OCD symptoms: అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌ (ఓసీడీ) లక్షణాలు గుర్తించడం ఎలా?

obsessive compulsive disorder
Image Credit: Pixabay

OCD symptoms: ఓసీడీ ఫుల్‌ఫామ్ (OCD full form) ఆబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌ (obsessive compulsive disorder). ఇది ఒక సాధారణ మానసిక వ్యాధి. తెలుగులో దీని అర్థం ఏంటంటే.. అవాంఛిత ఆలోచనలు పదేపదే రావడం (అబ్సెషన్స్‌), ఒకే పని లేదా అలవాటును పదే పదే చేయడాన్ని నియంత్రించుకోలేకపోవడాన్ని (కంపల్సివ్‌) స్థూలంగా ఓసీడీ వ్యాధిగా చెప్పొచ్చు. కొందరిలో అబ్సెషన్స్‌ లేదా కంపల్సివ్‌ లక్షణం ఉంటే మరికొందరిలో రెండూ ఉంటాయి.

సాధారణంగా కొందరు కడిగిన గిన్నెనే పదే పదే కడుగుతారు. గంటలో పదిసార్లు శానిటైజర్‌తో చేతులు శుభ్రపరచుకుంటారు. ఆఖరికి వేరే వాళ్లిచ్చే కరెన్సీ నోట్లకు కూడా స్నానం చేయిస్తారు. ఇవన్నీ వినడానికి ఫన్నీగా, సింపుల్‌ గా ఉండొచ్చు. కానీ ఈ పనుల వెనుక అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌(ఓసీడీ) వ్యాధి లక్షణం దాగి ఉండే అవకాశం ఉంది.

ఈ మానసిక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి వేరేవాళ్లు చెబితే కానీ తాను అతిగా శుభ్రత పాటిస్తున్న సంగతి తెలియక పోవచ్చు. వ్యాధి లక్షణాలను అర్థం చేసుకోవడం కూడా కొంచెం కష్టమే. అవి ఒక్కొక్కరికి విభిన్నంగా ఉండొచ్చు. కొందరిలో లక్షణాలు మైల్డ్‌ గా ఉంటే మరికొందరిలో తీవ్రంగా ఉండొచ్చు.

OCD types: అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌ రకాలు

ఓసీడీ లక్షణాలను సాధారణంగా నాలుగు రకాలుగా విభజిస్తారు.

1. తనిఖీ చేయడం: తాళం వేశామా లేదా, వేసినా సరిగ్గా పడిందా లేదా పదే పదే చెక్‌ చేయడం. అలాగే అలారం పెట్టామా? మరిచిపోయామా? లైట్‌ స్విచ్‌ ఆపేశామా? మోటార్‌ ఆపేశామా? ఇలా తనిఖీ చేయడం. అలాగే ఏదైనా వైద్య స్థితి గతి గురించి.. పదే పదే తనిఖీ చేసుకోవడం

2. కల్తీ గురించి ఆందోళన: కొన్ని వస్తువులు మురికిగా ఉన్నాయనో, కల్తీ అయ్యాయనో ఆందోళన చెందడం, లేదా పదేపదే శుభ్రపరచుకోవడం

3. ఆర్డర్‌లో పెట్టుకోవడం: వస్తువులు, చేతలు 100 శాతం పర్‌ఫెక్ట్‌గా, నిర్ధిష్ట పద్ధతిలో ఉండాలనుకోవడం

4. అనుచిత ఆలోచనలు : అవాంఛిత ఆలోచనలు పదేపదే రావడం, ఇవి ఒక్కోసారి హింసాత్మకమైనవిగా, డిస్టర్బింగ్‌గా ఉండడం

అబ్సెసివ్‌ ఆలోచనల్లో కొన్ని

1. మీ గురించి మీరు అతిగా ఆందోళన చెందడం, లేదా ఇతరుల గురించి వారికేదైనా ఆపద వస్తుందేమోనని భయపడడం
2. భాగస్వామిని, లేదా ఇతరులను కారణం లేకుండా అతిగా అనుమానించడం
3. ఇతరులతో గట్టిగా మాట్లాడేందుకు భయపడడం

కంపల్సివ్‌ అలవాట్లలో కొన్ని

1. కొన్ని పనులను ప్రతిసారి నిర్ధిష్టమైన ప్యాటర్న్‌లో చేయడం, లేదా పదేపదే చేయడం

2. అన్ని సక్రమంగా, పరిశుభ్రంగా ఉండాలని అనుకోవడం, పదే పదే వస్తువులను సర్దుతూ ఉండడం

3. పెన్నును చేతితో అతిగా తిప్పడం

4. డోర్‌ హ్యాండిల్స్‌ ముట్టుకోకుండా డోర్‌ తీయడానికి ప్రయత్నించడం

5. ఎవరికీ షేక్‌ హ్యండ్‌ ఇవ్వకపోవడం

6. ఇంటికి లేదా వాహనానికి తాళం వేశామో లేదో పదే పదే చూసుకోవడం

7. అవతలి వ్యక్తి తాను చెప్పింది వింటున్నారో లేదో అన్న అనుమానంతో చెప్పిన విషయాన్ని పదేపదే చెప్పడం ఇవన్నీ ఓసీడీ లక్షణాలుగా చెప్పుకోవచ్చు.

OCD in celebrities: కొందరు సెలెబ్రిటీల్లోనూ ఓసీడీ

అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌ లక్షణాలు కనిపిస్తే భయపడాల్సిన అవసరం లేదు. ఒకటో రెండో లక్షణాలు ఉన్నంత మాత్రాన కూడా భయం అక్కర్లేదు. సెలబ్రిటీల్లో కూడా కొందరు ఈ వ్యాధి లక్షణాల బారిన పడ్డవారు ఉన్నారు.

ఓసీడీతో బాధపడుతున్న ప్రముఖులు కూడా ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. మొన్నటి వరకు అమెరికాను పాలించిన డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా ఓసీడీ బాధితుడే. స్కూల్లో, కాలేజీలో చదువుతున్నప్పుడు ఆయన టీచర్‌ డెస్క్‌ ల వద్దకు కూడా వెళ్లేవారు కాదట.

ట్రంఫ్‌ టీచర్లకు షేక్‌ హ్యాండ్‌ కూడా ఇచ్చేవారు కాదట. ఎందుకంటే చేతిపై పదిహేడు వేల బ్యాక్టిరియా ఉంటుందని భయపడేవారట. ట్రంప్‌ ఆ భయం పోయేందుకు చికిత్స తీసుకున్నారు. ఆ తరువాత ఓసీడీ తీవ్రత తగ్గినప్పటికీ పూర్తిగా మాత్రం నయం కాలేదు.

ప్రెసిడెంట్‌ అయ్యాక కూడా ఓసీడీ లక్షణాలు పాక్షికంగా ఉన్నాయంటారు. షేక్‌ హ్యాండ్‌ ఇచ్చే విషయంలో మాత్రం ఓసీడీ పెద్దగా ప్రభావం చూపలేదు. పలువురు దేశాధినేతలను కలిసేప్పుడు భయపడకుండానే చేతులు కలిపారు

అంతర్జాతీయ స్టార్‌ ఫుట్‌ బాల్‌ ఆటగాడు డేవిడ్‌ బెకమ్‌ కూడా ఓసీడీ బాధితుడే. ఈయనకి అన్నీ సరైన క్రమంలో పెట్టడం అలవాటు. అంతేకాదు అన్ని సరిసంఖ్యలో ఉండాలని కూడా కోరుకుంటూ ఉంటారు.

మూడు కోక్‌ క్యాన్లు ఉంటే ఒకటి తాగకుండా బయటపడేస్తారు. రెండు సరి సంఖ్య కాబట్టి అలా చేశానని చెప్పుకొస్తారు. ఇంట్లో ఎప్పుడూ వస్తువులను అమరస్తూ కూర్చుంటాడు. అలా ప్రవర్తించండం మానాలనుకున్నా, మానలేకపోతున్నానని చెబుతున్నాడు ఈ స్టార్‌ ప్లేయర్‌. 

అతని భార్య కూడా డేవిడ్‌ ఓసీడీతో రాజీపడిపోయింది. ఆయన చేష్టలను అప్పుడప్పుడు మీడియాతో పంచుకుంటూ ఉంటుంది కూడా.


ఇవి కూడా చదవండి : హైపర్‌ యాక్టివా.. ఏడీహెచ్‌డీ ఉందా?


మన సెలెబ్రిటీల విషయానికి వస్తే దీపికా పడుకునేలో కూడా ఓసీడీ లక్షణాలు ఉన్నాయట. ఇల్లు, కారు, స్నేహితుల ఇల్లు, చివరికి సినిమా సెట్‌ లో కూడా ఏదైనా చిందరవందరగా ఉంటే చూడలేదు. తానే సర్దేస్తారట.

గతంలో డిప్రెషన్‌ బారిన పడ్డ దీపికా తిరిగి కోలుకుని డిప్రెషన్‌ బాధితులకు ఊరటగా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ప్రియాంక చోప్రా తాను ఓసీడీ బాధితురాలిననే గతంలో తెలిపింది. ఒకసారి తాను ఇచ్చిన పార్టీలో నాప్కిన్లు, గిన్నెలు, స్పూనులు సర్దుకుంటూనే ఉందట.

పార్టీని ఎంజాయ్‌ చేయడమే మర్చిపోయింది. ఓసీడీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపకపోయినా.. చిన్న చిన్న ఆనందాలను దూరం చేస్తుందని అంటోంది ప్రియాంక చోప్రా.

ఇక బాలీవుడ్‌ బాంబ్‌ షెల్‌ సన్నీ లియోన్‌ కు పాదాల అతి శుభ్రత ఎక్కువ. ప్రతి పావుగంటకు ఓసారి పాదాలు కడుక్కుంటూనే ఉంటుంది. ఇదో ఓసీడీ రకం. షూటింగ్‌ సెట్లో ఉన్నా ఆమె ఇదే రకంగా ప్రవర్తిస్తుంది.

OCD causes: ఓసీడీ ఎందుకొస్తుంది?

మెదడు కొన్ని వేల కోట్ల న్యూరాన్స్‌ తో నిర్మితమైంది. న్యూరాన్స్‌ మధ్య సమాచార మార్పిడికి సెరటోనిన్‌ అనే న్యూరోట్రాన్స్‌ మీటర్‌ అవసరం. సెరటోనిన్‌ పరిమాణం తగ్గితే మతిమరుపు, ఒత్తిడి కలుగుతుంది.

దీని వల్ల ఓసీడీ వచ్చే అవకాశం ఉంది. అలాగే చిన్న వయస్సులో భౌతిక, లైంగిక దాడికి గురైనప్పుడు, ప్రమాదం బారినపడ్డప్పుడు, డిప్రెషన్, యాంగ్జయిటీ వంటివాటి బారినపడ్డప్పుడు, బాగా ఒత్తిడికి గురైనప్పుడు భవిష్యత్తులో ఓసీడీ లక్షణాలు కనిపించే అవకాశాలు ఉన్నాయి.

భవిష్యత్తులో ప్రతి ఇంట్లో ఒక వ్యక్తికి ఓసీడీ వచ్చే అవకాశం ఉన్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

OCD treatment: ఓసీడీకి చికిత్స ఉందా?

మీలో కనిపించే లక్షణాలు ఈ ఓసీడీకి సంబంధించినవి కావని వైద్యులు నిర్ధారించేందుకు తగిన వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఓసీడీ లక్షణాలని భావిస్తే మీ ఆలోచనలు, అలవాట్ల గురించి తెలుసుకుంటారు.

దీనికి నిర్ధిష్టమైన చికిత్స లేదు కానీ మీలో కనిపించే లక్షణాలు మీపై ప్రభావం చూపకుండా ఉండేందుకు థెరపీ గానీ, మందులు గానీ, రెండింటి కలయికతో కూడిన చికిత్స గానీ అందిస్తారు.

మెదడులో తగ్గిన సెరటోనిన్‌ స్థాయిలను పెంచడానికి తగిన మందులను వైద్యులు సూచిస్తారు. అలాగే భయాలు, ఆందోళనలు తగ్గించేందుకు మానసికపరమైన సైకోథెరఫీ చికిత్సను అందిస్తారు.

కాగ్నిటివ్‌ బిహేవియర్‌ చికిత్సతో ప్రవర్తనను మారుస్తారు. యోగా, ధ్యానం, వంటివి ఒత్తిడి కారణంగా ఎదురయ్యే ఓసీడీ లక్షణాలను నయం చేస్తాయి. వ్యాధి లక్షణాలు గమనిస్తే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

– మానస్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Previous articleCryptocurrency in telugu: క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటి? బిట్‌ కాయిన్‌ ఎలా కొనుగోలు చేయొచ్చు?
Next articlePregnancy food chart: ప్రెగ్నెన్సీ ఆహారం : ఫుడ్‌ ఛార్ట్‌ ఎలా ప్రిపేర్ చేయాలి?