మీ పిల్ల‌ల్లో జ్ఞాప‌క‌ శ‌క్తి మంద‌గిస్తోందా? బ్రెయిన్ చురుకుగా ప‌నిచేయాలంటే ఇవ్వాల్సిన ఫుడ్ ఇదే..

walnuts, nuts, nusschalen
పిల్లల మెదడు అభివృద్ధి చెందేందుకు ఇవ్వాల్సిన ఆహారం Photo by congerdesign on Pixabay

మీ పిల్లలు రోజంతా చురుకుగా ఉండి వారి బ్రెయిన్ వేగంగా ప‌నిచేయాలంటే వారి డైట్‌లో ఈ ర‌క‌మైన ఆహ‌రాన్ని ఖ‌చ్చితంగా చేర్చండి. ముఖ్యంగా వాళ్లు తినే ఆహ‌రంలో ప్రోటీన్స్, మిన‌ర‌ల్స్, పోష‌కాలు ఎక్కువ‌గా ఉండే విధంగా చూసుకోవాలి. అప్పుడు వాళ్లు యాక్టివ్‌గా ఉండ‌డ‌మే కాదు వాళ్ల బ్రెయిన్ కూడా అంతే షార్ప్‌గా ప‌నిచేస్తుంది. ఆ ఆహారాలేంటో ఈ స్టోరీలో చూసేయండి.

పిల్ల‌లు మెద‌డు చాలా శ‌క్తివంత‌మైన‌ది. అలాంటి మెద‌డుకు ప‌దును పెట్టే విధంగా చేయాల్సిన బాధ్యత త‌ల్లిదండ్ర‌ల‌పై ఉందంటున్నారు నిపుణులు. పిల్ల‌లంద‌రూ ఒకేలా ఉండ‌రు. ఒక్కొక్క‌రు ఒక్కో విధ‌మైన జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని క‌లిగి ఉంటారు. కొంద‌రి బ్రెయిన్ చాలా షార్ప్‌గా ప‌నిచేస్తుంది. ఏ ప‌నినైనా చాలా సులువుగా చేయ‌గ‌లిగే నేర్ప‌ు ఉంటుంది. కానీ కొంద‌రు అదే ప‌నిని చాలా క‌ష్ట‌త‌రంగా చేస్తారు. వాళ్ల‌ ఆలోచ‌న శ‌క్తి కొంత తక్కువగా ఉంటుంది. అలాంటివారికి  తగిన పౌష్ఠికాహారం ఇవ్వడం అవసరం. 

కొన్ని రకాల ఫుడ్స్‌ వాళ్లకి తినిపించ‌డం వ‌ల్ల వాళ్ల  ఆలోచ‌నా శ‌క్తి చాలా వేగ‌వంతమ‌వుతుంది. మంచి తెలివితేట‌ల‌ను పొంద‌గ‌లుగుతారు. మరి ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి? ఏ విధంగా తీసుకోవాలి? ఏం తింటే వారి బ్రెయిన్ షార్ప్‌గా ప‌నిచేస్తుంది? ఇలాంటి విష‌యాల‌న్నింటిని ఈ స్టోరీలో చ‌దివేయండి.

1. కొవ్వు చేపలు

చేప‌లు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది బ్రెయిన్ చాలా వేగంగా ప‌నిచేసే విధంగా చేస్తుంది. చేప‌ల‌లో సాల్మన్, మాకేరెల్‌, వంటి కొవ్వు చేపలను ఎక్కువ‌గా తీసుకుంటే తెలివితేట‌లు పుంజుకునే అవకాశం ఉంది. ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉండ‌డం వ‌ల్ల  నాడీ వ్యవస్థ బ‌ల‌ప‌డుతుంది. వారానికి కనీసం రెండుసార్లు మీ పిల్లల ఆహారంలో చేపలను చేర్చండి. ఇది వారిలో జ్ఞాప‌క‌శ‌క్తి  అభివృద్ధికి సహాయపడుతుంది.

2. కోడిగుడ్లు:

కోడిగుడ్లలో పోష‌కాలు అధికంగా ఉంటాయి. బ్రెయిన్‌కి కావ‌ల‌సిన  అన్ని విట‌మిన్లు కోడిగుడ్ల‌లో ల‌భిస్తాయి. గుడ్లలో ఎక్కువ‌గా బి1, బి3, కొలీన్‌… వంటి విటమిన్లు కూడా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును సక్ర‌మంగా ప‌నిచేసేలా చేస్తాయి. ముఖ్యంగా కొలీన్‌ జ్ఞాపకశక్తికి, మెదడులో రసాయనాల ఉత్పత్తికీ దోహదపడుతుంది. గుడ్లలో ప్రోటీన్ కూడా ఉంటుంది. పిల్లల ఎదుగుద‌ల అభివృద్దికి, చురుకుగా ఉండ‌డానికి  సహాయపడుతుంది. మెదడు పనితీరుకు మద్దతు ఇస్తుంది. ఇందులో విట‌మిన్ డి పుష్క‌లంగా ఉంటుంది. క‌నుక పిల్ల‌ల‌కు ఇది బెస్ట్ ఫుడ్. 

3. ఆకుకూరలు

ఆకుకూర‌లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆకుకూర‌ల్లో  శ‌రీరానికి కావ‌ల‌సిని అన్ని పోష‌కాలు, ఖనిజ లవణాలు ల‌భిస్తాయి. ఆవకూర, క్యాబేజీ, లెట్యూస్, బ్రోక‌లి  వంటి ప‌చ్చ‌ని ఆకుకూర‌లు శ‌క్తిని ఇవ్వ‌డంలో తోడ్ప‌డ‌తాయి. ఇందులో  బి కాంప్లెక్స్ విటమిన్లతో పాటు కె-విటమిన్‌ కూడా సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి వీటిని తినడం వల్ల మెదడు ఇన్‌ఫ్లమేషన్‌కి గురికాకుండా చూసుకోవచ్చు. ఈ పోషకాలు మెదడు కణాల నిర్వహణ, అభివృద్ధికి తోడ్పడతాయి. ఆకుకూరల్లో ఫోలేట్‌ కూడా అధికంగా ఉంటుంది. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్ పిల్ల‌ల మెదడును చురుగ్గా చేస్తుంది.

4. సీజన్ వారీగా పండ్లు

పిల్ల‌ల‌కు సీజ‌న‌ల్‌గా ల‌భించే పండ్ల‌ను ఎక్కువ‌గా తినిపించ‌డం చాలా ముఖ్యం. ఏ కాలానికి ఆ కాలంలో లభించే పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఢోకా ఉండ‌ద‌ని చెబుతున్నారు నిపుణులు. అలాగే పిల్ల‌లు ఎంతో ఇష్టంగా తినే వాటిలో స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ, ఇలాంటివి కూడా చాలా మేలు చేస్తాయి. వారి మెద‌డుని శ‌క్తివంత‌మైన‌దిగా మారుస్తాయి. బెర్రీల్లో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెదడును ఆక్సీకరణ ఒత్తిడి, వాపు నుంచి రక్షిస్తాయి. ఇవి చూడ‌టానికి చిన్న పండ్లే అయినా వీటిలో చాలా పోష‌కాలు ఉంటాయి.  ముఖ్యంగా విటమిన్ సి, రోగనిరోధక వ్యవస్థకు దోహ‌ద‌ప‌డుతుంది.  

5. డ్రై ఫ్రూట్స్:

సాధార‌ణంగా డ్రై ఫ్రూట్స్ అందిరికీ మంచివే. పిల్ల‌లు, పెద్ద‌లు ఎవ‌రు తిన్నా వాటి నుంచి  చాలా ప్రోటీన్స్ , మిన‌ర‌ల్స్ అందుతాయి. ఇవి రోజంతా త‌మ ప‌నిని యాక్టివ్‌గా చేసేలా చేస్తాయి. పైగా పిల్ల‌లు న‌ట్స్ తిన‌డంలో ఆస‌క్తిని చూసిస్తారు కూడా. క‌నుక డ్రై ఫ్రూట్స్‌ను పిల్ల‌ల ఆహ‌రంలో భాగం చేసినట్లైయితే వాళ్ల‌కు మెరుగైన జ్ఞాప‌క‌శ‌క్తిని అందించిన్న‌ట్లు అవుతుంది. వీటిని పౌడ‌ర్‌లా చేసి రోజూ పాలల్లో వేసిన‌ట్లైతే  మ‌రింత చురుకుద‌నం వాళ్ల‌కు ల‌భిస్తుంది. అంతేకాక పాలల్లో ఉండే కాల్షియం, డ్రై ఫ్రూట్స్‌లో ఉండే విట‌మిన్స్ అన్నీ కూడా వాళ్ల‌కు స‌మ‌పాళ్ల‌లో అందుతాయి.

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Previous articlePotato Pakodi Recipe: ఆలూ పకోడి ఎప్పుడైనా చేశారా! టేస్టీ స్నాక్ ఐడియా మీకోసం
Next articleరంప‌చోడ‌వ‌రం జ‌ల‌పాతాలు: వేసవిలో ఆహ్లాదం పంచే రంప, అమృతధార వాటర్ ఫాల్స్