కరోనా లాక్‌డౌన్ తరువాత జీవితం ఇంతకుముందులా ఉండకపోవచ్చు. మనమంతా ఒక కొత్త లైఫ్ ప్రారంభించబోతున్నాం. లైఫ్‌లో మనకు ఏది ముఖ్యం? ఏది కాదన్న స్పష్టత చాలా మందిలో ఇప్పటికే వచ్చింది.
మన విలువలు మారుతున్నాయి. మన జీవితాలు, ముఖ్యంగా మన అలవాట్లు మారిపోతాయి. మన ఇంటి వాతావరణం కూడా మారిపోతుంది. మన ఆలోచనధోరణిలో కూడా మార్పులు ఉంటాయి. ఏయే మార్పులు చోటు చేసుకోబోతున్నాయో చూద్దాం..
లివింగ్ రూమ్ ఆఫీస్‌గా మారిపోతుంది..
కరోనా లాక్‌డౌన్ పీరియడ్‌లో అనేక ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేయాల్సి వచ్చింది. ఇందులో అనేక మంచి చెడ్డలు, కష్ట సుఖాలు ఇమిడి ఉన్నాయి. అయితే చాలావరకు ప్లస్ పాయింట్లే ఉన్నాయి. కరోనా తరువాత జీవితం బాగుండాలంటే ఇంట్లోనే ఓ మూల ఆఫీస్ ఏర్పాటు చేసుకోవాలి.
అంటే కనీసంగా ఓ డెస్క్‌టాప్ కంప్యూటర్, ప్రింటర్, బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్, వీడియో కాన్ఫరెన్సింగ్‌కు తగిన పరికరాలు ఏర్పాటు చేసుకుంటే కుటుంబ జీవితానికి, ఉద్యోగ జీవితానికి మధ్య బాలెన్స్ అవుతుంది. మీ పనితీరు బాగుంటే అప్పుడప్పుడు వర్క్ ఫ్రమ్ హోం అడిగి ఇంటి నుంచే పనిచేసుకోవచ్చు.
ఇల్లే క్లాస్ రూమ్.. అల్లరే అల్లరి
లాక్‌డౌన్‌లో దాదాపు నెల పదిహేను రోజులు పిల్లలు స్కూల్ లేక ఇంట్లోనే ఉండిపోయారు. పాఠశాలల యాజమాన్యాలు కూడా ఏం చేయాలో తెలియక తలలుపట్టుకున్నాయి. తరువాత జూమ్, ఇంపార్టస్, వంటి యాప్‌ల ద్వారా ఆన్‌లైన్ క్లాసులు తీసుకున్నా ఒకటీ రెండు మాత్రమే. భవిష్యత్తులో కూడా మళ్లీ మళ్లీ లాక్‌డౌన్ ఎదురయ్యే పరిస్థితి లేకపోలేదు.
అందువల్ల ఇంట్లోనే ఓ మూలన పిల్లలకు ఓ టేబుల్, డెస్క్‌టాప్ కంప్యూటర్, ప్రింటర్ (వర్క్‌షీట్లు ప్రింట్ చేసుకోవడానికి) ఏర్పాటుచేసుకోవడం ఉత్తమం. పిల్లలను ట్యూషన్ల కోసం బయటకు పంపడం క్షేమం కాదనుకున్నప్పుడు ఆన్‌లైన్‌లోనే ట్యూషన్లు పెట్టించండి.
ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ కొద్దిరోజుల్లోనే ఎంతో పాపులర్ అయ్యింది. ఫ్రీగా కూడా చాలా అందుబాటులో ఉన్నాయి. నిజం చెప్పాలంటే లక్షలాది రూపాయలు ఫీజులు గుంజే పాఠశాలల నుంచి పిల్లలను సాధారణ స్కూళ్లకు మార్చి ఆన్‌లైన్ విద్య అందించడం మన జేబుకు హాయిగా ఉంటుంది.
అల్టిమేట్‌గా ఆరోగ్యమే మహా భాగ్యం
లక్షలు వెచ్చించినా కరోనా దాటికి అనేక జీవితాలు నిలబడలేదు. దేశవ్యాప్తంగా వేలాది మరణాలు సంభవించాయి. ఇందులో జీవనశైలి వ్యాధులు ఉన్న వారిపైనే ప్రభావం ఎక్కువగా పడింది. అంటే జీవనశైలిని మార్చుకోవాల్సిన అవసరాన్ని కరోనా గుర్తింపజేసింది. అందువల్ల క్రమశిక్షణ లేని జీవితం కంటే.. ఆరోగ్యకరమైన జీవితమే ముఖ్యమని సంకేతమిచ్చింది. సో ఇప్పుడు ఇక వ్యాయామం, యోగ, ధ్యానంపై మనల్లో శ్రద్ధ పెరుగుతుంది.
సొంత వాహనం అవసరం
ప్రజారవాణాపై ఆధారపడిన వారికి సొంత వాహనం ఇక తప్పనిసరి సాధనంగా మారనుంది. కరోనా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. అందువల్ల మన స్థాయికి తగ్గ వ్యక్తిగత వాహనం కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పిల్లలను డ్రాప్ చేయడానికి ఇన్నిరోజులు స్కూల్ బస్సు, ప్రయివేటు టాక్సీలపై ఆధారపడేవాళ్లం. ఇప్పుడు మనమే డ్రాప్ చేసి, మనమే తెచ్చుకోవాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు ఈ బాధ్యత తీసుకోకతప్పని పరిస్థితి. అందువల్ల డ్రైవింగ్ నేర్చుకోవడం వంటి నైపుణ్యాలు అందిపుచ్చుకోవాలి.
హోం అప్లయిన్సెస్ సమకూర్చుకోవడంపై దృష్టి
ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా మన అవసరాలు మనమే తీర్చుకునేలా హోం అప్లయెన్సెస్ కొనుక్కోవాలన్న ఆలోచన అందరిలో వస్తుంది. వాటర్ క్యాన్లపై ఆధారపడేవారు ఆర్వో, పని మనిషిపై ఆధారపడేవాళ్లు వాషింగ్ మెషీన్, డిష్ వాషర్, వాక్యూమ్ క్లీనర్.. ఇలా అన్నీ సమకూర్చుకోవాల్సి రావొచ్చు.
ఇంట్లోనే వినోదం
సినిమా హాళ్లలో తరచుగా సినిమా చూసే అలవాటు ఉన్న వారు హాయిగా ఇంట్లోనే కూర్చుని సినిమా చూసేందుకు పెద్ద తెర గల యాండ్రాయిడ్ టీవీలను సమకూర్చుకునేందుకు ప్రయత్నించవచ్చు. ఒక్క సినిమాకు కుటుంబ సభ్యులతో కనీసం రూ. 1000 నుంచి రూ. 2000 మల్టీప్లెక్స్‌లో పెట్టాల్సి వస్తోంది.
ఈ ఖర్చుతో పెద్ద టీవీ కొనుక్కోవడం కష్టమేమీ కాదు. ఎలాగూ కొత్త సినిమాలన్నీ కాస్త అటుఇటుగా అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ ల్లో వచ్చేస్తున్నాయి. ఇప్పుడైతే కొత్త సినిమాలు కూడా ఓటీటీ ల్లోనే విడుదలవుతున్నాయి. అలాగే బయటి తిండి కంటే ఇంట్లో తయారు చేసుకుని తినడంలో ఉన్న ఆనందం వేలు ఖర్చు చేసినా రాదన్న అవగాహన మనకు లాక్ డౌన్ తెలియజెప్పింది.
సొంతూరు వైపు పయనం
పెద్ద పెద్ద నగరాల్లో చాలీచాలని జీతాలతో టన్నుల కొద్ది ఒత్తిడితో పనిచేసిన ఉద్యోగులను లాక్‌డౌన్ పునరాలోచనలో పడేసింది. అసలు ఈ ఒత్తిడి జీవితం మనకు అవసరమా? వచ్చే జీతంలో పది శాతం కూడా సేవింగ్స్‌లేని ఈ జీవితం కోసం కన్న వాళ్లను, ఉన్న వారిని వదిలేసి దూరంగా బతకడం అవసరమా?
రెంట్‌కు, స్కూల్ ఫీజుకే జీతం డబ్బులు ఖాళీ అయ్యే జీవితానికి నగరం అవసరమా? ఈమాత్రం డబ్బులు ఊళ్లోనో, మన జిల్లా కేంద్రంలోనే సంపాదించలేమా? పిల్లల చదువులు సొంతూర్లో దొరకవా? ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండవా? అన్న ఆలోచన రేకెత్తించింది.
ఇరుకు జీవితాలు, ఇరుగుపొరుగు లేని జీవితాల కంటే సొంతూరే మేలన్న ఆలోచనను కొందరైనా అమలు చేసే పరిస్థితి ఉంది. ఈ డిజిటల్ ప్రపంచంలో ఫ్రీలాన్స్ ఉద్యోగాలకు కొదవే లేదు. ఇలాంటి వారంతా ఛలో సొంతూరు అంటే ఆశ్చర్యం లేదు.
అంతేకదా.. వందలాది కుటుంబాలు ఉండే అపార్టమెంట్ల కంటే.. అవి తెచ్చిపెట్టే కరోనా కష్టాల కంటే.. ఇండివిడ్యువల్ ఇళ్లే(ఊళ్లో) హాయి కదా.. పక్కోడు తుమ్మితే ఊడిపోయే జీవితంపై భరోసా పెట్టుకుని నగరంలో కోట్లు పెట్టి అపార్ట్‌మెంట్లు, ఇండిపెండెంట్ ఇళ్లు ఏం కొంటాం.. వాటికి జీవిత కాలం ఈఎంఐ ఏం కడతాం? కొనే ఆలోచనలేవైనా వాటిని వాయిదావేసుకోవాల్సిందే.
ఎందుకంటే లాక్‌డౌన్‌లో ఎవరి ఉద్యోగం శాశ్వతం కాదు కదా.. అందువల్ల కరోనా తరువాత జీవితం ఎలా ఉండబోతుందంటే మార్పులు అనేకం అనే చెప్పాలి.
ఇవీ చదవండి