Ragi Kichidi Recipe: రాగి కిచిడీ.. ఉద‌యం టేస్టీ అల్పాహారం.. రెసిపీ కూడా చాలా సులువు

finger millets
రాగి కిచిడీ బలవర్థకం ఇంకా రుచికరం కూడా"Neglected and Underutilized species - Finger Millet" by Bioversity International is licensed under CC BY-NC-ND 2.0

Ragi Kichidi Recipe: రాగి కిచిడీ ఎప్పుడైనా చేశారా? ఈ రెసిపీ చాలా సులువు. రుచికి రుచి. ఆరోగ్యానికి ఆరోగ్యం. రాగులను ఇంగ్లిషులో finger millets అంటారు. రోజూ రాగుల‌ను ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. వీటిని ఏ రూపంలో అయినా తీసుకోవ‌చ్చు. ముఖ్యంగా వేస‌వి కాలం వ‌చ్చిందంటే ఏది తినాల‌న్నా నోటికి అంత‌గా రుచించ‌దు. ఎండ వ‌ల్ల శ‌రీరంలో వేడి అధిక‌మై తీవ్ర అల‌స‌ట‌కు లోన‌వుతూ ఉంటాం. దీనితో నీర‌సం, ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌లు తలెత్తుతాయి. శ‌రీరంలో ఉండే నీరు కూడా ఆవిరైపోయి డీహైడ్రేష‌న్ బారిన ప‌డుతుంటాం. అందుకే మంచి పోష‌కాలు ఉండే ఆహారాన్ని తిన‌డం ఉత్త‌మం. అందులోనూ రాగుల్లో మంచి పోష‌క విలువ‌లు, ఫైబ‌ర్ అధికంగా ఉంటాయి. అందుకనే వీటిని రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి.

రాగులు ఇత‌ర ధాన్యాల కంటే బ‌ల‌మైన ఆహారంగా చెప్పొచ్చు. శారీర‌కంగా ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డేవారు రాగిపిండితో త‌యారు చేసిన ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం మంచిది. అలా తీసుకున్న‌ప్పుడు శ‌రీరం చాలా దృఢంగా ఉంటుంది. రాగులలో కాల్షియం అత్యధికంగా ఉంటున్నందున ఎముకలు బలంగా ఉంటాయి. సాధార‌ణంగా రాగుల‌తో చేసే వంట‌ల‌లో ఎక్కువ‌గా రాగి జావ‌, సంక‌టి చేస్తుంటారు. మ‌రి అల్పాహ‌రంగా రాగుల‌ను ఉప‌యోగిస్తే అంద‌రూ ఇష్టంగా తినేయ‌చ్చు. ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. ఆ కోవలో రాగి కిచిడీని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

రాగి కిచిడీకి కావ‌ల‌సిన ప‌దార్థాలు:

  1. బియ్యం – ఒక క‌ప్పు
  2. పెస‌ర‌ప‌ప్పు – అర క‌ప్పు
  3. రాగులు – ఒక క‌ప్పు
  4. కూర‌గాయ ముక్క‌లు – క‌ప్పు (క్యారెట్, ట‌మోట‌, బంగాళ‌దుంప‌, బీన్స్)
  5. ప‌చ్చిమిర్చి – రెండు
  6. తాలింపు గింజ‌లు – అర టీ స్పూన్
  7. ప‌సుపు – ఒక టీ స్పూన్
  8. గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్
  9. నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు
  10. ఉప్పు – రుచికి స‌రిప‌డా

రాగి కిచిడీ త‌యారీ విధానం

  1. ముందుగా పెస‌ర‌ప‌ప‌ప్పు, బియ్యం, రాగుల‌ను తీసుకుని శుభ్రంగా క‌డిగి క‌నీసం రెండు గంట‌ల పాటు నానబెట్టాలి.
  2. ఇప్పుడు స్టౌ మీద కుక్క‌ర్ పెట్టుకుని అందులో నెయ్యి వేసి వేడి చేయాలి.
  3. నెయ్యి వేడెక్కాక అందులో తాలింపు గింజ‌ల‌ను వేసి అవి చిట‌ప‌ట‌లాడేవ‌ర‌కూ వేయించాలి.
  4. అవి వేగిన త‌ర్వాత ప‌చ్చిమిర్చి, ప‌సుపు, కూర‌గాయ ముక్క‌ల‌ను, ఉప్పు వేసి బాగా క‌ల‌పాలి.
  5. నిమిషం త‌ర్వాత అందులో గ‌రం మ‌సాలా వేసి క‌లుపుకొని ఆపై నాన‌బెట్టిన ప‌ప్పు, బియ్యం, రాగుల‌ను నీటితో స‌హా వేసి క‌ల‌పాలి.
  6. ఇలా క‌లిపిన తర్వాత మూత పెట్టి మూడు లేదా నాలుగు విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కూ ఉంచాలి.
  7. ఆపై స్టౌ ఆఫ్ చేసి కుక్క‌ర్ ప్రెష‌ర్ పోయాక మూత తీసుకుని ఇష్ట‌మైన వాళ్లు కొద్దిగా కొత్తిమీర‌ను చ‌ల్లుకోవాలి. 

అంతే ఎంతో రుచికరంగా ఉండే రాగి కిచిడీ రెడీ. ఇది అల్పాహారంగా ఆరోగ్యానికి ఎంతో మంచిది. రొటీన్‌కు భిన్నంగా ఉంటున్నందున పిల్లలూ ఇష్టంగా తింటారు.

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Previous articleవాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌.. ఇంటర్‌నెట్ లేక‌పోయినా ప‌ర్వాలేదు  ఫొటోలు, ఫైల్స్‌ పంపొచ్చు..!
Next articleచిల‌గడ‌దుంప వంకాయ కూర.. చిటికెలో చేసేయొచ్చు