ఉత్త‌రాంధ్ర స్పెష‌ల్ బెల్లం ఆవ‌కాయ రెసిపీ.. ఇంట్లోనే ఈజీగా ఇలా పెట్టేయండి

a group of vegetables and fruits
బెల్లం ఆవకాయ పచ్చడి తయారీ విధానం Photo by SANTOSH RAULO on Unsplash

ఉత్తరాంధ్ర‌ స్పెష‌ల్ బెల్లం ఆవ‌కాయ‌. అక్క‌డ చాలామంది స్పైసీ ఆవ‌కాయ కంటే బెల్లం ఆవ‌కాయ‌ను ఎక్కువ‌గా తింటారు. ఆవ‌కాయ పెట్ట‌డం రాని వారు కూడా ఇంట్లోనే సులువుగా బెల్లం ఆవ‌కాయ‌ను త‌యారు చేసేయచ్చు. ఇక్క‌డ చెప్పిన ప‌ద్దతిలో పెడితే రుచి అద్భుతంగా ఉంటుంది. ఎన్ని రుచులు ముందున్నా అక్క‌డ ఆవ‌కాయ లేనిదే ప‌రిపూర్ణం కాదు. అందులో బెల్లం ఆవ‌కాయ మ‌రికాస్త రుచిని పెంచుతుంది. ముఖ్యంగా వేస‌వి అన‌గానే ఆవ‌కాయ, ఊర‌గాయ నోరూరిస్తాయి. అయితే కొంద‌రికీ ఎన్ని సార్లు చేసినా ఎక్కువ కాలం నిల్వ ఉండేలాగా, అందులోనూ రుచిగా ఉండేలాగా చేయడం కొంచెం క‌ష్టమే అవుతుంది.

కానీ ఈ ప‌ద్ద‌తిలో ఒక‌సారి ట్రై చేస్తే ఏ ఆవ‌కాయ ప‌చ్చ‌డినైనా ఈజీగా పెట్టేయ‌చ్చు. ఈ బెల్లం ఆవకాయ‌ను పెట్ట‌డానికి మంచి మామిడికాయ‌ల‌ను తీసుకోవాలి. ముఖ్యంగా క‌లెక్ట‌ర్ కాయల‌ను తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనినే హైదరాబాద్‌లో అయితే తోతాపురి అంటారు. తియ్య‌గా, పుల్ల‌గా ఉండే ఈ బెల్లం ఆవ‌కాయ‌ను ఎలా చేయాలో ఈ క‌థ‌నంలో చూసేయండి.

బెల్లం ఆవకాయ పెట్టడానికి కావాల్సినవి:

  1. మామిడి ముక్కలు – రెండు కేజీలు
  2. మెంతి పొడి – అర క‌ప్పు
  3. ఆవ పొడి – రెండు క‌ప్పులు
  4. బెల్లం – ముప్పావు కేజీ
  5. ఉప్పు – అర క‌ప్పు
  6. కారం – రెండు క‌ప్పులు
  7. ప‌సుపు – అర స్పూన్
  8. నువ్వుల నూనె – కేజీ

బెల్లం ఆవకాయ తయారు చేసే విధానం:

  1. ముందుగా మామిడికాయలు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి వాటి ముచుకను తీసి ఒక అరగంట పాటు నీళ్ళల్లో ఉంచి ఆ తర్వాత వాటిని శుభ్రంగా తుడిచి మనకు కావాల్సిన సైజులో ముక్కలు కోసి పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు ఒక వెడ‌ల్పాటి గిన్నెలో మామిడి ముక్క‌లు తీసుకుని అందులో మామిడి కాయలు కొలవడానికి తీసుకున్న కప్పుతో, కారం, ఉప్పు, ఆవపొడి, మెంతిపొడి, బెల్లం, ప‌సుపు ఇవ‌న్నీ వేసి ప్ర‌తీ ముక్క‌కి అన్నీ ప‌ట్టేలా క‌లిపాలి.
  3. ఇప్పుడు దాన్ని మూత పెట్టేసి ఒక‌రోజంతా అలానే ఉంచేయాలి.
  4. కావాలంటే రెండు మూడు రోజులైనా ఉంచ‌వ‌చ్చు. అప్పుడు బాగా ఊరుతుంది.
  5. త‌ర్వాత అందులో నువ్వుల నూనె క‌లిపి కారం, ఉప్పు వేసిన మిశ్రమాన్ని బాగా క‌లుపుకోవాలి
  6. ఒకవేళ తీపి త‌క్కువ‌గా కావాల‌నుకునేవాళ్లు సగం కప్పు వేసుకోవచ్చు.
  7. ఇలా కలిపిన ముక్కల్ని మూడు రోజుల పాటు ఉంచి, బాగా ఊరిన తర్వాత, ముక్కలు వేరుగా, ఊట వేరుగా చేసి ముక్కల్ని ఊటని ఒక రోజు ఎండలో పెట్టాలి.
  8. స‌రిప‌డా ఉప్పు చూసుకుని, ముక్కలు మునిగేంత నూనె పోసుకుని బాగా కలుపుకుని జాడీలో భద్రంగా పెట్టుకుంటే సంవత్సరం వరకు బెల్లం ఆవకాయ పాడవకుండా నిలవ ఉంటుంది.

అంతే. ఎంత సులువుగా ఇట్టే పెట్టేసే ఈ బెల్లం ఆవకాయ తియ్యగా, కమ్మగా, చాల బాగుంటుంది. మరింకెందుకాలస్యం మీరు కూడా ఈ వేస‌వికి బెల్లం ఆవకాయను పెట్టేసుకుని రుచిని ఆనందించండి.

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Previous articleపిల్ల‌ల‌కు త‌ల్లిదండ్రులే రోల్‌మోడ‌ల్స్.. ఈ అల‌వాట్ల‌తో వారికి మంచి భవిష్య‌త్‌ అందించండి
Next articleముల్లంగి: వ్యాధులను తరిమివేసే శక్తిమంతమైన ఆహారం