ముల్లంగిని ఇష్టపడేవారు అరుదుగా ఉంటారు. అయితే ముల్లంగి ప్రయోజనాలు తెలిస్తే వదులుకోరు. టేస్టీగా ఉండదనే ఉద్దేశ్యంతో కొనడానికి ఆసక్తి చూపరు. ముల్లంగిలో ఎన్నో ప్రయోజనకరమైన పోషకాలు దాగి ఉంటాయి. ఇది అన్ని కూరగాయలలా కాకుండా ఘాటుగా, విభిన్నమైన రుచితో ఉంటుంది. ముల్లంగిలో విటిమిన్ ఎ, విటమిన్ బి, సి, కార్భోహైడ్రేట్లు, సోడియం, క్లోరిన్, ఐరన్ ఇంకా అనేక పోషకాలు నిండి ఉంటాయి. అలాగే ముల్లంగి రసాన్ని తాగడం వలన ఎన్నో సమస్యల నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీని వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ చూసేయండి.
షుగర్ వ్యాధి నివారణకు:
ప్రస్తుత రోజుల్లో షుగర్ అనేది అందిరిని బాధిస్తున్న సమస్య. షుగర్ వ్యాధి జన్యుపరంగా కానీ, జీవనశైలి వల్ల కానీ, అధిక స్ట్రెస్ వల్ల గానీ రావొచ్చని వైద్యులు చెబుతున్నారు. ముల్లంగి మధమేహ నివారణకు బాగా పనిచేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ముల్లంగిలో ఉండే గ్లూకోసినోలేట్స్, ఐసోథియోసైనేట్ వంటి రసాయన సమ్మేళనాలు రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడంలో తోడ్పడతాయి. కనుక షుగర్ వ్యాధితో బాధపడేవారు తరచుగా ముల్లంగిని తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
ముల్లంగిలో ఉండే విటమిన్-సి, కాల్షియమ్, పొటాషియం, ఇతర ఖనిజ లవణాలు బ్లడ్ ప్రెషర్‌ని నియంత్రిస్తాయి. రక్తప్రసరణ సాజావుగా సాగేందుకు రక్తనాళాలను మెరుగుపరచడంలో ముల్లంగి కీలక పాత్ర పోషిస్తుంది. తద్వారా గుండె పనితీరుకు దోహదపడుతుంది.
జీర్ణక్రియకు సహాయకారి:
జీర్ణక్రియను సక్రమంగా నిర్వహించడానికి బాగా ఉపయోగపడేది ఫైడర్. ఇది ముల్లంగిలో పుష్కలంగా లభిస్తుంది. జంక్ ఫుడ్ వల్ల ఏర్పడే వ్వాధులకు, జీర్ణ సమస్యలకు దీనితో చెక్ పెట్టవచ్చు. మలబద్దకం లాంటి సమస్యలను పరిష్కరించుకోవచ్చు.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
ముల్లంగిలో ఐరన్, ఫాస్పరస్ విభిన్న వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతాయి. రక్తహీనత తగ్గించడంలో, హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
అయితే ముల్లంగిలో అధిక ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. ముల్లంగి ఆకులను అధిక మొత్తంలో తినడం వల్ల హైబీపీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. ముల్లంగిలో ఉండే ఒక ప్రత్యేక లక్షణం ద్వారా శరీరంలోని నీటిని మూత్రం రూపంలో కోల్పోయి, శరీరం డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంది. తగు మొత్తంలో మాత్రమే ముల్లంగి తినడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్