Lip dryness: ఎండకాలంలో కూడా పెదాలు పగలడం, పొడిబారడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ కాలంలో వాతావరణం చాలా వేడిగా ఉండి తేమ శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఫలితంగా తేమను కోల్పోవడం వల్ల పెదవులు పగిలి, పొడిబారుతుంటాయి. దీని వల్ల పెదవులపై మంటను కూడా కలగజేస్తుంది. ఎందుకంటే పెదవులు చాలా సున్నితంగా ఉంటాయి. కనుక వేసవిలో బయటికి వెళ్లినప్పుడు చర్మంపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో అదేవిధంగా పెదవుల రక్షణకు కూడా కొన్ని పాటించడం ముఖ్యం. బయటికి వెళ్లిన్నప్పుడు కచ్చితంగా లిప్ బామ్ రాయడం అవసరం. ఎందుకంటే శరీరంలో మిగితా భాగాలన్నిటికి చెమట పడుతుంది. పెదవులకు మాత్రం చెమట పట్టదు. పెదవులకు తేమ సరిగా ఉండకపోవడం వలన త్వరగా ఆరిపోయి పొడిబారడం తద్వారా పగలడానికి కారణమవుతుంది. కనుక వేసవిలో ఈ సమస్యను అధిగమించాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అవేంటో చూడండి.
కొబ్బరి నూనె:
కొబ్బరి నూనె జుట్టుకు ఎంత బాగా పనిచేస్తుందో తేమను అందిస్తుందో అదేవిధంగా పెదవులను రక్షించడంలో కూడా అంతే ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. కొబ్బరి నూనెలో సహజంగా మాయిశ్చరైజర్ ఉంటుంది. ఇది పెదవులను పొడిబారకుండా పగలకుండా కాపాడుతుంది. గోరువెచ్చని నీటితో పెదవులను శుభ్రంగా కడిగి తడి ఆరిన తర్వాత చేతులతో కొబ్బరి నూనెను తీసుకుని పెదాలపై సున్నితంగా మసాజ్ చేయాలి. రాత్రంతా అలాగే ఉంచేసి మరుసటి రోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగితే మంచి ఫలితం ఉంటుంది.
కలబంద:
కలబంద వల్ల ఎన్ని ఉపయోగాలో అందరికీ తెలిసిన విషయమే. చర్మ సంరక్షణకు, జుట్టు సంరక్షణకు, ఆరోగ్యపరమైన సమస్యలకు కలబందను ఎన్నో విధాలుగా ఉపయోగిస్తూ ఉన్నాం. ఆయుర్వేదం పరంగా కలబందను ఎన్నో రకాల సౌందర్య సాధనాలన్నింటిలోనూ వాడుతున్నారు. కనుక కలబంద పెదవులను అందంగా మార్చడానికి, పగుళ్ల వంటి సమస్యలు తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు పెదవులపై కలబంద జెల్‌ను అప్లయ్ చేసి మరుసటి రోజు ఆదయం నిద్రలేచిన తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే పగిలిన పెదాల నుంచి ఉపశమనం లభిస్తుంది.
నెయ్యి:
నెయ్యి చర్మ సంరక్షణకు తోడ్పడే దివ్య ఔషధం. ఇది పెదవులకు అవసరమైన పోషణను అందించడానికి బాగా సహాయపడుతుంది. ఇందుకోసం పెదవులకు నెయ్యి రాసుకుని కొద్దిసేపు మసాజ్ చేయాలి. అలాగే వెన్న కూడా పెదవులకు చాలా మంచి తేమను ఇచ్చి పెదవులకు మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. మజ్జిగ చిలికినపుడు కొద్దిగా వెన్న పైన తేలుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఆ వెన్నను నెమ్మదిగా తీసి దాన్ని పెదవులకు అప్లయ్ చేసి సున్నితంగా మసాజ్ చేస్తే పెదవులు పగలనే పగలవు.
తేనె:
తేనె కూడా సహజమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. తేనెను చర్మం అందంగా మెరవడానికి కొన్ని ఫేస్ ప్యాక్‌లతో కలిపి రాసుకుంటూ ఉంటారు. అలాగే పెదవులకు కూడా మంచి పోషణను ఇచ్చి అందంగా ఉంచుతుంది. ఇది యాంటీ బాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది. అందుకే తేనె పొడి పెదాలను నివారించడానికి బాగా సహాయపడుతుంది. ఇందుకోసం తేనెను నేరుగా పెదవులపై అప్లై చేసి మసాజ్ చేయండి. తేనె పెదాలను మృదువుగా మారేలా చేస్తుంది.
పసుపు- పాలు:
పసుపు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. పసుపు యాంటీ బయాటిక్ కనుక గాయాలను మాన్పడంలో మరియు చర్మ సౌందర్యానికి అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. మరి ఈ ఔషధం పెదవులకు కూడా బెస్ట్ అని చెప్పవచ్చు. పసుపులో కొన్ని చుక్కల పాలు పోసి చిక్కటి పేస్ట్ తయారు చేసుకుని పెదవులపై రాసి కొద్దిసేపటి తర్వాత కడిగేసుకోవాలి. మంచి ఫలితం ఉంటుంది.
నీరు ఎక్కువగా తీసుకోండి :
సహజమైన చిట్కాలు ఎన్ని పాటించిన్నప్పటికీ వాటితో పాటుగా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. అంటే నీరు ఎక్కువగా తాగాలి. ఎందుకుంటే శరీరంలో తగినంతగా నీరు లేకపోతే పెదవులు తేమను కోల్పోయి ఎక్కువగా డీహైడ్రేషన్‌కు లోనవుతాయి. కనుక ప్రతీరోజూ 8 నుంచి 10 గ్లాసుల నీటిని తాగడం అవసరం.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్