మంచి తల్లిదండ్రులుగా ఉండేందుకు మార్గాలు

Photo by Vidal Balielo Jr. from Pexels

మంచి తల్లిదండ్రులు గా మనం ఉంటున్నామా? పిల్లలను పెంచడం అన్నది ఓ కళ. మంచి సంస్కారం, క్రమశిక్షణతో మీ పిల్లల్ని పెంచుతున్నారంటే.. సమాజానికి గొప్ప సేవ చేస్తున్నట్లే లెక్క. అయితే కాలంతో పోటీ పడుతున్న ఈ సమయంలో పిల్లలకు తగినంత సమయం కేటాయించలేకపోతున్నారు చాలా మంది తల్లిదండ్రులు. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో మనుగడ సాగించాలంటే భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ కారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలతో గడపడానికి తగినంత సమయం కేటాయించలేకపోతున్నారు. లక్షల కొద్దీ ఫీజులు కట్టి పెద్ద పెద్ద కార్పొరేట్‌ స్కూళ్లలో చదివిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప తమ పిల్లలతో తగినంత సమయం గడపకపోవడం వల్ల వాళ్లకెంత చేటు చేస్తున్నారో మాత్రం గుర్తించడం లేదు. మరి మీరు మీ పిల్లలను ఎలా పెంచుతున్నారు? అసలు మంచి తల్లిదండ్రులు కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చెప్పబోయే సూచనలు పాటించడం అంత సులువు కాదు.. వందకు వంద శాతం అమలు చేయడం కూడా సాధ్యం కాకపోవచ్చు. కానీ ఎప్పటికప్పుడు మీరు వాటిపై తగినంత దృష్టి సారిస్తే మీరు సరైన దిశలో వెళ్తున్నట్లే. మంచి తల్లిదండ్రులుగా ఉండాలంటే ఏం చేయాలో డియర్ అర్బన్ అందిస్తున్న కథనం ఇదీ..

మీరే రోల్‌ మోడల్

మీకు తెలుసా.. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే శిశువు నేర్చుకోవడం మొదలుపెడుతుందని. అందుకే ఓ మనిషి జీవితంలోని తొలి వెయ్యి రోజులే అతని భవిష్యత్‌ను నిర్దేశిస్తాయని తరచూ డాక్టర్లు చెబుతుంటారు. ఈ వెయ్యి రోజులే చాలా కీలకం. అంటే తల్లి గర్భం నుంచి మొదలై శిశువు జన్మించిన తర్వాత తొలి రెండేళ్లు గడిచే వరకు మనం వాళ్లతో ఎలా ఉంటాం.. ఏం మాట్లాడతాం.. ఏం తినిపిస్తాం అన్నదానిపైనే వాళ్ల ఉజ్వల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. చాలా మంది తమ పిల్లలకు ఎలా ఉండాలి.. ఏం చేయాలి అని పదే పదే చెబుతుంటారు. కానీ పిల్లలకు చెప్పడం కంటే చేసి చూపించడం అన్నదే ముఖ్యమన్న సంగతి పట్టించుకోరు. పిల్లలు ఏం చేసినా తమను చూసే నేర్చుకుంటారన్న సంగతి గుర్తుంచుకోవాలి. అంటే వాళ్లకు పేరెంట్సే తొలి రోల్‌ మోడల్స్‌. ఎదుటి వ్యక్తిని చూసి అనుకరించడం అన్నది మనిషికి సహజంగా వచ్చే లక్షణం. పిల్లలు కూడా తమ తల్లిదండ్రులు చేసే ప్రతి పనిని నిశితంగా గమనిస్తుంటారు. వాళ్లూ అలాగే చేయడానికి ప్రయత్నిస్తారు. మీ పిల్లలు ఇలా ఉండాలి.. ఇలా పెరగాలి.. ఈ లక్ష్యాలను సాధించాలి అని మీరు అనుకున్నట్లయితే ముందు మీరు అలా ఉండాలన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. 

ప్రేమను చూపించండి

తమ పిల్లల్ని ప్రేమించని తల్లిదండ్రులు ఎవరూ ఉండరు. అయితే ఆ ప్రేమను ఎలా వ్యక్తపరుస్తున్నారన్నదే మీ పిల్లల ఎదుగుదలలో కీలకపాత్ర పోషిస్తుంది. ప్రేమిస్తున్నామన్న పేరుతో వాళ్లు ఏం చేసినా భరించడం, అలసత్వం వహించడం, అతి జాగ్రత్తగా పెంచడం, అడిగినవన్నీ కొనివ్వడం చేస్తున్నారంటే మీ చేజేతులా వాళ్ల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నామని గ్రహించండి. వాళ్లను ప్రేమతో హత్తుకోవడం, తగినంత సమయం వాళ్లతో గడపడం, వాళ్లు చెప్పిన విషయాలను శ్రద్ధగా వినడం ద్వారా కూడా వాళ్లపై మీకున్న ప్రేమను వ్యక్తపరచవచ్చన్న విషయం గుర్తుంచుకోండి. ఇలా చేయడం వల్ల వాళ్లలో ఆక్సిటాసిన్‌, ప్రోలాక్టిన్‌లాంటి సానుకూల హార్మోన్లు విడుదలవుతాయి. ఏ కష్టం ఎదురైనా ఎదుర్కొనే ధైర్యాన్ని వాళ్లలో నింపుతాయి.

చేయెత్తారో చేజారిపోతారు

చాలా మంది పేరెంట్స్‌ తమ పిల్లలను క్రమశిక్షణతో పెంచాలని అనుకుంటారు. దీనికోసం కఠినంగా వ్యవహరిస్తుంటారు. కొడితేగానీ వాళ్లు మాట వినరు అన్న ధోరణి కనబరుస్తుంటారు. కానీ దీనివల్ల వాళ్లు చేజారిపోతారన్న విషయాన్ని మాత్రం గ్రహించరు. కొట్టడం వల్ల అప్పటికప్పుడు తమకు కావాల్సిన ఫలితాన్ని పేరెంట్స్‌ రాబడతారేమోగానీ.. అది పిల్లల్లో హింసా ప్రవృత్తిని పెంచుతుందన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. వాళ్లతో కలిసి ఆడండి.. పాడండి.. నవ్వండి.. వాళ్ల బాధల్ని పంచుకోండి.. వాళ్ల సమస్యల్ని సానుకూల వాతావరణంలో పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం ద్వారా ఓ సానుకూల క్రమశిక్షణను వాళ్లకు మీరు నేర్పిన వాళ్లవుతారు. 

నేనున్నానన్న భరోసా ఇవ్వండి

పిల్లలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను ఉన్నాను అన్న భరోసా వాళ్లకు ఇవ్వాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. పిల్లలు ఏదైనా చెప్పడానికి వస్తే విసుక్కోవడం, కసురుకోవడం చేయొద్దు. మీరు ఏ పనిలో ఉన్నా.. ఎంతటి ఒత్తిడిలో ఉన్నా వాళ్లు చెప్పేది ఓపిగ్గా వినండి. పిల్లలతో తరచూ మాట్లాడుతూ ఉండండి. వాళ్ల సమస్యలకు పరిష్కారం చూపించండి. ఇది వాళ్ల మానిసిక పరిపక్వతకు దోహదపడుతుంది. 

మీ ఆరోగ్యం బాగా చూసుకోండి

పిల్లలు పుట్టిన తర్వాత మీ ఆరోగ్యం విషయంలోగానీ, మీ వైవాహిక జీవితంలోగానీ కొన్ని సమస్యలు వస్తుంటాయి. అవి ముదిరితే మీ పిల్లల భవిష్యత్‌ను కూడా ప్రభావితం చేస్తాయన్న విషయం గుర్తుంచుకోండి. మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూనే వైవాహిక జీవితంలో వచ్చే సమస్యలను పరిష్కరించుకోవడం అన్నది చాలా ముఖ్యం. 

పిల్లలకు టార్గెట్లు సరే.. మీ సంగతేంటి?

మా అబ్బాయి లేదా అమ్మాయి స్కూల్‌లో టాపర్‌గా నిలవాలి.. ఆటపాటల్లో రాణించాలి.. స్వతంత్రంగా ఆలోచించగలగాలి.. ఉన్నతంగా జీవించాలి అని అనుకోని పేరెంట్స్‌ ఎవరూ ఉండరు. స్కూల్లో చేర్పించే సమయంలోనే వాళ్లకు కొన్ని లక్ష్యాలను కూడా నిర్దేశిస్తుంటారు చాలా మంది తల్లిదండ్రులు.  కానీ మీ పిల్లలు ఆ లక్ష్యాలను అందుకునే దిశగా మీరు ఎంత సమయం కేటాయిస్తున్నారు? పిల్లల భవిష్యత్తు గురించి ఎంతో గొప్పగా ఊహించుకునే తల్లిదండ్రుల్లో చాలా మంది ఈ రోజు గడిస్తే చాలు అన్నట్లుగానే వ్యవహరిస్తుంటారు. గొప్ప లక్ష్యాలను నిర్దేశించడమే కాదు.. వాటిని చేరుకోవడానికి కావాల్సిన మానసిక స్థైర్యాన్ని కూడా మీ పిల్లలకు మీరే అందించాలి.  విజయానికి పొంగిపోకుండా, ఓటమికి కుంగిపోకుండా చేయాల్సిన బాధ్యత మీదే.

Previous articleక్రికెట్‌లో స్మార్ట్‌ బాల్‌.. అసలేంటిది?
Next articleHealthy Habits: ఈ ఆరు ఆరోగ్య సూత్రాలతో కొత్త శక్తి