హాబీతో సంపాదన మార్గాలు తెలుసుకోండి

earning with hobby
pic credit pexels.com

సంపాదించడానికి ఉద్యోగమే చేయాలా.. కాస్త కొత్తగా ఆలోచించాలే గానీ సవాలక్ష మార్గాలు ఉన్నాయి. మీకు ఇష్టమైనదే చేయండి.. ఈ రోజుల్లో చాలా మంది డబ్బు కావాలి కాబట్టే ఉద్యోగాలు చేస్తున్నారు తప్ప.. ఇష్టపడి చేస్తున్నవాళ్లు ఎంతమంది? అందుకే అదేదో మనకు నచ్చిన పని చేస్తూనే సంపాదిస్తే ఎలా ఉంటుంది? మీ హాబీయే మీపై కాసుల వర్షం కురిపిస్తే వద్దంటారా? నిజమే.. మీ హాబీతో ఇంట్లో కూర్చునే సరదాగా సంపాదించేయండి. ఈ ఇంటర్నెట్‌ యుగంలో డబ్బు సంపాదించడం కూడా సులువే అన్న విషయాన్ని గుర్తించండి. ఎవరో ఇచ్చే ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా మీ మనసుకు నచ్చిన పని చేస్తూ నాలుగు రాళ్లు వెనకేసుకోండి. మీ హాబీతో సంపాదన మార్గాలపై డియర్ అర్బన్ డాట్ కామ్ ప్రత్యేక కథనం ఇది.

కుకింగ్‌తో కోట్లు

వంట చేయడం మీకు ఇష్టమా? నోరూరించే వంటకాలు చేయడంలో మీరు ఎక్స్‌పర్టా? ఇంకెందుకు ఆలస్యం.. ఈ హాబీతో సంపాదన మార్గాలివిగో.. సొంతంగా ఓ బ్లాగ్‌ క్రియేట్‌ చేసుకొని ఏ వంట ఎలా చేయాలో చెప్పండి లేదంటే ఓ యూట్యూబ్‌ చానెల్‌ స్టార్ట్‌ చేసేయండి. ప్రపంచంలో తినేవాళ్లకు కొదవ లేనట్లే.. కొత్త కొత్త వంటలకూ కరువు లేదు. చెబితే నమ్ముతారో లేదో గానీ.. మధులిక అనే ఓ మహిళ 2011లో ఇలాగే యూట్యూబ్‌లో ఓ వంటల చానెల్‌ ప్రారంభించింది. ఆమె వంటల వీడియోలకు విపరీతమైన క్రేజ్‌ ఏర్పడటంతో ఇప్పుడు ఆ చానెల్‌పైనే నెలకు కనీసం రూ. 3 లక్షలు సంపాదిస్తున్నారామె. ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్‌ లెవల్‌లో ఇప్పుడామె ఫేమస్‌ అయిపోయారు. 

తింటూ కూడా సంపాదించేయొచ్చు

మీరు వంట చేయడంలో కాకుండా తినడంలో ఎక్స్‌పర్టా..? అయినా పర్వాలేదు. తింటూ కూడా సంపాదించేయొచ్చు. ఇతరులు చేసిన వంటలు రుచి చూసి ఎలా ఉన్నాయో రీవ్యూలు రాసేవాళ్లు కూడా ఇప్పుడు బాగానే సంపాదిస్తున్నారు. జొమాటోలాంటి యాప్స్‌ తమ టాప్‌ రీవ్యూవర్స్‌కి రివార్డులు కూడా ఇస్తోంది. సదరు కంపెనీల నుంచి గిఫ్ట్‌లతోపాటు తమ రెస్టారెంట్లకు వచ్చి కాస్త తమ వంటలను రుచి చూసి పోవాలన్న ఆహ్వానాలు కూడా మీకు దక్కుతాయి. జొమాటో టాప్‌ రీవ్యూవర్‌గా మీరు మారిపోతే ఫ్రీగా క్రెడిట్స్‌, అప్పుడప్పుడూ ఫుడ్‌ కూడా పంపిస్తారు. సొంతంగా ఓ బ్లాగ్‌ క్రియేట్‌ చేసుకొని రీవ్యూలు రాసుకుంటూ ఫుడ్‌ క్రిటిక్‌గా మారిపోవచ్చు. 

ఫొటోగ్రఫీ మీ హాబీయా

ఫొటోగ్రఫీ అంటే మీకు ఇష్టమా.. మంచి కెమెరా మీ దగ్గర ఉందా.. అయితే ఎన్నో మార్గాల్లో మీరు డబ్బు సంపాదించవచ్చు. లోకల్‌గా ఫ్రీలాన్స్‌ ఫొటోగ్రాఫర్‌ కావచ్చు. కానీ దీని ద్వారా పరిమితమైన అవకాశాలే ఉంటాయి. అదే కాస్త ఎక్కువ సంపాదించాలంటే ఫొటోగ్రఫీ సైట్స్‌కు మీ ఫొటోలను అమ్ముకోవచ్చు. మీకు ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ఉంటే మరీ మంచిది. మీ ఫొటోలతో ఫాలోయింగ్‌  పెంచుకోండి.. డబ్బు సంపాదించండి. ప్రొఫెషనల్‌ ఫొటోగ్రఫీ అకౌంట్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఉన్నాయి. మంచి బ్రాండ్స్‌ దృష్టిలో మీరు పడ్డారంటే మీ దశ తిరిగినట్లే. ఒక్కో పోస్టుకు వేల కొద్దీ సంపాదించే అవకాశం ఉంటుంది. https://stock.adobe.com/ , https://www.shutterstock.com/ వంటి సైట్లలో మీ ఫోటోలను అమ్ముకోవచ్చు. 

షాపింగ్‌ చేసినా డబ్బే..

కొంత మందికి షాపింగ్‌ కూడా ఒక హాబీగా ఉంటుంది. గంటల కొద్దీ షాపింగ్‌ చేస్తూ గడిపేస్తారు. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లాంటి ఆన్‌లైన్‌ షాపింగ్‌ సైట్స్‌ వచ్చిన తర్వాత అవసరం ఉన్నా లేకపోయినా.. కొనేస్తున్నారు. అయితే ఇలా షాపింగ్‌ చేస్తూ కూడా మీరు సంపాదించ వచ్చన్న విషయం తెలుసా? అమెజాన్‌ ఈ అవకాశాన్ని మీకు అందిస్తోంది. అమెజాన్‌ రీసెల్లింగ్‌ బిజినెస్‌ ట్రై చేయండి. ముందుగా ఓ అమెజాన్‌ సెల్లర్‌ అకౌంట్‌ను క్రియేట్‌ చేసుకోవాలి. మొదట్లో పర్సనల్‌ అకౌంటే ఇస్తారు. నెలకు కనీసం 40 వస్తువులను మీరు అమ్మగలగితే.. మీరు ప్రొఫెషనల్‌ అకౌంట్‌కు అప్‌గ్రేడ్‌ కావచ్చు. ఈ అమెజాన్‌ సెల్లర్‌ యాప్‌ ఐవోఎస్‌, ఆండ్రాయిడ్‌లలో ఫ్రీగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మొదట్లో వస్తువులను కొనుగోలు చేయడానికి మాత్రం మీరు కాస్త డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. 

ఆడుతూపాడుతూ..

స్మార్ట్‌ఫోన్లు వచ్చిన తర్వాత గేమ్స్‌ ఆడటం చాలా మందికి ఒక అలవాటుగా మారిపోయింది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ గేమ్స్‌ ఆడేస్తున్నారు. అయితే ఈ హాబీతో సంపాదన కు కూడా మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకు ఫ్యాంటసీ క్రికెట్‌ లీగ్‌ ఇలాంటిదే. క్రికెట్‌ మీద మీకు మంచి పట్టు ఉంటే.. మీ ఇష్టమైన ప్లేయర్స్‌తో ఓ డ్రీమ్‌ టీమ్‌ను తయారు చేసుకోండి. మీకున్న స్పోర్ట్స్‌ నాలెడ్జ్‌తో ఇలాంటి యాప్స్‌లో డబ్బు సంపాదించుకోవచ్చు. డ్రీమ్‌11 కూడా ఇలాంటిదే. రానున్న మ్యాచ్‌లకు ముందుగానే మీకున్న పరిజ్ఞానంతో డ్రీమ్‌ టీమ్‌ను ఎంపిక చేయండి. వాళ్ల ప్రదర్శనను బట్టి మీ సంపాదన ఆధారపడి ఉంటుంది. గేమ్‌పై మంచి పట్టు ఉంటే కనుక బాగానే సంపాదించవచ్చు. ఒక్క క్రికెట్‌ అనే కాదు.. కబడ్డీ, బాస్కెట్‌బాల్‌, ఫుట్‌బాల్‌ లాంటి గేమ్స్‌కు కూడా ఇలాంటి ఫ్యాంటసీ యాప్స్‌ ఉన్నాయి. 

స్టాక్‌ మార్కెట్‌ బెస్ట్‌..

స్టాక్‌ మార్కెట్‌ను చాలా మంది ఓ జూదంలాగా చూస్తారు గానీ.. కొంతమందికి ఇందులో ఇన్వెస్ట్‌ చేయడం కూడా ఓ హాబీయే. నిజానికి అన్ని హాబీల కన్నా ఎక్కువ సంపాదించి పెట్టేది ఇదే. ఎప్పటికప్పుడు మార్కెట్‌లోని కంపెనీల గురించి, వాటి మధ్య ఉండే పోటీ గురించి తెలుసుకుంటూ, మార్కెట్‌లోని ఎగుడుదిగుడుల గురించి తెలుసుకోగలిగితే స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేయడం కూడా ఓ హాబీలా మారిపోతుంది. స్టాక్‌ మార్కెట్‌ను మీరు రెగ్యులర్‌గా ఫాలో అయితే ఒక విషయం గమనించవచ్చు. దీర్ఘకాలంలో ఏడాదికి ఇది 8 శాతం వృద్ధి సాధిస్తోంది. లాభాలు పొందడానికి ఇక్కడ అపరిమితమైన అవకాశాలు ఉంటాయి. అయితే మీ చాయిస్‌పై మీకు పూర్తి విశ్వాసం ఉంటేనే ఇన్వెస్ట్ చేయండి. అది కూడా మొదట్లో పరిమిత స్థాయిలో పెడితేనే మంచిది. 

బాగా రాయగలిగినా డబ్బే..

మీరు మంచి రైటర్‌ అయితే.. వివిధ అంశాలపై మీకు పట్టు ఉన్నట్లయితే.. ఓ బ్లాగ్‌ స్టార్ట్‌ చేసి ఆన్‌లైన్‌లో సంపాదించవచ్చు. ఇతరులకు రాస్తే వెంటనే డబ్బు వస్తుంది.. మీరే సొంతంగా బ్లాగ్‌ స్టార్ట్‌ చేసి రాస్తే.. కాస్త ఆలస్యమైనా నిలకడగా సంపాదించే చాన్స్‌ ఉంటుంది. ఓ సంస్థలో పని చేయడం లేదా మీరే సొంతంగా ఓ సంస్థ ఏర్పాటు చేయడం లాంటిదే ఇది కూడా. మీ బ్లాగ్‌ను చూసే వాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతుంటే.. దానికి తగినట్లుగా మీ బ్యాంక్‌ బ్యాలెన్స్‌ పెరుగుతుంది. ఈ బ్లాగ్‌లతో నెలకు లక్షలు సంపాదించే వాళ్లు చాలా మందే ఉన్నారు. మీరూ మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. మీ తెలివి తేటలే దీనికి పెట్టుబడి. ఫ్రీలాన్స్ రచయితగా డబ్బు సంపాదించాలనుకుంటే మాత్రం https://www.freelancer.in/ వంటి వెబ్ సైట్లు చాలా అవకాశాలు కల్పిస్తాయి.

ఇక రచయితగా మారి బుక్స్ పబ్లిష్ చేయాలనుకుంటే అమెజాన్ ఇందుకు అవకాశం కల్పిస్తోంది. మీరు రాసి పెడితే చాలు.. ఆన్ లైన్ ఇ బుక్ అమెజాన్ అమ్మిపెడుతుంది. 

Previous articleఅరోమాథెరపీ.. ఒత్తిడి, ఒంటి నొప్పులు మాయం
Next articleషటిల్ క్లౌడ్ తో జీమెయిల్ కు మెయిల్స్ మైగ్రేషన్