లాక్‌డౌన్ లవ్ స్టోరీస్: పుత్తం పుదు కాలై రివ్యూ

[yasr_overall_rating size=”medium” postid=”2423″]

సినిమాకు భాషాభేదాలు అడ్డంకులు కావు, కథకు సార్వత్రికత, దర్శకులకు ప్రతిభ ఉండాలంతే.

ప్రేమను మించిన సార్వత్రిక కథాంశం ఏం ఉంటుంది? ప్రతిభావంతులైన ఐదుగురు ప్రముఖ దర్శకులు లాక్‌డౌన్ కాలంలో విరిసిన ప్రేమలు, కన్నీళ్లై కరిగిన మంచు తెరలు, కొత్త చిగుళ్లు తొడిగిన అనుబంధాలను చిత్ర మాలికగా అందించారు.

అవునన్నా కాదన్నా మనందరిలోనూ అంతో ఇంతో ఉన్నఅదో రకం అగ్లీ ప్రేమ లేదా వ్యామోహం కథ చివర్లో ఉంది. ఇంగ్లిష్, హిందీ సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి కాబట్టి తమిళమా? అని మొహం చిట్లించకుండా పుత్తం పుదు కాలై (సరికొత్త పొద్దు)ను చూసేయండి.

తిరిగి వచ్చిన వసంతం


మొదటి చిత్రం సుధా కొంగర దర్శకత్వంలో తయారైన ఇలామై ఇదో ఇదో. అంటే యవ్వనం ఇదిగో ఇదిగో అనుకోవచ్చు ఇంచుమించుగా. విశాఖపట్నంలో పుట్టి, సుప్రసిద్ధ తమిళ దర్శకురాలిగా పేరుమోసిన సుధ ( వెంకటేశ్ గురు – 2017) మనకూ సుపరిచితురాలే.

భార్యలేని భర్త రాజీవ్, భర్తలేని భార్య లక్ష్మి! ఇద్దరూ మనవలను ఎత్తుకోవాల్సిన వయస్కులే. ఈ లేటు వయసులో వారిద్దరూ ప్రేమలో పడటమే కాదు, యోగా క్లాసులకని పని మనిషికి మస్కా కొట్టిన రాజీవ్ పెళ్లయిన కూతురి ‘నిఘా’ నుంచి రెండు రోజుల ఆటవిడుపు సంపాదిస్తాడు.

ఆ ఆనందంతో చిందలేస్తున్న రాజీవ్ ఇంటి తలుపు తడుతుంది సూట్‌కేస్‌తో సహా దిగిన లక్ష్మి. ఆమె కూడా కొడుక్కి అదే యోగా క్లాసుల కథకి ఎమోషనల్ టచ్ ఇచ్చి మరీ వచ్చింది. రెండు రోజులపాటూ ఈ సీనియర్ ప్రేమ పక్షులకు స్వేచ్ఛ! ఆ ఆనందాన్ని కాస్త వైన్‌తో సెలబ్రేట్ చేసుకుంటుండగా లాక్‌డౌన్! మూడు వారాలపాటూ వారిద్దరు కలిసి గడపాల్సిందే. మరీ మరీ హ్యాపీ! !

ముది వయసు వ్యక్తిత్వాలు మొండితనానికి నాలుగు అడుగులు లేదా అంగుళాల దూరానికి చేరడం అరుదేమీ కాదు. నాలుగు రోజులకే చిరాకులు పరాకులు, కోపతాపాలు మొదలవుతాయి. సోఫాలో తడి టవల్ వేస్తే రాజీవ్‌కు చిరాకు. వద్దన్నా వినదు లక్ష్మి. చెంచాలతో గిన్నెలను ఫ్రిజ్‌లో పెట్టొద్దని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోడు రాజీవ్. ఎడ్డమంటే తెడ్డమనే ఈ జంట ప్రేమ లాక్‌డౌన్ ముగిసే వరకైనా నిలిచేనా?

లాక్‌డౌన్ ముగుస్తుంది. కానీ ‘యోగా క్యాంప్’ ఇక ముగిసేది కాదు. వీడియా కాన్ఫరెన్స్ పెట్టి… లక్ష్మి కొడుక్కి, రాజీవ్ కూతురికి ఒకేసారి బ్రేకింగ్ న్యూస్ వినిపించేస్తారు! పెద్ద వయసులో తోడును కోరుకునే జంట పరిణత ప్రేమను గిలిగింతలు పెట్టించే అందమైన ప్రేమగా మలచడం సుధకే చెల్లింది.

రాజీవ్‌గా జయరామ్ (అల వైకుంఠపురంలో రామచంద్ర), లక్ష్మిగా ఊర్వశి… ఇద్దరూ గొప్ప మళయాళ నటులు. నూతన వసంతాగమనంతో కుర్రకారుగా మారిన ఆ జంటకు సుధ నిజంగానే పునర్‌ యవ్వనాన్ని ప్రసాదించారు. కాళిదాస్‌ను రాజీవ్‌గా, కళ్యాణి ప్రియదర్శన్‌ని లక్ష్మిగా సందర్భానుసారంగా పరకాయ ప్రవేశం చేయిస్తూ దర్శకురాలు ప్రదర్శించిన చమత్కరానికి ఎవరైనా హ్యాట్సాప్ అనక తప్పదు.

అతను, నేను – ఆమె, నేను


ఏ పరిచయమూ అవసరంలేని బహు భాషా దర్శకుడు గౌతమ్ మీనన్ మాత్రమే చెప్పగలిగిన ఉద్వేగభరితమైన కథ ఇది. ‘అతను’ అంటే తాత, ‘నేను’ అంటే మనవరాలు. ఈ తాతామనవరాళ్ల ప్రేమ కథా చిత్రానికి ఒక పార్శ్వం మాత్రమే.

లాక్‌డౌన్‌ ప్రకటించడంతోనే ఒంటరిగా ఉన్న తన ముసలి తండ్రి ఇంటికి వెళ్లమని తల్లి పోరితే, గత్యంతరంలేక తాత ఇంటికి చేరిన మనవరాలు సాఫ్టీ. పేరు ఏమిటోగానీ ఆమెను ‘కన్నా’అని పిలుస్తారు.

తాతది రాతి గుండె అని మనవరాలి నమ్మకం. “ముసలాడికి వాట్సాప్ కూడా వచ్చే” అంటూ విసుక్కుంటూ, తన గదిలో వర్క్‌ ఫ్రమ్ హోమ్ ఏడుస్తూ గడిపేస్తే సరి అనుకునే బాపతు ఆమె. ఈ చిన్న సినిమా ముగిసేసరికి…కాదు లాక్‌డౌన్ ముగిసేసరికి… అదే కన్నా తాతను అమితంగా ప్రేమించే మనవరాలిగా మారిపోతుంది. ఎలా?

అది తెలియాలంటే ‘ఆమె-నేను’ల మధ్య నిలిచిన గోడ గురించి తెలియాలి. కథలోని అతి ముఖ్యమైన ఈ భాగంలో ‘నేను’ తాత. ‘ఆమె’ మనకు కనిపించని ఆయన కూతురు, కన్నాతల్లి. ఆ తండ్రీకూతుళ్ల మధ్య గోడను కట్టింది తాతేనని మనవరాలి గట్టి నమ్మకం. లాక్‌డౌన్ కాలంలో తాత ఇంట్లో ‘బందీ’గా ఉండటం వల్లనే అది నిజం కాదని తెలుస్తుంది.

గొప్ప న్యూక్లియార్ సైంటిస్ట్‌గా కులాలు మతాలే కాదు, ఆర్థిక అంతరాల పట్టింపులు కూడా లేని తాత… అమ్మ పెళ్లి అయినప్పటి నుండి తనకు తానుగానే గృహనిర్బంధం విధించుకున్నాడనుకునేది కన్నా. కానీ తల్లిని తాత వెలివేయలేదు. తల్లే తన తండ్రికి మొహం చూపలేక, అపరాధభావంతో తనంతట తానుగా ఇద్దరి మధ్యా ఆ గోడను కట్టుకుంది.

తల్లి ఏ అపరాధం చేసి తనను తాను శిక్షించుకుంటూ, తాతను కూడా అంతులేని వేదనకు గురిచేస్తున్నదో ఇప్పుడు కన్నాకు తెలుసు. స్త్రీ తన రెక్కలను తానే కత్తిరించేసుకుకుని, తన గొంతుకను తానే నులిమేసుకునేలా చేయగల ప్రేమ-పెళ్లి బంధం గురించి కూడా కన్నాకు అర్థం అవుతుంది.

కాబట్టే, “ఇంతకూ నాకు అర్థం కానిది ఒకటే…మీ నాన్న మంచివాడు, ఏ లోపాలు లేనివాడు, గొప్పవాడు అని మీ అమ్మ మిమ్మల్ని నమ్మించాలనుకుంది బాగానే ఉంది. కానీ, ఆమెకు అసలు ఆ ఆలోచన ఎక్కడ నుంచి వచ్చింది?” అంటూ తాత ఆశ్చర్యపడటం చూసి ఆమె మనసారా నవ్వగలుగుతుంది.

లాక్‌డౌన్ ముగిస్తుంది. మనవరాలికి తాత వీడ్కోలు పలుకుతాడు. కానీ, తన ఇంట్లో నలుగురు కలగలిసి మాట్లాడుకుంటుంటే వినాలని తాపత్రయపడే తాత కోరిక నెరవేరబోతున్నదని… ఒంటరి పక్షిగా బతుకుతున్నఆ ముసలాయన ఇంట్లో మళ్లీ కూతురు గొంతు వినిపిస్తుందని, మనవరాళ్లు వాళ్ల కుటుంబాలు చేసే సందడితో ఆ ఇల్లు కళకళలాడే రోజు రానున్నదని సంకేతిస్తూ సినిమా ముగుస్తుంది.

అరగంటలోగానే మూడు తరాల అనుబంధాల దోబూచులాటను గుండెను తాకే ఉద్వేగభరితమైన సన్నివేశాలతో ఇంత హృద్యంగా చిత్రీకరించడం ఎలా సాధ్యం? తాతామనవరాళ్లుగా ఎమ్. ఎస్. భాస్కర్, రీతూ వర్మ మీ కంట కన్నీరు పెట్టించరని హామీ లేదు.

ఏవర్రా, ఎవరికైనా కాఫీ కావాలా?


“కాఫీ ఎనీవన్?” సుహాసినీ మణిరత్నం దర్శకురాలు. ఎక్కడెక్కడి డాక్టర్ల మాట కాదని, విదేశాల నుండి దిగిన ఇద్దరు కూతుళ్ల మాట పడెచెవిన పెట్టి… కోమాలో ఉన్న భార్యకు ఆసుపత్రులు, అక్కడి మందుల వాసన పడదంటూ ఇంట్లోనే తెచ్చి పెట్టుకున్న ఆ ముసలాయనది ప్రేమా? పిచ్చా? పిచ్చి ప్రేమా? “సర్‌ప్రైజ్” అంటూ మొదలైన ఈ చిత్రం సర్‌ప్రైజింగ్‌గానే ముగుస్తుంది. మణిరత్నం అంతటి వాడు కథా సహకారాన్ని అందించిన చిత్రం ఇది. అతి గొప్ప చిత్రంగా నిలవగల బలమైన ఇతివృత్తం. కానీ…ఇది హాసన్ కుటుంబ సభ్యుల సినిమా కావడమే దీని బలహీనత. శ్రుతి హాసన్, సుహాసిని, అను హాసన్ ముగ్గురూ అక్కచెల్లెళ్లయితే, కోమలం చారుహాసన్‌ వాళ్ల తల్లి. తండ్రి పాత్రధారి మాత్రం కథాడి రామమూర్తి.


తక్కువ పాత్రలు, సరళమైన కథ చిన్న చిత్రాలకు తప్పక ఉండాల్సిన లక్షణాలు. పెద్ద ఫీచర్ ఫిల్మ్‌లో చెప్పగల విషయాలన్నిటిని చిన్న సినిమాలో కుక్కేసే ప్రయత్నం దేని మీదా ఫోకస్ లేకుండా చేస్తుంది. అదే జరిగింది. కీలకమైన మూడో కూతురు రమ్య పాత్రను పోషించిన శృతిహాసన్ అత్తెసరు మార్కుల మూసపోత పెర్ఫార్మెన్స్‌తో, తనలో చక్కటి నటి కూడా ఉన్నదని నిరూపించుకునే మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నారు. దర్శకురాలిగా సుహాసిని ఒక మెట్టు ఎక్కబోయి దిగారు?

పునస్సమాగమం


రాజీవ్ మీనన్ దర్శకత్వం వహించిన రీయూనియన్. లాక్‌డౌన్‌లో ఊరికి వెళ్లిపోదామని బయలుదేరి, అనుకోకుండా బాల్య మిత్రుడు విక్రమ్ (గురుచరణ్) ఇంటికి చేరిన డ్రగ్ అడిక్ట్ సాధన (ఆండ్రియా జెర్మియా) కథ. ఇప్పుడు సర్జన్ అయిన విక్రమ్ తల్లి (లీలా సామ్సన్) వాకర్ పట్టుకుని తప్ప నడవలేని ఆర్థ్రైటిస్ పేషంట్. చిన్ననాటి జ్ఞాపకాల కలబోత, తల్లీకొడుకుల ఆప్యాయతానురాగాలు కలిసి సాధనకు డ్రగ్స్‌కు గుడ్ బై చెప్పగల మనోధైర్యాన్నిఇస్తాయి. చిన్ననాటి మూగ ప్రేమ లాక్‌డౌన్‌లో కొత్త చిగుళ్లు తొడిగి, లాక్‌డౌన్ ముగింపుతో ఫలిస్తుంది. విక్రమ్ తల్లి మిత భాషి. కళ్లు, ముఖకవళికలతోనే ఈ ప్రేమ కథలో కీలక పాత్రధారి అయ్యారు. కథా వస్తువులో ఏ కొత్తదననం లేకపోయినా రాజీవ్ చక్కగా రక్తి కట్టించగలిగారు.

ఐదవది అద్భుతం(మిరకల్) అనే అగ్లీ ప్రేమ కథ. దర్శకులు కార్తీక్ సుబ్బరాజ్. బ్లాక్ కామెడీ కోవకు చెందిన ఇది డబ్బు మీద ప్రేమ లేదా వ్యామోహం కథ. చూడటానికి సరదాగానే ఉన్నా ఈ చిత్ర మాలికలోకి ఇమిడేది కాదు.

అమెజాన్ బాస్‌లు కంటెంట్‌పై కాస్త శ్రద్ధ చూపలేరా?
ఒరిజినల్ కంటెంట్ కోసం నెట్‌ప్లిక్స్‌తో పోటీపడుతున్న అమెజాన్ ప్రైమ్ ప్రకటించిన రెండు తమిళ అంథాలజీలలో ఇది మొదటిది. కోవిడ్ నిరాశామయ కాలంలో వీక్షకులలో కొత్త ఆశల పూలు పూయించాలన్న సంకల్పం గొప్పదే. కానీ, మిరకల్ ఏ ఆశలను రేకెత్తిస్తుంది? కాఫీ ఎనీవన్?కి లాక్‌డౌన్‌కి సంబంధం ఏమన్నా ఉందా? ఇదేదో పొరపాటు కాదు, అమెజాన్ ప్రైమ్ బాస్‌లకు అలవాటుగానే మారినట్టుంది.

డిసెంబర్ 18న విడుదల చేసిన లాక్‌డౌన్ కథలు-2 “అన్‌పాస్‌డ్”లోని “అపార్ట్‌మెంట్” ఇతివృత్తానికి లాక్‌డౌన్‌కి ఎలాంటి సంబంధమూ లేదు. ఓటీటీ మార్కెట్ కోసం, ‘ఒరిజినల్ కంటెంట్’ కోసం ఆరాటమే తప్ప అంథాలజీల వంటి కొత్త, ప్రయోగాత్మక చిత్రాల కంటెంట్ విషయంలోనైనా కాసింత శ్రద్ధ చూపలేరా?

మూవీ రివ్యూ : పుత్తం పుదు కాలాయ్
రేటింగ్‌ : 3/5
నటీనటులు : జయరామ్, ఊర్వశి, కాళిదాస్ జయరామ్, కళ్యాణి ప్రియదర్శన్
M. S. భాస్కర్, రీతు వర్మ.
శ్రుతి హాసన్, సుహాసిని, అను హాసన్, కథాడి రామమూర్తి, కోమలం చారుహాసన్
ఆండ్రియా జెర్మియా, గురుచరణ్ సి, లీలా సామ్సన్
బాబీ సింహ, శరత్ రవి, కె. ముత్తుకుమార్
నిర్మాణం : మీనాక్షి సినిమాస్, లయన్ టూత్ స్టూడియోస్, మద్రాస్ టాకీస్, రాజీవ్ మీనన్ ప్రొడక్షన్స్, స్టోన్ బెంచ్
దర్శకులు: సుధ కొంగర, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సుహాసిని మణిరత్నం, రాజీవ్ మీనన్
కార్తీక్ సుబ్బరాజ్
విడుదల : అక్టోబర్ 2, 2020
నిడివి : 129 నిమిషాలు
ఓటీటీ : అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోస్
భాష: తమిళం
సబ్‌టైటిల్స్: ఇంగ్లిష్, తమిళం



రివ్యూ: పీవీఆర్

Previous articleనెట్‌ఫ్లిక్స్ స్పానిష్ మూవీ: సండేస్ ఇల్‌నెస్‌ : రామోన్ సాలజార్ అద్భుత సృష్టి
Next articleఎ కాల్ టు స్పై : గత కాలపు ‘కొత్త హీరో’ల సాహస గాథ