little millets benefits in telugu: లిటిల్ మిల్లెట్స్‌ను తెలుగులో సామలు అని అంటారు. మిల్లెట్స్ (తృణ ధాన్యాలు / చిరు ధాన్యాలు) లో చాలా రకాలు ఉన్నాయి. కొర్రలు, సామలు, అరికెలు, అండు కొర్రలు, ఊదలు ఇలా చాలా రకాల తృణ ధాన్యాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ సామల్లో ఉండే పోషకాలు, వాటి వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు సమగ్రంగా మీ కోసం..
Little millets health benefits: సామలు ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు
సామలలో ఉండే పీచు పదార్థం మనలోని అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ముఖ్యంగా మలబద్ధకం సమస్య ఇట్టే మాయం అవుతుంది. హార్మోన్ల అసమతుల్యత సమస్యలను పూర్తిగా అదుపులో పెడుతుంది. అంతేకాకుండా థైరాయిడ్, బ్లడ్ కాన్సర్ వంటి తీవ్రమైన జబ్బులను కూడా నియంత్రిస్తుంది.
లో గ్లైసెమిక్ ఇండెక్స్, ఫైబర్ అధికంగా ఉండడం వల్ల డయాబెటీస్‌తో బాధపడుతున్న వారికి ఇది మంచి ఆహారంగా పేరుంది. రక్తంలో గ్లూకోజ్ లెవల్స్‌ను నియంత్రిస్తుంది. వేగంగా పెరగకుండా తోడ్పడుతుంది.
సామల్లో ఉండే అధిక మెగ్నీషియం వల్ల మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే నియాసిన్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఫాస్పరస్ అధిక బరువును కోల్పోయేందుకు, కణాల్లో పునరుజ్జీవానికి తోడ్పడుతుంది. శరీరంలోని మలినాలను తొలగించే డీటాక్సిఫికేషన్ ఫుడ్‌గా ఉపయోగపడుతుంది.
సామలు (little millets) శ్వాసకోస వ్యాధుల నుంచి కూడా ఉపశమనం ఇస్తాయి. ముఖ్యంగా ఆస్తమా పేషెంట్లకు ఈ ఆహారం మేలు చేస్తుంది. దీనిలో గ్లుటెన్ లేని కారణంగా సెలియాక్ వ్యాధి బారిన పడ్డ వారికి, గ్లుటెన్ సెన్సిటివ్ ఎంటెరోపతి ఉన్నవారికి ప్రత్యామ్నాయ ఆహారంగా ఉపయోగపడుతుంది.
సామల్లో పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. టోకోఫెరోల్స్, టోకోట్రైనోల్స్, కెరటెనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. కెరటెనాయిడ్స్ వ్యాధి నిరోధకతను పటిష్టం చేస్తాయి. ఇవి విటమిన్ ఏ గా రూపాంతరం చెందుతాయి కాబట్టి కంటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. టోకోఫెరోల్స్, టోకోట్రైనాల్స్ విటమిన్ ఈ ఆక్టివిటీని కలిగి ఉంటాయి. నరాలు, కండరాలు, గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ఎర్ర రక్త కణాలు డామేజ్ కాకుండా కాపాడుతాయి. గుండె జబ్బులు రాకుండా, అలాగే వృద్ధాప్య లక్షణాలు రాకుండా కాపాడుతాయి.
little millets nutrition value: ప్రతి వంద గ్రాముల సామల్లో ఉండే పోషక విలువలు ఇలా…
పోషకం | విలువ |
ప్రోటీన్ | 9.6 గ్రా. |
కార్బోహైడ్రేట్స్ | 60.5 గ్రా. |
ఫ్యాట్ | 5 గ్రా. |
ఐరన్ | 9.3 మి.గ్రా. |
ఫాస్ఫరస్ | 220 మి.గ్రా |
కాల్షియం | 17 మి.గ్రా. |
మెగ్నీషియం | 114 మి.గ్రా. |
ఎనర్జీ | 325 క్యాలరీలు |
ఫైబర్ | 7.7 గ్రా. |
థయామిన్ | 0.30 మి.గ్రా. |
రైబోఫ్లావిన్ | 0.09 మి.గ్రా. |
నియాసిన్ | 3.2 మి.గ్రా. |
సామలు మరీ ఖరీదేం కాదు. కిలో రూ. 100 నుంచి రూ. 200 మధ్య వేర్వేరు బ్రాండ్లలో అందుబాటులో ఉన్నాయి. వరి అన్నం మాదిరిగా ఎక్కువ పరిమాణం అవసరం ఉండదు. మనం తినే వరి అన్నంలో సగం సరిపోతుంది. అందువల్ల ఖర్చు గురించి పెద్దగా ఆందోళన అవసరం లేదు. రోజూ ఒక పూట సామలు, ఇంకో పూట కొర్రలు, ఊదలు, అండుకొర్రలు, అరికెలు.. ఇలా ఏదో ఒకటి మార్చి మార్చి తింటే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.
సామలు బాగా చలువ చేస్తాయి. అందువల్ల వీటిని ఎక్కువగా వేసవిలో తింటారు. చలికాలంలో కొర్రలు ఎక్కువగా తింటాారు. సామలను అన్నం, ఉప్మా, బనానా పాన్‌కేక్, పరాఠా, కిచిడీ.. ఇలా అనేక రెసెపీలుగా చేసుకోవచ్చు.
ఏ రూపంలో వండుకున్న సామలు తేలిగ్గా జీర్ణమవుతాయి. అయితే వీటిని ప్రారంభంలో వారంలో మూడు, నాలుగు రోజులకు మించి తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.