కోడిగుడ్డు ఆమ్లెట్ పులుసు రెసిపీ ఎప్పుడైనా చేశారా? తింటే ఆహా.. ఎంత రుచిగా ఉంది అనాల్సిందే. సాధారణంగా పులుసు చాలామందికి ఇష్టం ఉండదు. కానీ కోడిగుడ్డు ఆమ్లెట్‌తో పులుసు చేస్తే మాత్రం దానికి ఫేన్స్ అవుతారు. అతి సులువుగా, వేగంగా అయ్యే కోడిగుడ్డు ఆమ్లెట్ పులుపు రెసిపీని మీరూ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. గుడ్లలో ఫోలేట్, ఐరన్, మెగ్నీషియం, విటమిన్లు ఎ, ఇ, B6, విటమిన్ డి పుష్కలంగా అందుతాయి. ఇది ఎముకల ఆరోగ్యానికి దోహదపడుతుంది. కాల్షియం కూడా సరైన మోతాదులో అందుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసీపీని ఎలా చేస్తారు? కావలసిన పదార్థాలేంటో ఇప్పుడే తెలుసుకుందాం.
కోడిగుడ్డు ఆమ్లెట్ పులుసు రెసిపీకి కావలసిన పదార్థాలు:
- కోడిగుడ్లు – మూడు
- ఉల్లిపాయలు – రెండు
- పచ్చిమిర్చి – నాలుగు
- కరివేపాకు – రెండు రెమ్మలు
- పసుపు – చిటికెడు
- కారం – ఒక టేబుల్ స్పూన్
- ఉప్పు – తగినంత
- ధనియాల పొడి – ఒక టీ స్పూన్
- అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్సూన్
- గరం మసాలా – ఒక టీ స్పూన్
- శెనగపిండి – కొద్దిగా
- అల్లం ముక్క – చిన్నది
- ఆవాలు – ఒక టీ స్పూన్
- జీలకర్ర – ఒక టీ స్పూన్
- చింతపండు – కొద్దిగా
- నూనె – రెండు టేబుల్ స్పూన్
- టమాటాలు – రెండు
- కొత్తిమీర – కొద్దిగా
కోడిగుడ్డు ఆమ్లెట్ పులుసు తయారు చేసే విధానం:
1. ముందుగా ఒక గిన్నె తీసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా శనగపిండి, అల్లం తురుముకుని ఆపై నాలుగు కోడిగుడ్లు వేసుకుని బాగా కలుపుకోవాలి.
2. ఇప్పుడు స్టౌ మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసి కలుపున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని వేసుకోవాలి.
3. ఇది 5 నిమిషాలు మూతపెట్టుకుని మీడియం మంటపై ఉడకనివ్వాలి.
4. ఆ తర్వాత మళ్లీ మూత తీసి రెండో వైపు తిప్పుకోవాలి. అప్పుడు ఆమ్లెట్ రెడీ అవుతుంది.
5. ఇప్పుడు రెండు వైపులా కాలిన ఆమ్లెట్‌ను నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి.
6. వేరోక కడాయిలో నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి.
7. ఇలా వేగిన దానిలో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పడు టమాటా ముక్కలు వేసుకుని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి.
8. టమాటాలు బాగా మగ్గిన తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి వేసుకుని మరొక నిమిషం ఉడికిన తర్వాత చింతపండు రసాన్ని వేసుకోవాలి.
9. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ ముక్కలను వేసుకుని కలుపుకోవాలి.
10. చివరగా కొత్తిమీరను చల్లుకుని ఒక 5 నిమిషాలు పాటు ఉడకనివ్వాలి.
అంతే టేస్టీ కోడిగుడ్డు ఆమ్లెట్ పులుసు రెడీ. తినడానికి ఎంతో కమ్మగా ఉంటుంది. ఈ టేస్ట్‌ని మీరు కూడా ట్రై చేసి చూడండి.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్