Homemade Ice cream: ఇంట్లోనే సుల‌భంగా ఐస్‌క్రీమ్ త‌యారు చేయండి.. చాలా టేస్టీగా ఉంటుంది

Composition on bowl with delicious whipped cream near mixer
ఇంట్లోనే ఐస్‌క్రీమ్ తయారు చేయడం ఎలా?Photo by Katerina Holmes on Pexels

Homemade Ice cream: ఐస్‌క్రీమ్ అంటే ఎవ‌రికి ఇష్టం ఉండ‌దు చెప్పండి.. ఏ వ‌య‌సు వారైనా ఇష్టంగా తినేది ఒక్క ఐస్‌క్రీమ్ మాత్రమే. అందులో ముఖ్యంగా పిల్ల‌లు ఎక్క‌డికైనా బ‌య‌ట‌కి వెళ్లినప్పుడు ఎక్కువ‌గా అడిగేది కూడా ఐస్‌క్రీమ్. స‌మ్మ‌ర్ వ‌చ్చిందంటే ఇక చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఐస్‌క్రీమ్‌కి మంచి గిరాకీ ఉంటుంది. గొంతులో చ‌ల్ల‌గా, టేస్టీగా ప‌డే కొద్దీ ఇంకా తినాల‌నిపించే ఐస్‌క్రీమ్‌ని ఇప్పుడు ఇంట్లోనే అతి సులువుగా చేసుకోవ‌చ్చు. పెద్ద‌గా క‌ష్ట‌ప‌డాల్సిన ప‌ని లేదు. చాలా సింపుల్ మెథ‌డ్‌లో చేసేయొచ్చు. 

మామూలుగా బ‌య‌ట మార్కెట్‌లో ల‌భించే ఐస్‌క్రీమ్‌లు చూడ‌డానికి, తిన‌డానికి ఎంత బావున్నా వాటిలో అనేక రకాల క‌ల్తీ ఎసెన్షియ‌ల్స్ క‌లిపేస్తూ ఉంటారు. అలా వాటిని తిన‌డం ద్వారా  పిల్ల‌ల‌కు  ఆరోగ్య ప‌ర‌మైన స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. క‌నుక చాలావ‌ర‌కూ ఇంట్లోనే హెల్తీగా, త‌యారు చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నీస్తే మంచిది. ఐస్‌క్రీమ్ త‌యారీ విధానం, ఎలాగో ఈ స్టోరీలో చూసేయండి. ఇది ఎవ్వ‌రైనా ఈజీగా చేసేయ‌చ్చు.

ఐస్‌క్రీమ్ తయారీకి కావ‌ల‌సిన ప‌దార్థాలు:

  1. పాలు – అర లీట‌రు
  2. క‌స్ట‌ర్డ్ పౌడ‌ర్ – రెండు టేబుల్ స్పూన్లు
  3. పంచదార – మూడు టేబుల్ స్పూన్లు
  4. ఫ్రెష్ క్రీమ్ – ఒక క‌ప్పు
  5. డ్రై ఫ్రూట్స్ – కొద్దిగా
  6. మిల్క్ మెయిడ్ – కొద్దిగా

ఐస్‌క్రీమ్ త‌యారీ విధానం

  1. ముందుగా ఒక బౌల్‌లో ఆర లీట‌రు పాల‌ను తీసుకుని స్టౌ మీద పెట్టి మ‌రిగించాలి. 3 నిమిషాలు ఇలా మ‌రిగిన త‌ర్వాత అందులో పంచ‌దార‌ను యాడ్ చేయాలి.
  2. ఈ మిశ్ర‌మాన్ని బాగా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే వ‌ర‌కూ మరిగించాలి.
  3. త‌ర్వాత  ఒక బౌల్‌లో ఒక కప్‌ ఫ్రెష్‌ క్రీమ్‌ను తీసుకోవాలి. ఇది  సూపర్‌ మార్కెట్లో లభిస్తుంది.
  4. అనంతరం బ్లెండర్ ఉంటే దానితో బీట్‌ చేస్తూ మెత్తగా చేసుకోవాలి. లేక‌పోతే మిక్సీలో కూడా చేసుకోవచ్చు.
  5. క్రీమ్‌ గట్టిగా మారిన తర్వాత అందులో వెనీలా ఎసెన్షియల్‌ను యాడ్ చేయాలి. అలాగే 200 గ్రాములు మిల్క్‌ మెయిడ్‌ను యాడ్‌ చేసి మళ్లీ మిక్స్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి.
  6. తర్వాత  మ‌రిగించిన పాల‌లో క‌స్ట‌ర్డ్ పౌడ‌ర్‌ను యాడ్ చేయాలి. ఒక 2 నిమిషాలు క‌లిపిన త‌ర్వాత ఆ మిశ్ర‌మాన్ని బౌల్‌లోకి తీసుకుని అందులో పైన చెప్పిన ఫ్రెష్ క్రీమ్, మిల్క్ మెయిడ్ మిశ్ర‌మాన్ని యాడ్ చేయాలి.
  7. దానంత‌టిని బాగా క‌ల‌పి వాటిపై నచ్చిన డ్రైఫ్రూట్స్ వేసుకుంటే స‌రిపోతుంది.
  8. ఇప్పుడు టైట్‌గా మూతపెట్టి డీ ఫ్రిజ్‌లో 6 నుంచి 7 గంటల పాటు పెట్టాలి. 

అంతే ఎంతో రుచికరమైన వెనీల ఐస్‌క్రీమ్‌ రడీ అయినట్లే. సర్వ్‌ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఐస్‌క్రీమ్‌ను యమ్మీ య‌మ్మీగా తినేయ‌చ్చు. ఇంట్లోనే ఈజీగా ఎలాంటి కెమెకల్స్‌ లేకుండా నేచురల్‌ ఐస్‌క్రీమ్‌ సిద్ధం చేసుకోవచ్చు. ఇక ఐస్ క్రీమ్ తయారీకి అవసరమయ్యే మిల్క్ మెయిడ్, ఫుల్ క్రీమ్, వెనిలా ఎసెన్షియల్ వంటివ‌న్నీ సూపర్ మార్కెట్‌లలో లభిస్తున్నాయి.

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Previous articleముల్లంగి: వ్యాధులను తరిమివేసే శక్తిమంతమైన ఆహారం
Next articleఈ వారం థియేట‌ర్, ఓటీటీ రిలీజ్ చిత్రాలు.. సినీ ప్రియులకు పండగే