వేస‌వి సెల‌వుల్లో మీ పిల్ల‌ల‌కు వినోదంతో పాటు ఇలాంటి ప‌నులు నేర్పించండి!

three children sitting on grass
వేసవిలో పిల్లలకు ఎలాంటి హాబీలు నేర్పాలి? Photo by Charlein Gracia on Unsplash

వేసవి సెలవుల్లో మీ పిల్ల‌ల‌కు వినోదాన్ని అందించ‌డం ఒక్కటే కాదు వాళ్ల‌లో సృజ‌నాత్మ‌క‌త‌కు ప‌దును పెట్టండి. ఎందుకంటే మనం మన పిల్లలకు ఎన్నో విషయాలు నేర్పించగలం. క‌నుక పిల్ల‌ల‌కు మంచి అల‌వాట్లు, సృజ‌నాత్మ‌క‌త‌ను పెంచ‌డంలో వేస‌వి సెల‌వులు ఉత్త‌మ‌మైనవి. కాబట్టి, ఈ వేసవి సెలవులను మీ పిల్ల‌ల‌కు విలువైనదిగా మార్చడానికి కొన్ని చిట్కాలు ఈ క‌థ‌నం ద్వారా మీకు అందిస్తున్నాం.

వేసవి కాలం వ‌చ్చిందంటే పిల్ల‌లు ఆట‌పాట‌ల‌తో ఆనందంగా గ‌డిపేస్తారు. అప్ప‌టిదాకా స్పూళ్ల‌కు వెళ్లి చ‌దువుల‌తో కుస్తీ ప‌ట్టిన పిల్ల‌ల‌కు వేస‌వి సెల‌వులు వ‌చ్చాయంటే చాలు అంతులేని ఉత్సాహం వస్తుంది. కానీ త‌ల్లిదండ్రులు ఇలాంటి స‌మ‌యంలో పిల్ల‌లకు చిన్న చిన్న ప‌నుల‌ను చేయించ‌డం, మంచి అల‌వాట్ల‌ను నేర్పించ‌డం ద్వారా వారి ఎదుగుద‌ల‌కు మంచి మార్గం వేసివారవుతారు. అంతేకాదు పెద్ద‌లు పిల్లలతో గడపడానికి, వారికి చాలా విషయాలు నేర్పడానికి కూడా ఇది ఉత్తమ సమయం. పాఠశాలలకు సెలవులు ఇవ్వ‌డంతో పిల్లలు ఎక్కువ సమయం ఇంట్లోనే గ‌డుపుతుంటారు. ఈ సమయంలో వారికి చాలా వినోదాత్మక‌, సృజ‌నాత్మ‌క జ్ఞానాన్ని అందిచ‌వ‌చ్చు. ఎన్నో విషయాలను నేర్పించవచ్చు. 

పిల్లలకు ఇవి నేర్పండి

1. గార్డెనింగ్

వేస‌వి సెల‌వుల్లో పిల్ల‌లకు గార్డెనింగ్ ప‌ట్ల ఆస‌క్తిని పెంచండి. మీ ఇంట్లో గానీ, మీ చుట్టుప‌క్క‌ల  సమీపంలోని ఉన్న నర్సరీకి గానీ తీసుకెళ్లి వివిధ రకాల మొక్కలు, పువ్వుల గురించి వివరంగా చెప్పండి. అలాగే ఇంటికి కూడా కొన్ని మొక్క‌ల‌ను  తెచ్చి వాటికి  రోజూ పిల్ల‌ల‌చేత నీళ్లు పోయించడం, వాటిని సంర‌క్షించ‌డం లాంటి చిన్న చిన్న ప‌నుల‌ను చేయించండి. దీని వ‌ల్ల పిల్ల‌ల‌కు మొక్క‌ల‌పై మంచి అవ‌గాహ‌న అందించే విధంగా చేయ‌వ‌చ్చు. ఇదొక మంచి అల‌వాటు. 

2. బుక్ రీడింగ్:

పిల్ల‌ల‌కు రోజూ మంచి స్టోరీలు చ‌ద‌వ‌డం, రాయడం అనే దానిపై దృష్టి ఉండేలా ప్రోత్స‌హించండి. ఈ ప‌ని రోజులో ఏదో ఒక పూట చేస్తే చాలు వాళ్ల‌కు పుస్తకాలు చదవడం అనే ఒక మంచి అల‌వాటును అందించిన వాళ్ల‌మ‌వుతాం. దీని వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఒత్తిడి తగ్గుతుందని వాళ్ల‌కు కొంచెం అర్థం అయ్యేటట్టు చెప్పండి. కథల పుస్తకాలు, చిన్న పిల్లలకు సంబంధించిన నవలలు వంటి పుస్తకాలను చదవ‌మ‌ని చెప్పండి. లేక‌పోతే వాళ్ల‌కు న‌చ్చిన పుస్త‌కాల‌ను ఎంచుకొని చ‌దివే చాయిస్ వాళ్ల‌కు ఇవ్వండి. 

3. పెట్ కీపింగ్:

అనేది పిల్లలకు ఇష్టమైన కార్యకలాపాలలో ఒకటి. ఇది మీ పిల్లల కోసం ఒక ఆహ్లాదకరమైన కాలక్షేపంగా ఉంటుంది. ఇది మీ పిల్ల‌ల‌ను మరింత బాధ్యతాయుతంగా, సహనంతో, దయతో, విశ్వాసంతో ఉండేలా చేస్తుంది. పెంపుడు జంతువుల గోళ్లను కత్తిరించడం, వాటికి ఆహారం ఇవ్వడం, నడవడానికి తీసుకెళ్లడం వంటి పనులు చేయమని మీ పిల్లలకు చెప్పండి.

4. సృజనాత్మక పనులు:

పిల్ల‌ల‌కు భాషా పరిజ్ఞానంపై అవ‌గాహ‌న క‌ల్పించండి. కొత్త కొత్త భాష‌ల‌ను నేర్చుకునే విధంగా ప్రోత్స‌హించండి. అలాగే వాళ్ల‌కు శారీర‌కంగా ఎదిగే విధంగా ఆట‌లు, డ్యాన్స్, సంగీతం, ర‌క‌ర‌కాల ఆలోచ‌న‌ల‌తో క్రాఫ్ట్స్ తయారుచేయ‌డం, మంచి మంచి బొమ్మ‌లు గీయ‌డం, ఇలా ఎన్నో ప‌నుల‌ను వాళ్ల‌కు న‌చ్చిన విధంగా చేయడం అల‌వాటు చేస్తే పిల్ల‌ల అభివృద్దికి బాట‌లు వేసిన‌ట్లు అవుతుంది. పైగా ఇలాంటి వాటిని పిల్ల‌లు ఎంతో ఉత్సాహంగా చేస్తారు కూడా.

5. బెస్ట్ అవుట్ ఆఫ్ ది వేస్ట్

చిన్న చిన్న ప‌నికి రాని వ‌స్తువుల‌ను, వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం వంటి ప‌నులు చేయ‌డం ద్వారా  పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలో వాళ్ల‌కు ఒక అవ‌గాహ‌న వ‌స్తుంది. కాగితం, కార్డ్‌బోర్డ్, ప్లాస్టిక్, స్టీల్ డబ్బాల వంటి వ్యర్థ పదార్థాలను కొత్తవిగా మార్చే ప్ర‌య‌త్నం చేసిన‌ప్పుడు వాళ్లలో ఉన్న సృజ‌నాత్మ‌క‌త బ‌య‌టప‌డుతుంది. పాత టిన్ డబ్బాలను పెయింట్ చేయవచ్చు. వాటిలో మొక్కలు పెట్టడం నేర్పించవచ్చు. ఇలా చేయ‌డం వ‌ల్ల పిల్ల‌ల‌కు ఇదొక మంచి హాబీ కూడా అవుతుంది.

6. విహార యాత్రలు

పిల్ల‌ల‌ను అప్పుడ‌ప్పుడు బ‌య‌ట‌కు తీసుకువెళ్లండి. అంటే విహారయాత్ర‌ల‌కు వెళ్ల‌డం వంటి వాటితో పిల్ల‌ల మ‌న‌సు ఎంతో హాయిగా, సంతోషంతో తేలుతుంది. బ‌య‌ట ప్ర‌పంచాన్ని కూడా ఒక విభిన్న కోణంలో చూసే నేర్ప‌రితనం వాళ్ల‌కు తెలుస్తుంది. కొన్ని కొత్త అనుభూతుల‌ను, అనుభ‌వాల‌ను పొందుతారు.

7. సంగీతం, డాన్స్

సంగీతం అనేది ఒక అభిరుచి, ఒక క‌ళ‌.  నైపుణ్యంతో కూడిన విద్య‌. పిల్ల‌ల‌కు మంచి కాలక్షేపం కూడా. ఇది మనస్సును ప్ర‌శాంతంగా  ఉంచ‌డానికి  సహాయపడుతుంది. మెరుగైన శ్వాస, గుండె పనితీరు వంటి అనేక శారీరక ప్రయోజనాలను అందిస్తుంది. సంగీతం నేర్పించ‌డం ద్వారా పిల్లలు వారి నైపుణ్యాలను పెంపొందించుకోవడంలో వారి గాత్రం మెరుగుపరచుకోవడంలో సహాయపడుతుంది. అలాగే డ్యాన్స్ కూడా ఒక అద్భుత క‌ళ‌. ఇది  వినోదాత్మకంగా, ఆసక్తికరంగా ఉంటుంది. ఇది శారీర‌కంగా ఒక మంచి వ్యాయామం. శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. మీ పిల్లలకు డ్యాన్స్ పట్ల ఆసక్తి ఉంటే, వారిని డ్యాన్స్ క్లాస్‌లో చేర్పించడం మంచిది. 

8. కుకింగ్

వంట చేయడం కొద్దిమంది పిల్ల‌లు హాబీగా నేర్చుకుంటారు. అది కూడా మంచి అల‌వాటే. చాలా మందికి వంటలో సాయం చేయడం ఇష్టమైనదిగా చూస్తారు. మీ పిల్లలకు వంట చేయడం పట్ల ఆసక్తి ఉంటే, మీరు వారికి వంట చేయడం నేర్పించవచ్చు. లేకపోతే, మీరు సహాయం కోసం అడగవచ్చు. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిట్టవద్దు. సహనం ముఖ్యం.

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Previous articlePudina Rice: పుదీనా రైస్ ఇలా చేయండి! ఈజీ, టేస్టీ రెసిపీ
Next articleBelly Fat loss Tips: బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది ప‌డుతున్నారా! పొట్ట తగ్గించే ఈ చిట్కాలు తెలుసుకోండి