వేసవిలో దర్శనమిచ్చే పండ్లలో నేరేడు ఒకటి. వేసవి సీజన్ పండ్లలో ఎన్నో రకాల పండ్లు మార్కెట్‌లో అందుబాటులో లభిస్తాయి. మనం ఆరోగ్యవంతంగా జీవించాలంటే ప్రకృతి నుండి వచ్చే అన్ని రకాల పండ్లు తినాల్సిందే. నేరేడు పండు కొన్ని రకాల వ్యాధలకు చెక్ పెడుతుందట. అందువలన దీనిని ఔషధాల సమాహారం అని కూడా అంటారు. మరి ఈ నేరేడు పండు తినడం వలన ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
నేరేడు పండు చూడడానికి నల్లగా నిగనిగలాడుతూ ఎంతో అందంగా కనిపిస్తుంది. కాకపోతే తింటున్నప్పుడు కొంచెం వగరుగా, పుల్లగా ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. వగరు కూడా కొన్ని విధాలా ఆరోగ్యమే. శరీరానికి అన్ని రకాల రుచులు అందితేనే పోషకాలు కూడా సరైన మోతాదులో అందుతాయి. చాలామంది వగరుగా ఉంటాయని, పళ్లకు జిగురుగా అంటుకుంటుందని ఈ పండ్లను తినడానికి ఇష్టపడరు. కానీ సీజనల్ ఫ్రూట్స్‌లో లభించే విటమిన్లు, పోషకాలు తప్పనిసరిగా శరీరానికి అందేలా చూసుకోవాలి. అప్పుడే సగం వ్యాధులను నయం చేసుకోవచ్చు.
నేరేడు పండు ఉపయోగాలు
నేరేడులో పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, కాల్షియం, విటమిన్ సి, ఐరన్, విటమిన్ ఎ, నియాసిన్, థయామిన్ ఇంకా మరెన్నో సమ్మేళనాల సముదాయంగా ఈ పండును చూడవచ్చు. అందుకే దీన్ని తినడం వలన రోగనిరోధక శక్తి వేగవంతం అవుతుంది.
మధుమేహాన్ని నియంత్రిస్తుంది:
నేరేడు పండు మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఔషధం లాంటిది. ఎందుకంటే ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కనుక రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి తోడ్పడుతుంది. మధుమేహం ఉన్పప్పుడు అనేక రకాల సమస్యలు వస్తాయి. అందులో మూత్ర విసర్జన, దాహాం ఎక్కువగా ఉండడం వంటి సమస్యల లక్షణాలను ఈ పండు దూరం చేస్తాయి.
చర్మానికి మేలు చేస్తుంది :
నేరేడు పండు తినడం వలన శరీరానికే కాదు చర్మానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఇది చర్మ సంబంధ సమస్యలను తగ్గించి చర్మ కాంతిని మెరుగుపడేలా చేస్తుంది. ఇందులో ఉండే యాంటి ఆక్సిడెంట్లు, విటమిన్స్ చర్మానికి ముడతలు రాకుండా యవ్వన ఛాయ అందిస్తుంది. అంతేకాకుండా చర్మంలో పేరుకుపోయిన జిడ్డు, ఇతర సమస్యలను పోగొట్టి అందమైన నిగారింపును ఇస్తుంది. ఇది కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేసి చర్మం మెరిసిపోయేలా చేస్తుంది.
క్యాన్సర్‌కు చికిత్సగా పనిచేస్తుంది:
నేరేడు పండు క్యాన్సర్ నిరోధకానికి చికిత్సలా పనిచేస్తుంది. ఇది ఫ్రీరాడికల్స్‌తో పోరాడి క్యాన్సర్ కణాలను అదుపులో ఉంచుతుంది. వీటి కణాల వృద్దిని పెరగకుండా కాపాడుతుంది.
ఇతర ప్రయోజనాలు:
- నేరేడు జీర్ణక్రియ సక్రమంగా పనిచేసి, కడుపులో పేరుకుపోయిన మలినాలను పోగొట్టడానికి అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని తరుచూ తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్, మలబద్దకం వంటి అనేక రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
- నోటిలో వచ్చే అనేక రకాల వ్యాధులను కూడా నయం చేస్తుంది. నోటి పూత, దుర్వాసన, నోటిలో పుండ్లు వేసినట్లైతే ఈ పండు ద్వారా వీటిని తగ్గించుకోవచ్చు. ఈ నేరేడు పండు తింటున్నప్పుడు నోటిలో కొంచెం సేపు ఉంచుకున్నటైతే నోటిపూత సమస్యలను దూరం చేయవచ్చు.
- దీన్ని తినడం వలన ఆకలి త్వరగా వేయడానికి అవకాశం ఉంటుంది. కడుపులో ఉండే చెత్తను ఏ విధంగా పోగొడుతుందో ఆకలిని పెంచడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది.
- గుండెకు కూడా నేరేడు పండు చాలా ఉపయోగకరంగా పనిచేస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు మెదడు పనితీరుకు అలాగే గుండె సంబంధిత వ్యాధులను అడ్డుకోవడంలో పుష్కలంగా పనిచేస్తుంది.
ఏ ఆహారమైనా మితంగా తీసుకోవడం మంచిది. అప్పుడే సక్రమంగా జీర్ణమవడానికి అవకాశం ఉంటుంది. ఈ నేరేడు పండు కూడా అలాంటిదే.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్