Premalu OTT Telugu: ఇటీవలే విడుదలైన ప్రేమలు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. రొమాంటిక్, కామిడీ జతగా మాళయాలంలో సూపర్ హిట్ మూవీగా పేరు తెచ్చుకున్న ఈ సినిమా త్వరలో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాను ప్రత్యేకంగా తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేయడం యూత్‌కి సినీ ఇండస్ట్రీ ఒక ట్రీట్ ఇచ్చిందనే చెప్పాలి.
ఈ చిత్రం మళయాలంలో ప్రేక్షకులను ఎంతలా అలరించిందో అలానే తెలుగులో కూడా అంతే ఆదరణ లభించి ఇప్పుడు ఓటీటీలో కూడా స్ట్రీమింగ్‌కు సిద్దం అయిపోతుంది. మరి ఆ స్ట్రీమింగ్ వివరాలేంటో ? అసలు ఈ హైదరాబాద్ లవ్ స్టోరీ ఏంటో? ఈ కథలో ఏమైనా చెప్పుకోదగ్గవి ఉన్నాయా? చిన్న లుక్కేద్దాం.
ఈ సినిమా రీసెంట్‌గా ఫిబ్రవరి 9 న రిలీజ్ అయింది. దీనికి గిరీష్ ఎ.డి. దర్శకత్వం వహించారు. నటీనటులుగా నస్లేన్ కే గపూర్, మమిత బైజు, శ్యామ్ మోహన్, సంగీత్ ప్రతాప్ తదితరులు నటించారు. ఈ సినిమా మళయాలంలో రూ. 10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి రూ. 50 కోట్లను కలెక్ట్ చేసింది. అలాగే తెలుగులో కూడా బారీ అంచనాలనే తీసుకొచ్చింది.
ఈ సినిమా హైదరాబాద్ నేపథ్యంలో తెరకెక్కింది. సరికొత్త ప్రేమకథగా యూత్‌ను ఎంటర్‌టైన్ చేస్తూ, అదే రూట్‌లో కామిడీ కూడా బాగానే పండించి తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుంది. అంతేకాదు ఈ మూవీని తెలుగులో రాజమౌళి కొడుకు ఎస్.ఎస్.కార్తికేయ రిలీజ్ చేసాడు. అలాగే ఈ సినిమాకు రాజమౌళితో పాటు ప్రిన్స్ మహేష్‌బాబు పాజిటివ్ ప్రశంసలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయ్. ఇది ఈ నెల 29న డిస్నీ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ రాబోతుంది.
ప్రేమలు కథ విషయానికి వస్తే…
సచిన్ (నస్లేన్ కే గఫూర్) ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. కొంచెం భయస్తుడు. తన కాలేజీలో అమ్మాయికి ప్రపోజ్ చేసి చివరికి విఫలమవుతాడు. ఇంతలో వాళ్ల ఇంట్లో చిన్న చిన్న గొడవల రీత్యా అతను యూకే వెళ్లాలని ప్లాన్ చేసుకుంటాడు. కానీ అతనికి వీసా రాదు.
ఇలా ఒక పక్క లవ్ పెయిల్యూర్, ఇంకోపక్క వీసా రాకపోవడంతో సతమతమవుతాడు. అయితే తన స్నేహితుడు అమల్ డేవిస్(సంగీత్ ప్రతాప్)ను వీసా విషయంలో సహాయం చేయమని అడుగుతాడు. అప్పటికే గేట్ కోచింగ్ కోసం ప్లాన్ చేస్తున్న అమల్ డేవిస్ సచిన్‌ను వెంట పెట్టుకుని వెళతాడు. అక్కడే హీరోయిన్‌తో మళ్లీ ప్రేమలో పడతాడు.
కేరళకు చెందిన రీనూ(మమిత బైజు) సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం హైదరాబాద్ వస్తుంది. అప్పుడే రీనూని మొదటిపారిగా చూసి ప్రేమలో పడతాడు. అయితే వీళ్లిద్దరూ ఒక పెళ్లిలో కలుస్తారు. అలా వీళ్లిద్దరూ స్నేహితులుగా మారుతారు. ఈ నేపథ్యంలో సచిన్ రీనూకి ప్రపోజ్ చేస్తాడు. అయితే రీనూని అంతకుముందే ఆఫీసులో ఆది అనే అబ్బాయి లవ్ చేస్తుంటాడు. అసలు రీనూ సచిన్‌ని లవ్ చేస్తుందా? బాగా సెటిలైన అబ్బాయిని చేసుకోవాలనే ఈ అమ్మాయితో తన లవ్ ఎంతవరకూ సక్సెస్ అవుతుంది? అనేది మిగిలిన కథ.
ప్రేమలు మూవీ హైలైట్స్
ఈ సినిమాలో సందర్భోచితమైన కామెడీ ప్రేక్షకులను మెప్పిస్తుంది. దర్శకుడు చాలా నేచురల్‌గా, రియలిస్టిక్‌గా కథను నడిపించాడు. అంతేకాకుండా హీరో సచిన్(నస్లేన్ కె గఫూర్) తన నటనతో, అమాయకత్వమైన అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో హాస్య సన్నివేశాలను తనదైన రీతిలో పండించి కథను తెరకెక్కించాడు దర్శకుడు. హీరోయిన్ తన ఆఫీసులో జరిగే సన్నివేశాలు, వీళ్లిద్దరూ కలిసిన తర్వాత వారి మధ్య ఎదురయ్యే సంఘటనలు, ఆఫీసు స్టాఫ్ చేసే అల్లరితో కథ చాలా నవ్వుల హంగామాగా సాగుతుంది. హీరోయిన్ మమిత బైజు తన అందచందాలతో చాలా క్యూట్‌గా నటించింది. అది కూడా ఈ ప్రేమలు సినిమాకి హైలైట్.
కొన్ని సన్నివేశాలు సాగదీతగా మారినా కామిడీతో దాన్ని కనిపించకుండా దర్శకుడు రూపొందించాడు. డైలాగులు కూడా తెలుగులో తగ్గట్టుగానే కుదరడం విశేషం. మొత్తానికి హైదరాబాద్ నేపథ్యంలో ప్రేమలు సినిమాను తెరకెక్కించడం వల్ల తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కాగలిగింది.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్