Flaxseeds Therapy for hair: జుట్టు పొడిపొడిగా, నిర్జీవంగా ఉన్న వారికి బెస్ట్ హోమ్ రెమిడీ అవిసె గింజల హెయిర్ ప్యాక్. ఇది జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. పొడి బారడాన్ని నివారిస్తుంది. మీరు చాలావాటిని ప్రయత్నించే ఉంటారు. కానీ ఈ అవిసె గింజలతో ఒకసారి ట్రై చేసి చూడండి. మీ జుట్టుకు మీరే ఫిదా అవుతారు. మరి ఈ అవిసె గింజల జెల్‌ను జుట్టుకు ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు? ఎలా వాడాలి? అనే విషయాలు తెలియకపోతే ఇక్కడ తెలుసుకోండి.
అవిసెగింజల్లో ప్రోటీన్, ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం, మాంగనీస్, సెలీనియం ఉంటాయి. ఇవి జుట్టును సరైన ఆకృతిలో సరైన విధంగా పెరిగేలా సహాయపడుతాయి. అవిసె గింజలు హార్మోన్స్ సమతుల్యత మెరుగుపడేలా చేస్తాయి.. అవిసె గింజల పొడి చేసుకుని రోజూ అన్నంలో కలుపుకుని తింటే మంచి ఫలితాలను పొందవచ్చు. జుట్టుకు పెట్టుకోవడం ఇష్టం లేని వాళ్లు అవిసె గింజలను ఇలా ఆహార రూపంలో తీసుకున్నా సత్వర ఫలితాలను చూడవచ్చు.
జుట్టు పోషణకు అవిసె గింజల నూనె:
అవిసె గింజలతో చేసిన నూనెను తలకు ఉపయోగించడం వలన జుట్టు మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. జుట్టు మూలాలను రక్షిస్తుంది. ఇందులో కూడా విటమిన్ ఇ ఉంటుంది. దీని వలన కొత్త జుట్టు మొలవడానికి అవకాశం ఉంటుంది. ఒక చిన్న గిన్నెలో మీ జుట్టుకు సరిపడా అవిసె గింజల నూనె తీసుకుని దానిని కొద్దిగా గోరువెచ్చగా అయ్యేవరకూ మాత్రమే వేడి చేస్తే సరిపోతుంది. తర్వాత స్టౌ ఆఫ్ చేసి నూనెను చల్లబర్చుకోండి. దీన్ని మీ జుట్టు స్కాల్ప్‌కు పట్టించి ఒక రెండు నిమిషాలు బాగా మసాజ్ చేయండి. ఇప్పుడు, మీ జుట్టును వేడి టవల్‌తో చుట్టి సుమారు 30 నిమిషాల పాటు ఆవిరి ప్యాక్‌లా వేయండి. ఆ తర్వాత మీ జుట్టును సాధారణ షాంపూతో కడిగేయండి. ఇలా వారానికి 2-3 సార్లు చేస్తే చాలు మంచి ఫలితాన్ని చూడొచ్చు.
అవిసెగింజల జెల్ తయారు చేసుకోవడం ఎలా?
- అవిసెగింజల హెయిర్ జెల్ తయారు చేయడానికి, ముందుగా అర కప్పు అవిసె గింజలు తీసుకోవాలి.
- ఇప్పుడు రెండు కప్పుల నీరును కూడా తీసుకొని మరిగించాలి. నీరు మరుగుతున్నప్పుడు అందులో అవిసెగింజలను వేసి ఉడకబెట్టాలి.
- అవసరమైతే ఒక టేబుల్ స్పూన్ నిమ్మ రసం కూడా వేసుకోవచ్చు. ఈ మిశ్రమం ఉడికిన తర్వాత చిక్కటి జెల్‌గా మారుతుంది.
- అప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి బాగా చల్లార్చుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ఈ జెల్‌ను మరొక గిన్నెలో వడకట్టుకుని అప్పుడు తలకు అప్లై చేసుకోవచ్చు.
- లేదా ఒక గాజు సీసాలో నిల్వ చేసుకొని తలస్నానం చేయడానికి ముందు ఈ జెల్‌ను అప్లై చేసి తక్కువ గాఢత గల షాంపూతో కడిగేయవచ్చు. ఇలా వారానికి కనీసం ఒకసారి చేస్తే మెరుగైన సిల్కీ హెయిర్ మీ సొంతం అవుతుంది.
హెయిర్ ప్యాక్:
మీ జుట్టు పొడి బారినట్లుగా ఉండి కాంతి విహీనంగా కనిపిస్తున్నట్టయితే, అవిసె గింజలతో చేసే హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల జుట్టు సిల్కీగా మారుతుంది. ఇందుకోసం రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజల పొడిని తీసుకోండి. దాంట్లో అరకప్పు పెరుగు, నాలుగు చుక్కల తేనె వేయండి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా పట్టించండి. ఈ ప్యాక్‌ని అరగంట పాటు అలా ఉంచేసుకుని తర్వాత గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయండి. మీ జుట్టు ఎంతో మృదువుగా, హైడ్రేటెడ్‌గా మారుతుంది.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్