చాలా మంది పెట్రోల్ కార్ కొనాలా? లేక డీజిల్ కార్ కొనాలా? ఏ కారు కొంటే డబ్బులు ఆదా అవుతాయి? అన్న సందిగ్ధంలో ఉంటారు. ఇప్పుడు పెట్రోల్ ధరకు, డీజిల్ ధరకు పెద్దగా తేడా లేదు. అయినప్పటికీ ఏ కారు కొంటే బాగుంటుందో చూద్దాం. మిత్రులు వారి వారి అనుభవాలను బట్టి సలహా ఇస్తుంటారు. అయితే మనమే శాస్త్రీయంగా లెక్కించి ఒక అంచనాకు రావొచ్చు.
పెట్రోల్ కార్ కొనడానికి, పెట్రోల్‌కు అయ్యే వ్యయాన్ని డీజిల్ కార్కు అయ్యే ఖర్చుతో పోల్చి చూస్తే మనకు ఏది లాభమో తేల్చుకోవచ్చు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు మీకు అందిస్తున్నాం.
హైదరాబాద్ లొకేషన్ ప్రాతిపదికన పెట్రోల్ కార్ , డీజిల్ కార్కు అయ్యే ఖర్చు, బ్యాంకు వడ్డీ, పెట్రోల్, డీజిల్ ధర.. వీటన్నింటి ఆధారంగా కింద ఇస్తున్న ఉదాహరణలను బేరీజే వేస్తే ఏ కార్ కొనడం ఉత్తమమో మీకే తేలిగ్గా అర్థమవుతుంది.
మారుతీ బాలెనో పై లెక్కిద్దాం..
బాలెనో ఎక్స్–షోరూమ్ హైదరాబాద్ ధర ( పెట్రోల్ కార్ ) బేసిక్ మోడల్ సిగ్మా పెట్రోల్ రూ. 5,70,602 ఉండగా.. హై ఎండ్ మోడల్ బాలెనో ఆల్ఫా ఆటోమేటిక్ పెట్రోల్ ధర రూ. 9,03,112 ఉంది. ఇవే డీజిల్ వెర్షన్లలో మినిమం రూ. 6,90,602గా ఉంటే.. హై ఎండ్ రూ. 10,23,112గా ఉంది. అంటే పెట్రోల్ వెర్షన్‌కు, డీజిల్ వెర్షన్‌కు కనీసం రూ. 1,20,000 వ్యత్యాసం ఉంది.
మనం ఇక్కడ మరీ బేసిక్ మోడల్ కాకుండా, మరీ హై ఎండ్ మోడల్ కాకుండా మధ్యస్థ మోడల్ బాలెనో డేల్టా ఆటోమేటిక్ పెట్రోల్ మోడల్‌ను ఎంచుకుందాం. దీని ధర రూ. 7,83,612. డీజిల్ వెర్షన్ అయితే రూ. 9,03,612
రోజూ మనం సగటున 60 కి.మీ. తిరగాల్సి ఉంటుందనుకుందాం. ఈ కారు మన కు పెట్రోల్ లీటర్‌కు 21.01 కి.మీ. మైలేజ్ ఇస్తుంది. డీజిల్ వెహికిల్ అయితే 27.39 కి.మీ. మైలేజ్ ఇస్తుంది. పెట్రోల్ ధర రూ. 83.44 ఉంది. డీజిల్ ధర రూ. 78.57గా ఉంది.
మీరు ఈ కార్కు లోన్ తీసుకుంటారనుకుందాం. 85 శాతం లోన్, 15 శాతం మీరు మార్జిన్ చెల్లించాలనుకుందాం. లోన్ కాలపరిమితి ఐదేళ్లు, వెహికిల్ లోన్ వడ్డీ రేటు 9 శాతం అనుకుందాం.
పెట్రోల్ వెర్షన్ కారుకైతే మీరు నెలకు ఈఎంఐగా రూ. 13,827 చెల్లించాల్సి వస్తుంది. డీజిల్ వెర్షన్ కారుకైతే మీరు రూ. 15,944 ఈఎంఐ చెల్లించాల్సి వస్తుంది. అంటే డీజిల్ కారుకు అదనంగా మీరు రూ. 1,45,020 చెల్లించాల్సి ఉంటుంది.
డీజిల్ కారైతే ఎన్ని రోజుల్లో రికవరీ అవుతుంది..
డీజిల్ ధర స్వల్పంగా తక్కువ కదా.. అయితే మీరు అదనంగా చెల్లించిన రూ. 1,45,020 మొత్తాన్ని రికవరీ చేసుకోవాలంటే మీ డీజిల్ కారును 1,57,630 కి.మీ. మేర వాడాల్సి ఉంటుంది. అంటే ఇలా వాడాలంటే మీకు 7.2 సంవత్సరాలు (86 నెలలు) పడుతుంది.
ఒకవేళ మీరు రోజుకు కేవలం 30 కి.మీ. మాత్రమే తిరుగుతారనుకుంటే మీ అమౌంట్ రికవరీ అయ్యేందుకు 14.4 ఏళ్లు పడుతుంది.
ఒకవేళ మీరు రోజుకు 100 కి.మీ. తిరుగుతారనుకుంటే మాత్రం కేవలం 4.3 సంవత్సరా(51 నెలలు)ల్లో రికవరీ అవుతుంది.
ఒకవేళ మీరు రోజుకు 200 కి.మీ. తిరుగుతారనుకుంటే మాత్రం కేవలం 2.2 సంవత్సరా(26 నెలలు) ల్లో రికవరీ అవుతుంది.
అంటే మీరు ఎక్కువగా తిరగాల్సి ఉంటే డీజిల్ కార్ అయితే మీకు లాభసాటి. లేదంటే పెట్రోల్ కారే మీ డబ్బులను ఆదా చేస్తుంది కదా…
అనుభవజ్ఞుల సలహా కూడా తీసుకోండి..
డీజిల్ కారుకు కొద్దిగా నిర్వహణ వ్యయం కూడా ఎక్కువగా ఉంటుందని వాహనదారులు చెబుతుంటారు.
లోన్ లో తీసుకోకుండా మొత్తం డబ్బులు చెల్లించి తీసుకున్నారనుకుందాం.. మీరు డీజిల్ వాహనానికి అదనంగా రూ. 1,20,000 ధర వెచ్చిస్తారు.
ఈ మొత్తాన్ని మనం రికవరీ చేసుకోవాలంటే.. మీరు రోజుకు 60 కి.మీ. దూరం తిరిగినట్టయితే 1,36,363 కి.మీ. మీ కారు పూర్తిచేసుకోవాలి. ఇందుకు 6.2 ఏళ్లు పడుతుంది.
సో.. ఇప్పుడు మీకు స్పష్టత వచ్చింది కదా.. తక్కువ దూరమైతే మనకు పెట్రోల్ వెర్షన్ బాగుంటుంది కదా..
మీకు మారుతీ కార్లకు సంబంధించి ఇతర మోడల్స్ కూడా పోల్చాలనుకుంటే ఈ క్యాలుక్యులేటర్ వాడండి. మీకు ఇంకా పూర్తి అవగాహన వస్తుంది.
ఈ కథనం మీకు నచ్చితే దయచేసి షేర్ చేసి నలుగురికి ఉపయోగపడేలా చేయండి. ధన్యవాదాలు.