మటర్ పనీర్ సబ్జీగా ఉత్తర భారత దేశంలో చాలా ప్రసిద్ధి చెందిన కూర మంచి పోషకాలతో నిండి ఉంటుంది. ప్రోటీన్, ఫైబర్ తో పాటు చక్కటి రుచికరమైన వంటకం ఇది. మటర్ అంటే పచ్చి బఠానీ. శీతాకాలంలో విరివిగా పచ్చి బఠానీ లభిస్తుంది. మిగిలిన రోజుల్లో ఫ్రోజెన్ బఠానీ కూడా లభిస్తుంది. పనీర్ మనకు డైరీలోగానీ, సూపర్ మార్కెట్లలో గానీ, అమెజాన్ ఫ్రెష్, బిగ్ బాస్కెట్, గ్రోఫర్స్ వంటి ఈకామర్స్ వెబ్ సైట్స్ లోనూ దొరుకుతుంది.
ప్రత్యేక సందర్భాల్లో ఈ మటర్ పనీర్ కర్రీ మన సంబరాలకు జోష్ ఇస్తుంది. బర్త్ డే పార్టీ గానీ, పెళ్లి రోజు గానీ, ఇంట్లో మరేదైనా వేడుక ఉంటే ఓసారి ట్రై చేయండి. చాలా సింపుల్ గా వండేయగలిగే కర్రీ ఇది.
మటర్ పనీర్ కర్రీకి కావలసిన పదార్థాలు
√ నూనె నాలుగు టీ స్పూన్లు
√ ఆవాలు పావు టీ స్పూను
√ సన్నగా తరిగిన ఉల్లిపాయ మొక్కలు ఒక కప్పు
√ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీస్పూన్
√ పసుపు అర టీ స్పూన్
√ ధనియాల పొడి అర టీ స్పూన్
√ గరం మసాలా అర టీ స్పూను
√ టమోటాలు 2 (మిక్సీలో వేసి పేస్టు సిద్ధం చేసి పెట్టుకోవాలి)
√ జీడిపప్పు 6 లేదా 7 ( పేస్ట్ చేసి పెట్టుకోవాలి)
√ పన్నీరు 100 గ్రాములు
√ పచ్చి బఠానీ ఒక కప్పు
√ కొత్తిమీర తగినంత
మటర్ పనీర్ కర్రీ తయారీ విధానం ఇలా
♦ ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె పోసి బాగా వేడైన తరువాత పనీర్ ముక్కలు వేసి స్టవ్ సిమ్ లోకి తగ్గించాలి. ముక్కల అంచులు పనీర్ బ్రౌన్ కలర్లోకి రాగానే వాటిని రెండో వైపునకు మార్చాలి. అంటే పనీర్ ముక్క అన్ని వైపులా వేడెక్కేలా చూడాలి. వెంట వెంటనే బ్రౌన్ కలర్ లోకి వస్తుంది.
♦ బ్రౌన్ కలర్ లోకి వచ్చాక వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
♦ కడాయిలో నూనె అలాగే ఉందికదా.. ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ ముక్కలు ఇలా ఒక్కోదాని తరువాత ఒక్కో నిమిషం గ్యాప్ ఇచ్చి నూనెలో వేస్తూ వేయించాలి.
♦ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి వేగనివ్వాలి.
♦ ఇప్పుడు టమోటా పేస్ట్ వేసి టమోటా ఫ్రాగ్రెన్స్ వచ్చే వరకూ అలా ఉడకనివ్వాలి. కొద్దిగా నీళ్లు కూడా పోస్తే చిక్కగా కాకుండా ఉంటుంది.
♦ తరువాత పచ్చి బఠానీ కూడా వేసి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి.
♦ ఉప్పు కారం వేసి మూతపెట్టి నూనె పైకి తేలేవరకు ఉడకనివ్వాలి.
♦ తర్వాత జీడిపప్పు పేస్ట్ కూడా వేసి ఉడకనివ్వాలి.
♦ చివరగా పన్నీర్ ముక్కలు, గరం మసాల వేసి కలపాలి.
♦ ఫినిషింగ్ టచ్ గా కొత్తిమీర వేసి దించేయాలి.
అంతే. ఎంతో రుచికరమైన మటర్ పనీర్ కూర తయారవుతుంది. ఇది రోటీ లోకి అలాగే అన్నంలోకి వెజ్ బిర్యానీ లోకి చాలా బాగుంటుంది.
కూర్పు : కిరణ్మయి
ఇవి కూడా చదవండి