Home Blog Page 71

ఆన్ లైన్ మోసాలు : పాత వస్తువులు అమ్మేటప్పుడు జాగ్రత్త

0

న్ లైన్ మోసాలు కోకొల్లలు. పాత వస్తువులను అమ్మేయాలనుకున్నా ఈ మోసాలు ఎదుర్కోకతప్పని పరిస్థితి. క్వికర్‌, ఓఎల్‌ఎక్స్‌ తదితర వెబ్ సైట్లు పాత వస్తువులను అమ్మేసేందుకు ఉపయోగపడతాయి కదా.. సింపుల్‌గా మనం అమ్మాలనుకుంటున్న వస్తువుల ఫొటోలు తీసి, దానిని ఎంతకు అమ్మాలనుకుంటున్నామో ధర పెట్టేయాలి. మీ వివరాలు ఇస్తే.. ఆసక్తి ఉన్నవాళ్లు మిమ్మల్ని సంప్రదిస్తారు.

అయితే వీటిని ఉపయోగించుకొని కొందరు వ్యక్తులు మోసాలకు పాల్పడుతున్నారు. వస్తువును అమ్మేది మీరే.. మీకు తెలియకుండానే దానికి ఎదురు డబ్బులు చెల్లించేది మీరే.. ముఖ్యంగా యూపీఐ ఆధారిత పేమెంట్స్‌ విషయంలో ఈ మోసాలు జరుగుతున్నాయి. అదెలా జరుగుతుంది.. ఆ మోసం బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

మోసం ఎక్కడ మొదలవుతుందంటే..

మీరు ఈ తరహా వెబ్ సైట్లలో ఏదైనా వస్తువును అమ్మకానికి పెట్టగానే ఆసక్తి ఉన్న వాళ్ల నుంచి ఫోన్‌ వస్తుంది. సపోజ్‌.. మీ పాత మొబైల్‌ ఫోన్‌ను అమ్మేయాలనుకొని దాని ఫొటోలను ఈ వెబ్‌సైట్లలో పెట్టారని అనుకుందాం. కాసేపటికే ఆసక్తి ఉన్న వాళ్ల నుంచి ఫోన్‌ వస్తుంది. సాధారణంగా పాత వస్తువులను అమ్మే సమయంలో ఎవరైనా బేరమాడుతారు. మీరు చెప్పిన ధరను తగ్గించమని అడుగుతారు.

కానీ ఇలాంటి మోసగాళ్లు ఫోన్‌ చేసినప్పుడు ఎలాంటి బేరమాడరు. మీరు చెప్పిన ధరకు కొనడానికి సిద్ధమవుతారు. ఒక్కోసారి వెంట వెంటనే కాల్స్‌ వస్తాయి. మీ వస్తువును కొనడానికి పోటీ పడుతున్నట్లుగా ఉంటుంది పరిస్థితి. కొంతమంది మీరు చెప్పిన ధర కంటే.. ఎక్కువిచ్చి అయినా కొనడానికి రెడీ అంటారు. ఇక్కడే మీరు జాగ్రత్తగా ఉండాలి. మీకు ఫోన్‌ చేసిన వ్యక్తి.. బేరమాడకపోయినా, ఎక్కువ మొత్తం ఇస్తానని చెబుతున్నా.. అనుమానించండి.

మోసం ఎలా జరుగుతుందంటే..

మనం ఏదైనా కొత్త వస్తువు కొనడానికి కూడా చాలాసార్లు బేరమాడతాం. వీలైనంత తక్కువకు కొనడానికే ప్రయత్నిస్తాం. అలాంటిది మీరు వాడిన వస్తువును కొనడానికి అవతలి వ్యక్తి మీరు చెప్పిన ధరకన్నా ఎక్కువ చెల్లిస్తానంటే కచ్చితంగా అనుమానం రావాల్సిందే. ఇలాంటి సందర్భాల్లో అవతలి వ్యక్తి.. మీ వస్తువును బుక్‌ చేసుకోవడానికి యూపీఐ ద్వారా డబ్బు చెల్లిస్తానని చెబుతారు. అసలు మోసం ఇక్కడే మొదలవుతుంది.

మొత్తం డబ్బు కానీ, అడ్వాన్స్‌గా కొంత మొత్తంగానీ డిజిటల్‌ పేమెంట్స్‌ యాప్‌ ద్వారా పంపిస్తానని అంటారు. అంటే గూగుల్‌ పే, ఫోన్‌ పె, ఇతర యూపీఐ యాప్స్ అన్నమాట. మీకు డబ్బు చెల్లించాల్సిందిపోయి.. ఈ యాప్స్‌లోని రిక్వెస్ట్‌ మనీ ఆప్షన్‌ ద్వారా మిమ్మల్నే డబ్బు అడుగుతారు. ఈ మెసేజ్‌ను సరిగా చూసుకోకపోతే మీరు మోసపోయినట్లే. వచ్చిన మెసేజ్‌పై క్లిక్‌ చేసేస్తే.. మీ అకౌంట్లోని డబ్బే అవతలి వ్యక్తికి చేరిపోతుంది. 

ఓటీపీనీ లాగేస్తారు..

మోసగాళ్లు ఒక్కోసారి మీ డబ్బును దోచుకోవడానికి మర్చంట్‌ అకౌంట్‌ కూడా వాడుతుంటారు. ఇలాంటి సమయంలో మీ మొబైల్‌కు ఓటీపీ కూడా వస్తుంది. పేటీఎంలాంటి సంస్థలు మర్చంట్‌ పేమెంట్స్‌లో మోసం జరగకుండా ఉండేందుకు సదరు కస్టమర్‌కు ఓటీపీ కూడా పంపిస్తాయి. ఈ సందర్భంలో మర్చంట్‌ అకౌంట్‌ వాడే మోసగాళ్లు మిమ్మల్ని ఆ ఓటీపీ అడుగుతారు. ఆ ఓటీపీ చెప్పేశారో మీ అకౌంట్లో డబ్బు పోయినట్లే.

అసలు ఇక్కడే కాదు.. ఏ సందర్భంలో అయినా.. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి ఇలాంటి ఓటీపీలు అడిగితే చెప్పొద్దు. డబ్బు మీ అకౌంట్‌లో నుంచి డెబిట్‌ కావడానికి ఈ ఓటీపీలు వస్తాయి తప్ప.. క్రెడిట్‌ కావడానికి కాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి.

మీకు ఎవరైనా డబ్బులు పంపిస్తే.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీ రాదు. పొరపాటుగానో, తొందర్లోనో అనాలోచితంగా మీకు వచ్చిన ఓటీపీ చెప్పేస్తే.. మీ వస్తువుకు మీరే ఎదురు డబ్బులు ఇచ్చిన వాళ్లు అవుతారు. 

ఇలా చేస్తే సేఫ్‌

సాధారణంగా ఓఎల్‌ఎక్స్‌, క్వికర్‌లలో వస్తువులను అమ్మేటప్పుడు యూపీఐల ద్వారానే డబ్బు చేతులు మారుతుంది. అయితే ఆ డబ్బు తీసుకోవడంగానీ, మీ వస్తువును ఇవ్వడంగానీ.. అవతలి వ్యక్తిని వ్యక్తిగతంగా కలిసిన తర్వాతే చేయడం అన్ని విధాలుగా మంచిది. మీ వస్తువును ఇవ్వాలంటే ఎలాగూ కొనే వ్యక్తి మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవాల్సిందే. అదే విషయం ఆ వ్యక్తికి చెప్పండి. నేరుగా మాట్లాడి బేరం కుదుర్చుకోండి.

పేమెంట్స్‌ పొందేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండండి. ఇక తప్పదు అనుకుంటేనే మీ వస్తువును కొనే వ్యక్తికి మీ ఇంటి అడ్రెస్‌ ఇవ్వండి. లేదంటే బయట ఎక్కడో ఓ చోట కలవండి. అసలే ఆన్‌లైన్ వ్యాపారం. అవతలి వ్యక్తులు మొహాలు కూడా తెలియవు. అందుకే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆన్ లైన్ మోసాలను ఎదుర్కోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఒంట్లో కొవ్వు మలినాలు తగ్గించుకోవడం ఎలా

0

ఒంట్లో ఉన్న కొవ్వును కరిగించుకోవడానికి చాలా మంది నానా పాట్లు పడుతుంటారు. డైటింగ్‌ చేస్తుంటారు.. జ్యూసులే తాగి బతికేస్తుంటారు. ఇష్టం లేకపోయినా వింత వింత పదార్థాలను తినేస్తుంటారు. ఇక కాలుష్యం కారణంగానో.. మనకున్న చెడు అలవాట్ల వల్లో ఒంట్లో మలినాలు కూడా పెద్ద ఎత్తున పేరుకుపోతున్నాయి. వీటిని బయటకు పంపించడానికి కూడా ఇష్టం లేని చేదును బలవంతంగానైనా మింగేస్తున్నారు. కానీ ఆ అవసరం లేకుండా, మీకు నచ్చే ఫుడ్‌తోనే ఒంట్లో కొవ్వు, మలినాలు తొలగించుకోవచ్చని తెలుసా? ఇప్పుడు మేం చెప్పుబోయే వాటిని రెగ్యులర్‌గా తినండి లేదా తాగండి.. పెద్దగా ఇబ్బంది పడకుండానే ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపండి. ఒంట్లో కొవ్వు మలినాలు తగ్గించుకోండి.

గ్రేప్‌ఫ్రూట్‌ (దబ్బ పండు)

చాలా మంది బరువు తగ్గడానికి కడుపు మాడ్చుకుంటారు. బాగా ఆకలి వేస్తున్నా.. లైట్‌గా తింటూ ఒళ్లు తగ్గించుకోవడానికి శ్రమ పడతారు. కానీ ఆ అవసరం లేదు. ప్రతి పూటా మీరు తినే ముందు సగం గ్రేప్‌ఫ్రూట్‌ను తినండి. ఆరు వారాల్లో మీకే స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఈ పండు తాలూకు అద్భుతమైన ఫలితాలు మెటబాలిజం అనే జర్నల్‌లోనూ ప్రచురించారు. ఈ పండులో కొవ్వును కరగదీసే ఫైటో కెమికల్స్‌ ఉంటాయి. వీటి వల్ల మీ నడుము చుట్టూ పేరుకుపోయిన అదనపు కొవ్వు కరిగిపోతుంది.

మందార టీ

మందార టీతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా హైబీపీ ఉన్న వాళ్లకు బాగా పని చేస్తుంది. రక్త ప్రసరణను నియంత్రిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు తగ్గడానికి కూడా బాగానే ఉపయోగపడుతుంది. పైగా జీర్ణశక్తి పెంచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి కూడా మందార టీ ఉపకరిస్తుంది. ఇందులో విటమిన్‌ సీ అధికంగా ఉంటుంది. 

అవకాడో

అవకాడో పండు వల్ల కూడా మీ శరీరానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. పోషకాలు పుష్కలంగా ఉండే ఈ పండు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్‌ కంటి చూపును మెరుగు పరుస్తుంది. లివర్‌ను పాడు చేసే గాలాక్టోసమైన్‌ అనే ఓ విష పదార్థానికి ఈ అవకాడో విరుగుడుగా పని చేస్తుంది.  దీని టేస్ట్‌ కూడా అద్భుతంగా ఉంటుంది. సో.. కచ్చితంగా మీ డైట్‌లో ఈ పండును చేర్చుకోవచ్చు. 

నిమ్మరసం

ఆరోగ్యంగా ఉండటానికి ప్రతి రోజూ కనీసం 8 గ్లాసుల నీళ్లయినా తాగాలని డాక్టర్లు చెబుతుంటారు. అయితే ప్రతిసారీ ఆ నీటిలో కొన్ని నిమ్మకాయ ముక్కలు వేసుకొని తాగండి. ఒంట్లో మలినాలను శుభ్రం చేయడానికి నీళ్లు ఎంతగానో ఉపకరిస్తాయి. వాటిలో నిమ్మకాయ ముక్కలు వేయడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది. 

సాల్మన్‌ చేపలు

స్మోకింగ్‌ ఎంత ప్రమాదమో మనకు తెలుసు. అయినా దానిని మానేయడానికి చాలా ఇబ్బంది పడతాం. ఈ స్మోకింగ్‌ కారణంగా వివిధ క్యాన్సర్లతోపాటు గుండె జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఎలాగైనా స్మోకింగ్‌ మానేయాలి అనుకున్న వాళ్లు.. రోజూ కొంత మోతాదులో అయినా సాల్మన్‌ చేపను మీ డైట్‌లో చేర్చుకోండి. ఇందులో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ రక్తాన్ని శుభ్రం చేస్తాయి. దీనివల్ల రక్త ప్రసరణకు ఎలాంటి అడ్డంకి లేకుండా సాఫీగా సాగిపోతుంది. రోజుకు రెండు గ్రాముల ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ తీసుకుంటే చాలు.. మీ గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే ధమనులు శుభ్రపడతాయి. వంద గ్రాముల సాల్మన్‌ చేపలో ఈ రెండు గ్రాముల ఒమెగా -3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. 

బీట్‌రూట్‌

మందు తాగే అలవాటు ఉన్నవాళ్ల లివర్‌ త్వరగా చెడిపోతుందని తెలుసు కదా. అలాంటి వాళ్లకు ఈ బీట్‌రూట్స్‌ ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే బెటాలేన్స్‌ అనే యాంటీఆక్సిడెంట్స్‌.. కాలేయంలోని కణాలను బాగు చేయగలవు.. కొత్తగా సృష్టించగలవు. దీనివల్ల లివర్‌ బాగా పని చేస్తుంది. 

ఆవాలు

మీ శరీర జీవక్రియ (మెటబాలిజం)ను మెరుగు పరుచుకునేందుకు ఆవాలు ఎంతగానో సాయం చేస్తాయి. ఒక టీ స్పూన్ ఆవాలు తింటే చాలు.. కొన్ని గంటల పాటు మీ జీవక్రియ 25 శాతం మేర మెరుగుపడుతుంది. శరీరానికి మంచి ప్రొటీన్‌ ఇచ్చే మాంసాహారంతో కలిపి ఈ ఆవాలను తీసుకుంటే.. మరింత మేలు జరుగుతుంది. 

పాలకూర

విపరీతమైన ఆకలితో బాధపడేవాళ్లకు పాలకూర దివ్యౌషధంలా పని చేస్తుంది. ఈ పాలకూర ద్వారా సహజసిద్ధంగా మీ ఆకలిని తగ్గించుకోవచ్చు. ఇందులో ఆకలిని తగ్గించే గుణం ఉన్న తైలకాయిడ్స్‌ ఉంటాయి. ప్రతి రోజూ మీ బ్రేక్‌ఫాస్ట్‌లోనో, లంచ్‌లోనూ పాలకూర కచ్చితంగా ఉండేలా చూసుకోండి.

అరటిపండ్లు

కడుపు ఉబ్బరానికి అరటిపండ్లు మంచి మందుగా పని చేస్తాయి. రోజూ రెండు పూటలా భోజనం చేసే ముందు అరటిపండు తింటే ప్రయోజనం ఉంటుంది. ఇలా చేయడం వల్ల 50 శాతం వరకు కడుపు ఉబ్బరం సమస్య  తగ్గిపోయినట్లు అనేరోబ్‌ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం చెబుతోంది. కడుపు ఉబ్బరాన్ని తగ్గించే బ్యాక్టీరియాను పెంచడంతోపాటు శరీరానికి అవసరమైనంత పొటాషియం ఈ అరటిపండు అందిస్తుంది. 

టమాటాలు

ఎండ వేడిమి నుంచి చర్మాన్ని కాపాడగలిగే యాంటీఆక్సిడెంట్స్‌ టమాటాల్లో పుష్కలంగా ఉంటాయి. రోజూ మన మెనూలో టమాటాలకు కూడా చోటిస్తే.. సూర్య కాంతి వల్ల మీ చర్మం దెబ్బ తినకుండా ఉంటుంది. వీటిని నేరుగా తినడం ఇష్టం లేకపోతే.. కూర, సాస్‌, సూప్‌ లేదా ఆమ్లెట్‌లలో కూడా వేసుకోవచ్చు. 

కివి పండు

మలబద్ధకంతో బాధపడే వాళ్లు ఈ కివి పండు తింటే ప్రయోజనం ఉంటుంది. ఇందులో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. నెల రోజుల పాటు రోజుకు రెండు కివి పండ్లను తింటే.. మలబద్ధకం చాలా వరకు తగ్గిపోయినట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఇప్పుడు దాదాపు అన్ని సూపర్‌ మార్కెట్‌లలో ఈ కివి పండు దొరుకుతోంది. 

చల్లని బంగాళాదుంపలు

మనం బంగాళాదుంపలను తరచూ తింటూనే ఉంటాం.. కానీ వాటిని వేడి వేడిగా తినడం మనకు అలవాటు. అలాకాకుండా బంగాళాదుంపలను వండిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టాలి. దీనివల్ల వాటిలో రెట్రోగ్రేడేషన్‌ ప్రక్రియ జరుగుతుంది. అంటే ఆలుగడ్డల్లో ఉండే సులువుగా జీర్ణమయ్యే పిండిపదార్థాలు కాస్తా.. నిరోధక పిండి పదార్థాలుగా మారుతాయి. ఈ పిండి పదార్థాలను అరిగించుకోవడానికి శరీరం కాస్త ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. దీని కారణంగా శరీరంలో ఉన్న అదనపు  కొవ్వు పదార్థాలు కరిగిపోతాయి. 

బాదాం

మందు తాగే అలవాటు ఉన్న వారి కాలేయం చుట్టూ చెడు కొలెస్ట్రాల్‌ చేరుతుంది. ఇది కాలేయ క్యాన్సర్‌కు దారి తీస్తుంది. మంచి విటమిన్లు ఉన్న బాదాంలను రోజూ తింటే.. ఈ చెడు కొలెస్ట్రాల్‌ తొలగిపోయి, కాలేయం శుభ్రపడుతుంది. 

ఓట్స్‌

ఓట్స్‌లోనూ ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. ఒక కప్పు ఓట్స్‌లో 16 గ్రాముల ఫైబర్‌ ఉంటుంది. ఒబెసిటీ, డయాబెటిస్‌, గుండె జబ్బులలాంటి వాటి బారిన పడకుండా ఓట్స్‌ కాపాడతాయి. రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా ఓట్స్‌ను తీసుకుంటే మేలు జరుగుతుందని అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ పరిశోధనలో తేలింది. 

ఈ ఫైనాన్షియల్ మిస్టేక్స్ .. మీ సంపదకు చేటు

0

మీ ఆర్థిక తప్పిదాలు (ఫైనాన్షియల్ మిస్టేక్స్) మీకు తెలియకపోవడం వల్లే నెలకు ఆరంకెల సంపాదన ఉన్నా.. అప్పుల పాలవుతున్నారు. కొందరిది అతి జాగ్రత్త అయితే.. మరి కొందరిది లెక్కలేనితనం. కొందరు తమ సంపాదనను ఇంట్లోనే మూటలు కట్టిపెడుతుంటే.. మరికొందరు అనవసరమైన ఖర్చు చేస్తున్నారు.

నిజానికి ఈ రెండింటితోనూ నష్టమే. మన దేశంలో చాలా వరకు మధ్య తరగతి కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నం అవుతున్నాయంటే దానికి కారణం.. ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ తెలియకపోవడమే. డబ్బు విషయంలో చేసిన తప్పునే మళ్లీ మళ్లీ చేస్తూ చేతులు కాల్చుకోవడం ఓ అలవాటుగా మారింది.

డబ్బుల విషయంలో అసలు మనం చేస్తున్నతప్పులేంటో తెలుసుకుంటే.. మన ఆర్థిక సమస్యలకు సగం పరిష్కారం దొరికినట్లే. డియర్ అర్బన్ డాట్ కామ్ మీకోసం అందిస్తున్న ప్రత్యేక కథనం ఇదీ..

ఖర్చుకు లెక్కేది?

 రెండు చేతులా సంపాదిస్తున్నాం కదా అని అంతకు మించిన స్థాయిలో ఖర్చు పెట్టేస్తుంటాం. ఎవరైనా డిస్కౌంట్‌ అంటే చాలు ఎగబడి కొనేస్తాం. అది మనకు అవసరమా కాదా అన్నది కూడా పట్టించుకోం. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లలో సేల్‌ అని కనిపిస్తే చాలు.. ఆర్డర్‌ చేసేస్తాం. నిజానికి మన వీక్‌నెసే వాళ్లకు పెట్టుబడి. అందుకే వీళ్లు దాదాపు ప్రతి నెలా ఏదో ఒక సేల్‌ పెడుతూనే ఉంటారు. 

 ఇక ఏడాదంతా కష్టపడి ఉద్యోగంలో హైక్‌ సంపాదిస్తాం. బోనస్‌లూ అందుకుంటాం. కానీ జీతం పెరిగింది కదా అని లగ్జరీల వైపు చూస్తాం. చిన్న ఇల్లు వదిలేసి పెద్ద ఇల్లు అద్దెకు తీసుకోవడం.. చిన్న కారు పక్కన పడేసి పెద్ద కారు కొనడంలాంటివి. ఇలా చేస్తూ పోతే ఇక సేవింగ్స్‌ ఎక్కడ ఉంటాయి?

 ఎవరైనా సోషల్‌ మీడియాలో ఆ టూర్‌కి వెళ్లొచ్చాం.. సూపర్‌గా ఉంది తెలుసా అని చెబితే చాలు.. ఖర్చుకు కూడా వెనుకాడకుండా వెంటనే లగేజ్‌ సర్దేస్తాం. తీరా వెళ్లొచ్చాక ఖర్చు లెక్కలు వేసుకొని బాధపడుతుంటాం. 

 ఐదు రోజులు చాలా కష్టపడిపోయాం.. వీకెండ్‌ రెండు రోజులు తెగ ఎంజాయ్‌ చేసి రిలాక్స్‌ కావాల్సిందే అనుకుంటాం. వీకెండ్‌ పార్టీల కోసం వేలకు వేలు ఖర్చు పెట్టేస్తాం. నెల తిరగ్గానే చేతిలో చిల్లగవ్వ కూడా ఉండదు. 

 అతి కొద్ది మంది మాత్రమే తాము చేస్తున్న ఖర్చుల లెక్కలు ఎప్పటికప్పుడు చూసుకుంటారు. పరిస్థితికి తగినట్లు నడుచుకుంటారు. కానీ చాలా మందికి అసలు తాము సంపాదించింది ఎలా ఖర్చయిపోయిందో కూడా తెలియదు. 

లగ్జరీతో లాసే..

మనకు ఫ్యాన్సీ అన్నా, లగ్జరీ అన్నా చాలా ఇష్టం. ఫ్యాన్సీ ఫోన్ నెంబర్, ఫ్యాన్సీ కారు, ఫ్యాన్స్‌ వాచ్‌, ఫ్యాన్సీ ఇల్లు.. ఇలా ఏది ఫ్యాన్సీ అనిపిస్తే దానికి ఎంతైనా ఖర్చు పెట్టేస్తాం. కానీ ఆ ఫ్యాన్సీ వస్తువుల వల్ల మనకు వచ్చేదెంత అన్నది ఆలోచించం.

ఇక ఆడవాళ్ల విషయానికి వస్తే బంగారం కనిపిస్తే చాలు కొనేస్తారు. సగటు మధ్య తరగతి వారి దగ్గర కూడా ఓ మోస్తరు బంగారం కచ్చితంగా ఉంటుంది. అయితే చాలా వరకు ఈ బంగారమంతా లాకర్లలోనే మూలుగుతుంది. ఏడాదికి ఒకటి లేదా రెండుసార్లు వాటిని పెట్టుకొని మురిసిపోవడానికి లక్షల కొద్దీ డబ్బు ఖర్చు చేస్తాం. 

పిల్లల పెళ్లిళ్లపై భారీగా ఖర్చు చేసేయడం కూడా మన అలవాటు. కూడబెట్టుకున్న డబ్బంతా ఖర్చు చేసైనా.. అవసరమైతే అప్పు చేసైనా.. మర్యాదలకు ఏ లోటూ రాకుండా పెళ్లిళ్లు చేస్తాం. రానురానూ ఈ ఖర్చులు మరింత పెరిగిపోతున్నాయి. ఏమైనా అంటే.. జీవితంలో ఒకేసారి జరుపుకునే వేడుక.. ఆ మాత్రం ఖర్చు చేస్తే తప్పేంటి అని ఎదురు ప్రశ్నిస్తారు. కానీ ఆ ఒక్క పెళ్లి మీ ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేసేస్తుందన్న విషయాన్ని గమనించరు.

ఆస్తి ఏది.. అప్పు ఏది?

మనలో చాలా మందికి ఆస్తి ఏది అన్నదానిపై  స్పష్టత ఉండదు. కారు కొని దాన్నో ఆస్తి అనుకుంటారు. కానీ కారు ఆస్తి కాదు. దాని మెయింటనెన్స్‌కు, ఇంధనానికి మనం ఖర్చు చేస్తూనే ఉండాలి. పైగా దాని విలువ రోజురోజుకూ తగ్గుతుందే కానీ పెరగదు. కొంత మంది అయితే లోన్‌ తీసుకొని మరీ కార్లు కొంటారు. ఇది చాలా తప్పు.

 అవసరం లేని వాటి కోసం ఇబ్బడిముబ్బడిగా ఖర్చు చేసే మనం.. మెడికల్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవడానికి మాత్రం వెనుకాడతాం. దానికి ఎందుకంత ఖర్చు పెట్టడం అన్న ఫీలింగ్‌లో ఉంటారు చాలా మంది. తీరా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడో, పెద్ద జబ్బు చేసినప్పుడో లక్షలు ఖర్చు చేస్తాం. ఇన్సూరెన్స్‌ విలువ మనకు అప్పుడు తెలుస్తుంది. 

 సంపాదించడానికి టైమ్‌ సరిపోవడం లేదు.. రోజుకు 48 గంటలు ఉంటే బాగుంటుంది అని కొంతమంది అనుకుంటారు. కానీ ఇంకొంత మంది మాత్రం ఉన్న టైమ్‌నూ వేస్ట్‌ చేస్తారు. తమ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లే నైపుణ్యాలను నేర్చుకోకుండా.. సోషల్‌ మీడియా, యూట్యూబ్‌, ఇంటర్నెట్‌లతోనే కాలక్షేపం చేస్తుంటారు. టైమ్‌ ఈజ్‌ మనీ అన్న సంగతి గుర్తు పెట్టుకోండి.

 చాలా మందికి జీవితంలో ఏదో సాధించాలన్న లక్ష్యం ఉంటుంది కానీ.. ఆర్థిక లక్ష్యాలు మాత్రం ఉండవు. అందుకే అలాంటివాళ్లు అసలు సేవింగ్స్‌ గురించి పట్టించుకోరు. తొలి జీతం అందుకున్నప్పటి నుంచే పొదుపు నేర్చుకోండి. అది భవిష్యత్తులో మీ ఆర్థిక పరిస్థితిని ఎంతగా మెరుగు పరుస్తుందో మీకే తెలుస్తుంది. 

ఇన్వెస్ట్‌మెంటూ ఓ కళే..

డబ్బు సంపాదించడానికి ఈ మధ్య చాలా మంది స్టాక్‌ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారు. కానీ స్టాక్స్‌పై సరైన అవగాహన లేకుండానే ఇన్వెస్ట్‌ చేసి నష్టపోతున్నారు. సోషల్‌ మీడియాలో ఎవరో ఇచ్చిన టిప్స్‌ను గుడ్డిగా ఫాలో అయిపోయి చేతులు కాల్చుకుంటున్నారు. అధ్యయనం లేకుండా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడితే ఆ సొమ్ము కోల్పోయినట్టే అనే సూత్రం గుర్తు పెట్టుకోండి.

 కొంతమంది తాము కూడబెట్టుకున్న డబ్బంతా తీసుకెళ్లి ఒకేదాంట్లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. అంటే రియల్‌ ఎస్టేట్‌లోనో, బంగారంలోనో, స్టాక్‌ మార్కెట్‌లోనో.. ఇలా ఒకేదాన్ని నమ్ముకోవడం చాలా ప్రమాదం. అన్నింట్లోనూ కొంత ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని గుర్తించండి. 

 రిస్క్‌ తీసుకోవడానికి మనలో చాలా మంది వెనుకాడతాం. ఎంతో కొంత రిటర్న్స్‌ వస్తే చాలని ఏడాదికి ఆరేడు శాతం వడ్డీ ఇచ్చే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకే పరిమితమవుతాం. ఇంకొందరు ఇంట్లోనే డబ్బు మూటలు పెట్టుకొని కూర్చుంటారు. దీనివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. 

సహనం చాలా ముఖ్యం

 డబ్బు సంపాదనలో మనిషికి సహనం కూడా ముఖ్యమే. నేను పెట్టిన డబ్బు ఓవర్‌నైట్‌ డబుల్‌ అయిపోవాలి అనుకుంటే దారుణంగా దెబ్బ తింటారు. స్టాక్‌ మార్కెట్‌లో చాలా మంది నష్టపోవడానికి ఈ అత్యాశే కారణం. కాస్త ఆలస్యమైన మంచి రిటర్న్స్‌ ఇచ్చే షేర్లను కొనుగోలు చేస్తే మంచిదని గ్రహించండి. 

మనమంతా చేసే పెద్ద తప్పు మరొకటి ఉంది. అదేంటంటే ఖర్చు పెట్టిన తర్వాత మిగిలిన డబ్బును ఇన్వెస్ట్‌ చేస్తాం. కానీ ఇన్వెస్ట్‌ చేసిన తర్వాత మిగిలిన డబ్బును ఖర్చు చేయడమన్నది మీ ఆర్థిక క్రమశిక్షణను సూచిస్తుంది. 

చివరిగా ఎంత సంపాదిస్తున్నామన్నది కాదు.. సంపాదించిన దానిని ఎలా మేనేజ్‌ చేస్తున్నామన్నది ముఖ్యమని గ్రహించండి. ఈ దిశగా మీ ఆర్థిక తప్పిదాలు ఏవో గుర్తించి వాటిని ఒక చోట రాసి పెట్టుకుని తరచూ చదువుకోండి.

ఇవీ చదవండి

♦ హాబీలతో ఆదాయ మార్గాలు ఇవిగో

 

8 స్టార్టప్ ఐడియాలు.. మీ తెలివే పెట్టుబడి

0

ది స్టార్టప్‌ల యుగం. లక్షల జీతం వచ్చే ఉద్యోగాలను కూడా వదులుకొని సొంతంగా ఓ స్టార్టప్‌ స్టార్ట్‌ చేద్దామన్న ఆలోచన నేటి యువతలో పెరిగిపోతోంది. స్టార్టప్ ఐడియాలు వెతుకుతున్న కాలమిది.. స్టార్టప్‌ అంటే ఏమీ లేదు. చిన్నగా, తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టే వ్యాపారం. ముఖ్యంగా ఐటీ సెక్టార్‌లో ఈ స్టార్టప్‌ల సంఖ్య చాలా ఎక్కువ.

ఒక్కరు లేదా నలుగురైదుగురు ఫ్రెండ్స్‌ కలిసి చిన్న ఆఫీస్‌  స్పేస్‌ అద్దెకు తీసుకొని స్టార్టప్‌ను మొదలు పెట్టేస్తున్నారు. నేరుగా దేశ, విదేశాల్లోని క్లైంట్స్‌ను సంప్రదించి చిన్న, చిన్న ప్రాజెక్టులను దక్కించుకుంటున్నారు. కాస్త రిస్క్‌ అయినా సరే.. ఓ సంస్థలో ఉద్యోగిగా చేసే కంటే.. ఇలా సొంతంగా స్టార్టప్‌ బెటర్‌ అన్న ఆలోచన యువతలో పెరిగిపోతోంది.

టీహబ్‌ పేరుతో తెలంగాణ ప్రభుత్వం కూడా ఇలాంటి స్టార్టప్స్‌ను ఎంకరేజ్‌ చేయడానికి గచ్చిబౌలిలో ఓ భవనాన్ని నిర్మించిన సంగతి తెలుసు కదా. స్టార్టప్‌ల కోసం తక్కువ అద్దెకు కార్పొరేట్‌ స్పేస్‌ ఇవ్వడమే ఈ టీహబ్‌ ఉద్దేశం.

అయితే చాలా మందికి ఏదైనా స్టార్టప్‌ మొదలుపెట్టాలని ఉన్నా.. ఏం చేయాలి.. ఎలా చేయాలి అన్నదానిపై స్పష్టత ఉండదు. అలాంటి వాళ్లకు టెక్నాలజీ రంగంలో ఎలాంటి స్టార్టప్స్‌ బెటరో ఇప్పుడు చూద్దాం. మీ కోసం డియర్ అర్బన్ డాట్ కామ్ అందిస్తున్న స్టార్టప్ ఐడియాలు ఇవీ..

యాప్ డెవలపర్‌

ఈ స్మార్ట్ ప్రపంచంలో ప్రతిదానికీ ఓ యాప్‌ ఉంటోంది. అందుకే యాప్‌ డెవలపర్లకు ఈ రోజుల్లో ఫుల్‌ డిమాండ్‌. మీరూ యాప్‌ డెవలపర్‌ అయితే సొంతంగా ఓ స్టార్టప్‌ ప్రారంభించేయండి. సొంత ప్రాజెక్టుల కోసం లేదా ఇతర సంస్థల కోసం యాప్స్‌ను డెవలప్‌ చేయండి.

మీ యాప్‌ను ప్రమోట్‌ చేసుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ప్రోడక్ట్‌హంట్‌, బీటాలిస్ట్‌, ఫేస్‌బుక్‌ యాడ్స్‌, ద స్టార్టప్‌ పిచ్‌లాంటి వెబ్‌సైట్స్‌ ద్వారా మీ యాప్స్‌కు మార్కెటింగ్‌ చేసుకోవచ్చు. పైగా ఇక్కడే మీ యాప్‌ డెవలప్‌మెంట్‌ సర్వీస్‌లో పెట్టుబడి పెట్టేవాళ్లను కూడా మీరు వెతుక్కోవచ్చు. 

టెక్నాలజీ కన్సల్టెంట్‌

ఇప్పుడు ప్రపంచమే టెక్నాలజీ చుట్టూ తిరుగుతోంది. ప్రతి రోజు ఎన్నో కొత్త కొత్త టెక్నాలజీలు, కొత్త ఆవిష్కరణలు మన ముందుకు వస్తున్నాయి. మీకు ఈ టెక్‌ ట్రెండ్స్‌ను ఫాలో కావడం చాలా ఇష్టమా.. అయితే మీరు టెక్నాలజీ కన్సల్టెంట్‌గా మారిపోవచ్చు.

మీ పని సింపుల్.. మీరు ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలకు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీల సమాచారం ఇస్తుండాలి. వాటిలో ఏయే టెక్నాలజీలు కంపెనీ డెవలప్‌మెంట్‌కు ఉపయోగపడతాయో వివరించాలి. టెక్నాలజీని బాగా ఫాలో అయ్యే వాళ్లకు ఇదేమంత కష్టమైన పనేమీ కాదు. 

సోషల్‌ మీడియా మేనేజర్‌

ఇది సోషల్‌ మీడియా యుగం. ప్రస్తుతం మెయిన్‌స్ట్రీమ్‌ మీడియా కంటే సోషల్‌ మీడియాకే ఫాలోవర్స్‌ ఎక్కువ. అందుకే చాలా బ్రాండ్స్‌ ప్రమోషన్‌ కోసం సోషల్‌ మీడియాపై ఆధారపడుతున్నాయి. మీకు సోషల్‌ మీడియాపై పట్టు ఉంటే.. వెంటనే ఓ స్టార్టప్‌ మొదలు పెట్టేయొచ్చు. సోషల్‌ మీడియా మేనేజర్‌గా బ్రాండ్స్‌ ప్రమోషన్‌ చేసుకోవచ్చు.

మీరు ఒప్పందం కుదుర్చుకున్న బ్రాండ్‌ తాలూకు సోషల్‌ మీడియా అకౌంట్‌ను మేనేజ్‌ చేయాలి. బ్రాండ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పోస్ట్‌ చేయడం, ఫాలోవర్స్‌ కామెంట్లు, డౌట్లకు సమాధానాలు ఇస్తుండటం చేయాలి. డిజిటల్‌ మార్కెటింగ్‌ రూపొందించాలి. బ్రాండ్‌ ఫాలోవర్స్‌ను పెంచాలి. అన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై పట్టు అవసరం లేదు.

మీకు బాగా తెలిసిన వాటితోనే ప్రమోట్‌ చేయండి. ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ట్రెండ్స్‌ తెలుసుకోవడం చాలా అవసరం. ఒక్కో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌పై ఒక్కో స్ట్రేటజీ అవసరం అవుతుంది. అందుకే ఈ బిజినెస్‌కు అనుభవం చాలా ముఖ్యం.

వెబ్‌సైట్‌ డెవలప్‌మెంట్‌

ఈ రోజుల్లో చాలా ఈజీగా సంపాదించే మార్గాల్లో ఈ వెబ్‌సైట్‌ డెవలప్‌మెంట్ స్టార్టప్‌ కూడా ఒకటి. ముఖ్యంగా ఇంటర్నెట్‌లో వెబ్‌సైట్‌లను తయారుచేయడానికి సాయపడే ఎన్నో ప్లాట్‌ఫామ్స్‌ అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించి వెబ్‌సైట్‌ డెవలప్‌ చేయడం చాలా ఈజీ.

పైగా ఈ మధ్య చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్లు కూడా వెబ్‌సైట్ల వైపు చూస్తున్నారు. వాళ్లకు ఓ బేసిక్‌ వెబ్‌సైట్‌ డెవలప్‌ చేసి మెయింటేన్‌ చేసినా చాలు.. డబ్బులివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వర్డ్‌ప్రెస్‌, స్క్వేర్‌ స్పేస్‌, సైట్‌123, వీబ్లీ, షాపిఫైలాంటి కాంటెంట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌తో వెబ్‌సైట్‌ డెవలప్‌ చేయొచ్చు. 

అడ్వాన్స్‌డ్‌ వెబ్‌ డెవలప్‌మెంట్‌

సీఎంఎస్‌ టూల్స్‌ ఉపయోగించి చేసేవాళ్లు బేసిక్‌ డెవలపర్స్‌. ఇలాంటి వాళ్లు చాలా మందే ఉన్నారు. మీకు అనుభవం ఉండి, అడ్వాన్స్‌డ్‌ ప్రోగ్రామింగ్‌ చేయగలిగితే అడ్వాన్స్‌డ్‌ వెబ్‌ డెవలపర్‌గా మారొచ్చు. దీనివల్ల మీ సంపాదన కూడా పెరుగుతుంది. పెద్ద పెద్ద బిజినెస్‌లకు అవసరమయ్యే వెబ్‌సైట్‌లను డిజైన్‌ చేయగలిగితే పెద్ద మొత్తంలో సంపాదించే అవకాశం ఉంటుంది.

దీనికోసం అవసరమైన అన్ని టూల్స్‌ , టెక్నిక్స్‌ తెలిసి ఉండాలి. యూజర్‌ ఫ్రెండ్లీగా ఉంటూ సెర్చ్‌ ఇంజిన్‌ ఫ్రెండ్లీ పేజ్‌లను తయారు చేయగలిగే డెవలపర్స్‌కు మంచి డిమాండ్‌ ఉంది. 

అనుబంధ మార్కెటింగ్‌

ఇది ఎన్నో ఏళ్లుగా విజయవంతమైన ఆన్‌లైన్‌ బిజినెస్‌గా పేరు సంపాదించింది. అనుబంధ లేదా అఫిలియేట్‌ మార్కెటింగ్‌ అంటే.. ఓ సంస్థ తయారు చేసే ప్రోడక్ట్‌ మీ ద్వారా కస్టమర్‌కు చేరుతుంది. ఓ ప్రోడక్ట్‌ను తయారు చేసే సంస్థ లేదా డిస్ట్రిబ్యూటర్లతో మీరు ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. వాళ్ల ఉత్పత్తులను మీ వెబ్‌సైట్‌ లేదా బ్లాగ్‌ లేదా సోషల్‌ మీడియా అకౌంట్‌ ద్వారా ప్రమోట్‌ చేసి కస్టమర్లకు అమ్మాల్సి ఉంటుంది.

ఇందుకుగాను సదరు కంపెనీ నుంచి కమీషన్‌ వస్తుంది. సింపుల్‌గా మీ ద్వారా ఓ కస్టమర్‌ ఓ కంపెనీ ఉత్పత్తిని కొంటే.. మీకు లాభం చేకూరుతుంది. http://www.shareasale.com/https://www.clickbank.com/http://www.affiliatefuture.com/లాంటి వెబ్‌సైట్లలో అఫిలియేట్‌ మార్కెటింగ్‌ అవసరమైన కంపెనీల వివరాలు ఉంటాయి. మీకు నచ్చిన బ్రాండ్‌తో మీ వెబ్‌సైట్‌ ద్వారా అఫిలియేట్‌ మార్కెటింగ్‌ చేసుకోవచ్చు. 

ఆన్‌లైన్‌ ట్యూషన్స్‌

ఆన్‌లైన్‌ ట్యూటోరింగ్‌ ఇప్పుడు వేగంగా వృద్ధి చెందుతున్న రంగం. గత ఐదేళ్లలో 40 శాతం వృద్ధి సాధించింది. మీ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ట్యూటోరింగ్‌ స్టార్టప్‌ ఉత్తమమైన మార్గం. మీకు పట్టు ఉన్న సబ్జెక్ట్‌పై ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పొచ్చు. మెల్లగా మీ స్టూడెంట్‌ బేస్‌ను పెంచుకోవాలి. ఓ యూట్యూబ్‌ చానెల్‌ను క్రియేట్‌ చేసి మీ టీచింగ్‌ వీడియోను అందులో పోస్ట్‌ చేయొచ్చు. Tutor.com, VIPKID, TutorHub.com, Smarthinking, Skooli, Vedantu లాంటి వెబ్‌సైట్లలో ఆన్‌లైన్‌ ట్యూషన్స్‌ ఆఫర్లు ఉంటాయి. 

టెక్‌ వీడియో చానెల్‌

దీని ద్వారా సింపుల్‌గా ఇంట్లో కూర్చొనే రెండు చేతులా సంపాదించవచ్చు. యూట్యూబ్‌లో ప్రస్తుతం ఈ టెక్‌ వీడియోనే పాపులర్‌ టాపిక్‌. మీకు టెక్నాలజీపై ఆసక్తి ఉంటే చాలు. ఎప్పటికప్పుడు మార్కెట్‌లోకి వస్తున్న టెక్నాలజీ గురించి చెబుతూ వీడియోలు చేయొచ్చు.

లేదంటే కొత్తగా వచ్చే గాడ్జెట్స్‌ పై రీవ్యూలూ ఇవ్వొచ్చు. రోజుకో కొత్త టెక్నాలజీ వస్తున్న ఈ రోజుల్లో చెప్పడానికి బోలెడంత కంటెంట్‌ ఉంటుంది. ఈ టెక్‌ వీడియోలకు యూట్యూబ్‌లో మంచి డిమాండ్‌ ఉంది. యూట్యూబ్‌లో మీ సొంత టెక్‌ వీడియో చానెల్‌ స్టార్ట్‌ చేసి అందులో వీడియోలు పోస్ట్‌ చేయండి. మీరు చెప్పే విషయాలు నచ్చితే సబ్‌స్క్రైబర్స్‌ సంఖ్య పెరుగుతుంది. అలా మీ సంపాదనను కూడా పెంచుకోవచ్చు. 

మీకు నచ్చిన స్టార్టప్ ఐడియాలు మాతో పంచుకోవాలనుకుంటే మాకు మెయిల్ చేయండి editor@dearurban.com

ఇవి కూడా చదవండి

షటిల్ క్లౌడ్ తో జీమెయిల్ కు మెయిల్స్ మైగ్రేషన్

0

టిల్‌ క్లౌడ్‌. ఈ టూల్ పేరు ఎప్పుడైనా విన్నారా? ఇది ఉచితంగా ఇతర అకౌంట్లలోని మెయిల్స్‌, డేటాను ఇంపోర్ట్‌ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ టూల్‌ను ఉపయోగించి మీ విలువైన డేటాను ఎలా ఇంపోర్ట్‌ చేసుకోవచ్చు.

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈమెయిలింగ్‌ కోసం ప్రధానంగా జీమెయిల్‌నే వాడుతున్నారు. మన దేశంలో అయితే 90 శాతం జీమెయిల్‌ని వాడుతున్న వాళ్లే ఉన్నారు. కొంతమందికి మల్టీపుల్‌ అకౌంట్స్‌ ఉంటాయి. జీమెయిల్‌లోనే ఒకటికి మించి అకౌంట్స్‌ లేదా యాహూ, ఔట్‌లుక్‌, మెయిల్‌లాంటి వాటిలో అకౌంట్లు ఉంటాయి.

ఒక్కోసారి అన్ని అకౌంట్ల మెయిల్స్‌ ఒకే సర్వీసులో అవసరమవుతుంటాయి. లేదంటే ఇన్ని అకౌంట్స్‌ ఎందుకు.. ఒకటే మెయింటేన్‌ చేస్తే సరిపోతుందన్న ఆలోచన వస్తుంది. ఇలాంటి సమయంలో ఆయా అకౌంట్లలో ఉన్న ముఖ్యమైన మెయిల్స్‌, ఇతర డేటాను మన ప్రధాన అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ ఎలా చేయాలన్న సందేహం చాలా మందికి కలుగుతుంది.

వేల సంఖ్యలో ఉన్న మెయిల్స్‌ను ఫార్వర్డ్‌ చేయడం కూడా కష్టమే. అందుకే దీనికోసం జీమెయిల్‌ ఒక మంచి ఆప్షన్‌ను తమ యూజర్లకు అందిస్తోంది. మీ జీమెయిల్‌ అకౌంట్‌లోనే ఉన్నఈ షటిల్ క్లౌడ్ అనే  మైగ్రేషన్‌ టూల్‌తో ఒక్క రూపాయి ఖర్చు కూడా లేకుండా ఇతర సర్వీసుల్లో ఉన్న మీ విలువైన మెయిల్స్‌, డేటాను ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. దీనిపై సవివరంగా డియర్ అర్బన్ డాట్ కామ్ మీకు కథనం అందిస్తోంది.

స్టెప్‌ బై స్టెప్‌ ఓసారి చూద్దాం..


1. ముందుగా మీ ప్రధాన జీమెయిల్‌ అకౌంట్‌లోకి లాగిన్‌ అవ్వండి. అందులో కుడివైపు పైన సెట్టింగ్స్‌ సింబల్‌పై క్లిక్‌ చేసి.. అందులో సెట్టింగ్స్‌ ఐకాన్‌ను ఎంపిక చేసుకోండి.

2. సెట్టింగ్స్ విండోలో అకౌంట్స్‌ అండ్‌ ఇంపోర్ట్‌ సెలక్ట్‌ చేసుకోండి. అందులోకి వెళ్లి ఇంపోర్ట్‌ మెయిల్‌ అండ్‌ కాంటాక్ట్స్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. కింద చూపించినట్లు మీకు మరో విండో ఓపెన్‌ అవుతుంది.

mails importing

3. మీరు ఏ అకౌంట్‌ నుంచి మెయిల్స్‌, డేటా ఇంపోర్ట్‌ చేసుకోవాలని అనుకుంటున్నారో ఆ అకౌంట్‌ను అక్కడ టైప్‌ చేసి, కంటిన్యూపై క్లిక్‌ చేయండి.

4. అప్పుడు మీ మరో అకౌంట్‌లోకి సైన్‌ ఇన్‌ కావాలని అడుగుతుంది. కంటిన్యూపై క్లిక్‌ చేయండి. 

5. మరో బాక్స్‌ ఓపెన్‌ అవుతుంది. అందులో మీ మెయిల్‌ ఐడీని టైప్‌ చేసి ఎంటర్‌ నొక్కండి. 

6. అక్కడ మీ పాస్‌వర్డ్‌ టైప్‌ చేసి కింద ఉన్న నెక్ట్స్‌ బటన్‌పై ప్రెస్‌ చేయండి.

7. అప్పుడు మీ మెయిల్‌ను యాక్సెస్‌ చేయడానికి జీమెయిల్‌ షటిల్‌క్లౌడ్‌ మైగ్రేషన్‌ మిమ్మల్ని అనుమతి కోరుతుంది. అక్కడ వాళ్ల టర్మ్స్‌ అండ్‌ కండిషన్స్‌ చదివి ఓకే అయితే అలో బటన్‌పై క్లిక్‌ చేయండి. 

8. ఒకవేళ షటిల్‌ క్లౌడ్‌ మీ మెయిల్‌ను యాక్సెస్‌ చేయగలిగితే.. అథెంటికేషన్‌ సక్సెస్‌ఫుల్‌ అన్న మెసేజ్‌ వస్తుంది. అప్పుడు ఆ విండోను క్లోజ్‌ చేయాల్సి ఉంటుంది. 

9. ఆ రెండో విండో క్లోజ్‌ చేసిన తర్వాత ఏ ఏ సమాచారం మీరు ఇంపోర్ట్‌ చేసుకోవాలని అనుకుంటున్నారో వాటిని సెలక్ట్‌ చేసుకోవాలి. కాంటాక్ట్స్‌, మెయిల్స్‌, వచ్చే 30 రోజుల వరకు కొత్త మెయిల్స్‌.. ఇలా చాలా ఆప్షన్స్‌ ఉంటాయి. వాటిని సెలక్ట్‌ చేసుకొని స్టార్ట్‌ ఇంపోర్ట్‌పై క్లిక్‌ చేయాలి. 

10. స్టార్ట్‌ ఇంపోర్ట్‌పై క్లిక్‌ చేసిన తర్వాత మీకు సెలక్ట్‌ చేసుకున్న డేటా అంతా ట్రాన్స్‌ఫర్‌ కావడానికి కొంత సమయం పడుతుంది. అది గంటలు కావచ్చు.. రోజులు కావచ్చు.. మీరు ఎంపిక చేసుకున్న డేటా సైజుపై ఆధారపడి ఉంటుంది. 

11. ఒకవేళ మధ్యలోనే ఈ ఇంపోర్ట్‌ను ఆపేయాలి అనుకుంటే.. సెట్టింగ్స్‌లోని అకౌంట్స్‌ అండ్‌ ఇంపోర్ట్‌లోకి వెళ్లి స్టాప్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి.

హాబీతో సంపాదన మార్గాలు తెలుసుకోండి

0

సంపాదించడానికి ఉద్యోగమే చేయాలా.. కాస్త కొత్తగా ఆలోచించాలే గానీ సవాలక్ష మార్గాలు ఉన్నాయి. మీకు ఇష్టమైనదే చేయండి.. ఈ రోజుల్లో చాలా మంది డబ్బు కావాలి కాబట్టే ఉద్యోగాలు చేస్తున్నారు తప్ప.. ఇష్టపడి చేస్తున్నవాళ్లు ఎంతమంది? అందుకే అదేదో మనకు నచ్చిన పని చేస్తూనే సంపాదిస్తే ఎలా ఉంటుంది? మీ హాబీయే మీపై కాసుల వర్షం కురిపిస్తే వద్దంటారా? నిజమే.. మీ హాబీతో ఇంట్లో కూర్చునే సరదాగా సంపాదించేయండి. ఈ ఇంటర్నెట్‌ యుగంలో డబ్బు సంపాదించడం కూడా సులువే అన్న విషయాన్ని గుర్తించండి. ఎవరో ఇచ్చే ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా మీ మనసుకు నచ్చిన పని చేస్తూ నాలుగు రాళ్లు వెనకేసుకోండి. మీ హాబీతో సంపాదన మార్గాలపై డియర్ అర్బన్ డాట్ కామ్ ప్రత్యేక కథనం ఇది.

కుకింగ్‌తో కోట్లు

వంట చేయడం మీకు ఇష్టమా? నోరూరించే వంటకాలు చేయడంలో మీరు ఎక్స్‌పర్టా? ఇంకెందుకు ఆలస్యం.. ఈ హాబీతో సంపాదన మార్గాలివిగో.. సొంతంగా ఓ బ్లాగ్‌ క్రియేట్‌ చేసుకొని ఏ వంట ఎలా చేయాలో చెప్పండి లేదంటే ఓ యూట్యూబ్‌ చానెల్‌ స్టార్ట్‌ చేసేయండి. ప్రపంచంలో తినేవాళ్లకు కొదవ లేనట్లే.. కొత్త కొత్త వంటలకూ కరువు లేదు. చెబితే నమ్ముతారో లేదో గానీ.. మధులిక అనే ఓ మహిళ 2011లో ఇలాగే యూట్యూబ్‌లో ఓ వంటల చానెల్‌ ప్రారంభించింది. ఆమె వంటల వీడియోలకు విపరీతమైన క్రేజ్‌ ఏర్పడటంతో ఇప్పుడు ఆ చానెల్‌పైనే నెలకు కనీసం రూ. 3 లక్షలు సంపాదిస్తున్నారామె. ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్‌ లెవల్‌లో ఇప్పుడామె ఫేమస్‌ అయిపోయారు. 

తింటూ కూడా సంపాదించేయొచ్చు

మీరు వంట చేయడంలో కాకుండా తినడంలో ఎక్స్‌పర్టా..? అయినా పర్వాలేదు. తింటూ కూడా సంపాదించేయొచ్చు. ఇతరులు చేసిన వంటలు రుచి చూసి ఎలా ఉన్నాయో రీవ్యూలు రాసేవాళ్లు కూడా ఇప్పుడు బాగానే సంపాదిస్తున్నారు. జొమాటోలాంటి యాప్స్‌ తమ టాప్‌ రీవ్యూవర్స్‌కి రివార్డులు కూడా ఇస్తోంది. సదరు కంపెనీల నుంచి గిఫ్ట్‌లతోపాటు తమ రెస్టారెంట్లకు వచ్చి కాస్త తమ వంటలను రుచి చూసి పోవాలన్న ఆహ్వానాలు కూడా మీకు దక్కుతాయి. జొమాటో టాప్‌ రీవ్యూవర్‌గా మీరు మారిపోతే ఫ్రీగా క్రెడిట్స్‌, అప్పుడప్పుడూ ఫుడ్‌ కూడా పంపిస్తారు. సొంతంగా ఓ బ్లాగ్‌ క్రియేట్‌ చేసుకొని రీవ్యూలు రాసుకుంటూ ఫుడ్‌ క్రిటిక్‌గా మారిపోవచ్చు. 

ఫొటోగ్రఫీ మీ హాబీయా

ఫొటోగ్రఫీ అంటే మీకు ఇష్టమా.. మంచి కెమెరా మీ దగ్గర ఉందా.. అయితే ఎన్నో మార్గాల్లో మీరు డబ్బు సంపాదించవచ్చు. లోకల్‌గా ఫ్రీలాన్స్‌ ఫొటోగ్రాఫర్‌ కావచ్చు. కానీ దీని ద్వారా పరిమితమైన అవకాశాలే ఉంటాయి. అదే కాస్త ఎక్కువ సంపాదించాలంటే ఫొటోగ్రఫీ సైట్స్‌కు మీ ఫొటోలను అమ్ముకోవచ్చు. మీకు ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ఉంటే మరీ మంచిది. మీ ఫొటోలతో ఫాలోయింగ్‌  పెంచుకోండి.. డబ్బు సంపాదించండి. ప్రొఫెషనల్‌ ఫొటోగ్రఫీ అకౌంట్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఉన్నాయి. మంచి బ్రాండ్స్‌ దృష్టిలో మీరు పడ్డారంటే మీ దశ తిరిగినట్లే. ఒక్కో పోస్టుకు వేల కొద్దీ సంపాదించే అవకాశం ఉంటుంది. https://stock.adobe.com/ , https://www.shutterstock.com/ వంటి సైట్లలో మీ ఫోటోలను అమ్ముకోవచ్చు. 

షాపింగ్‌ చేసినా డబ్బే..

కొంత మందికి షాపింగ్‌ కూడా ఒక హాబీగా ఉంటుంది. గంటల కొద్దీ షాపింగ్‌ చేస్తూ గడిపేస్తారు. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లాంటి ఆన్‌లైన్‌ షాపింగ్‌ సైట్స్‌ వచ్చిన తర్వాత అవసరం ఉన్నా లేకపోయినా.. కొనేస్తున్నారు. అయితే ఇలా షాపింగ్‌ చేస్తూ కూడా మీరు సంపాదించ వచ్చన్న విషయం తెలుసా? అమెజాన్‌ ఈ అవకాశాన్ని మీకు అందిస్తోంది. అమెజాన్‌ రీసెల్లింగ్‌ బిజినెస్‌ ట్రై చేయండి. ముందుగా ఓ అమెజాన్‌ సెల్లర్‌ అకౌంట్‌ను క్రియేట్‌ చేసుకోవాలి. మొదట్లో పర్సనల్‌ అకౌంటే ఇస్తారు. నెలకు కనీసం 40 వస్తువులను మీరు అమ్మగలగితే.. మీరు ప్రొఫెషనల్‌ అకౌంట్‌కు అప్‌గ్రేడ్‌ కావచ్చు. ఈ అమెజాన్‌ సెల్లర్‌ యాప్‌ ఐవోఎస్‌, ఆండ్రాయిడ్‌లలో ఫ్రీగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మొదట్లో వస్తువులను కొనుగోలు చేయడానికి మాత్రం మీరు కాస్త డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. 

ఆడుతూపాడుతూ..

స్మార్ట్‌ఫోన్లు వచ్చిన తర్వాత గేమ్స్‌ ఆడటం చాలా మందికి ఒక అలవాటుగా మారిపోయింది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ గేమ్స్‌ ఆడేస్తున్నారు. అయితే ఈ హాబీతో సంపాదన కు కూడా మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకు ఫ్యాంటసీ క్రికెట్‌ లీగ్‌ ఇలాంటిదే. క్రికెట్‌ మీద మీకు మంచి పట్టు ఉంటే.. మీ ఇష్టమైన ప్లేయర్స్‌తో ఓ డ్రీమ్‌ టీమ్‌ను తయారు చేసుకోండి. మీకున్న స్పోర్ట్స్‌ నాలెడ్జ్‌తో ఇలాంటి యాప్స్‌లో డబ్బు సంపాదించుకోవచ్చు. డ్రీమ్‌11 కూడా ఇలాంటిదే. రానున్న మ్యాచ్‌లకు ముందుగానే మీకున్న పరిజ్ఞానంతో డ్రీమ్‌ టీమ్‌ను ఎంపిక చేయండి. వాళ్ల ప్రదర్శనను బట్టి మీ సంపాదన ఆధారపడి ఉంటుంది. గేమ్‌పై మంచి పట్టు ఉంటే కనుక బాగానే సంపాదించవచ్చు. ఒక్క క్రికెట్‌ అనే కాదు.. కబడ్డీ, బాస్కెట్‌బాల్‌, ఫుట్‌బాల్‌ లాంటి గేమ్స్‌కు కూడా ఇలాంటి ఫ్యాంటసీ యాప్స్‌ ఉన్నాయి. 

స్టాక్‌ మార్కెట్‌ బెస్ట్‌..

స్టాక్‌ మార్కెట్‌ను చాలా మంది ఓ జూదంలాగా చూస్తారు గానీ.. కొంతమందికి ఇందులో ఇన్వెస్ట్‌ చేయడం కూడా ఓ హాబీయే. నిజానికి అన్ని హాబీల కన్నా ఎక్కువ సంపాదించి పెట్టేది ఇదే. ఎప్పటికప్పుడు మార్కెట్‌లోని కంపెనీల గురించి, వాటి మధ్య ఉండే పోటీ గురించి తెలుసుకుంటూ, మార్కెట్‌లోని ఎగుడుదిగుడుల గురించి తెలుసుకోగలిగితే స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేయడం కూడా ఓ హాబీలా మారిపోతుంది. స్టాక్‌ మార్కెట్‌ను మీరు రెగ్యులర్‌గా ఫాలో అయితే ఒక విషయం గమనించవచ్చు. దీర్ఘకాలంలో ఏడాదికి ఇది 8 శాతం వృద్ధి సాధిస్తోంది. లాభాలు పొందడానికి ఇక్కడ అపరిమితమైన అవకాశాలు ఉంటాయి. అయితే మీ చాయిస్‌పై మీకు పూర్తి విశ్వాసం ఉంటేనే ఇన్వెస్ట్ చేయండి. అది కూడా మొదట్లో పరిమిత స్థాయిలో పెడితేనే మంచిది. 

బాగా రాయగలిగినా డబ్బే..

మీరు మంచి రైటర్‌ అయితే.. వివిధ అంశాలపై మీకు పట్టు ఉన్నట్లయితే.. ఓ బ్లాగ్‌ స్టార్ట్‌ చేసి ఆన్‌లైన్‌లో సంపాదించవచ్చు. ఇతరులకు రాస్తే వెంటనే డబ్బు వస్తుంది.. మీరే సొంతంగా బ్లాగ్‌ స్టార్ట్‌ చేసి రాస్తే.. కాస్త ఆలస్యమైనా నిలకడగా సంపాదించే చాన్స్‌ ఉంటుంది. ఓ సంస్థలో పని చేయడం లేదా మీరే సొంతంగా ఓ సంస్థ ఏర్పాటు చేయడం లాంటిదే ఇది కూడా. మీ బ్లాగ్‌ను చూసే వాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతుంటే.. దానికి తగినట్లుగా మీ బ్యాంక్‌ బ్యాలెన్స్‌ పెరుగుతుంది. ఈ బ్లాగ్‌లతో నెలకు లక్షలు సంపాదించే వాళ్లు చాలా మందే ఉన్నారు. మీరూ మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. మీ తెలివి తేటలే దీనికి పెట్టుబడి. ఫ్రీలాన్స్ రచయితగా డబ్బు సంపాదించాలనుకుంటే మాత్రం https://www.freelancer.in/ వంటి వెబ్ సైట్లు చాలా అవకాశాలు కల్పిస్తాయి.

ఇక రచయితగా మారి బుక్స్ పబ్లిష్ చేయాలనుకుంటే అమెజాన్ ఇందుకు అవకాశం కల్పిస్తోంది. మీరు రాసి పెడితే చాలు.. ఆన్ లైన్ ఇ బుక్ అమెజాన్ అమ్మిపెడుతుంది. 

అరోమాథెరపీ.. ఒత్తిడి, ఒంటి నొప్పులు మాయం

0

రుకులు పరుగుల అర్బన్‌ లైఫ్‌లో రోజుకో కొత్త ఆరోగ్య సమస్య మనల్ని వేధిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా తలనొప్పులు, ఒంటి నొప్పులు.. మానసిక ఒత్తిడి ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయాయి. ఈ రోగాలు, నొప్పులకు ఇంగ్లిష్‌ మందులు వాడితే లేనిపోని సైడ్‌ ఎఫెక్ట్స్‌ మరింత చికాకు కలిగిస్తాయి. ఈ తలనొప్పులన్నీ ఎందుకూ అనుకున్న వాళ్లు కళ్లు మూసుకొని అరోమా థెరపీని ఫాలో కావచ్చు.

ఈ చికిత్సలో ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవు. మనకు అత్యంత సులువుగా లభించే ఆకులు, పువ్వులు, కాయల సువాసన, సహజ నూనెలతో నిత్య జీవితంలోని ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ వాసనలేంటి.. నూనెలేంటి.. వీటితో రోగాలు తగ్గడమేంటన్న అనుమానాలు చాలా మందిని అరోమా థెరపీకి దూరంగా ఉంచుతున్నాయి.

అరోమాథెరపీతో లాభాలేంటి?

కానీ ఈ థెరపీ వల్ల కలిగే లాభాలు తెలిస్తే.. కచ్చితంగా ఫాలో అవుతారు. అరోమా థెరపీ కోసం మీకు పెద్ద సరంజామా అవసరం లేదు. రెగ్యులర్‌గా థెరపీ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన పనీ ఉండదు. ఈ థెరపీ కోసం కావాల్సిన వాటిలో చాలా వరకు చిన్న చిన్న దుకాణాల్లో, సూపర్‌ మార్కెట్‌లలోనూ ఉంటాయి.

ఈ థెరపీలో వాడే నిమ్మకాయలు, ఆరెంజెస్‌, వెనీలా, లావెండర్‌ మొక్కలలాంటివి మనకు సులువుగా దొరుకుతాయి. వీటి నుంచి వచ్చే సువాసనల్లో నొప్పిని, ఒత్తిడిని మాయం చేసే అద్భుతమైన లక్షణాలు ఉంటాయని మనలో చాలా మందికి తెలియదు. నిమ్మకాయలైనా, నారింజలైనా, వెనీలా అయినా.. వేడి నీళ్లలో వేస్తే చాలు.. వాటి నుంచి వచ్చే సువాసన ఒత్తిడిని తగ్గించి రాత్రి పూట మంచి నిద్ర పట్టేలా చేస్తుంది.

అరోమా థెరపీలో భాగంగా కొన్ని సువాసనలతోపాటు మరికొన్ని సహజ నూనెలు, ఇంకొన్ని టీలో కలిపి తాగే ఔషధాలు కూడా ఉంటాయి. నొప్పులను నివారించడానికి ఓ ప్రత్యామ్నాయ మార్గంగా అరోమా థెరపీని కొన్ని వందల ఏళ్లుగా ఉపయోగిస్తూనే ఉన్నారు. ఈ థెరపీలో భాగంగా ఏ ఆరోగ్య సమస్యకు దేనిని, ఎలా వాడాలి అన్న వివరాలు ’డియర్ అర్బన్‘ మీకోసం అందిస్తోంది.

నిద్ర లేమి, ఒత్తిడి

1. లావెండర్‌: లావెండర్‌ మొక్కల నుంచి వచ్చే పరిమళం ఒత్తిడిని దూరం చేస్తుంది. మంచి, ప్రశాంతమైన నిద్ర పట్టేలా చూస్తుంది. అంతేకాదు ఈ లావెండర్‌ మన గుండె వేగాన్ని కూడా తగ్గించగలదు. నిద్రలేమితో బాధపడే వారికి ఇది బాగా పనిచేస్తుంది. 

2. బేరి పండ్లు: ఒత్తిడి నుంచి బయటపడటానికి ఈ బేరి పండ్లు కూడా బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా మహిళలు ఈ బేరి పండ్ల వాసన చూస్తే.. వాళ్లలో ఒత్తిడిని కలిగించే హార్మోన్ల విడుదల స్థాయి తగ్గుతుంది. అంతేకాదు మీ మూడ్‌ను కూడా సానుకూలంగా మారుస్తుందని కొన్ని శాస్త్రీయ అధ్యయనాలు నిరూపించాయి. 

3. వెనీలా: పర్ఫ్యూమ్స్‌ తయారు చేసే వాళ్లు ఎక్కువగా వాడే ఈ వెనీలా నుంచి వచ్చే సువాసన.. ఒత్తిడి నుంచి దూరం చేసి, శరీరానికి అవసరమైన ఉపశమనం లభించేలా చేస్తుంది. హైపర్‌ యాక్టివిటీ, ఆందోళనను తగ్గించే శక్తి కూడా ఈ వెనీలాకు ఉంది. 

ఆందోళన, డిప్రెషన్‌

4. నారింజ పండ్లు‌: సంత్రా లేదా ఆరెంజ్‌ లేదా నారింజ పండ్లలోని వాసన పోస్ట్‌ ట్రామటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌ (పీటీఎస్‌డీ).. అంటే ఏదైనా భయానక ఘటన జరిగిన తర్వాత కలిగే ఒత్తిడి నుంచి దూరం చేస్తుంది. గర్భవతుల్లో ఆందోళనను తగ్గించే శక్తి కూడా వీటి నుంచి వచ్చిన తైలానికి ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒత్తిడిని తగ్గించే గుణం ఈ సంత్ర పండ్లకు ఉంటుంది. 

5. నిమ్మకాయ: మనకు విరివిగా దొరికే నిమ్మకాయలో ఆందోళన, డిప్రెషన్‌ను తగ్గించే లక్షణాలు ఉన్నాయని ఎంత మందికి తెలుసు? శాస్త్రీయ అధ్యయనాలే దీనిని నిరూపించాయి. వీటి నుంచి వచ్చే సహజ నూనెలనుగానీ లేక నిమ్మకాయ నుంచి వచ్చే వాసనను అలాగే పీల్చడం వల్లగానీ ఒత్తిడి నుంచి దూరం కావచ్చు. నిమ్మ గడ్డి కూడా మిమ్మల్ని ఆందోళన నుంచి బయట పడేస్తుంది. 

శ్వాస సంబంధిత, రక్త ప్రసరణ సమస్యలు

6. యూకలిప్టస్‌ (నీలగిరి): మనకు జలుబు చేసినప్పుడు శ్వాస పీల్చుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. గొంతు నొప్పి, దగ్గు వేధిస్తుంటుంది. ఇలాంటి వాటికి నీలగిరి తైలం బాగా పని చేస్తుంది. ఇప్పటికీ చాలా మంది ఇళ్లలో జిందా తిలస్మాత్ పేరుతో ఈ తైలం అందుబాటులో ఉంటుంది. 

7. తులసి ఆకులు: హైబీపీ ఉన్న వాళ్లకు తులసి ఆకుల రసం ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మహిళలకు ఇది బాగా పని చేస్తున్నట్లు ఒక అధ్యయనంలో తేలింది. 

తలనొప్పి, ఇతర నొప్పులు

8. కర్పూరం: మనం రోజూ ఇంట్లో వాడే కర్పూరాన్ని ఎన్నో రకాల చికిత్సల కోసం వాడుతారు. చర్మ సంబంధిత వ్యాధులతోపాటు కీళ్ల నొప్పులకు కూడా ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. కర్పూరం నుంచి వచ్చే వాసన తలనొప్పిని దూరం చేస్తుంది. దీనిని ఎన్నో లోషన్లు, బామ్‌లలో విరివిగా వాడతారు. 

9. మెంథాల్ (పుదీనా) ‌: మైగ్రెయిన్‌తో బాధపడే వాళ్లు మెంథాల్‌తో ఉపశమనం పొందినట్లు అనేక అధ్యయనాల్లో తేలింది. వివిధ నొప్పులను తగ్గించడంలో మెంథాల్‌ ప్రభావంపై ఎన్నో ఏళ్లుగా చాలా అధ్యయనాలు జరిగాయి. తలనొప్పి లక్షణాలను తగ్గించడంతోపాటు వికారం, వాంతులను కూడా తగ్గించే శక్తి మెంథాల్‌కు ఉంది. 

10. రోజ్‌మేరి: ఈ రోజ్‌మేరి ఆయిల్‌ వాసన చూడటం వల్ల తలనొప్పి, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గినట్లు తాజా అధ్యయనాలు నిరూపించాయి. ఒంట్లో మంటను తగ్గించడంతోపాటు రక్త ప్రసరణను కూడా మెరుగుపరచడంలో రోజ్‌మేరీ ఆకులు సాయపడతాయి.  

వికారం, కడుపు నొప్పి

11. అల్లం: యాంటీ సెప్టిక్‌గా పనిచేయడంతోపాటు ఔషధ గుణాలున్న అల్లం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కడుపులో వికారం, వాంతులను నివారించడానికి అల్లం వాడతారు. ఎప్పుడైనా కాస్త ఒంట్లో బాగా లేనట్లు అనిపిస్తే అల్లం వాసన చూడండి.. వెంటనే శరీరంలో సానుకూల మార్పులు వస్తాయి. 

అరోమా థెరపీని ఎన్నో రకాలుగా వాడొచ్చు. అన్నింటికన్నా ఉత్తమమైన మార్గం పరిమళాన్ని ఆస్వాదించడం. అయితే అది ఏ రకమైన పరిమళం అన్నదాన్ని బట్టి వాడాల్సి ఉంటుంది. కొన్ని సహజ నూనెల రూపంలో, మరికొన్ని ధూపంలాగా, ఇంకొన్ని స్ప్రేలాగా వాడుకోవచ్చు. 

ఆర్గానిక్‌ వే.. జీవించండి కొత్తగా..

0

ఆర్గానిక్ వే ఆఫ్ లైఫ్. ఇక్కడ ఆర్గానిక్‌ అంటే చాలా మంది కేవలం ఆహారం మాత్రమే అనుకుంటారు. సేంద్రీయ ఎరువులతో పండిన ఆహార పదార్థాలను తింటే చాలని అనుకుంటారు. కానీ ఆహారమే కాదు.. మొత్తంగా మీ జీవితమే ఆర్గానిక్‌గా మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది.

ఇంట్లో వాడే ప్రతి వస్తువూ ఆర్గానిక్‌ అయి ఉండాలి. క్లీనింగ్‌ ఉత్పత్తులు, మేకప్‌ కిట్స్‌, వేసుకునే బట్టలు, వాహనాలు.. ఇలా అన్నీ ఆర్గానిక్‌ కావాల్సిందే. ఇలా చేయడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉండటంతో పాటు పర్యావరణానికీ మీ వంతు మేలు చేసిన వాళ్లు అవుతారు. ఆర్గానిక్‌ వేలో కొత్తగా ఎలా జీవించాలో చెప్పడమే ఈ ఆర్టికల్‌ ప్రధాన ఉద్దేశం. 

సేంద్రీయ ఆహారం

1. సేంద్రీయ ఆహారాన్నే కొనండి. ఈ మధ్య నగరాలు, పట్టణాల్లో కొత్త కొత్త ఆర్గానిక్‌ స్టోర్లు పుట్టుకొస్తున్నాయి. ఈ ఆహారం తినడం వల్ల మీ ఆరోగ్యం బాగుండటంతోపాటు పర్యావరణం కూడా బాగుంటుంది. రసాయన ఎరువులు, పురుగు మందులు వాడిన ఆహారాన్ని తింటున్నారంటే.. మీ శరీరంలోకి పరోక్షంగా హానికారక రసాయనాలను పంపిస్తున్నట్లే. అంతేకాదు ఆర్గానిక్‌ ఆహారం మంచి టేస్ట్‌తోపాటు పోషకాలతో కూడి ఉంటుంది. మీరు మాంసాహారం తినేవాళ్లయితే.. ఎలాంటి హార్మోన్లు, యాంటీ బయాటిక్స్‌ ఇవ్వకుండా పెంచిన వాటినే తీసుకోండి. అలాంటి కోళ్ల నుంచి వచ్చిన గుడ్లనే తినండి. సర్టిఫైడ్‌ ఆర్గానిక్‌ ఎగ్స్‌ కూడా ఇప్పుడు మార్కెట్‌లో దొరుకుతున్నాయి. 

2. స్థానికంగా దొరికే కూరగాయలు, పండ్లనే కొనడానికి ప్రయత్నించండి. దీనివల్ల అన్ని రకాల పండ్లూ, కూరగాయలు తినే అవకాశం మీకు లభించకపోవచ్చు. కానీ ఇలా చేయడం వల్ల మీ చుట్టు పక్కలే పండే ఆ పంట నిజంగానే ఎలాంటి రసాయనాలు లేకుండానే పండించారా లేదా అన్నది తెలుస్తుంది. పైగా స్థానిక రైతులను ఆదుకున్నవాళ్లు కూడా అవుతారు. స్థానిక వ్యవసాయ మార్కెట్లు, ఆర్గానిక్‌ దుకాణాల్లో ఇవి దొరుకుతాయి. ఈ మధ్య ఆర్గానిక్‌ కూరగాయలు, పండ్లను హోమ్‌ డెలివరీ కూడా చేస్తున్నారు. కాకపోతే మీరు ఆర్డర్‌ చేసే ముందే అవి పక్కాగా సేంద్రీయ ఎరువులతో పండించినవేనా అన్నది చూసుకోవాల్సి ఉంటుంది. 

3. మీ వంట మీరే చేసుకోండి. అర్బన్‌ ఏరియాల్లో టైమ్‌ దొరక్క చాలా మంది బయటి ఫుడ్‌కు అలవాటు పడతారు. ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నవాళ్లు ఆర్గానిక్‌ రెస్టారెంట్లకు వెళ్లి తింటుంటారు. కానీ అలాంటి రెస్టారెంట్లలో మీకు వడ్డిస్తున్నది నిజంగా ఆర్గానిక్‌ ఆహారమేనా? అందుకే మీరే సొంతంగా సేంద్రీయ ఆహారాన్ని ఇంట్లోనే వండుకొని తింటే మేలు. ఎప్పుడో ఒకసారి బయట తినాలని అనిపిస్తే.. కచ్చితంగా సేంద్రీయ ఉత్పత్తులను వాడే రెస్టారెంట్లకే వెళ్లండి. ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేస్తే అవెక్కడున్నాయో తెలిసిపోతుంది. 

4. ఇంట్లోనే కావాల్సిన కూరగాయలను పండించుకుంటే ఇంకా మంచిది. ఆరోగ్యానికి ఆరోగ్యం. ఖర్చూ తగ్గుతుంది. చాలా మందికి గార్డెనింగ్‌ ఓ హాబీగానూ మారిపోయింది. దీనికి ఇంట్లో పెద్దగా స్థలం కూడా అవసరం లేదు. 4X4 అడుగుల స్థలంలో ఒక మనిషికి కావాల్సిన వివిధ రకాల కూరగాయలను పండించుకోవచ్చు. కిటికీలు, బాల్కనీలు, వెలుతురు, గాలి రాగలిగితే ఇంట్లోనే వీటిని పండించుకోవచ్చు. ఫ్రెష్‌ కూరగాయలు అప్పటికప్పుడు వంటకు రెడీగా ఉంటాయి. 

సేంద్రీయ ఉత్పత్తులే వాడండి

1. ఇంట్లో వస్తువులను శుభ్రం చేసుకోవడానికి మార్కెట్‌లో ఎన్నో రకాల ప్రోడక్ట్స్‌ అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిలో చాలా వరకు రసాయనాలు వాడినవే. ఫాస్పేట్లు, థాలెట్లు లేని క్లీనింగ్‌ ప్రోడక్ట్స్‌ కొనేలా చూడండి. కొంతమంది గ్రీన్‌ వాషింగ్‌ అంటూ రసాయనాలు లేని ఉత్పత్తుల పేరుతో అమ్ముతున్నారు. కానీ వీటిలో పామ్‌ ఆయిల్‌ ఉంటుంది. పామ్‌ ఆయిల్‌ను చాలా వరకు అడవుల్లో చెట్లు నరికి పండిస్తుంటారు. దీనివల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది. అందువల్ల మీరు కొనే ఉత్పత్తుల్లో పామాయిల్‌ ఉందో లేదో చూసుకోండి. ఇవన్నీ ఎందుకూ అనుకుంటే.. మన ఇంట్లోనే గ్రీన్‌ వాషింగ్‌కు కావాల్సిన వస్తువులు ఉంటాయి. బేకింగ్‌ సోడా, నిమ్మరసం, ఉప్పు, వైట్‌ వెనిగర్‌లాంటివి క్లీనింగ్‌కు బాగా ఉపయోగపడతాయి. 

2. ఇక ఇంట్లోని దోమలను తరమడానికంటూ మనం తెచ్చుకునే ఉత్పత్తులతో లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. ఇందులో వాడే రసాయనాలు మన ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతాయి. దీనికంటే దోమలను సహజసిద్ధంగా తరిమేసే మార్గాలను అన్వేషించండి. ఉదాహరణకు నిమ్మకాయను సగానికి కోసి అందులో లవంగాలను పెట్టి దోమలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో ఉంచండి. ఒకసారి కొన్న మెషీన్‌లో వేప నూనె పోసిన రీఫిల్‌ను పెట్టి వాడుకోండి. 

3. ఇక మనం వాడే మేకప్‌ కిట్‌లలోనూ కెమికల్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఈ మధ్య వీటిలోనూ సేంద్రీయ, సహజసిద్ధంగా తయారు చేసిన వస్తువలంటూ చాలా వస్తున్నాయి కానీ.. వాటిని పూర్తిగా నమ్మే పరిస్థితి లేదు. ఎన్విరాన్‌మెంటల్‌ వర్కింగ్ గ్రూప్‌ అందుకే ఓ వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఇందులో ఎలాంటి సౌందర్య సాధనాలను వాడాలో వివరిస్తున్నారు. లేదంటే సహజసిద్ధమైన నూనెలు.. అంటే జొజొబా, ఆలివ్‌, కొకొనట్‌ ఆయిల్‌తో తయారు చేసిన సబ్బులను వాడొచ్చు. 

4. వాడిన దుస్తులనే కొనుగోలు చేయండి. ఇది మీకు వినడానికి కాస్త ఇబ్బందిగా అనిపించినా.. ఇలా చేస్తే పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వాళ్లు అవుతారు. ఇప్పుడు సెకండ్‌ హ్యాండ్‌ దుస్తులను అమ్మే స్టోర్లు కూడా నగరాల్లో వెలుస్తున్నాయి. వీటిలో షాపింగ్‌ కూడా మీకో కొత్త అనుభూతిని పంచుతుంది. సెకండ్‌ హ్యాండ్‌ బట్టలేంటి అనుకుంటే.. కనీసం ఆర్గానిక్‌ ఉత్పత్తులతో తయారు చేసిన దుస్తులనైనా కొనుక్కోండి. ఆర్గానిక్‌ క్లోథింగ్‌ స్టోర్లు కూడా బాగానే ఉన్నాయి. ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేస్తే మీకు దగ్గర్లోని స్టోర్‌ గురించి తెలుస్తుంది. 

ఆర్గానిక్‌ వేలో వెళ్లండి

1. రోడ్లపై పెరిగిపోతున్న వాహనాలు వెలువరుస్తున్న కాలుష్యం పర్యావరణంపై పెను ప్రభావాన్ని చూపుతున్న సంగతి తెలుసు కదా. అందుకే మీ ప్రయాణాలను కూడా ఆర్గానిక్‌గా మార్చుకోండి. కారు తప్పదనుకుంటే మైలేజీ ఎక్కువ ఇచ్చే వాటిని తీసుకోండి. పొల్యూషన్‌ లేని సీఎన్జీ గ్యాస్‌, ఎలక్ట్రిక్‌ వాహనాలను వాడితే ఇంకా మంచిది. మైలేజ్‌ ఎక్కువిస్తుంది కదా అని.. అవసరం ఉన్నా.. లేకపోయినా.. కార్లు బయటకు తీయకండి. 

2. ప్రయాణానికి ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలు వెతకండి. నడిచి వెళ్లే దూరమే అయితే.. కాళ్లకు పని చెప్పండి. లేదంటే సైకిల్‌ వాడండి. ఆరోగ్యానికి ఆరోగ్యం.. పర్యావరణానికీ మేలు చేసిన వాళ్లు అవుతారు. 

3. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ను వీలైనంతగా వాడండి. ఒక్కరు బయటకు వెళ్లినా కారో, బైకో వేసుకెళ్లే బదులు బస్సో, రైలో చూసుకోండి. హైదరాబాద్‌లాంటి నగరాల్లో ఇప్పటికే మెట్రో రైలు కూడా అందుబాటులోకి వచ్చింది. మెట్రో రైలుతో మీ సమయం ఆదా అవుతుంది. పైగా రోడ్లపై ఉన్న కాలుష్యం బారి నుంచి బయటపడతారు.

హైదరాబాద్ లో ఆకట్టుకునే 6 థీమ్ రెస్టారెంట్లు

0

హైదరాబాద్‌ అంటే ఇరానీ చాయ్‌, బిర్యానీలకు ఫేమస్‌. దేశ విదేశాల నుంచి వచ్చిన టూరిస్టులు కూడా వీటిని టేస్ట్‌ చేయందే వెళ్లరు. ఇరానీ చాయ్‌ రుచులు పాతబస్తీలోని ప్రతి కేఫ్‌లో దొరుకుతాయి. ఇక బిర్యానీకి ప్యారడైజ్‌, కేఫ్‌ బహార్‌, బావర్చిలాంటి రెస్టారెంట్లు ఉండనే ఉన్నాయి. భాగ్యనగరాన్ని ప్రత్యేకంగా చూడటానికి వచ్చిన వారికి ఇవి భిన్నమైన రుచులను పంచుతాయి. కానీ హైదరాబాద్ లోనే నివసించేవారికి కాస్త కొత్తగా ఏదైనా ట్రై చేయాలని అనిపిస్తుంది. దీనికోసం మీరు నగరం విడిచి ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. అవును.. బిర్యానీ రుచులే కాదు.. మీకు మొత్తంగా ఓ వింత అనుభూతిని పంచే థీమ్ రెస్టారెంట్లు సిటీలో చాలానే ఉన్నాయి.

అక్కడికి వెళ్తే మిమ్మల్ని మీరు మరచిపోతారు. ఓ కొత్త లోకంలో విహరిస్తున్న ఫీల్‌ను వివిధ రెస్టారెంట్‌ నిర్వాహకులు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. రొటీన్‌ రెస్టారెంట్లు, బిర్యానీ రుచులతో విసిగిపోయిన వాళ్లు వీటిని ట్రై చేయొచ్చు. 

డైలాగ్‌ ఇన్‌ ద డార్క్‌

పేరులో ఉన్నట్లే ఈ రెస్టారెంట్‌ మొత్తం చిమ్మచీకటిగా ఉంటుంది. టేస్ట్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌ అనే ట్యాగ్‌లైన్‌తో ఉండే ఈ రెస్టారెంట్‌లో అన్నీ వింతే. మీరు అందులోకి అడుగుపెడితే అంతా చీకటి. ఏమీ కనిపించదు. మిమ్మల్ని డైనింగ్‌ ఏరియా దగ్గరికి తీసుకెళ్లేందుకు కొందరు అంధ దివ్యాంగులు అక్కడ సిద్ధంగా ఉంటారు. టేబుల్‌ దగ్గర కూర్చున్న తర్వాత కూడా చిమ్మ చీకట్లోనే మీకు ఆహారాన్ని వడ్డిస్తారు. వెలుతురును ప్రసారం చేసే ఏ వస్తువులనైనా అంటే.. మొబైల్ ఫోన్లు, కెమెరాలు, వాచ్‌లు, లైటర్స్‌ను లోపలికి అనుమతివ్వరు. అంతేకాదు 8 ఏళ్లలోపు చిన్నారులను కూడా ఈ రెస్టారెంట్‌లోకి అనుమతించరు. నిత్య జీవితంలో అంధులు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటారో తెలియచెప్పడమే తమ ఉద్దేశమని రెస్టారెంట్ నిర్వాహకులు చెబుతున్నారు.

మాదాపూర్‌లోని ఇనార్బిట్‌మాల్‌ ఐదో అంతస్తులో ఈ రెస్టారెంట్‌ ఉంటుంది. శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 12.30 నుంచి 3.30 గంటల వరకు, సోమవారం రాత్రి 7.30 నుంచి 10.00 గంటల వరకు, మంగళవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 7.30 నుంచి 9 గంటల వరకు ఈ రెస్టారెంట్‌ ఓపెన్‌ ఉంటుంది. 

బీచ్‌ హౌజ్‌

హాయిగా ఇసుక తెన్నెల్లో కూర్చొని పక్కనే ఉన్న సముద్రాన్ని చూస్తూ వెన్నెల్లో భోజనం చేయాలని చాలా మంది అనుకుంటారు. గోవాలాంటి టూరిస్ట్‌ ప్లేస్‌లలో ఇలాంటి అవకాశం ఉంటుందని చాలా మంది వెళ్తుంటారు. కానీ ఇప్పుడదే ఎక్స్‌పీరియన్స్‌ మన హైదరాబాద్‌లోనే దొరుకుతుంది. మాదాపూర్‌లోని బీచ్‌ హౌజ్‌ రెస్టారెంట్‌కు వెళ్తే బీచ్‌కు వెళ్లిన ఫీలే కలుగుతుంది. క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌ కావాలంటే బుధవారాలు, మ్యూజిక్‌ నైట్‌ ఎంజాయ్‌ చేయాలంటే శనివారాలు ఈ బీచ్‌ హౌజ్‌ రెస్టారెంట్‌కు వెళ్లొచ్చు.

మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ దగ్గర్లోని కావూరీ హిల్స్‌లో ఈ రెస్టారెంట్‌ ఉంటుంది. ఇద్దరు డిన్నర్‌ చేయాలంటే ట్యాక్స్‌లు కాకుండా సుమారు రూ.700 వరకు ఖర్చవుతుంది. ఆల్కహాల్‌ కూడా సర్వ్‌ చేస్తారు. 

ది గ్రాండ్‌ ట్రంక్‌ రోడ్‌

ఈ రెస్టారెంట్‌ పూర్తిగా డిఫరెంట్‌. ఓ హైవే దాబాను పోలిన సెటప్‌ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ రెండు లారీలు కూడా ఉంటాయి. ఒకదాంట్లో ఓ పెద్ద గ్రూపు కూర్చొని భోజనం చేసే వీలుంటుంది. ఇక్కడి గోడలపై పెయింటింగ్స్‌, ఆంబియన్స్‌ అదుర్స్‌ అనేలా ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, బ్రంచ్‌ అన్నీ దొరుకుతాయి. అయితే బఫెట్‌ ఎంజాయ్‌ చేయాలని అనుకున్నవాళ్లు ఈ రెస్టారెంట్‌కు రావచ్చు.

బఫెట్‌లోని అన్ని ఐటమ్స్‌ చాలా బాగుంటాయి. నార్త్‌ ఇండియన్‌, చైనీస్‌, మొఘలాయ్‌ వెరైటీలను టేస్ట్ చేయొచ్చు. ఇద్దరికి వెయ్యి రూపాయల వరకు అవుతుంది. మాదాపూర్‌లోని ఇమేజ్‌ గార్డెన్‌ రోడ్‌లో ఈ రెస్టారెంట్‌ ఉంది. 

రోబో కిచెన్‌

ఇది హైదరాబాద్‌లోనే తొలి రోబో థీమ్‌ రెస్టారెంట్‌. జూబ్లీహిల్స్‌లోని అల్కాజార్‌ మాల్‌ రెండో అంతస్తులో ఉంటుంది. ఇక్కడ రోబోలే మీకు సర్వ్‌ చేస్తాయి. రెస్టారెంట్‌లోకి అడుగుపెట్టగానే రోబోనే వెల్‌కమ్‌ చెబుతుంది. మీ టేబుల్‌ వరకు తీసుకెళ్తుంది. అంతేకాదు మీరు ఆర్డర్‌ ఇవ్వాలనుకుంటే ఓ ట్యాబ్‌ను చేతిలో పెడతారు. అందులో నుంచే మీకు కావాల్సినవి ఆర్డర్‌ చేయాల్సి ఉంటుంది. నిమిషాల్లో మీకు నచ్చిన ఫుడ్‌ను రోబోలు తెచ్చి వడ్డిస్తాయి. చైనీస్‌, థాయ్‌, నార్త్‌ ఇండియన్‌ వంటకాలకు ఈ రెస్టారెంట్‌ ఫేమస్‌. ఎల్‌ఈడీ లైట్ల ధగధగలు, మనసును ఆహ్లాదపరిచే మ్యూజిక్‌ మనల్ని మరో లోకంలోకి తీసుకెళ్తాయి. ఇక్కడ డిన్నర్‌ చేస్తే ఇద్దరికి ట్యాక్స్‌లు కాకుండా కనీసం 1200 వరకు ఖర్చవుతుంది. 

ఖైదీ కిచెన్‌

సంగారెడ్డిలో ఓ జైలు గురించి తెలుసు కదా. ఒక రోజుకి రూ.500 ఇస్తే మీకు కూడా జైలు అనుభవం చూపిస్తామని ప్రకటన ఇచ్చింది. హైదరాబాద్‌లోని ఈ ఖైదీ కిచెన్‌ రెస్టారెంట్‌ కూడా అలాంటిదే. ఇందులోకి వెళ్తే జైల్లోకి వెళ్లిన ఫీలే మీకు కలుగుతుంది. ఇక్కడి వెయిటర్స్‌ ఖైదీల్లాగా, మేనేజర్‌ జైలర్‌లాగా డ్రెస్సులు వేసుకుంటారు. జైలు గేట్లు, గోడలు ఎలా ఉంటాయో.. ఇక్కడా అలాంటి ఆంబియన్స్‌నే క్రియేట్‌ చేశారు. ఇటాలియన్‌, నార్త్‌ ఇండియన్‌, చైనీస్‌ ఫుడ్‌కి ఈ రెస్టారెంట్‌ ఫేమస్‌. బంజారాహిల్స్‌లోని రోడ్‌ నంబర్‌ 12లో ఈ ఖైదీ కిచెన్‌ ఉంది. ఆ రూట్‌లో వెళ్లినపుడు ఎప్పుడైనా ఈ డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ను ట్రై చేయండి. 

ఓహ్రీస్‌ గుఫా

హైదరాబాద్‌లో చాలా ఏళ్లుగా ఉన్న ఫేమస్‌ రెస్టారెంట్లలో ఇదీ ఒకటి. ఇందులోకి వెళ్తే ఓ గుహలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. ఇక్కడి వెయిటర్లు వేటగాళ్ల దుస్తుల్లో ఉంటారు. బషీర్‌బాగ్‌లోని పాత గాంధీ మెడికల్‌ కాలేజీ అపోజిట్‌లో ఈ రెస్టారెంట్‌ ఉంది. వెదురుతో చేసిన ఫర్నీచర్‌ ఇక్కడ స్పెషల్‌ అట్రాక్షన్‌. అంతేకాదు 90ల్లోని హిట్‌ బాలీవుడ్‌ సాంగ్స్‌ ప్లే చేస్తూ మిమ్మల్ని ఆ కాలంలోకి తీసుకెళ్తారు. నార్త్‌ ఇండియన్‌ ఫుడ్‌కు ఫేమస్‌. బార్‌ కూడా ఉంటుంది. 

హైపర్‌ యాక్టివా.. ఏడీహెచ్‌డీ ఉందా?

0

హైపర్‌ యాక్టివ్‌ పిల్లలను జాగ్రత్తగా పరిశీలించాలి. వాళ్లు ఏడీహెచ్‌డీ తో బాధపడుతున్నారేమో చూడండి. ఏడీహెచ్‌డీ అంటే అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్‌ యాక్టివిటీ డిజార్డర్‌. దీనిని గతంలో అటెన్షన్‌ డెఫిసిట్‌ డిజార్డర్‌ అనేవాళ్లు. మీ పిల్లాడు హైపర్‌ యాక్టివ్‌ గా ఉన్నంత మాత్రాన ఈ డిజార్డర్‌తో బాధపడుతున్నాడని భయపడిపోకండి.

తాజా అధ్యయనాల ప్రకారం పిల్లల్లో ఈ డిజార్డర్‌ గురించి తెలుసుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వాళ్లు చెప్పిన లక్షణాలు మీ హైపర్‌యాక్టివ్‌ పిల్లల్లో ఉన్నాయేమో చూసుకోండి. స్కూల్ వయసు పిల్లల్లో ఈ డిజార్డర్‌ ఉండే అవకాశాలు ఉన్నాయి. పిల్లలు పెరిగి పెద్దవుతున్నా.. ఈ డిజార్డర్‌ వేధిస్తూనే ఉంటుంది.

అమెరికన్‌ సైకియాట్రిక్‌ అసోసియేషన్‌కు చెందిన డయాగ్నోస్టిక్‌ అండ్‌ స్టాటిస్టికల్‌ మ్యానువల్‌ ఆఫ్‌ మెంటల్‌ డిజార్డర్స్‌ (డీఎస్‌ఎం) ప్రకారం ఏడీహెచ్‌డీని గుర్తించడానికి కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. మీ పిల్లలు హైపర్ యాక్టివ్ ఉండి.. అప్పటికప్పుడు చేసే పనిపై ఏకాగ్రత కోల్పోతున్నంత మాత్రాన వాళ్లు ఈ ఏడీహెచ్‌డీతో బాధపడుతున్నట్లు కాదని గ్రహించండి. 

పిల్లల్లో ఏడీహెచ్‌డీ లక్షణాలు

ఏడీహెచ్‌డీ లక్షణాలను కూడా రెండు విధాలుగా గుర్తించవచ్చు. ఈ డిజార్డర్‌కు సంబంధించి డీఎస్‌ఎం తీసుకొచ్చిన మార్గదర్శకాలను ఇప్పుడు చూద్దాం.

ఏకాగ్రత కోల్పోవడం

  చేసే పనులపై శ్రద్ధ వహించకపోవడం లేక స్కూల్‌ లేదా ఇతర పనులలో అజాగ్రత్తగా వ్యవహరించడం
  ఏదైనా పని లేదా ఆటపాటల పట్ల ఎక్కువసేపు దృష్టి నిలుపలేకపోవడం (ఉదాహరణకు స్కూల్లో పాఠం శ్రద్ధగా వినకపోవడం, ఎక్కువసేపు చదవలేకపోవడం)
  తరచూ నేరుగా తనతోనే మాట్లాడుతున్నా వినిపించుకోకపోవడం (ఉదాహరణకు ఏకాగ్రతను దెబ్బతీసే ఘటనలు ఏవీ జరగకపోయినా ఏదో ఆలోచిస్తున్నట్లు ఉండిపోవడం)
  తరచూ మనం ఇస్తున్న సూచనలను పాటించకపోవడం, స్కూల్‌ వర్క్‌ లేదా ఇతర పనులను పూర్తి చేయలేకపోవడం (ఉదాహరణకు ఏదైనా పని మొదలుపెట్టి వెంటనే ఏకాగ్రత కోల్పోయి దానిని మధ్యలోనే వదిలేయడం)
  రోజువారీ పనులు లేదా కార్యకలాపాలను కూడా చేయడానికి ఇబ్బంది పడుతుండటం (ఉదాహరణకు తనకు సంబంధించిన వస్తువులను సరిగా చూసుకోలేకపోవడం, టైమ్‌ మేనేజ్‌మెంట్‌ లేకపోవడం, గడువులోపు పనులను పూర్తి చేయేలకపోవడం)
  కాస్త ఎక్కువ సేపు బుర్రకు పదును పెట్టి చేయాల్సిన పనులను ఇష్టపడకపోవడం, చేయకపోవడం (ఉదాహరణకు స్కూలు పిల్లలైతే స్కూల్‌ వర్క్‌ లేదా హోమ్‌ వర్క్‌ చేయకపోవడం.. అదే పెద్దవాళ్లయితే రిపోర్టులు తయారు చేయడం, ఓ భారీ ఫైలును సమీక్షించలేకపోవడం)
  పనులు పూర్తి చేయడానికి కావాల్సిన వస్తువులను తరచూ పోగొట్టుకోవడం (ఉదాహరణకు స్కూలు పిల్లలైతే పెన్సిల్స్‌, బుక్స్‌, ఇతర స్కూలుకు సంబంధించిన వస్తువులను పోగొట్టుకోవడం.. అదే పెద్ద వాళ్లయితే పర్సులు, కీస్‌, మొబైల్‌ ఫోన్లు పోగొట్టుకోవడం)
  చేస్తున్న పనికి సంబంధం లేని ఆలోచనలతో సులువుగా ఏకాగ్రత కోల్పోతుండటం (పెద్ద వాళ్లలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. అనవసర ఆలోచనలు చేస్తుంటారు)
  రోజువారీ చేయాల్సిన పనులను మరచిపోవడం

హైపర్‌ యాక్టివిటీ.. ఇంపల్సివిటీ

  తరచూ ఒక చోట కుదురుగా ఉండలేకపోవడం (చంచలత్వం) అంటే ఎప్పుడూ కాళ్లూ, చేతులూ ఆడిస్తుండటం, కుర్చీలో కుదురుగా కూర్చోలేకపోవడం
  ఓ చోట కచ్చితంగా ఉండాల్సిన సమయంలో ఉండకుండా ఎక్కడికో వెళ్లిపోవడం (స్కూల్‌లో క్లాస్‌ జరుగుతుంటే బయటకు వెళ్లిపోవడం లేదా ఆఫీసులో ఉండాల్సిన సమయంలో ఉండకపోవడం)
  అనవసర సందర్భాల్లో అతిగా స్పందించడం
  తరచూ ఖాళీ సమయాల్లో ఆడుతూ పాడుతూ సరదాగా ఉండకపోవడం
  హడావిడిగా ఉండటం.. ఎవరో వెనక తరుముతున్నట్లుగా వ్యవహరిస్తుండటం (ఉదాహరణకు ఎక్కువసేపు ఓ చోట ఉండలేకపోవడం అంటే మీటింగ్స్‌లోగానీ, నలుగురితో కలిసి మాట్లాడుతున్నపుడుగానీ మధ్యలోనే వెళ్లిపోవడం)
తరచూ అతిగా మాట్లాడుతుండటం
తరచూ అవతలి వాళ్లు అడిగిన ప్రశ్న పూర్తవకుండానే సమాధానం ఇస్తుండటం (ఉదాహరణకు అవతలి వాళ్ల వాక్యాన్ని వీళ్లే పూర్తి చేస్తుంటారు.. ఏదైనా చర్చలో పాల్గొన్నపుడు తమ వంతు వచ్చే వరకు వేచి చూడలేరు)
ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోవడం (ఉదాహరణకు ఇతరుల సంభాషణలోకి హఠాత్తుగా వచ్చేయడం, వాళ్ల పనుల్లో జోక్యం చేసుకోవడం, ఇతరుల వస్తువులను వాళ్ల అనుమతి లేకుండానే తీసుకోవడం)

ఏడీహెచ్‌డీ ని ఎలా గుర్తించాలి

రెండు సందర్భాల్లోని లక్షణాలను మీరు పూర్తిగా చదివారు కదా. రెండింట్లోని లేదా కనీసం ఒక దాంట్లోని ఆరు లక్షణాలు కనుక ఆరు నెలల పాటు మీ పిల్లల్లో కనిపిస్తూ.. అది వాళ్ల విద్య, సామాజిక జీవితంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని అనిపిస్తేనే దీనిని ఏడీహెచ్‌డీగా అనుమానించండి. అదే పెద్ద వాళ్లలో అయితే వీటిలోని కనీసం ఐదు లక్షణాలు ఆరు నెలలపాటు ఉన్నాయేమో గమనించండి. చాలా వరకు 12 ఏళ్లలోపు పిల్లల్లోనే ఈ లక్షణాలు ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. 

ఏడీహెచ్‌డీకి చికిత్స ఉందా?

కచ్చితంగా దీనికి చికిత్స ఉంది. అది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మందుల ద్వారా అయితే రెండోది థెరపీల ద్వారా. రెండూ ఒకేసారి తీసుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతుంటారు. సాధారణంగా ఏడీహెచ్‌డీతో బాధపడే చిన్నారులు భవిష్యత్తులో అపోజిషనల్‌ డిఫయంట్‌ డిజార్డర్‌, కండక్ట్‌ డిజార్డర్‌లాంటి వాటి బారిన పడే ముప్పు ఉండటం తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది.

ఇలాంటి పిల్లల చికిత్సలో తల్లిదండ్రులదే కీలకపాత్ర. మొదట వారి ద్వారానే ఈ డిజార్డర్‌ను తొలగించే ప్రయత్నం చేస్తారు. పిల్లల ప్రవర్తన మార్చడానికి తీసుకోవాల్సిన చర్యలపై తల్లిదండ్రులకు నిపుణులు శిక్షణ ఇస్తారు. ఇక క్లాస్‌ రూమ్‌లలో పిల్లల ప్రవర్తన మార్చడానికి టీచర్లకు కూడా శిక్షణ ఇస్తారు.

మెడికేషన్‌

ఏడీహెచ్‌డీకి నిపుణుల సమక్షంలో చికిత్స అందిస్తారు. పీడియాట్రిషన్‌, సైకియాట్రిస్ట్‌లాంటి వాళ్లు ప్రత్యేకంగా వీళ్లకు ట్రీట్‌మెంట్‌ ఇస్తారు. మెడికేషన్‌ పరంగా చూస్తే ఐదు రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. 

ఇవి ఏడీహెచ్‌డీకి శాశ్వతమైన పరిష్కారం చూపకపోయినా.. చాలా వరకు పిల్లల ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఏకాగ్రత పెరగడం, ప్రశాంతంగా పనిచేయడం, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంపై దృష్టి సారించే అవకాశాలు ఉంటాయి.

కొన్ని ప్రతి రోజూ తీసుకోవాల్సిన మందులు కాగా.. కొన్ని కేవలం స్కూలుకు వెళ్లే రోజుల్లో తీసుకుంటే సరిపోతుంది. మధ్యమధ్యలో పిల్లల ప్రవర్తనను గమనిస్తూ చికిత్సను కొనసాగించాలా వద్దా అన్నది నిర్ణయిస్తారు. మొదట్లో స్వల్ప మోతాదుల్లో ఇస్తూ తర్వాత క్రమంగా పెంచుతూ వెళ్తారు. 

థెరపీ

మందులు వాడుతూనే కొన్ని రకాల థెరపీలు చేయించుకుంటే కూడా ప్రయోజనం ఉంటుంది. ఏడీహెచ్‌డీ ద్వారా వచ్చే ప్రవర్తనాపరమైన లోపాలను ఈ థెరపీల ద్వారా అధిగమించవచ్చు. 

సైకోథెరపీ

ఏడీహెచ్‌డీతో బాధపడే చిన్నారులకు సైకోథెరపీలు కూడా ఉంటాయి. ఇందులో భాగంగా సామాజిక నైపుణ్యాలు, కోపాన్ని అదుపు చేసుకోవడం, క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడంలాంటి వాటిపై శిక్షణ ఇస్తారు.

బిహేవియర్‌ థెరపీ

ఈ థెరపీలో భాగంగా పిల్లల ప్రవర్తన మార్చడానికి ప్రయత్నిస్తారు. ఏడీహెచ్‌డీ లక్షణాలను తగ్గించుకునేలా వాళ్లకు ఏదో ఒకరకమైన బహుమతులు ఇస్తూ ప్రోత్సహించడం ఇందులో ఒక భాగం. తినే సమయంలో అయినా, హోంవర్క్‌ చేసే సమయంలో అయినా తాము చెప్పినట్లు చేస్తే చిన్న చిన్న బహుమతులు ఇస్తూ మెల్లగా వాళ్ల ప్రవర్తన మార్చాలి. అటు స్కూల్‌లో అయితే ఇలాంటి పిల్లలను టీచర్లు ప్రత్యేకంగా చూస్తూ.. వాళ్లు సాధించే చిన్న చిన్న విజయాలను కూడా మెచ్చుకోవడం, ప్రోత్సహించడంలాంటి చేయాలి. వాళ్లకు ఇష్టమైన రీతిలో చదువు నేర్పించడం కూడా ఇందులో ఒక భాగం. 

తల్లిదండ్రులకు శిక్షణ

ఏడీహెచ్‌డీతో బాధపడుతున్న పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇస్తారు. వాళ్లతో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి.. వాళ్లతో ఎలా పని చేయించుకోవాలి.. ఏం చేస్తే వాళ్ల ఏకాగ్రత పెరిగి, ప్రవర్తన మెరుగవుతుందో ఈ శిక్షణలో చెబుతారు. దీనివల్ల అలాంటి పిల్లలతో మీ సంబంధాలు మరింత మెరుగై.. వాళ్లను ఆ డిజార్డర్‌ బారి నుంచి మీకు మీరుగా రక్షించుకోగలుగుతారు.

ఇక సామాజిక నైపుణ్యాలను మెరుగుపరిచే శిక్షణను కూడా ఏడీహెచ్‌డీ పిల్లలకు ఇస్తారు. బయటకు వెళ్లినపుడు ఎలా ఉండాలి.. వాళ్ల ప్రవర్తన అవతలి వాళ్లపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న అన్న అంశాలపై పిల్లలకు శిక్షణ ఇస్తారు. 

చివరిగా మరోసారి మేము చెప్పేది ఏంటంటే.. మీ పిల్లలు హైపర్ యాక్టివ్ అయినంత మాత్రాన ఈ ఏడీహెచ్‌డీ బారిన పడ్డారని ఆందోళన చెందకండి. పైన చెప్పిన లక్షణాలన్నింటినీ ఓసారి గమనించి, అనుమానం వస్తే నిపుణులను సంప్రదించండి.