Home Blog Page 72

గూగుల్ ఫ్యామిలీ లింక్ ఖాతాతో పిల్లల బ్రౌజింగ్ సేఫ్

0

గూగుల్ ఫ్యామిలీ లింక్ యాప్ ఎప్పుడైనా విన్నారా? ’నాకు మొబైల్ వాడటం సరిగా రాదుకాని మా అబ్బాయి మాత్రం మొత్తం మొబైల్ ని చుట్టబెట్టేస్తాడు’ చాలా మంది తల్లిదండ్రులు లేదా తాతలు అనడం చూస్తూనే ఉంటాం.. మరి ఆ పిల్లలు ఎటువంటి యాప్స్ మొబైల్ లో ఇన్ స్టాల్ చేస్తున్నారు.. వాటి వల్ల నష్టమేమన్న ఉందా..? అసలు ఎటువంటి వెబ్సైట్లు చూస్తున్నారు అనేది తెలుస్తుందా..? ఇదే కోణంలో ఆలోచించే తల్లిదండ్రులు కూడా పిల్లలకు స్మార్ట్ ఫోన్ లేదా ట్యాబ్ కొనివ్వాలని ఉన్నా ఆగిపోతున్నారు. దానికి పరిష్కారమే ఈ గూగుల్ ఫ్యామిలీ లింక్ యాప్. దీని ద్వారా మీ పిల్లలకు జీమెయిల్ ఖాతా సృష్టించవచ్చు.

మొబైల్ వల్ల పిల్లలపై వ్యతిరేక ప్రభావం ఉండటం అనేది సహజంగా అనుకునే విషయం. అదే సమయంలో పిల్లల మేధోసంపత్తి పెరగడానికి, కొత్త ఆలోచనలు పురుడు పోసుకోవడానికి, విషయ పరిజ్ఞానం పెంచుకోవడానికి, బైజూస్, హెలో ఇంగ్లీష్ వంటి విద్యాపరమైన యాప్స్ వినియోగించడానికి స్మార్ట్ ఫోన్ లేదా ట్యాబ్ అనేది పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది అనడంలో సందేహంలేదు.

అయితే బ్లూవేల్, పబ్జీ వంటి ఆటలకు దూరంగా ఉంచుతూ ఎప్పటికప్పుడు తల్లిదండ్రుల పర్యవేక్షణలో మొబైల్ వినియోగించేలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదే.. ఇప్పుడు తల్లిదండ్రుల పర్యవేక్షణ కోసం గూగుల్ ముందడుగు వేసి ‘ఫ్యామిలీ గ్రూప్’ కి అవకాశం ఇస్తుంది. మరి ఆ యాప్ ఎలా పనిచేస్తుంది..? దాని వల్ల ఉపయోగం ఏంటి..?  అనేది పరిశీలిద్దాం…

జీమెయిల్ ఖాతాతోనే రక్షణ..

పిల్లల వినియోగించే ఆండ్రాయిడ్ మొబైల్ లేదా ట్యాబ్ లో ప్రైమరీ గూగుల్ ఖాతా వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. సాధారణంగా పిల్లలకు జీమెయిల్ ఖాతా ఉండదు కాబట్టి ఇంట్లో ఉండే పెద్దవారి ఖాతా వివరాలు ఎంటర్ చేసి మొబైల్ వినియోగానికి ఇస్తారు. అలా కాకుండా పిల్లలకు ప్రత్యేకంగా ఒక గూగుల్ ఖాతా సృష్టించాలి.

అలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు..

 పిల్లల మొబైల్ మీ అనుమతి లేకుండా కొత్త యాప్ డౌన్లోడ్ చేసుకోవడం కుదరదు.

క్రోమ్ బ్రౌజర్ లో అడల్ట్ కంటెంట్ చూసేందుకు వీలులేకుండా ఆటోమేటిగ్గా కొన్ని వెబ్సైట్లు బ్లాక్ అవుతాయి.

వారు ఏ వయసుకు తగిన యాప్స్ వేసుకోవాలో మీరే నిర్ణయించుకోవచ్చు.

పిల్లలు వాడే మొబైల్లో అవి కాకుండా ఇంకా ఎటువంటి యాప్స్ ఉన్నాయో వివరాలు తెలుసుకోవచ్చు.

ప్లేస్టోర్ పేరెంట్ కంట్రోలే కాకుండా, గూగుల్ క్రోమ్ ఫిల్టర్స్, గూగుల్ సెర్చ్ ఫిల్టర్స్, గూగుల్ అసిస్టెంట్, ఆండ్రాయిడ్ యాప్స్ సెట్టింగ్స్ కూడా తల్లిదండ్రులే చేయొచ్చు.

అది ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం..

మొదట గూగుల్ ప్లే స్టోర్ నుంచి గూగుల్ ఫ్యామిలీ లింక్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి.

యాప్ ఓపెన్ చేసి మీ గూగుల్ ఖాతా వివరాలు ఇవ్వాలి.

అక్కడ ‘సూపర్వైజ్ ఏ ఫ్యామిలీ మెంబర్’ అని ఉన్న చోట క్లిక్ చేసి పిల్లల సరైన వయసు వివరాలు ఇస్తూ గూగుల్ ఖాతా తీసుకోవాలి.

ఇప్పటికే స్మార్ట్ ఫోన్ లేదా ట్యాబ్ ఉందా అనే వివరాలు ఎంటర్ చేసి, పిల్లల ప్రాథమిక సమాచారం అందించి ఖాతాని సృష్టించాలి.

ఒక సారి పిల్లలకు ప్రత్యేక ఖాతా సృష్టించిన తరువాత వారు వాడే స్మార్ట్ ఫోన్ లో వేరే గూగుల్ ఖాతా చేయడానికి వీలు పడదు. అందువల్ల తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే వారు వినియోగించుకోవాల్సి ఉంటుంది. కావాలంటే ఆ ఖాతాని తొలిగించి కొత్తది యాడ్ చేసుకోవచ్చు. అలా పిల్లల ఖాతాలో చిన్నమార్పు చేసినా తల్లిదండ్రులకు సమాచారం వస్తుంది. ఈమెయిల్ రూపంలోనూ, గూగుల్ ఫ్యామిలీ లింక్ యాప్ నోటిఫికేషన్ ద్వారా సమాచారం అందుతుంది. అలా ఎప్పటికప్పుడు పిల్లల మొబైల్ వాడకాన్ని పర్యవేక్షించుకోవచ్చు.

— డియర్అర్బన్ టీం

ఇవి కూడా చదవండి

interior design of home: మీరే ఇంటీరియర్‌ డిజైనర్స్‌.. ఖర్చు లేకుండా..

0

interior design of home: ఇంటీరియర్‌ డిజైనర్స్‌కు ఇప్పుడు మార్కెట్‌లో ఎంత డిమాండ్‌ ఉందో తెలుసు కదా. ఏదో ఇల్లు కట్టి, రంగులేసి ఊరుకోవడం లేదెవరూ. ఒంటినే కాదు ఇంటిని కూడా అందంగా ఉండేలా చూసుకుంటున్నారు. తమ టేస్ట్‌కు తగినట్లు ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకుంటున్నారు. లివింగ్‌ రూమ్‌, హాల్‌, కిచెన్‌, బెడ్‌రూమ్‌, బాత్‌రూమ్‌.. ఇలా ఒక్కో రూమ్‌లో ఒక్కో డిజైన్‌తో తమ అభిరుచిని చాటుకుంటున్నారు. దీనికోసం లక్షలు ఖర్చు చేయడానికి కూడా చాలా మంది వెనుకాడటం లేదు. కానీ అందరూ ఇంత ఖర్చు భరించలేరు. అలాగని చూస్తూ వదిలేయలేరు. అలాంటి వాళ్ల కోసమే ఈ ఇంటీరియర్‌ టిప్స్‌. ఈ సింపుల్‌ టిప్స్‌ పాటించడం వల్ల మీ ఇంటికి మీరే డిజైనర్‌గా మారిపోవచ్చు. పైగా మీ బడ్జెట్‌లోనే ఇంటిని అందంగా మార్చుకోవచ్చు. 

interior design: లైట్‌ కలర్స్‌తో మాయ చేసేయండి

అర్బన్‌ ఏరియాల్లోని మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీలు చాలా వరకు చిన్న చిన్న ఇళ్లలో, ఇరుకైన గదుల్లో నివసిస్తుంటారు. ఇంత చిన్న గదికి ఇంకా ఏం ముస్తాబు చేస్తాంలే అని బాధపడుతుంటారు. కానీ చిన్న రూమ్‌ను కూడా పెద్దగా కనిపించేలా అందంగా మాయ చేసేయొచ్చు. పెద్ద పెద్ద కిటికీలు, గోడలకు లైట్‌ 
కలర్స్‌ వేయడం ద్వారా చిన్న గది కూడా పెద్దగా కనిపిస్తుంది. అక్కడక్కడా పెద్ద పెద్ద అద్దాలు పెట్టడం వల్ల రూమ్‌ మరింత విశాలంగా కనిపించేలా చేయొచ్చు. చిన్న గదులకు ముదురు రంగులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకండి. అది మీ గది మరింత చిన్నగా కనిపించేలా చేస్తుంది. 

interior design: పాత, కొత్త.. అన్నీ కలిపేయండి

మనకు కొత్తొక వింత.. పాతొక రోత. కొత్త వస్తువు ఏదైనా వస్తే.. పాతదాన్ని పక్కన పడేస్తాం. కానీ ఇంటీరియర్‌ డిజైనింగ్‌ నిపుణులను అడగండి.. ఆ పని ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దని చెబుతారు. మీ ఇంటి డిజైన్‌.. మీరు, మీ వ్యక్తిత్వం, మీ స్టైల్‌ని ప్రతిబింబించేలా ఉండాలని అంటారు. అందుకే మీ తాతల 
కాలం నాటి వస్తువేదైనా ఇంట్లో ఉంటే.. దానిని ఎక్కడో ఎవరికీ కనిపించకుండా మూలన పడేయకండి. మీరు తెచ్చుకున్న అత్యాధునిక ఫర్నీచర్‌తోపాటే దాన్ని కూడా ఉంచండి. కొత్త, పాతల కలయిన ఎలాంటి మ్యాజిక్‌ చేస్తుందో మీకు అర్థమవుతుంది. మీరు ఒకవేళ ఆర్ట్‌ లవర్స్‌ అయినా కూడా ఇదే సూత్రం 
పాటించండి.

interior design: రంగు పడితే చాలు

ఒక్కోసారి అన్నీ ఉన్నా ఏదో వెలితి ఉన్నట్లు కనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఇలాంటి సమయంలో సింపుల్‌గా కొత్త పెయింట్‌ వేసేయండి. ఆకర్షణీయమైన రంగుల్లోని పెయింట్స్‌ నిర్జీవంగా ఉన్న మీ ఇంటి గది, ఫర్నీచర్‌కు ఓ కొత్త లుక్‌ను తీసుకొస్తుంది. 

Indoor Plants: మీ ఇల్లే ఓ గార్డెన్‌

మొక్కలను బయట పెరట్లోనే పెంచాలన్న రూలేమీ లేదు. మనకు ఆసక్తి ఉండాలే కానీ.. అవి ఇంట్లోకీ వచ్చేస్తాయి. లివింగ్‌ రూమ్‌లో మనతోపాటే కూర్చుంటాయి. హాల్‌లో మనకు తోడుగా ఉంటాయి. కిచెన్‌లో సాయం చేస్తాయి. చిన్న, పెద్దా అన్న తేడా లేకుండా మీ ఇంట్లోని అన్ని రూమ్స్‌లో మొక్కలను పెట్టుకోవచ్చు. పైసా ఖర్చు లేకుండా మీ ఇంటికి కొత్త అందాన్ని తీసుకొచ్చేవి ఈ మొక్కలే. అంతేకాదు ఈ మొక్కలు ఇంట్లో ఉండటం వల్ల ఇంట్లోని గాలి స్వచ్ఛంగా మారుతుంది. తేమ తగ్గి ఉక్కపోత కూడా ఉండదు. హానికరమైన వాయువులను ఈ మొక్కలు పీల్చుకుంటాయి కాబట్టి ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. అసలు మొక్కలు లేని ఇల్లు ఓ ఇల్లే కాదని గుర్తుంచుకోండి. 

Photos: మీ ఫొటోల దుమ్ము దులపండి

ఇంటిని ముస్తాబు చేయడానికి మార్కెట్లో దొరికే ఖరీదైన వస్తువులే అవసరం లేదు. మీరు, మీ కుటుంబ సభ్యుల ఫొటోలు ఉన్నా చాలు. ఏదో ఫంక్షన్‌లోనో, పండుగలప్పుడో, ఏదైనా వెకేషన్‌కు వెళ్లినప్పుడో కొత్త బట్టలు వేసుకొని అందరూ కలిసి ఫొటోలకు పోజులివ్వడం చాలా కామన్‌. కానీ ఆ ఫొటోలు అల్మారాలు దాటి బయటకు రావు. ఒకసారి వాటి దుమ్ము దులపండి. కొన్ని మంచి ఫొటోలను సెలక్ట్‌ చేసుకొని వాటిని ఒకే రకమైన ఫ్రేమ్స్‌లో పెట్టి గోడకు తగిలించండి. ఓ గ్రిడ్‌ ఆకారంలోనో, వరుసగానో.. మీకు నచ్చినట్లుగా డిజైన్‌ చేయండి. ఆ గోడకే కాదు.. మీ ఇంటికే కొత్త అందం వస్తుంది. ఫొటోలే కాదు.. చీప్‌గా దొరికే వెదురు వస్తువులను కూడా ఇంటిని ముస్తాబు చేసుకోవడానికి విరివిగా వాడుకోవచ్చు. వెదురు కుర్చీలు, వెదురు బుట్టలు ఇంటికి మంచి లుక్‌ని తీసుకొస్తాయి. అంతెందుకు మీ ఇంట్లో రంగు రంగుల ప్లేట్స్‌ ఉన్నా చాలు.. ఫొటో ఫ్రేమ్స్‌లాగా వాటినీ గోడలకు వేలాడదీస్తే ఆ లుక్కే వేరు. మీరే ఇంటీరియర్ డిజైనర్లుగా మారిపోతారు.

ఎనీడెస్క్ యాప్ మీ ఫోన్‌లో ఉందా.. జాగ్రత్త!

0

స్మార్ట్‌ ప్రపంచంలో ప్రతీ దానికి ఓ యాప్‌ ఉంటోంది. నిత్య జీవితంలోని మన పనుల్ని సులువు చేయడానికి ఈ యాప్స్‌ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. హెల్త్‌, ఎంటర్‌టైన్‌మెంట్, బిజినెస్‌, సోషల్‌.. ఇలా ప్రతి దాంట్లోనూ ఎన్నో యాప్స్‌ వస్తున్నాయి. ఆండ్రాయిడ్‌ డివైస్‌లలో అయితే ఈ యాప్స్‌కు కొదవే లేదు. ప్లే స్టోర్‌ ఓపెన్‌ చేస్తే లక్షల కొద్దీ యాప్స్‌, గేమ్స్‌ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇందులో మేలు చేసేవి ఎన్ని ఉన్నాయో కీడు చేసేవి అంతకన్నా ఎక్కువే ఉన్నాయి.

చాలా వరకు యాప్స్‌తో వైరస్‌ ముప్పు పొంచి ఉంటుంది. ఇలాగే మన ఆర్థిక లావాదేవీలను సులభతరం చేయడానికి కూడా ఎన్నో యాప్స్‌ మనకు అందుబాటులో ఉన్నాయి. దాదాపు ప్రతి బ్యాంకూ ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించి కస్టమర్లకు సేవలు అందిస్తున్నాయి. ఆయా బ్యాంక్స్‌ యాప్స్‌ వాడటం వల్ల ఎలాంటి ముప్పు లేదు. కానీ వీటి నుంచి డబ్బు దొంగిలించేందుకు ఆస్కారం ఉన్న యాప్స్‌తోనే ముప్పు పొంచి ఉంది. అలాంటివే రెండు యాప్స్‌ ఇప్పుడు భయపెడుతున్నాయి.

సాక్షాత్తూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా ఈ యాప్స్‌తో జాగ్రత్త అంటూ హెచ్చరికలు జారీ 
చేసింది. ఆర్బీఐతోపాటు ప్రముఖ బ్యాంకులైన హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ కూడా తమ కస్టమర్లకు ఇప్పటికే వార్నింగ్‌ ఇచ్చాయి. ఈ యాప్‌ గురించి పూర్తిగా తెలసుకోకుండా వాడారో మీ అకౌంట్‌లోని డబ్బు మాయమవుతుందని చెబుతున్నాయి. 

అసలేంటీ యాప్‌

ఈ యాప్‌ పేరు ఎనీడెస్క్‌ (AnyDesk). చాలా మంది ఈ యాప్‌ గురించి వినే ఉంటారు. కొంత మంది ఇప్పటికీ వాడుతూనే ఉండొచ్చు. కానీ ఈ యాప్‌ ద్వారా కొందరు వ్యక్తులు మీ డబ్బు దొంగిలిస్తున్నారన్న విషయం ఎంతమందికి తెలుసు? ఆర్బీఐ వార్నింగ్‌ ఇచ్చింది కూడా ఈ యాప్‌ గురించే. ఈ యాప్‌ను ఉపయోగించి యూపీఐ ద్వారా మీ డబ్బును దొంగిలిస్తున్నారు కొందరు మోసగాళ్లు. నిజానికి ఈ యాప్‌ డేంజర్‌ కాదు. దీనిని ఎంతోమంది ఐటీ ప్రొఫెషనల్స్‌ వాడుతున్నారు.

ఇదొక రిమోట్ కంట్రోల్ అప్లికేషన్. ఈ యాప్‌ ద్వారా ఎక్కడెక్కడో ఉన్న కంప్యూటర్లు, మొబైల్స్‌ను కనెక్ట్‌ చేయొచ్చు. అంటే ఇదొక స్క్రీన్‌ షేరింగ్‌ ప్లాట్‌ఫామ్‌. ఈ ఎనీ డెస్క్‌లాగే టీమ్‌వ్యూయర్‌ క్విక్‌సపోర్ట్‌ అనే యాప్‌ కూడా ఉంది. ఈ రెండు యాప్స్‌ ద్వారా స్క్రీన్‌ షేరింగ్‌ చేసుకోవచ్చు అని చాలా మందికి తెలుసు. 

మోసగాళ్ల వల

కానీ.. కొందరు మోసగాళ్లు ఈ యాప్‌ ద్వారానే ఆన్‌లైన్‌లో డబ్బు దొంగిలిస్తున్నారన్న విషయం తెలియదు. అసలు మోసం ఎలా జరుగుతుందంటే.. సాధారణంగా రెండు విధాలుగా ఈ మోసం జరుగుతుంది. ఒకటి ఎవరైనా వ్యక్తి తాను కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌ అంటూ మీకు ఫోన్‌ చేయడం ద్వారా.. రెండోది బాధితుడే కస్టమర్‌ కేర్‌కు కాల్‌ చేసి తన సమస్య పరిష్కరించాలని అడిగిన సందర్భంలో ఈ మోసం జరిగే అవకాశం ఉంటుంది.

సదరు వ్యక్తి ఫోన్‌ చేసి మీ ఫోన్‌లో ఎనీడెస్క్‌ లేదా టీమ్‌వ్యూయర్‌ క్విక్‌సపోర్ట్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అడుగుతాడు. ఈ రెండింట్లో ఏదైనా యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత 9 అంకెల కోడ్‌ జనరేట్‌ అవుతుంది. అవతలి వ్యక్తి మీ అకౌంట్‌లో ఉన్న డబ్బు దొంగిలించడానికి ఈ కోడే సాయపడుతుంది.

యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత ఈ 9 అంకెల కోడ్‌ చెప్పాల్సిందిగా అడుగుతారు. ఈ కోడ్‌ చెప్పి, యాప్‌ పర్మిషన్స్‌కు అనుమతి ఇవ్వగానే మీ స్క్రీన్‌ అవతలి వ్యక్తికి కనిపిస్తుంది. మీ స్క్రీన్‌ను ఎప్పటికప్పుడు చూడటమే కాదు.. డేటాను రికార్డు చేసుకునే అవకాశం కూడా సదరు వ్యక్తికి దక్కుతుంది. 

మీరు ఏం చేసినా తెలిసిపోతుంది

ఇక అప్పటి నుంచి మీరు మీ డివైస్‌లో ఏ పని చేసినా.. ఆ వ్యక్తి చూడగలుగుతాడు. మీ మొబైల్‌లో ఉన్న బ్యాంకింగ్‌ యాప్‌ లేదా యూపీఐలో మీ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ టైప్‌ చేసినా కూడా ఆ వ్యక్తికి కనిపిస్తుంది. మీ అకౌంట్‌లోని డబ్బును దొంగిలించడానికి ఇంత కంటే ఇంకేం కావాలి? ఫోన్‌ లాక్‌ చేసి ఉన్న సమయంలో కూడా ఈ ఎనీడెస్క్‌, టీమ్‌వ్యూయర్‌ క్విక్‌సపోర్ట్‌ యాప్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో పని చేస్తూనే ఉంటాయి. ఆ లెక్కన మీ మొబైల్‌లోని డేటా మొత్తం ఎప్పటికప్పుడు అవతలి వ్యక్తి చేరిపోతూనే ఉంటుంది. 

ఆండ్రాయిడ్‌ డివైస్‌లకే డేంజర్‌ ఎక్కువ

సెక్యూరిటీ పరంగా చూస్తే ఆండ్రాయిడ్‌ కంటే ఐఓఎస్‌ అన్ని విధాలుగా బెస్ట్‌ అనడంలో ఎలాంటి డౌట్‌ లేదు. ఆండ్రాయిడ్‌ డివైస్‌లో ఎలాంటి పరిమితులు లేకుండా ఎలాంటి యాప్‌నైనా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అన్నింటికీ యాక్సెస్‌ ఈజీగా లభిస్తుంది. యాప్‌ పర్మిషన్స్‌కు ఓకే చెప్పారంటే చాలు.. ఎనీడెస్క్‌ యాప్‌ ద్వారా మోసగాళ్లు మీ ఆండ్రాయిడ్‌ డివైస్‌లోని డేటానంతా చోరీ చేసేస్తారు. వాళ్లు మీ డేటా దొంగిలిస్తున్న విషయం కూడా మీకు తెలియదు. అదే ఐఫోన్‌ విషయానికి వస్తే ఐఓఎస్‌ నుంచి పీసీకి క్యాస్ట్‌ చేసే అవకాశం ఎనీడెస్క్‌కు ఉండదు. అందువల్ల ఆండ్రాయిడ్‌ ఫోన్లతో పోలిస్తే ఈ యాప్‌ ద్వారా ఐఫోన్‌ యూజర్లకు కాస్త ముప్పు తక్కువనే చెప్పాలి. 

తెలియకపోతే వదిలేయండి

ఎనీడెస్క్‌ అనే కాదు.. ఏ రిమోట్‌ డెస్క్‌టాప్‌ యాప్స్‌ గురించైనా పూర్తిగా తెలియకపోతే డౌన్‌లోడ్‌ చేయకపోవడమే మేలు. సాధారణ మొబైల్‌ ఫోన్‌ యూజర్లకు టెక్‌ ఎక్స్‌పర్ట్స్‌ ఇచ్చే సలహా కూడా ఇదే. ఈ యాప్స్‌ ఎలా పని చేస్తాయో ముందు తెలుసుకోండి. ఇక కస్టమర్‌ కేర్‌ నుంచి కాల్‌ చేస్తున్నామని చెబుతూ.. ఏదైనా యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోమని అడిగితే వెంటనే నో చెప్పేయండి. సాధారణంగా ఏ కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌ యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోమని గానీ, పాస్‌వర్డ్స్‌, కోడ్స్‌ చెప్పమనిగానీ అడగరు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, యూపీఐ యాప్స్‌ ద్వారానే ఇలాంటి మోసాలు జరుగుతుంటాయి. ఎనీడెస్క్‌లాంటి యాప్స్‌ ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు తమ రహస్య సమాచారాన్ని చూస్తున్నారన్న విషయం కూడా కస్టమర్లకు తెలియదు. 

Top web series to watch: వెబ్‌ సిరీస్‌లో తప్పక చూడాల్సినవేవి?

top web series to watch: వెబ్‌ సిరీస్‌.. మన ఇండియన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిస్ట్‌లో కొత్తగా వచ్చి చేరిన పదమిది. రెండు, మూడు దశాబ్దాలుగా వెస్టర్న్‌ కంట్రీస్‌లో ఈ వెబ్‌ సిరీస్‌లు పాపులరైనా.. మనకు మాత్రం కొన్నేళ్ల ముందు నుంచే తెలుసు. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌, హాట్ స్టార్, జీ 5 వంటివి మన తలుపు తట్టిన తర్వాత వెబ్‌ సిరీస్‌లు మన జీవితంలో ఓ భాగమయ్యాయి. ఇవి కూడా టీవీల్లో వచ్చే సీరియల్స్‌లాంటివే. కాకపోతే వెబ్‌లో వస్తాయి కాబట్టి వీటికి వెబ్‌ సిరీస్‌ అని పేరు. ఒక్కో సీజన్‌లో కొన్ని ఎపిసోడ్స్‌తో ఈ వెబ్‌ సిరీస్‌ వస్తుంటాయి. కొంతకాలంగా హిందీలోనూ వెబ్‌ సిరీస్‌లు వస్తున్నా.. ఇంగ్లిష్‌ వెబ్‌ సిరీస్‌ల ముందు ఇవి దిగదుడుపే.

ఒక్కో వెబ్‌ సిరీస్‌.. హాలీవుడ్‌ మూవీకి ఏమాత్రం తీసిపోదు. నెట్‌ఫ్లిక్స్‌లాంటి సంస్థలు భారీ బడ్జెట్‌తో వీటిని రూపొందిస్తున్నాయి. 1990ల్లో ఈ వెబ్‌ సిరీస్‌ మొదలైనా.. 2000వ దశకంలో బాగా పాపులర్‌ అయ్యాయి. ఓ పదేళ్లుగా మన దేశంలోనూ అభిమానులను సంపాదించుకున్నాయి. ఈ వెబ్‌ సిరీస్‌లను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లిష్‌లో ఇప్పటి వరకు వచ్చిన ఆల్‌టైమ్‌ బెస్ట్‌ వెబ్‌ సిరీస్‌లు ఏవో ఒకసారి చూద్దాం. ఇప్పటి వరకు మీరు వీటిని చూడకపోతే వెంటనే చూసేయండి. 

గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ (Game of thrones web series)

ఇంగ్లిష్‌లో వచ్చిన ఆల్‌టైమ్‌ బెస్ట్‌ సిరీస్‌ (all time best web series) లో ఈ గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ ముందు వరుసలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. హెచ్‌బీవో చానెల్‌ ఈ సిరీస్‌ను నిర్మించింది. 2011, ఏప్రిల్‌ 17న మొదలైన ఈ సిరీస్‌ 2019 మే 19తో ముగిసింది. మొత్తం 8 సీజన్లలో 73 ఎపిసోడ్ల పాటు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. వెస్ట్‌రోస్‌, ఎసోస్‌ అనే రెండు కాల్పనిక ఖండాల్లోని రాజ్యాల మధ్య సింహాసనం కోసం జరిగే పోరాటమే ఈ గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌. సింహాసనం కోసం రాజవంశీకుల మధ్య పోరు, వాటి నుంచి స్వాతంత్ర్యం పొందడానికి సామంతులు చేసే పోరాటమే ఈ గేమ్‌ ఆఫ్ థ్రోన్స్‌ కథాంశం. హెచ్‌బీవో గో, 
అమెజాన్‌ ప్రైమ్‌లలో ఈ గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ వెబ్‌ సిరీస్‌ చూడొచ్చు. హాలీవుడ్‌ స్థాయి గ్రాఫిక్స్‌, కాస్టూమ్స్‌తో ఈ వెబ్‌ సిరీస్‌ మిమ్మల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా, టీవీ ప్రేక్షకులు విశ్వసించే ఐఎండీబీ ఈ వెబ్‌ సిరీస్‌కు 9.5 రేటింగ్‌ ఇవ్వడం విశేషం.

ఫ్రెండ్స్‌ (friends web series)

ఆరుగురు ఫ్రెండ్స్‌ జీవితాల చుట్టూ తిరిగే కథాంశంతో వచ్చిన ఈ వెబ్‌ సిరీస్‌ చాలా పాపులరైంది. 1994 నుంచి 2004 మధ్య పది సీజన్లపాటు యూత్‌ను ఎంతగానో ఆకర్షించిందీ వెబ్‌ సిరీస్‌. నిజమైన స్నేహం అంటే ఏంటో చాటి చెప్పేలా ఈ సిరీస్‌ను రూపొందించారు. న్యూయార్క్‌ సిటీలోని మాన్‌హటన్‌లో నివసించే ఈ ఆరుగురు స్నేహితుల కుటుంబాల్లోని కష్టాలు, వాళ్ల మధ్య జరిగే ప్రేమాయణాలు, కొట్లాటలు, కన్నీళ్లు, సరదాలన్నింటినీ మేళవించి యువతను ఆకర్షించేలా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ఈ వెబ్‌ సిరీస్‌కు ఐఎండీబీ 8.9 రేటింగ్‌ ఇచ్చింది. ఎప్పుడో 25 ఏళ్ల కిందట మొదలై 15 ఏళ్ల కిందటే ముగిసిన ఈ ఫ్రెండ్స్‌ వెబ్‌ సిరీస్‌కు ఇప్పటికీ మంచి డిమాండ్‌ ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వెబ్‌ సిరీస్‌ చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్, ఐట్యూన్స్‌లోనూ ఈ సిరీస్‌ ఎపిసోడ్స్‌ను కొనుగోలు చేయొచ్చు. 

బ్రేకింగ్‌ బ్యాడ్‌ (breaking bad web series)

క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ సాధారణ కెమెస్ట్రీ టీచర్‌ ఓ డ్రగ్‌ స్మగ్లర్‌గా ఎలా మారాడన్న కథాంశంతో ఈ వెబ్‌ సిరీస్‌ రూపొందింది. 2008 నుంచి 2013 మధ్య ఐదు సీజన్లు, 62 ఎపిసోడ్లపాటు ఈ క్రైమ్‌ డ్రామా సాగింది. కుటుంబాన్ని పోషించడానికి స్కూల్‌ టీచర్‌ ఉద్యోగం చేసే వాల్టర్‌ వైట్‌ అనే వ్యక్తి తన మాజీ విద్యార్థి జెస్సీ పింక్‌మాన్‌తో కలిసి మేథమ్‌ఫిటమైన్‌ అనే డ్రగ్‌ తయారు చేస్తాడు. ఓ సాదాసీదా స్కూల్‌ టీచర్‌ డ్రగ్స్‌ సామ్రాజ్యంలో రారాజుగా ఎలా మారాడన్న కథాంశాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఐఎండీబీలో 9.5 రేటింగ్‌ పొందిన ఈ బ్రేకింగ్‌ బ్యాడ్‌ వెబ్‌ సిరీస్‌ ప్రతి ఎపిసోడ్‌ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. 

13 రీజన్స్‌ వై (13 reasons why web series)

17 ఏళ్ల ఓ టీనేజర్‌ ఆత్మహత్య, ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలుసుకోవడానికి ఆమె స్నేహితుడు చేసే ప్రయత్నం చుట్టూ తిరిగే కథాంశంతో ఈ 13 రీజన్స్‌ వై వెబ్‌ సిరీస్‌ తెరకెక్కింది. 2007లో ఇదే పేరుతో వచ్చిన నవల ఆధారంగా నెట్‌ఫ్లిక్స్‌ కోసం ఈ సిరీస్‌ను చిత్రీకరించారు. క్లే జెన్సన్‌ అనే 
17 ఏళ్ల యువకుడు, ఆత్మహత్య చేసుకున్న అతని ఫ్రెండ్‌ హన్నా బేకర్‌ చుట్టూ కథ తిరుగుతుంది. తనపై జరిగిన లైంగిక దాడి, పుకార్లను తట్టుకోలేక బేకర్‌ ఆత్మహత్య చేసుకుంటుంది. అయితే తాను ఆత్మహత్య చేసుకునే కొన్ని వారాల ముందు నుంచి తాను ఎందుకు చనిపోబోతున్నానో చెబుతూ కొన్ని టేప్స్‌ను రికార్డు చేసి పెడుతుంది. తాను చనిపోవడానికి 13 కారణాలు ఉన్నాయని అందులో హన్నా చెబుతుంది. 2017, మార్చి నుంచి ఈ వెబ్‌ సిరీస్‌ టెలికాస్ట్‌ అవుతోంది. ఇప్పటికే రెండు సీజన్లలో 26 ఎపిసోడ్లు పూర్తయ్యాయి. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్‌ను చూడొచ్చు. 

నార్కోస్‌ (narcos web series)

కొకైన్‌ తయారీ, అక్రమ రవాణాతో కోట్లు కొల్లగొట్టి బిలియనీర్‌గా మారిపోయిన డ్రగ్‌ కింగ్‌పిన్‌ పాబ్లో ఎస్కోబార్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన వెబ్‌ సిరీస్‌ ఇది. ఈ అమెరికన్‌ క్రైమ్‌ డ్రామాను కొలంబియాలో చిత్రీకరించారు. మొత్తం మూడు సీజన్లు, 30 ఎపిసోడ్ల పాటు ఈ వెబ్‌ సిరీస్‌ సాగింది. 2015, 2016, 2017లలో మూడు సీజన్లను నెట్‌ఫ్లిక్స్‌ టెలికాస్ట్‌ చేసింది. 1970లలో తొలిసారి ఎస్కోబార్‌ కొకైన్‌ తయారు చేసినప్పటి నుంచీ ఈ సిరీస్‌ మొదలవుతుంది. తొలి రెండు సీజన్లు అతని జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపించగా.. మూడో సీజన్‌లో అతని మరణం తర్వాత గిల్బెర్టో రోడ్రిగెజ్‌ కొకైన్‌ సామ్రాజ్యాన్ని విస్తరించిన తీరు, వాళ్లకు అడ్డుకట్ట వేయడానికి డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అడ్మినిస్ట్రేషన్‌ వేసిన ఎత్తుగడలతో కథ నడుస్తుంది. ఐఎండీబీ 8.8 రేటింగ్‌ ఇచ్చిన ఈ నార్కోస్‌ వెబ్‌ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు. 

మరికొన్ని పాపులర్ వెబ్ సిరీస్ (Popular web series)

ఇవే కాకుండా ఆజీ, సిక్స్‌ ఫీట్‌ అండర్‌, షెర్లాక్‌, ద వైర్‌, ద బిగ్‌ బ్యాంగ్‌ థియరీ, సూట్స్‌, ద వాకింగ్‌ డెడ్‌లాంటి పాపులర్‌ ఇంగ్లిష్‌ వెబ్‌ సిరీస్‌లను కూడా మిస్‌ కావద్దు. ఇక హిందీలోనూ ఈ మధ్య అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌లలో కొన్ని వెబ్‌ సిరీస్‌లు వచ్చాయి. వాటిలో సేక్రెడ్‌ గేమ్స్‌, మీర్జాపూర్‌, బ్యాంగ్‌ బాజా 
బారాత్‌, క్రిమినల్‌ జస్టిస్‌, ది ఆమ్‌ ఆద్మీ ఫ్యామిలీ, గర్ల్స్‌ హాస్టల్‌, ఇమ్మెచ్చూర్‌, మేడ్ ఇన్ హెవెన్, ఫోర్ మోర్ షాట్స్ లాంటి వెబ్‌ సిరీస్‌లు బాగా పాపులర్‌ అయ్యాయి. 

Healthy Habits: ఈ ఆరు ఆరోగ్య సూత్రాలతో కొత్త శక్తి

0

Healthy Habits: మనం అత్యంత అశ్రద్ధ చేసేది మన ఆరోగ్యమే. పోటీ ప్రపంచంలో మన జీవితాలు ఎలా మారిపోయాయంటే.. మన బతుకు మరెవరి కోసమో బతుకుతున్నట్లుగా కష్టంగా, భారంగా రోజులు వెల్లదీస్తున్నాం. రాబోయే తరాలకు మూటలు కట్టి పెట్టే పనిలో పడి మన గురించి మనం మరచిపోతున్నాం.

మన బిజీ షెడ్యూల్‌పై వాట్సాప్‌లలో వచ్చే జోకులను చూస్తూ భారంగా ఓ నవ్వు నవ్వేసి.. అంతేగా అనుకుంటూ మళ్లీ మన పనిలో పడిపోతున్నాం. రోజంతా తీరిక లేకుండా గడిపేసి.. ఆ పని భారం నుంచి రిలాక్స్‌ కావడానికంటూ టీలు, కాఫీలు, మందు, సిగరెట్‌ లాంటి ఆరోగ్యాన్ని దెబ్బతీసే వాటికి అలవాటు పడిపోతున్నాం.

గడియారంతో పోటీ పడుతూ బాగానే సంపాదిస్తున్నారు సరే.. కానీ వందేళ్ల జీవితానికి సరిపడే శక్తిని ముప్పై, నలభై ఏళ్లకే ఖర్చు పెట్టేస్తున్నామన్న సంగతి గుర్తిస్తున్నారా? మూడు పదుల వయసులోనే గుండెకు మూడు స్టెంట్లు వేసుకుంటున్న మన స్నేహితులు, బంధువులను చూసైనా మీరు మారుతున్నారా?

అసలు మీ బిజీ షెడ్యూల్‌లో కనీసం ఐదు నిమిషాలైనా మీ ఆరోగ్యం ఎలా ఉందో చూసుకోవడానికి కేటాయిస్తున్నారా? డబ్బుదేముంది బాస్‌.. పోతే మళ్లీ వస్తుంది.. కానీ ఉన్నది ఒకటే జిందగీ.. కాస్త మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టండి..

అలాగని మీ పనులన్నీ మానుకొని కూర్చోవాల్సిన పని లేదు. ప్రతి రోజు ఈ సింపుల్‌ హెల్త్‌ టిప్స్‌ పాటించి చూడండి.. కచ్చితంగా మీ జీవితంలో ఊహించలేని మార్పులు వస్తాయి.

10 Glasse water per day: ఆరోగ్యానికి 10 గ్లాసుల నీళ్లు

మీరు కూడా ఎన్నోసార్లు వినే ఉంటారు.. రోజూ ఎన్ని నీళ్లు తాగితే అంత మంచిది అని. కానీ దానిని సరిగ్గా పాటిస్తున్న వాళ్లు ఎంతమంది. మంచి నీళ్లు తాగినంత ఈజీగా మీ మీ రోజువారీ పనులు చేసుకుంటారేమోగానీ.. అసలు సమయానికి ఆ నీళ్లు తాగాలన్న విషయాన్ని మరచిపోతారు.

పైగా దాహాన్ని తీర్చుకోవడానికి చాలా మంది కాఫీలు, టీలు, సాఫ్ట్‌ డ్రింక్స్‌, సోడాలపై ఆధారపడతారు. ఇవి సమస్యను పెంచేవే తప్ప తగ్గించేవి కావు అని గుర్తు పెట్టుకోండి. రోజుకు కనీసం 10 గ్లాసుల నీళ్లు తాగి చూడండి.. కొన్ని రోజుల్లోనే మీ బాడీలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది.

నీళ్లను ఎప్పుడూ అందుబాటులో ఉంచుకుంటూ.. ప్రతి రోజు దీనిని ఓ అలవాటుగా మార్చుకోండి. బయటికెళ్లినా, ఆఫీసులో ఉన్నా.. ఓ వాటర్‌ బాటిల్‌ దగ్గరే పెట్టుకుంటే సగం పని పూర్తయినట్లే.

పోనీ మీరు పనిలో పడితే అన్నీ మరచిపోతారనుకుంటే.. నీళ్లు ఎప్పుడెప్పుడు తాగాలో గుర్తు చేయడానికి చాలా యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. మీ స్మార్ట్‌ ఫోన్‌లో వాటిని ఇన్‌స్టాల్‌ చేసుకోండి. ఆక్వాఅలెర్ట్‌, మై వాటర్‌ బ్యాలెన్స్‌, డ్రింక్‌ వాటర్‌ రిమైండర్‌లాంటివి ట్రై చేయొచ్చు. 

Brushing: బ్రషింగ్‌ లో నిర్లక్ష్యం వద్దు

పళ్లు తోమడాన్ని చాలా మంది ఓ తప్పని  పనిగా చూస్తుంటారు తప్ప.. ఆ పని సరిగా చేయగలిగితే చాలు మీ ఆరోగ్యానికి సంబంధించి సగం పని పూర్తయినట్లే అన్న విషయం చాలా మందికి తెలియదు. రోజుకు రెండుసార్లు బ్రష్‌ చేయండి. ఒకసారి పళ్ల సందులను క్లీన్‌ చేసుకోండి. మీ నోరు శుభ్రంగా ఉంటే మీ ఆరోగ్యం బాగున్నట్లే. ప్రతి రోజూ రెండు పూటలా ఒక టైమ్‌ కేటాయించుకొని బ్రష్‌ చేయడం మరచిపోకండి. మంచిగా బ్రష్‌ చేసుకోవడానికి మూడు నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు.

Exercises: ఇష్టమైన వ్యాయామమే చేయండి

ప్రతి రోజూ కనీసం అర గంట వ్యాయామమైనా చేయాలని డాక్టర్లు చెబుతుంటారు. కానీ చాలా మంది ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. చేసే వాళ్లు కూడా ఏదో బలవంతంగా చేస్తుంటారు తప్ప ఇష్టంగా చేయరు. అందుకే ఆ అరగంట కూడా మీకు ఇష్టమైన వ్యాయామమే చేయండి. మీకు రన్నింగ్‌ అంటే
ఇష్టమా.. అయితే ఉదయాన్ని కాసేపు పరుగెత్తండి. బయటకు వెళ్లలేకపోతే ట్రెడ్‌మిల్‌ పైనా చేసేయొచ్చు. స్విమ్మింగ్‌ ఇష్టమైతే.. ఎన్నో ఇండోర్‌, ఔట్‌డోర్‌ సెంటర్లు ఉన్నాయి. యోగా, మార్షల్‌ ఆర్ట్స్.. ఇలా ఏది కుదిరితే అది, మీకు ఏది నచ్చితే అది చేయండి. నచ్చినవాటిని ఇష్టంగా చేస్తాం కదా. ఏదైనా మన
ఆరోగ్యానికి మేలు చేసేదే.

Good sleep: నిద్ర లేకపోతే అంతే సంగతులు

స్మార్ట్‌ ఫోన్లు, యాప్స్‌ మన జీవితానికి ఎంతగా పనికొస్తున్నాయో అంత కీడు కూడా చేస్తున్నాయి. వాటి మోజులో పడి సరిగా తిండి, నిద్ర కూడా లేకుండా పోతోంది. ఓ మనిషికి కనీసం 8 గంటల నిద్ర చాలా అవసరం. కానీ ఈ గాడ్జెట్స్‌ కారణంగా చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. వాటిని చూస్తూ
నిద్రపోవడం మరచిపోతున్నారు. ప్రతి రోజు ఒకే సమయానికి పడుకోవడం అనేది ఓ అలవాటుగా మార్చుకోండి. తద్వారా శరీరంలో ఎన్నో సానుకూల మార్పులు వస్తాయన్న విషయం చాలా మందికి తెలియదు.

రోజూ 8 గంటలు పడుకునేంత సమయం దొరకడం లేదంటే కుదరదు. రాత్రి పూట కాస్త తొందరగా, ఒకే సమయానికి పడుకోవడం అలవాటు చేసుకుంటే ఇది సాధ్యమే. అయితే పడుకునే గంట ముందే మీ ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌ను పక్కన పెట్టడం కూడా మరచిపోవద్దు. నిద్ర పోవాలనుకుంటున్న సమయానికి కనీసం 15 నిమిషాల ముందు అలారమ్‌ పెట్టుకుంటే మంచిది.

Don’t fill the stomach: కడుపు నింపుకోవడానికి తినకండి

కడుపులో ఎలుకలు పరుగెడుతున్నాయంటే అందులో ఏదో ఒకటి వేసేసి దానిని శాంతింపజేయాలని మనలో చాలా మంది చూస్తుంటారు. తినడం అంటే కడుపు నింపుకోవడం కోసమే అన్నట్లుగా మన ఆహార అలవాట్లు మారిపోయాయి.

వీటి వల్లే అజీర్తి, బరువు పెరగడం, అలసట వంటి సమస్యలు వస్తున్నాయి. ఆకలి వేసినప్పుడు ఏది కనిపిస్తే అది తినేసి తర్వాత అనారోగ్య సమస్యలతో బాధపడటం కంటే మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అన్ని విధాలా మేలు చేస్తుంది.

సూపర్‌ మార్కెట్‌కు వెళ్లగానే ఆకర్షణీయంగా కనిపించే ప్యాకెట్లన్నీ తీసి మన కార్ట్‌లో పడేస్తుంటాం. సాధారణంగా ఆరోగ్యానికి చేటు చేసే ఇలాంటి వస్తువులే స్టోర్‌ మధ్యలో అందరికీ కనిపించేలా ఉంటాయి. కానీ ఆరోగ్యాన్నిచ్చే పండ్లు, కూరగాయలు స్టోర్‌ చివర్లో ఉంటాయి.

కళ్లను ఆకర్షించే వాటి జోలికి వెళ్లకుండా కాస్త ఆరోగ్యాన్ని కాపాడే వాటి దగ్గరికి వెళ్లి కొనండి. డబ్బులూ మిగులుతాయి.. ఆరోగ్యమూ బాగుంటుంది.

Self care: మీకు మీరు టైమ్‌ కేటాయించుకుంటున్నారా?

అసలు నాకు అంత టైమ్‌ ఎక్కడుంది.. అన్న మాట తరచూ అందరి నోటి నుంచీ వింటూనే ఉంటాం. టైమ్‌ ఎవరికైనా రోజులో 24 గంటలే ఉంటుంది. దానిని మనం ఎలా  ఉపయోగించుకుంటున్నామన్నదే పాయింట్‌ ఇక్కడ. బిజీ షెడ్యూల్‌లో మనకు మనం టైమ్‌ కేటాయించుకోలేకపోతున్నాం.

ప్రతి రోజూ మనకు ఇష్టమైన పని చేయడానికి కాస్తయినా టైమ్‌ కేటాయించడం చాలా ముఖ్యం. మనకు మనం టైమ్‌ కేటాయించుకోవడం అంటే వ్యక్తిగా మనల్ని మనం మెరుగుపరచుకుంటున్నట్లే.

బుక్స్‌ చదవడం, మ్యూజిక్‌ వినడం, సినిమాలు చూడటం, పార్క్‌లో నడవడం.. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో పని అంటే ఇష్టం. ప్రతి రోజూ వాటికి కాస్త టైమ్‌ కేటాయించగలిగితే.. అది మీ మానసిక, శారీరక ఆరోగ్యానికి దోహదపడుతుంది.

ఇవన్నీ మీకు చాలా చిన్న చిన్న పనులుగానే కనిపిస్తుండొచ్చు కానీ.. ఇవే మీ జీవితంలో పెద్ద మార్పులకు దారి తీస్తాయని గ్రహించండి. ఆరోగ్యంగా ఉండండి.

మంచి తల్లిదండ్రులుగా ఉండేందుకు మార్గాలు

0

మంచి తల్లిదండ్రులు గా మనం ఉంటున్నామా? పిల్లలను పెంచడం అన్నది ఓ కళ. మంచి సంస్కారం, క్రమశిక్షణతో మీ పిల్లల్ని పెంచుతున్నారంటే.. సమాజానికి గొప్ప సేవ చేస్తున్నట్లే లెక్క. అయితే కాలంతో పోటీ పడుతున్న ఈ సమయంలో పిల్లలకు తగినంత సమయం కేటాయించలేకపోతున్నారు చాలా మంది తల్లిదండ్రులు. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో మనుగడ సాగించాలంటే భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ కారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలతో గడపడానికి తగినంత సమయం కేటాయించలేకపోతున్నారు. లక్షల కొద్దీ ఫీజులు కట్టి పెద్ద పెద్ద కార్పొరేట్‌ స్కూళ్లలో చదివిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప తమ పిల్లలతో తగినంత సమయం గడపకపోవడం వల్ల వాళ్లకెంత చేటు చేస్తున్నారో మాత్రం గుర్తించడం లేదు. మరి మీరు మీ పిల్లలను ఎలా పెంచుతున్నారు? అసలు మంచి తల్లిదండ్రులు కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చెప్పబోయే సూచనలు పాటించడం అంత సులువు కాదు.. వందకు వంద శాతం అమలు చేయడం కూడా సాధ్యం కాకపోవచ్చు. కానీ ఎప్పటికప్పుడు మీరు వాటిపై తగినంత దృష్టి సారిస్తే మీరు సరైన దిశలో వెళ్తున్నట్లే. మంచి తల్లిదండ్రులుగా ఉండాలంటే ఏం చేయాలో డియర్ అర్బన్ అందిస్తున్న కథనం ఇదీ..

మీరే రోల్‌ మోడల్

మీకు తెలుసా.. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే శిశువు నేర్చుకోవడం మొదలుపెడుతుందని. అందుకే ఓ మనిషి జీవితంలోని తొలి వెయ్యి రోజులే అతని భవిష్యత్‌ను నిర్దేశిస్తాయని తరచూ డాక్టర్లు చెబుతుంటారు. ఈ వెయ్యి రోజులే చాలా కీలకం. అంటే తల్లి గర్భం నుంచి మొదలై శిశువు జన్మించిన తర్వాత తొలి రెండేళ్లు గడిచే వరకు మనం వాళ్లతో ఎలా ఉంటాం.. ఏం మాట్లాడతాం.. ఏం తినిపిస్తాం అన్నదానిపైనే వాళ్ల ఉజ్వల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. చాలా మంది తమ పిల్లలకు ఎలా ఉండాలి.. ఏం చేయాలి అని పదే పదే చెబుతుంటారు. కానీ పిల్లలకు చెప్పడం కంటే చేసి చూపించడం అన్నదే ముఖ్యమన్న సంగతి పట్టించుకోరు. పిల్లలు ఏం చేసినా తమను చూసే నేర్చుకుంటారన్న సంగతి గుర్తుంచుకోవాలి. అంటే వాళ్లకు పేరెంట్సే తొలి రోల్‌ మోడల్స్‌. ఎదుటి వ్యక్తిని చూసి అనుకరించడం అన్నది మనిషికి సహజంగా వచ్చే లక్షణం. పిల్లలు కూడా తమ తల్లిదండ్రులు చేసే ప్రతి పనిని నిశితంగా గమనిస్తుంటారు. వాళ్లూ అలాగే చేయడానికి ప్రయత్నిస్తారు. మీ పిల్లలు ఇలా ఉండాలి.. ఇలా పెరగాలి.. ఈ లక్ష్యాలను సాధించాలి అని మీరు అనుకున్నట్లయితే ముందు మీరు అలా ఉండాలన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. 

ప్రేమను చూపించండి

తమ పిల్లల్ని ప్రేమించని తల్లిదండ్రులు ఎవరూ ఉండరు. అయితే ఆ ప్రేమను ఎలా వ్యక్తపరుస్తున్నారన్నదే మీ పిల్లల ఎదుగుదలలో కీలకపాత్ర పోషిస్తుంది. ప్రేమిస్తున్నామన్న పేరుతో వాళ్లు ఏం చేసినా భరించడం, అలసత్వం వహించడం, అతి జాగ్రత్తగా పెంచడం, అడిగినవన్నీ కొనివ్వడం చేస్తున్నారంటే మీ చేజేతులా వాళ్ల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నామని గ్రహించండి. వాళ్లను ప్రేమతో హత్తుకోవడం, తగినంత సమయం వాళ్లతో గడపడం, వాళ్లు చెప్పిన విషయాలను శ్రద్ధగా వినడం ద్వారా కూడా వాళ్లపై మీకున్న ప్రేమను వ్యక్తపరచవచ్చన్న విషయం గుర్తుంచుకోండి. ఇలా చేయడం వల్ల వాళ్లలో ఆక్సిటాసిన్‌, ప్రోలాక్టిన్‌లాంటి సానుకూల హార్మోన్లు విడుదలవుతాయి. ఏ కష్టం ఎదురైనా ఎదుర్కొనే ధైర్యాన్ని వాళ్లలో నింపుతాయి.

చేయెత్తారో చేజారిపోతారు

చాలా మంది పేరెంట్స్‌ తమ పిల్లలను క్రమశిక్షణతో పెంచాలని అనుకుంటారు. దీనికోసం కఠినంగా వ్యవహరిస్తుంటారు. కొడితేగానీ వాళ్లు మాట వినరు అన్న ధోరణి కనబరుస్తుంటారు. కానీ దీనివల్ల వాళ్లు చేజారిపోతారన్న విషయాన్ని మాత్రం గ్రహించరు. కొట్టడం వల్ల అప్పటికప్పుడు తమకు కావాల్సిన ఫలితాన్ని పేరెంట్స్‌ రాబడతారేమోగానీ.. అది పిల్లల్లో హింసా ప్రవృత్తిని పెంచుతుందన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. వాళ్లతో కలిసి ఆడండి.. పాడండి.. నవ్వండి.. వాళ్ల బాధల్ని పంచుకోండి.. వాళ్ల సమస్యల్ని సానుకూల వాతావరణంలో పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం ద్వారా ఓ సానుకూల క్రమశిక్షణను వాళ్లకు మీరు నేర్పిన వాళ్లవుతారు. 

నేనున్నానన్న భరోసా ఇవ్వండి

పిల్లలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను ఉన్నాను అన్న భరోసా వాళ్లకు ఇవ్వాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. పిల్లలు ఏదైనా చెప్పడానికి వస్తే విసుక్కోవడం, కసురుకోవడం చేయొద్దు. మీరు ఏ పనిలో ఉన్నా.. ఎంతటి ఒత్తిడిలో ఉన్నా వాళ్లు చెప్పేది ఓపిగ్గా వినండి. పిల్లలతో తరచూ మాట్లాడుతూ ఉండండి. వాళ్ల సమస్యలకు పరిష్కారం చూపించండి. ఇది వాళ్ల మానిసిక పరిపక్వతకు దోహదపడుతుంది. 

మీ ఆరోగ్యం బాగా చూసుకోండి

పిల్లలు పుట్టిన తర్వాత మీ ఆరోగ్యం విషయంలోగానీ, మీ వైవాహిక జీవితంలోగానీ కొన్ని సమస్యలు వస్తుంటాయి. అవి ముదిరితే మీ పిల్లల భవిష్యత్‌ను కూడా ప్రభావితం చేస్తాయన్న విషయం గుర్తుంచుకోండి. మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూనే వైవాహిక జీవితంలో వచ్చే సమస్యలను పరిష్కరించుకోవడం అన్నది చాలా ముఖ్యం. 

పిల్లలకు టార్గెట్లు సరే.. మీ సంగతేంటి?

మా అబ్బాయి లేదా అమ్మాయి స్కూల్‌లో టాపర్‌గా నిలవాలి.. ఆటపాటల్లో రాణించాలి.. స్వతంత్రంగా ఆలోచించగలగాలి.. ఉన్నతంగా జీవించాలి అని అనుకోని పేరెంట్స్‌ ఎవరూ ఉండరు. స్కూల్లో చేర్పించే సమయంలోనే వాళ్లకు కొన్ని లక్ష్యాలను కూడా నిర్దేశిస్తుంటారు చాలా మంది తల్లిదండ్రులు.  కానీ మీ పిల్లలు ఆ లక్ష్యాలను అందుకునే దిశగా మీరు ఎంత సమయం కేటాయిస్తున్నారు? పిల్లల భవిష్యత్తు గురించి ఎంతో గొప్పగా ఊహించుకునే తల్లిదండ్రుల్లో చాలా మంది ఈ రోజు గడిస్తే చాలు అన్నట్లుగానే వ్యవహరిస్తుంటారు. గొప్ప లక్ష్యాలను నిర్దేశించడమే కాదు.. వాటిని చేరుకోవడానికి కావాల్సిన మానసిక స్థైర్యాన్ని కూడా మీ పిల్లలకు మీరే అందించాలి.  విజయానికి పొంగిపోకుండా, ఓటమికి కుంగిపోకుండా చేయాల్సిన బాధ్యత మీదే.

క్రికెట్‌లో స్మార్ట్‌ బాల్‌.. అసలేంటిది?

0

క్రికెట్ లో స్మార్ట్ బాల్ గురించి ఎప్పుడైనా విన్నారా? మన దేశంలో క్రికెట్‌ను ఓ మతంగా భావించే అభిమానులు ఉన్నారు. మన జాతీయ క్రీడ హాకీయే అయినా.. క్రికెట్‌ బ్యాట్‌ ముందు హాకీ స్టిక్‌ దిగదుడుపే. ఎప్పుడైతే 36 ఏళ్ల కిందట హర్యానా హరికేన్‌ కపిల్‌ దేవ్‌ నేతృత్వంలోని టీమిండియా విశ్వ విజేతగా నిలిచిందో అప్పటి నుంచీ మన దేశంలో క్రికెట్‌కు విపరీతమైన క్రేజ్‌ పెరిగిపోయింది. క్రికెట్‌ ప్లేయర్స్‌ను దేవుళ్లుగా భావించి పూజలు చేసే అభిమానులను కూడా చూస్తున్నాం.  

అయితే క్రికెట్‌ను కూడా ఎప్పటికప్పుడు మరింత జనరంజకంగా మార్చేందుకు ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ఎన్నో మార్పులు, చేర్పులు చేస్తూనే వస్తోంది. ఈ మార్పులు యూత్‌ని ఆకర్షించేలా ఉంటున్నాయి. ఒకప్పుడు క్రికెట్‌లో కేవలం తెలుపు రంగు దుస్తులతోనే ప్లేయర్స్‌ బరిలోకి దిగేవాళ్లు. కేవలం పగటి పూట మాత్రమే ఆడేవాళ్లు. కానీ 1992 వరల్డ్‌కప్‌ మొత్తంగా ఓ కొత్త అనుభూతిని అభిమానులకు అందించింది. ఆ వరల్డ్‌కప్‌లో ప్లేయర్స్‌ రంగు రంగుల దుస్తుల్లో కనిపించారు. ఫ్లడ్‌ లైట్ల వెలుతురులో వైట్‌ బాల్‌తో ఆట క్రికెట్‌ ఫ్యాన్స్‌ను కట్టి పడేసింది. ఇక అక్కడి నుంచి క్రికెట్‌ వెనుతిరిగి చూడలేదు.

భారత ఉపఖండంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఖండాల్లో క్రికెట్‌ అభిమానులను సంపాదించుకుంది. రంగుల దుస్తులు, ఆటలో మార్పులే కాదు.. టెక్నాలజీ పరంగానూ క్రికెట్‌ ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూనే ఉంది. తాజాగా స్మార్ట్‌ బాల్‌తో ఆటను మరింత రంజుగా మార్చడానికి సిద్ధమైంది. 

క్రికెట్‌ కేరాఫ్‌ టెక్నాలజీ

మనం ఏ 1992 వరల్డ్‌కప్‌ గురించి మాట్లాడుకుంటున్నామో.. ఆ వరల్డ్‌కప్‌కు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. క్రికెట్‌లో తొలిసారి మూడో అంపైర్‌ ఓ బ్యాట్స్‌మన్‌ను రనౌట్‌గా ప్రకటించాడు. ఫీల్డ్‌లో ప్లేయర్స్‌ ఆడే ఆటను అన్ని యాంగిల్స్‌లో టీవీ ముందు కూర్చున్న ప్రేక్షకులు కూడా అనుభూతి చెందాలన్న ఉద్దేశంతో మైదానం చుట్టూ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా వచ్చిన వీడియోలన్నింటినీ విశ్లేషించి ఓ బ్యాట్స్‌మన్‌ రనౌటయ్యాడా లేదా అని నిర్ణయించే అవకాశం ఫీల్డ్‌ బయట ఉండే థర్డ్‌ అంపైర్‌కు దక్కింది. ఇక అప్పటి నుంచీ ఫీల్డ్‌ అంపైర్లపై ఒత్తిడి తగ్గించే ఎన్నో టెక్నాలజీలు ఒక్కొక్కటిగా క్రికెట్‌ను పలుకరించాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. 

స్కోరుబోర్డు గ్రాఫిక్స్‌

మ్యాచ్‌లో స్కోరు ఎంతైందో గ్రౌండ్‌లో కూర్చున్న ప్రేక్షకుల కంటే ముందుగానే టీవీ ముందు కూర్చున్న ప్రేక్షకుడికి తెలిసిపోతోంది. దీనికి కారణం స్కోరు బోర్డు గ్రాఫిక్స్‌. ఓ టీమ్‌ స్కోరు కార్డుతో మొదలై.. ఏ బ్యాట్స్‌మన్‌ ఎంత స్కోరు చేశాడు. అతడు ఎక్కడెక్కడ బౌండరీలు బాదాడు.. ఏ బౌలర్‌ బంతి ఎక్కడ 
వేశాడు.. ఏ పొజిషన్‌లో ఏ ఫీల్డర్‌ నిల్చున్నాడులాంటి ఎన్నో గ్రాఫిక్స్‌ ఇప్పుడు క్రికెట్‌లో కనిపిస్తున్నాయి. 

స్నీకో మీటర్‌

బంతి బ్యాట్‌కు తగిలిందా లేదా తెలుసుకోవడానికి తీసుకొచ్చిన టెక్నాలజీ ఇది. స్టంప్స్‌ దగ్గర స్నీకో అనే ఓ మైక్రోఫోన్‌ను ఏర్పాటు చేస్తారు. ఇది బంతి ఒక్కో ఉపరితలాన్ని తాకినప్పుడు ఒక్కోలా స్పందిస్తుంది. దీని ద్వారా బంతి బ్యాట్‌కు తగిలిందా లేక ప్యాడ్‌కు తగిలిందా లేదా బ్యాట్‌ గ్రౌండ్‌కు తగిలిందా అన్నది అంపైర్‌ తేల్చుకోగలుగుతాడు. 

హాక్‌ ఐ

క్రికెట్‌లో పెను మార్పులకు కారణమైన టెక్నాలజీ ఇది. ఈ మధ్య డీఆర్‌ఎస్‌లో తరచూ వాడుతున్న టెక్నాలజీ ఇదే. బౌలర్‌ విసిరిన బంతి ఏ దిశలో వెళ్తుందో చూడటానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతోంది. ఓ బ్యాట్స్‌మన్‌ ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడా లేదా అన్నది దీని ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన వివిధ కెమెరాలను విశ్లేషించి బంతి గమనాన్ని ఈ టెక్నాలజీ పసిగడుతుంది. 

హాట్‌స్పాట్‌

బంతి దిశను గుర్తించేందుకే వాడుతున్న మరో టెక్నాలజీ ఇది. ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాలను ఉపయోగించి బ్యాట్స్‌మన్‌కు బంతి ఎక్కడ తగిలిందో గుర్తిస్తారు. బంతి తగిలిన చోట ఓ తెల్లని మచ్చ (హీట్‌ సిగ్నేచర్‌)లా కనిపిస్తుంది. అంపైర్‌ గుర్తించడానికి కష్టంగా ఉండే ఎల్బీడబ్ల్యూలు, క్యాచ్‌ ఔట్లను నిర్ణయించడానికి 
ఈ టెక్నాలజీ వాడుతున్నారు. 

స్టంప్‌ కెమెరా

గ్రౌండ్‌ చుట్టూ ఎన్నో కెమెరాలను ఏర్పాటు చేసినట్లుగానే స్టంప్స్‌లోనూ ఓ చిన్న కెమెరాను ఏర్పాటు చేస్తారు. దీనివల్ల బ్యాట్స్‌మన్‌ లేదా బౌలర్‌ యాంగిల్‌ నుంచి చూసే అవకాశం కూడా టీవీ ప్రేక్షకులకు దక్కుతుంది. పైగా రనౌట్లు, స్టంపౌట్‌ల విషయంలోనూ ఈ కెమెరాలు థర్డ్‌ అంపైర్‌కు సాయపడుతున్నాయి. 

స్పీడ్‌ గన్‌

ప్రస్తుతం బౌలర్‌ విసిరిన బంతి వేగాన్ని గుర్తించడానికి వాడుతున్న టెక్నాలజీ ఇది. ఇదొక డాప్లర్‌ రాడార్‌ యూనిట్‌. ఫీల్డ్‌లో కదులుతున్న వారి వేగాన్ని గుర్తిస్తుంది. సాధారణంగా బంతి వేగాన్ని అంచనా వేయడానికే ఈ స్పీడ్‌ గన్‌ను వాడుతున్నారు. ఇప్పుడు స్మార్ట్‌ బాల్‌ దీనికి ప్రత్యామ్నాయంగా 
మారనుంది. 

అసలేంటీ స్మార్ట్‌ బాల్‌

ఇప్పుడు ప్రపంచమంతా స్మార్ట్‌ అయిపోతోంది. ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌ వాచ్‌లు కనిపిస్తున్నాయి. క్రికెట్‌ కూడా ఇప్పుడు స్మార్ట్‌గా మారిపోతోంది. అందులో భాగంగా వస్తోందే ఈ స్మార్ట్‌ బాల్‌. ఆస్ట్రేలియాకు చెందిన క్రికెట్‌ బాల్స్‌ తయారీ కంపెనీ కూకాబుర్రా ఈ స్మార్ట్‌ బాల్స్‌ను తయారు 
చేస్తోంది. ఈ స్మార్ట్‌ బాల్‌ ద్వారా క్రికెట్‌ ఆడే విధానంతోపాటు కోచింగ్‌ కూడా మారిపోనుంది. ప్రేక్షకులకు కూడా కొత్త అనుభూతి చెందనున్నారు. కూకాబుర్రా రెండేళ్లుగా ఈ స్మార్ట్‌ బాల్‌ను అభివృద్ధి చేస్తోంది. స్పోర్ట్‌ కార్‌ అనే తన టెక్నాలజీ పార్ట్‌నర్‌తో కలిసి ఈ స్మార్ట్‌ బాల్‌ను కూకాబుర్రా తయారుచేస్తోంది. 

ఎందుకీ స్మార్ట్‌ బాల్‌

స్టంప్స్‌లో కెమెరా, పక్కకు మైక్రోఫోన్‌లాంటివి ఇప్పటి వరకు మనం చూశాం. కానీ తొలిసారి క్రికెట్ బాల్‌లో ఓ మైక్రో చిప్‌ను ఈ స్మార్ట్‌ బాల్‌ ద్వారా చూడబోతున్నాం. ఈ మైక్రోచిప్‌ ద్వారా బౌలర్లు ఎప్పటికప్పుడు తాము విసిరిన బంతి వేగం, స్పిన్‌ అయితే ఎన్ని డిగ్రీల కోణంలో అయిందన్న విషయాలు తెలుసుకోవచ్చు. తమ చేతికి ఓ స్మార్ట్‌ఫోన్‌ పెట్టుకుంటే సరిపోతుంది. స్మార్ట్‌ బాల్‌తో దానిని కనెక్ట్‌ చేస్తే బంతి విసరగానే వాచ్‌లో దాని స్పీడ్‌, యాంగిల్‌ వివరాలు నమోదవుతాయి. బంతి విసిరే సమయానికి ఉన్న వేగం, పిచ్‌పై బౌన్స్‌ అయ్యే ముందున్న వేగం, బౌన్స్‌ అయిన తర్వాత బంతి వేగాన్ని కూడా ఈ స్మార్ట్‌ బాల్‌ నమోదు చేయగలదు. 

ఇప్పటికిప్పుడు చూడలేం

అయితే ఈ స్మార్ట్‌ బాల్‌ను ఇప్పటికిప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో వాడేంతగా పరీక్షించలేదు. ప్రస్తుతం ప్రయోగాల దశలోనే ఉంది. వచ్చే కొన్ని నెలల వ్యవధిలో ఓ మేజర్‌ టీ20 టోర్నీలో ఈ స్మార్ట్‌ బాల్‌ను వాడాలని ఐసీసీ భావిస్తోంది. వచ్చే ఏడాదినాటికి ఈ స్మార్ట్‌బాల్‌ను ఐసీసీతోపాటు అన్ని క్రికెట్‌ బోర్డులకు ఇవ్వాలని కూకాబుర్రా నిర్ణయించింది. ఆ తర్వాత క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌లలో ఈ స్మార్ట్‌బాల్‌ను మనం చూడొచ్చు.

author

రచయిత: హరిప్రసాద్ శీలమంతుల, ఫ్రీలాన్స్ జర్నలిస్టు

సెకెండ్ హాండ్ కార్లతో లాభాలేంటి?

0

ప్రీ ఓన్డ్ కార్ కారు.. తరచుగా మనం వినే పదం. కార్ అంటే ఒకప్పుడు లగ్జరీ. కానీ ఇప్పుడు అవసరం. ఒకప్పుడు గొప్పోళ్ల ఇళ్లలో మాత్రమే కనిపించేది. కానీ ఇప్పుడు సాధారణ మధ్య తరగతి వాళ్ల ఇళ్ల ముందు కూడా కనిపిస్తోంది. నలుగురు కలిసి ఎక్కడికైనా వెళ్లాలంటే.. ఆటోలు, బస్సుల కంటే కారే చీప్‌ అన్న ఫీలింగ్‌ ఇప్పుడు చాలా మందిలో ఉంది.

పైగా సెకండ్‌ హ్యాండ్‌ కార్ల అమ్మకాలు పెరిగిన తర్వాత మిడిల్‌ క్లాస్‌ వాళ్లు కూడా వీటిని కొనే సాహసం చేస్తున్నారు. తమ రేంజ్‌కు తగినట్లు చిన్న హ్యాచ్‌బ్యాక్‌ కారు నుంచి లగ్జరీ ఎస్‌యూవీల వరకు అన్నీ సెకండ్‌ హ్యాండ్‌లో దొరుకుతున్నాయి. అయితే సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనాలంటే చాలా మంది వెనకడుగు వేస్తారు? కొత్త కారైతే కంపెనీ వారెంటీ ఉంటుంది.

కారుకు ఏమైనా అయినా వాళ్లే చూసుకుంటారు. కానీ సెకండ్‌ హ్యాండ్‌ కారుతో రిస్క్‌ ఎక్కువని, కారు గురించి పూర్తిగా తెలిస్తేనే కొనండి అని చెప్పేవాళ్లు కూడా చాలా మంది ఉంటారు. దీంతో సెకండ్‌ హ్యాండ్‌ కొనాలని అనుకున్న వాళ్లు కూడా కాస్త ఎక్కువ పెట్టి కొత్త కారే కొందామని అనుకుంటారు.

అయితే ఆ కొత్త కారు కంటే చాలా తక్కువ ధరలో, వారెంటీ, ఫ్రీ సర్వీస్‌తో కూడిన సెకండ్‌ హ్యాండ్‌ కార్లు కూడా మార్కెట్‌లో దొరుకుతున్నాయన్న విషయం కొంత మందికే తెలుసు. వాటినే మనం ప్రీ ఓన్డ్‌ సర్టిఫైడ్‌ కార్లు అంటున్నాం.

అసలేంటీ ప్రీ ఓన్డ్‌ సర్టిఫైడ్‌ కార్లు

సాధారణంగా సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనాలంటే మన బంధువులు, స్నేహితులపైనే ఆధారపడతాం. తెలిసిన వాళ్ల దగ్గర కారు కొంటే కాస్త నమ్మకంగా ఉంటుంది అన్నది మన ఫీలింగ్‌. లేదంటే మనకు తెలిసిన ఏ మెకానిక్‌నో తీసుకెళ్లి కారును మొత్తం చూసి అంతా బాగుందనిపిస్తే కొనేస్తాం. ఈ మధ్య వాడిన వస్తువులు కొనడానికి ఆన్‌లైన్‌లోనే ఎన్నో సైట్లు కూడా ఉన్నాయి. మన అదృష్టం బాగుంటే ఇలా కొన్న కార్లు ఎలాంటి రిపేర్లు లేకుండా బాగానే నడుస్తాయి. లేదంటే ప్రతి రోజూ వాటితో ఇబ్బంది పడాల్సి వస్తుంది. పైగా ఇలా కొన్న కార్లకు ఏవైనా రిపేర్లు వచ్చినా, సర్వీసింగ్‌ చేయించాలన్నా కారు కొన్న మరుసటి రోజు నుంచే మన జేబులో డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఈ తలనొప్పంతా ఎందుకు అనుకున్నవాళ్లకు బెస్ట్‌ ఆప్షన్‌ ఈ ప్రీ ఓన్డ్ సర్టిఫైడ్‌ కార్లు. ఇవి కూడా సెకండ్‌ హ్యాండ్‌ కార్లే. కానీ మంచి కండిషన్‌లో ఉంటాయి. వీటిని అమ్మే డీలర్లు ఈ కార్లను సర్టిఫై చేసి ఇస్తారు. వీటిని అమ్మే ముందే అన్ని రకాలుగా పరీక్షిస్తారు. మళ్లీ అమ్మడానికి అవసరమైన మార్పులు చేర్పులు చేస్తారు. మొత్తానికి దాదాపుగా ఓ కొత్త కారునే కొన్నామన్న ఫీలింగ్‌ కస్టమర్లకు కలిగేలా చేయడమే ఈ ప్రీ ఓన్డ్‌ సర్టిఫైడ్‌ కార్ల ఉద్దేశం.

రిపేర్లు, మెయింటెన్స్‌  ఫ్రీ

ఇంతకుముందు చెప్పినట్లు తెలిసిన వాళ్ల దగ్గర కారు కొన్నా.. మరుసటి రోజు నుంచే దానికి వచ్చే రిపేర్లు, మెయింటెనెన్స్‌కు మనమే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఈ బిల్లు ఒక్కోసారి తడిసి మోపెడవుతుంది. అయితే ఈ సర్టిఫైడ్‌ కార్లకు మాత్రం పరిమిత కాలానికి సంబంధిత డీలర్‌ వారెంటీ కూడా ఉంటుంది. ఆ కాలంలో కారుకు ఏమైనా రిపేర్లు వచ్చినా, సర్వీసులు చేయాలన్నా ఫ్రీగానే చేస్తారు.

పైగా కారు అమ్మకానికి పెట్టినపుడే దానిని క్షుణ్నంగా పరిశీలిస్తారు కాబట్టి.. రిపేర్లు వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇక సాధారణంగా ఇలాంటి కార్లు అమ్మే డీలర్లు మొదటి మూడు, నాలుగు సర్వీసులను ఫ్రీగానే చేస్తారు. నిజానికి కొత్త కారు కొన్నా కూడా కంపెనీ వాళ్లు దాదాపుగా ఇవే ఆఫర్లు ఇస్తారు.

తక్కువ వడ్డీకే లోన్లు

కొత్త కారు కొంటే ఎలా అయితే వెహికిల్‌ లోన్‌ అందుబాటులో ఉంటుందో ఈ సర్టిఫైడ్ కార్లు కొనాలన్నా లోన్లు ఇస్తారు. నేరుగా డబ్బు చెల్లించి కారు కొనే స్థోమత లేకపోతే లోన్‌ తీసుకోవచ్చు. పైగా బయటి సెకండ్‌ హ్యాండ్‌ కార్లతో పోల్చి చూస్తే ఈ సర్టిఫైడ్‌ కార్లకు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చే బ్యాంకులూ ఉన్నాయి. మీ బ్యాంక్‌తో సంప్రదించి వాళ్లు సెకండ్‌ హ్యాండ్‌ కార్లకు ఏ వడ్డీకి లోన్‌ ఇస్తున్నారు.. సర్టిఫైడ్‌ కార్లకు ఏ వడ్డీకి లోన్‌ ఇస్తున్నారన్న విషయం తెలుసుకుంటే తేడా మీకే అర్థమవుతుంది.

రేటు కాస్త ఘాటే

ప్రీ ఓన్డ్‌ సర్టిఫైడ్‌ కార్లు కొత్త కార్ల కంటే చీపే. అలా అని మరీ అంత చవకేమీ కాదు. బయట కొనే సెకండ్‌ హ్యాండ్‌ కార్లతో పోలిస్తే వీటి ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. మీరు అనుకున్న బడ్జెట్‌లో మీకు నచ్చిన కారు కొనలేకపోవచ్చు. నిజానికి కొత్త కారు రేంజ్‌లో బెనిఫిట్స్‌ను మీరు పొందాలనుకుంటే ఆ మాత్రం
ఎక్కువ ధర చెల్లించక తప్పదు.

మీ ఏరియాలో ఉన్న ఈ సర్టిఫైడ్‌ కారు డీలర్లందరి దగ్గరా ఉన్న కార్లను పరిశీలించి మీకు నచ్చిన, మీ బడ్జెట్‌లో వచ్చే కారును మీ సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుత సంవత్సర మోడల్ నుంచి మొదలు పదేళ్ల పాత కార్లు కూడా అందుబాటులో ఉంటాయి. బీఎండబ్ల్యూ, మారుతీ తదితర సంస్థలు తమ సర్టిఫైడ్ కార్ల అమ్మకాలపై వాణిజ్య ప్రకటనలు కూడా ఇస్తుంటాయి.

దొరుకుతాయంటే..

ప్రి ఓన్డ్‌ సర్టిఫైడ్‌ కార్లు అమ్మే డీలర్లు చాలా మందే ఉన్నారు. మీకు కావాల్సిన కంపెనీ కారును బట్టి ఆయా డీలర్లను సంప్రదించవచ్చు. సాధారణంగా ఇండియాలో మధ్య తరగతి మెచ్చిన, వాళ్లకు అందుబాటు ధరలో ఉండే కార్లను తయారు చేసే కంపెనీ మారుతి సుజుకి.

ఈ కంపెనీకి చెందిన సర్టిఫైడ్‌ కార్లను అమ్మే డీలర్లు హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాల్లో ఉన్నారు. https://www.marutisuzukitruevalue.com వెబ్ సైట్ లో ఈ కార్లు ఎక్కడ దొరుకుతాయో తెలుసుకోవచ్చు. మారుతీ ట్రూ వాల్యూ పేరుతో హిమాయత్‌నగర్‌, నాగోల్‌, గచ్చిబౌలి, మదీనాగూడా, ఎల్బీనగర్‌, మలక్‌పేట్‌, మల్లేపల్లి, బేగంపేట్‌, టోలీచౌకీలాంటి ప్రాంతాల్లో సర్టిఫైడ్‌ మారుతి కార్లు లభిస్తాయి.

ఇక హ్యుండాయ్‌ కార్లు ( https://hpromise.hyundai.co.in/ ) కావాలనుకుంటే.. హైదరాబాద్ లోని సనత్‌నగర్‌లోని తల్వార్‌ హ్యుండాయ్‌, ఎల్బీ నగర్‌లోని లక్ష్మీ హ్యుండాయ్‌, లక్డీకాపూల్‌లోని కున్‌ యునైటెడ్‌ హ్యుండాయ్‌, రాణిగంజ్‌లోని సాబూ హ్యుండాయ్‌, బంజారాహిల్స్‌లోని తల్వార్‌ హ్యుండాయ్‌ షోరూమ్‌లను సంప్రదించవచ్చు.

దాదాపుగా ఇవే ప్రాంతాల్లో టాటా, హోండా, షెవర్లేలాంటి కంపెనీల సర్టిఫైడ్‌ కార్లు కూడా అమ్మకానికి ఉన్నాయి. గచ్చిబౌలి, మాదాపూర్‌, అత్తాపూర్‌, యూసుఫ్‌గూడ, ఎల్బీ నగర్‌లాంటి ప్రాంతాల్లో మల్టీ బ్రాండ్‌ కార్లను అమ్మే షోరూమ్స్‌ ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. మీకు నచ్చిన, మీరు మెచ్చిన, మీ బడ్జెట్‌లో ఉన్న సర్టిఫైడ్‌ సెకండ్‌ హ్యాండ్‌ కార్లను సొంతం చేసుకోండి.

ఇవి కూడా చదవండి

ఇంట్లో స్వచ్ఛమైన గాలినే పీలుస్తున్నారా..

0

వాయు కాలుష్యం కారణగా ఇంట్లో స్వచ్ఛమైన గాలి పీల్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ప్రపంచీకరణ ముసుగులో ఇప్పుడు మనిషి ముందుకెళ్తున్నాడా లేక వెనక్కి వెళ్తున్నాడా తెలియని పరిస్థితి. అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసం భవిష్యత్‌ తరాల మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. 

ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో రోజురోజుకూ పెరిగిపోతున్నకాలుష్యం మనుషుల ప్రాణాలు తీస్తోంది. ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా వాయు కాలుష్యం కారణంగా 42 లక్షల మంది చనిపోతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మన దేశంలోనూ నగరాలు కాలుష్యకాసారాలుగా మారిపోయాయి. రాజధాని ఢిల్లీతో పాటు ఆర్థిక రాజధాని ముంబై, మన హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలాంటి నగరాల్లో కాలుష్యం ప్రమాదకరస్థాయిని మించిపోతోంది.

కాలుష్యాన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా.. సుప్రీం కోర్టే రంగంలోకి దిగి ఎన్నో ఆంక్షలు విధించినా కాలుష్యం ముప్పు మాత్రం తొలగడం లేదు. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో బయట అడుగు పెట్టాలంటే వాయు కాలుష్యం బెంబేలెత్తిస్తోంది.

అయితే బయటి సంగతి పక్కన పెట్టండి.. అసలు మీ ఇంట్లోనైనా మీరు స్వచ్ఛమైన గాలిని పీలుస్తున్నారా? ఇంట్లో గాలి స్వచ్ఛంగా లేకపోతే వచ్చే సమస్యలు, వాటిని నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోండి.

ఇంట్లో ఉక్కపోత ఎక్కువగా ఉందా?

సాధారణంగా నగరాలు, పట్టణాల్లో ఇళ్లు చాలా ఇరుగ్గా ఉంటాయి. ఇలాంటి ఇళ్లలో వెంటిలేషన్‌ సమస్య సర్వసాధారణం. దీని కారణంగా ఇంట్లోని గాల్లో తేమ అధికమై ఉక్కపోత వేధిస్తుంది. మీ ఇంట్లోనూ ఇలాంటి పరిస్థితే ఉందంటే.. ఇంట్లో స్వచ్ఛమైన గాలి రావడం లేదన్న విషయాన్ని గమనించాలి.

దీనివల్ల ఇంట్లోని దుమ్ము, దూళి బయటకు వెళ్లే అవకాశం కూడా ఉండదు. ఆ దుమ్ము, దూళితో కూడిన గాలినే పీల్చడం వల్ల మీరు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంటుంది. పైగా ఇంట్లో తేమ ఎక్కువగా ఉండటం వల్ల బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. ఇది కచ్చితంగా మీ ఆరోగ్యంపై ప్రభావం చూపించేదే.

ఆరోగ్య సమస్యలు

మనకు, మన ఇంట్లో వాళ్లకు తరచూ వచ్చే పలు ఆరోగ్య సమస్యలు కూడా ఇంట్లో గాలి కాలుష్యానికి సూచికలుగా పని చేస్తాయి. తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారంటే దానికి మీ బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ ఒక్కటే కారణం కాదు.

ఇంట్లోని గాలి నాణ్యత నాసిరకంగా ఉన్నాఅనారోగ్యాలు వస్తుంటాయి. ఇంట్లో స్వచ్ఛమైన గాలి లేకపోవడం వల్ల తరచూ ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయని గుర్తుంచుకోండి.

  • అలసట, నీరసం

  •  ముక్కు, కళ్లు, గొంతు తడారిపోయినట్లుగా అనిపించడం

  •  కడుపులో వికారంగా అనిపించడం

  •  మైకం

  •  తలనొప్పి

  •  అలెర్జీలు

  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు

  • ముక్కు కారడం, సైనస్ 

ఇతర అనారోగ్య సమస్యలు వచ్చినపుడు కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే మీరు కేవలం ఇంట్లో ఉన్నంతసేపు మాత్రమే ఈ లక్షణాలు కనిపించడం, ఆఫీసుకో, మరో ప్రాంతానికో వెళ్లినపుడు కనిపించకపోవడం లాంటివి జరిగితే కచ్చితంగా మీ ఇంట్లో గాలి నాణ్యత ఆందోళన కలిగించేదేనని గుర్తించాలి.

సమస్యకు మూలాలు గుర్తించకుండా మన ఆరోగ్యంపై ఆందోళన చెందుతూ వేలాది రూపాయలు వైద్య పరీక్షలకు వెచ్చిస్తూ మానసిక క్షోభను అనుభవిస్తాం. అందువల్ల ముందుగా లోపం ఎక్కడ ఉందో గుర్తించండి. 

ఇల్లు రిపేర్‌ చేయించారా?

చాలా మంది తమ ఇంటిని మరింత అందంగా, సౌలభ్యంగా ఉండేలా తీర్చిదిద్దుకోవడానికి రిపేర్లు చేస్తుంటారు. దీనివల్ల ఇల్లు బాగా కనిపిస్తుందేమోగానీ అది ఇంట్లోని గాలి నాణ్యతను దెబ్బ తీస్తుందన్న విషయం చాలా మందికి తెలియదు. ఉదాహరణకు ఇంటికి రంగులు వేయించినా, ఫ్లోరింగ్‌ను మార్చినా కొన్ని కెమికల్స్‌ విడుదలవుతాయి.

మీ ఇంట్లో మంచి ఎయిర్‌ ఫిల్టర్‌ లేకపోతే ఈ రసాయనాలు ఎప్పటికీ ఇంట్లోనే ఉండిపోతాయి. అలా జరగకుండా ఉండాలంటే.. రిపేర్లు పూర్తయిన వెంటనే ఇంటిని బాగా శుభ్రం చేసుకోవాలి. వీలైతే మంచి ఎయిర్‌ ప్యూరిఫయర్‌ను ఇంట్లోకి ఉంచుకునే ప్రయత్నం చేయాలి. దీనివల్ల గాల్లోని ప్రమాదకర అణువులు బయటకు వెళ్లిపోయి మీకు స్వచ్ఛమైన గాలి అందుతుంది.

ఇంట్లో ఎయిర్‌ ఫిల్టర్‌ను మారుస్తున్నారా?

స్వచ్ఛమైన నీటి కోసం ప్యూరిఫయర్లను ఇళ్లలో వాడటం సాధారణమైపోయింది. అలాగే నగరాల్లో స్వచ్ఛమైన గాలి కోసం ఇంట్లోనే ఎయిర్‌ ఫ్యూరిఫయర్లను ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయి. అయితే వీటిలో ఎయిర్‌ ఫిల్టర్లను కూడా ప్రతి మూడు నెలలకోసారి మార్చకపోతే మాత్రం ముప్పు తప్పదు.

వాటర్ ఫ్యూరిఫయర్లలో ఫిల్టర్లను ఎలా మారుస్తున్నారో.. ఎయిర్‌ ప్యూరిఫయర్‌లో కూడా ఫిల్టర్లను మార్చాలి. అప్పుడే ఇంట్లోని గాలి నాణ్యత మెరుగవుతుంది. అందువల్ల ఎయిర్‌ ఫిల్టర్‌ను సమయానుకూలంగా మార్చే అలవాటు చేసుకోండి. మరచిపోకుండా ఉండేందుకు మీ మొబైల్‌ ఫోన్లో ఓ రిమైండర్‌ కూడా పెట్టుకోండి. 

ఇంట్లో మొక్కలు పెంచుదామా?

ఇంట్లో గాలిలో నాణ్యత లేదని భావించినప్పుడు ఇంట్లో పెంచే మొక్కలను సేకరించి పెంచండి. నర్సరీల్లో, ఆన్ లైన్ ఈ కామర్స్ వెబ్ సైట్లలో ఇవి లభిస్తాయి. గాలిలో నత్రజనిని సంగ్రహించి ఇవి ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. ఒకరకంగా ఎయిర్ ఫూరిఫయర్లుగా పనిచేస్తాయి. ఇలాంటి మొక్కలు పెంచినప్పుడు గాలిలో నాణ్యత పెరగడమే కాకుండా.. మనసు ఉల్లాసంగా ఉంటుంది. 

వీటిని గమనించండి

  1. గాలిలో నాణ్యత కొరవడి అలర్జీ బారిన పడి ఉంటే కారణాలు గుర్తించే ప్రయత్నం చేయండి.

  2. దోమల నివారణకు వాడే మస్కిటో రెపెలెంట్స్, గాఢమైన ఫ్లోర్ క్లీనర్లు, ఇతర రసాయనాలు వెలువరించే ఉత్పత్తులు వాడుతున్నారో గమనించాలి.

  3. రసాయనాలు కాకుండా వేప నూనె వంటి వాటిని వాడడం వల్ల దోమలను నివారించవచ్చు. గోడల రంగులు అలర్జీలకు కారణమవుతున్నాయా చూడాలి. మార్కెట్లో వీటికి ప్రత్యామ్నాయ రంగులు కూడా వచ్చాయి.

  4. అలాగే నిత్యం తలుపులు మూసి ఉంచడం కాకుండా.. గాలి దారాళంగా వచ్చేలా చూస్తే మీ ఆరోగ్యం తప్పనిసరిగా మెరుగవుతుందనడంలో అతిశయోక్తి లేదు.

ఇవి కూడా చదవండి

పర్సనల్‌ లోన్‌ ఎలా తీసుకోవాలి?

0

పర్సనల్‌ లోన్ వేతన జీవులకు ఆర్థిక అవసరాలకు స్నేహితుడిలా ఆదుకుంటుంది. బయట రెండు లేదా మూడు రూపాయల వడ్డీ కట్టలేని సగటు మధ్య తరగతి ఉద్యోగికి ఈ పర్సనల్‌ లోన్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది.

పైగా రుణాలు ఇవ్వడానికి ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి. తరచూ బ్యాంకుల నుంచే మీకు లోన్‌ కావాలా అంటూ కాల్స్‌ కూడా వస్తుంటాయి. అయితే మన వివరాలు అన్నీ చెప్పి, లోన్‌ కోసం అప్లై చేసుకున్న తర్వాత అవి రిజెక్ట్‌ అవుతుంటాయి.

ఇలా ఎందుకు జరుగుతుందో, అసలు పర్సనల్‌ లోన్‌ రావాలంటే ఏం చేయాలో చాలా మందికి అంతుబట్టదు. కానీ కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని లోన్‌ కోసం ప్రయత్నిస్తే కచ్చితంగా ఏ బ్యాంకూ మీ అప్లికేషన్‌ను తిరస్కరించే అవకాశమే ఉండదు. ఆ టిప్స్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం.

మీ క్రెడిట్‌ స్కోరు చెక్‌ చేసుకోండి

పర్సనల్‌ లోన్‌ తీసుకోవాలన్న ఆలోచన వచ్చిన వెంటనే మీరు చేయాల్సిన మొట్ట మొదటి పని మీ క్రెడిట్‌ స్కోర్‌ చెక్‌ చేసుకోవడం. మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ క్రెడిట్‌ స్కోరు ఎంతగానో ఉపయోగపడుతుంది. పైగా ప్రతి ఏడాది ఒకసారి సిబిల్లో ఉచితంగా ఈ క్రెడిట్‌ స్కోర్‌ కాపీ పొందే అవకాశం మీకు ఉంటుంది. బ్యాంక్ బాజార్ డాట్ కామ్, పైసా బాజార్ డాట్ కామ్ వంటి వెబ్ సైట్లలో రిజిస్టర్ చేసుకుంటే క్రెడిట్ స్కోరు ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు.  మీ క్రెడిట్‌ స్కోరును ప్రభావితం చేస్తున్న పొరపాట్లను  గమనించి, వాటిని సరి చేసుకొనే అవకాశం దీని ద్వారా కలుగుతుంది. వాటిని సరి చేసుకొని లోన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది.

అసలు క్రెడిట్‌ స్కోరు లేకపోతే ఇలా చేయండి

చాలా మందికి పర్సనల్‌ లోన్ అవసరం ఉంటుంది. కానీ వాటిని పొందడానికి కావాల్సినంత క్రెడిట్‌ స్కోరు మాత్రం ఉండదు. అలాంటి సమయంలో క్రెడిట్‌ స్కోరు మెరుగ్గా ఉన్న వ్యక్తిని పూచీకత్తుగా దరఖాస్తులో చేర్చండి. ఇలా చేయడం వల్ల మీకు లోన్‌ వచ్చే అవకాశాలు మెరుగవుతాయి.

ఇలా క్రెడిట్‌ స్కోరు ఎక్కువగా ఉన్న వ్యక్తుల పూచీకత్తు వల్ల మరింత ఎక్కువ లోన్‌ వచ్చే చాన్స్‌ కూడా ఉంటుంది. లోన్‌ తీసుకున్న తర్వాత సకాలంలో తిరిగి చెల్లించగలిగితే మీ క్రెడిట్‌ స్కోరు కూడా మెరుగవుతుంది.

పర్సనల్‌ లోన్ కు ఎక్కువ అప్లికేషన్లు వద్దు

పర్సనల్‌ లోన్‌ కోసం వివిధ బ్యాంకులకు అప్లికేషన్ల మీద అప్లికేషన్లు పంపించారో మొదటికే మోసం వస్తుంది. ఎన్ని ఎక్కువ దరఖాస్తులు చేసుకుంటే మీ క్రెడిట్‌ స్కోరుకు అంత దెబ్బ పడుతుందన్న విషయం గమనించండి. ఇలా ఎక్కువ దరఖాస్తులు చేసుకోవడం వల్ల మీరు లోన్‌ కోసం పెద్ద ఎత్తునే ప్రయత్నాలు చేస్తున్నారని బ్యాంకులు భావిస్తాయి.

సాధారణంగా ఇలాంటి కస్టమర్లు రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించరన్న అభిప్రాయం బ్యాంకులకు ఉంటుంది. దీంతో మీ దరఖాస్తును తిరస్కరించే ప్రమాదం ఉంది. అలాగే మీరు కొన్ని ఆన్ లైన్ వెబ్ సైట్లలో పర్సనల్ లోన్ కోసం గానీ, క్రెడిట్ కార్డు కోసం గానీ ఎంక్వైరీ చేసినా మీ క్రెడిట్ స్కోరు ప్రభావితమవుతుంది. తప్పనిసరిగా తీసుకోవాలనుకున్నప్పడే లోన్ కోసం ఎంక్వైరీ చేయాలి. 

పర్సనల్‌ లోన్ అందించే ఇతర సంస్థలు

సాధారణంగా చాలా మంది పర్సనల్‌ లోన్ల కోసం సాంప్రదాయ బ్యాంకులపైనే ఆధారపడతారు. ఆ బ్యాంకులు తమ లోన్‌ అప్లికేషన్లను నిరాకరిస్తే నిరాశ చెందుతారు. అయితే ఇలాంటి వాళ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర మార్గాలను పరిశీలించాలి. ఇలాంటి లోన్లు ఇచ్చే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. ఇవి చాలా వరకు సాధారణ బ్యాంకుల కన్నా మెరుగైన వడ్డీ రేట్లకు కూడా పర్సనల్‌ లోన్లు ఇస్తుంటాయి.

పాత బాకీలు లేకుండా చూసుకోండి

గతంలోనే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. ఆర్థిక పరిస్థితి బాగా లేక వాటిని తిరిగి చెల్లించలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరో లోన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే.. దానిని బ్యాంకులు కచ్చితంగా తిరస్కరించే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. కొత్త రుణం తీసుకునే ముందే ఎలాగోలా పాత బాకీలు తీర్చేస్తే మీ క్రెడిట్‌ స్కోరు మెరుగై.. రుణం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయం గుర్తుంచుకోండి.

ఏది బెస్ట్‌ ఆఫరో తెలుసుకోండి

పర్సనల్‌ లోన్‌ కోసం దరఖాస్తు చేసుకునే ముందు మార్కెట్లో వివిధ బ్యాంకులు ఇస్తున్న ఆఫర్లు తెలుసుకోండి. ఆన్‌లైన్‌లోనే ఈ వివరాలు తెలుసుకునే వీలు కూడా ఉంది. దీని ద్వారా అతి తక్కువ వడ్డీ రేటుకు ఎవరు లోన్‌ ఇస్తున్నారన్న విషయంపై మీకు స్పష్టత వస్తుంది.

ఎంత వస్తుందో ముందుగానే చూసుకోండి

ఏదైనా పర్సనల్‌ లోన్‌ తీసుకునే ముందు మీకు ఎంత వరకు రుణం వస్తుందో చూసుకోవడం మంచిది. దీనివల్ల మీ అవసరాలు, ఆర్థిక పరిస్థితి, బ్యాంకులు ఇచ్చే రుణాన్ని బట్టి తిరిగి ఆ లోన్‌ ఎలా చెల్లించాలన్నదానిపై మీకు స్పష్టమైన అవగాహన వస్తుంది. పర్సనల్ లోన్ వడ్డీ క్యాలుక్యులేటర్లు కూడా ఆన్ లైన్లో అందుబాటులో ఉన్నాయి. గూగుల్లో వెతికితే ఈ టూల్స్ దొరుకుతాయి.

పర్సనల్‌ లోన్ ఎంత వరకు తీసుకోవచ్చు?

పర్సనల్‌ లోన్‌ తీసుకునే ముందు నెలవారీ ఎంత చెల్లించాల్సి ఉంటుంది? అంత మొత్తం చెల్లించే సంపాదన మీకు ఉందా లేదా అని చూసుకోవడం మంచిది. మీరు నెలవారీ ఎంత తిరిగి చెల్లించగలరో ఆ మేరకే రుణం తీసుకుంటే ఎలాంటి చిక్కులు ఉండవు. మీకు అవసరమున్న లోన్‌ కంటే కూడా ఎక్కువగా ఇవ్వడానికి కొన్ని బ్యాంకులు సిద్ధంగా ఉంటాయి.

ఎక్కువగా ఇస్తున్నారు కదా అని తీసుకున్నారో.. దానిని తిరిగి చెల్లించడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇది మీ క్రెడిట్‌ స్కోరుపైనా ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అలాగే భవిష్యత్తులో మీరు హౌజింగ్ లోన్ తీసుకోవాలనుకుంటే పర్సనల్ లోన్ తీసుకోకపోవడమే ఉత్తమం. మనకు పర్సనల్ లోన్ ఇఎంఐ ఎంత ఉందో బేరీజు వేసుకుని ఆమేరకు హౌజింగ్ లోన్ మొత్తాన్ని బ్యాంకులు తగ్గించి ఇస్తాయి.

డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోండి

పర్సనల్‌ లోన్‌ పొందాలంటే బ్యాంకులు వివిధ పత్రాలను అప్లికేషన్‌తోపాటు జత చేయమని అడుగుతాయి. అందులో ముఖ్యంగా బ్యాంక్‌ స్టేట్‌మెంట్లు, ట్యాక్స్‌ రిటర్న్స్‌, మీ ఉద్యోగ సంబంధిత రికార్డులన్నీ ఉండేలా చూసుకోవాలి. ఈ డాక్యుమెంట్లన్నీ పక్కాగా ఉంటే.. లోన్‌ వచ్చే అవకాశాలు మెరుగవుతాయి.

ఏజెంట్‌తో నేరుగా మాట్లాడండి

సరైన క్రెడిట్‌ స్కోరు లేదనో, అవసరమైన పత్రాలు అన్నీ జత చేయలేదనో, మరే ఇతర కారణం వల్లో మీకు లోన్‌ ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరిస్తాయి. అందువల్ల లోన్‌ కోసం దరఖాస్తు చేసుకునే ముందే సదరు బ్యాంకు ఏజెంట్‌తో వ్యక్తిగతంగా మాట్లాడితే మంచిది.

నేరుగా మాట్లాడటం వల్ల మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, మీ వ్యక్తిత్వం ఎలాంటిది, తిరిగి సకాలంలో లోన్‌ చెల్లించే సామర్థ్యం మీకు ఉందా లేదా అన్న అంశాలపై సదరు ఏజెంట్‌ ఓ స్పష్టమైన అవగాహనకు వచ్చే వీలుంటుంది. ఇది మీకు లోన్‌ వచ్చే అవకాశాలను మరింత మెరుగు పరుస్తుంది. 

ప్రీ అప్రూవ్డ్ లోన్ తీసుకోవచ్చా?

నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. కానీ మీకు అవసరమైతేనే. అది కూడా వడ్డీ తక్కువగా ఉన్నప్పుడే. మీ శాలరీ ఖాతా ఉన్న ఎస్ బి ఐ వంటి బ్యాంకులు, మీకు క్రెడిట్ కార్డును ఆఫర్ చేసిన సంస్థలు మీ క్రెడిట్ స్కోరును బట్టి ప్రీ అప్రూవ్డ్ లోన్ ఆఫర్ చేస్తాయి.

ఇందుకోసం మీరు ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం ఆయా సంస్థల యాప్ లో అవి ఆఫర్ చేసిన చోట ఓకే అని క్లిక్ చేస్తే సెకండ్లలో మీ బ్యాంకు ఖాతాల్లో వచ్చి చేరుతాయి. మీ పర్సనల్ లోన్ ఖాతా మీ నెట్ బ్యాంకింగ్ ఖాతాలో కనిపిస్తుంది.

పర్సనల్‌ లోన్ వడ్డీ రేటు ఎంతుండాలి?

సాధారణంగా మీ క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉంటే 10.99 శాతం నుంచి 13 శాతం మధ్య వడ్డీ రేటును బ్యాంకులు వసూలు చేస్తాయి. కొన్ని సంస్థలు ప్రాసెసింగ్ ఫీజు, మరికొన్ని సంస్థలు ఇతర రుసుములు వసూలు చేస్తాయి.

ఈ రేట్ల మధ్య పర్సనల్‌ లోన్ తీసుకోవడం కోసం మీరు ఆయా సంస్థల ప్రతినిధులతో బార్గేయిన్ చేయొచ్చు. ఇంతవరకూ పర్సనల్ లోన్ లేనట్లయితే ఒక చిన్న మొత్తాన్ని లోన్ గా తీసుకోండి. ఆ తదుపరి లోన్ తక్కువ వడ్డీ రేటుకే దొరుకుతుంది. 

ఇవి కూడా చదవండి

author

రచయిత: హరిప్రసాద్ శీలమంతుల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్