అర్ధం చేసుకోకపోతే ఆ భాష వచ్చినట్లు కాదంటారు.
కన్నడ వచనకారుడు బసవన్న, రచయితలు కువెంపు, లోకేష్, గిరిష్ కర్నాడ్ మొదలు టాల్‌స్టాయ్ వరకు విశ్వ సాహిత్యం నుంచి ఎన్నెన్నో ఉదాహరణలు మనకు పరిచయం చేస్తారు.
ఒక్కో గెలుపు మనలో కలిగించే వికారాలను వివరిస్తూ ఓటమి ఇప్పటి వరకు తన సహజత్వాన్ని కోల్పోలేదు.. అదే సమయంలో విజయం ఎంత వికృతంగా ఉంటుందో వివరిస్తూ తన అనుభవాలను ఏ మాత్రం దాచుకోకుండా వెల్లడించారు.
మన విజయాలు మనకు గోరీలు కాకుండా చూసుకోవాలని హెచ్చరిస్తారు. వందల ఏళ్ల నాటి చెట్లు మనకు ఎలాంటి పాఠాలు చెబుతాయో చెబుతూ.. మేం రెండు వేల ఏళ్లుగా శిలువలు ఇస్తూనే ఉన్నాం… మీరు ఒక్క యేసును ఇవ్వలేకపోయారంటూ చెట్లు అంటున్నాయంటే మనవ జాతి కృతఘ్నతను ఎత్తి చూపినట్లవుతుంది. ఆ వాక్యం మనల్ని వెంటాడుతుంది.
హిందువులా ఉండాలా? క్రైస్తవురాలిగానా?
అంతిమంగా మనిషి మనిషిలా జీవించాలి. ప్రకృతిని ప్రేమించాలి. నేను హిందువులా ఉండాలా.. క్రైస్తవురాలిగా ఉండాలా అనే తన బిడ్డకు.. మనిషిలా ఉండాలనే చెప్పే మాట మతం మత్తు నెత్తికి ఎక్కిన మూర్ఖులకు చెప్పుదెబ్బ అయితే ఆలోచనాపరులకు అద్భుతమైన మాట.
నిరంతర ప్రయాణమే మనిషిని మార్చుతుందంటూ రాజభవనంలో ఉన్నంత వరకూ రాముడు చిన్నవాడే. ఎప్పుడైతే అడవిలో అడుగుపెట్టాడో ఆ ప్రయాణమే రాముడిని అవతార పురుషుడిని చేసింది. రాజభవనం గడప దాటిన తర్వాతే గదా మనకు బుద్దుడు దొరికింది అనడం ద్వారా భద్ర జీవితపు సరిహద్దులు చెరిపేసి కల్లోలమైన ప్రపంచాన్ని చూడమంటారు. అలజడిలోనే అసలు శక్తి బయటకు వస్తుందనే విషయాన్ని తెలియజేస్తారు.
రాజకీయాలు, సినిమాలు మతంగా మారి మనల్ని శాసిస్తున్న తీరు.. ఆసుపత్రి పురిటి నొప్పుల నుంచే వెంటాడే లంచం.. అమాయకత్వం, మూర్ఖత్వం మధ్య తేడాలు ఒక్కటేమిటి జీవితపు అన్ని పార్శ్వాలను తడుముతారు. అన్నింటికి మించి నేల, భాష, గుంపు, జాతి, మతం, పార్టీల హద్దులు ఎందుకు అని ప్రశ్నిస్తూ విశ్వ మానవతత్వాన్ని మనకు బోధిస్తారు. ఆలోచింపజేస్తారు.
ప్రకాష్‌రాజ్ ఆలోచనలు, ఆచరణలు, అనుభవాల సమాహారమైన దోసిట చినుకులు నిజంగా దోసిట వరహాలు, రత్నాలు, వజ్రాలు.. కానీ ప్రకాష్‌రాజ్ దృష్టి కోణంలో చూస్తే చినుకుకు ఉన్న గొప్పతనం వీటికి లేదు. అందుకే ఇవి దోసిట చినుకులు.. పట్టుకొని కడుపు నిండా తాగండి.. జీర్ణించుకోండి.. ఆచరించండి.
– గ్రీష్మ, ఫ్రీలాన్స్ రైటర్
ఇవీ చదవండి