స‌మ్మ‌ర్‌లో కూల్ కూల్‌గా మ్యాంగో మిల్క్ షేక్.. పిల్ల‌ల‌కు అందించ‌డిలా!

green apple beside clear drinking glass with milk
మ్యాంగో మిల్క్ షేక్ రెసిపీ Photo by Jyoti Singh on Unsplash

ఈ స‌మ్మ‌ర్‌కి కూల్ కూల్‌గా మామిడి మిల్క్ షేక్ ఇచ్చారంటే పిల్ల‌లు ఆనందంగా తాగేస్తారు. వాళ్లకు ఎంతో మ‌జాగా కూడా ఉంటుంది. చ‌ల్ల‌ని కూల్‌డ్రింక్‌లు తాగే కంటే ఇలా సీజ‌నల్ పండ్ల రసాల‌ను ఇంట్లోనే త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల‌న ఆరోగ్యం మ‌న చేతుల్లోనే ఉంటుంది. వేస‌విలో మామిడి పండ్ల‌కు కొదువ లేదు. అన్ని ర‌కాల పండ్లలో మామిడి పండ్లు రారాజు అని కూడా అంటారు. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. ఈ పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఫోలేట్, బీటా కెరాటిన్, ఐరన్, విటమిన్ ఎ, సి వంటి పోషకాలు, అలాగే కాల్షియం, జింక్, విటమిన్ ఇ ఉన్నాయి. ఈ రుచికరమైన పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మ‌రి ఈ చ‌ల్ల‌ని మిల్క్ షేక్‌ని మీరూ ఇంట్లో చేసుకుని కూల్ అయిపోండి.

మ్యాంగో మిల్క్ షేక్  త‌యారీకి కావ‌ల‌సిన ప‌దార్థాలు:

  1. మామిడి పండ్లు – రెండు 
  2. పాలు – ఒక కప్పు
  3. పంచ‌దార‌- ఒక టేబుల్ స్పూన్
  4. డ్రై ఫ్రూట్స్ – ఒక చిన్న క‌ప్పు
  5. ఐస్ క్యూబ్స్ – రెండు, మూడు

మామిడి మిల్క్ షేక్ త‌యారీ  విధానం:

  1. ముందుగా మామిడి కాయను శుభ్రంగా కడిగి, తొక్క తీసి ముక్కలుగా కోయాలి.
  2. ఇప్పుడు బ్లెండర్ జార్‌లో మామిడి, పాలు, పంచదార, ఐస్ క్యూబ్స్ వేసి బ్లెండ్ చేసుకోవాలి.
  3. మామిడి కాయను పేస్ట్ అంతా షేక్‌లా రెడీ అయ్యే వరకు బ్లెండ్ చేయాలి. రెండు నిమిషాల్లో మ్యాంగో షేక్ సిద్ధంగా ఉంటుంది.
  4. సిద్ధం చేసుకున్న మ్యాంగో షేక్‌ని గ్లాస్‌లో పోసి పైన పిస్తా, జీడిపప్పు, బాదంపప్పు వేసి చల్లారేవరకు ఆగాలి.

అంతే చల్ల‌ని మ్యాంగో మిల్క్ షేక్ రెడీ. ఎండాకాలంలో ఇది పిల్ల‌ల‌కు ఇది మంచి ఫ్రూట్ జ్యూస్. అంతేకాకుండా ఇది ఎన్నో ఉప‌యోగాలు క‌లిగి ఉంది.

1.గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది:

మామిడి పండ్ల‌లో  పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో ఎంత‌గానో ఉప‌క‌రిస్తుంది. మామిడి పీచు ప‌దార్థం కలిగి ఉంటుంది. కనుక ఇది అందరూ తినాల్సిన అద్భుతమైన పండు. అలాగే ఇందులో పొటాషియం, వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

2. మామిడి జీర్ణక్రియకు సహాయపడుతుంది:

ఇది జీర్ణ‌క్రియ‌ను మెరుగుప‌ర‌చ‌డంలో స‌హ‌య‌ప‌డుతుంది. మామిడి ఎన్నో ర‌కాల ఖ‌నిజ లవణాలను కలిగి ఉంటుంది. ఇవి జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తాయి. ఇది జీర్ణ ఎంజైమ్‌లను కలిగి ఉంటుంది. మామిడిలో నీరు, డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకం, విరేచనాలు వంటి జీర్ణ సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.

3. రోగ‌నిరోధ‌క‌శ‌క్తిని పెంచుతుంది:

మామిడి అద్భుత‌మైన రోగ‌నివారిణి. ఇది శ‌రీరంలో అనేక వ్యాధ‌ల‌ను న‌యం చేయడంలో ముందుంటుంది.  మామిడిలో విటమిన్ ఎ, విటమిన్ సి ఉంటాయి. మామిడి పండ్లలో కాపర్, ఫోలేట్, విటమిన్ ఇ , బి విటమిన్లు వంటి పోషకాలు కూడా ఉన్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Previous articleఓటీటీలో ఈ వారం విడుదల.. 21 సినిమాలు స్ట్రీమింగ్‌కు సిద్దం
Next articleముఖంపై అవాంఛిత రోమాలు ఇబ్బంది పెడుతున్నాయా? సింపుల్‌గా ఇలా తొలిగించండి