మూవీ రివ్యూ: సూఫియుం సుజాతయుం
మూవీ రేటింగ్ : 3/5
నటీనటులు : జయసూర్య, అదితీ రావ్ హైదరీ, దేవ్‌మోహన్, సిద్దిఖీ
మ్యూజిక్ : ఎం.జయచంద్రన్
ప్రొడ్యూసర్ : విజయ్‌బాబు
బానర్ : ఫ్రై డే ఫిల్మ్ హౌజ్
డైరెక్టర్ : నరనిపూఝా షానవాస్
విడుదల : జూలై 3, అమెజాన్ ప్రైమ్ ఓటీటీ డైరెక్ట్ రిలీజ్ (మళయాలం మూవీ)
సూఫియుం సుజాతయుం మూవీ విడుదలకు ముందే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ట్రైలర్, వీడియో సాంగ్స్ అందుకు కారణం. థియేటర్ల లాక్డౌన్ కారణంగా ఓటీటీలో నేరుగా విడుదలైన సినిమాల్లో సూఫియుం సుజాతయుం కూడా చేరింది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో నేరుగా ఈ శుక్రవారం విడుదలైంది.
మళయాలంలో సూఫియుం.. సుజాతయుం.. అంటే సూఫి.. సుజాత అని అర్థం. కథలోకి వెళ్లేముందు సూఫిజం గురించి రెండు మాటలు చెప్పుకొందాం. సూఫిజం అనే పదం తసవ్వుఫ్ అని అరబిక్ పదం నుంచి వచ్చిందని చెబుతారు. తసవ్వుఫ్ అంటే హృదయాన్ని నిర్మలం చేయడం.
కామం, క్రోధం, ఈర్శ, అసూయ, కీర్తికాంక్ష, లోభం, మోసం వంటి దుర్గుణాలకు దూరంగా ఉంటూ హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవడం. సూఫీజం ఇస్లాం మతంలో ఒక ఆధ్యాత్మిక ఆచారమని సింపుల్‌గా చెప్పొచ్చు. ఆధ్యాత్మిక మార్గాన అల్లా ప్రేమను పొందడం సూఫీలు చేసే పని.
సూఫియుం సుజాతయుం కథ :
సుజాత (అదితీరావ్ హైదరీ) కథక్ డాన్సర్. మాటలు రావు. కానీ వినబడుతుంది. అనుకోకుండా బస్సులో కలిసిన సూఫీ(దేవ్ మోహన్)ను తొలిచూపులోనే ప్రేమిస్తుంది. సూఫీ.. ఓ మసీదులో చిన్నారులకు మతాచారాలు నేర్పుతుంటాడు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అటు మత గురువుకు గానీ, ఇటు సుజాత తండ్రికి గానీ ఈ ప్రేమ నచ్చదు.
మీ లవ్ జిహాద్ కోసం నా కూతురును వాడుకోవద్దని మత గురువుకు చెబుతాడు. మాటలు రాని తన కూతురిని వదిలేయమని ప్రాధేయపడతాడు. కానీ సుజాత సూఫీతో కలిసి వెళ్లిపోవాలనుకుంటుంది. అది తెలిసి తండ్రి ఆత్మహత్యాయత్నం చేస్తాడు. దీంతో సుజాత సూఫీని ఒదులుకుంటుంది.
అప్పటికే సుజాత అంటే ఇష్టపడే రాజీవ్ (జయసూర్య)తో తండ్రి పెళ్లి జరిపిస్తాడు. ఆ వెంటనే సుజాత్, రాజీవ్ దుబాయ్ వెళ్లిపోతారు. సూఫీ కూడా అప్పటికే ఊరొదిలి వెళ్లిపోతాడు. సరిగ్గా పదేళ్లకు ఊరి నుంచి ఫోన్ వస్తుంది. సూఫీకి సంబంధించిన కబురది. వెంటనే రాజీవ్ సుజాతను తీసుకుని ఆ వూరు ఎందుకు వెళ్తాడు? అక్కడేం జరిగిందన్నదే కథ.
మతం, కులం తేడా లేకుండా పెళ్లి చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. వివాహం చేసుకున్నప్పుడు వారు మతాన్ని ఎందుకు మార్చుకోవాలి. వారి వారి విశ్వాసాల ప్రకారం జీవించొచ్చు కదా.. కానీ మతం మార్పించడం వెనక ఉన్న రహస్యం ఏంటి? ప్రేమకు మతం అవరోధం కానప్పుడు.. జీవించడానికి ఎందుకు అవరోధం? కానీ ఎవరైనా ఏ మతమైనా మారేందుకు కూడా స్వేచ్ఛ ఉంది కదా.. ఇలా అనేక వాదోపవాదాలు సమాజంలో ఉన్నాయి. సినిమా ట్రైలర్ చూసినప్పుడు ఇదే చర్చ నడిచింది. ఈ వాదనలు పక్కనపెడితే సుజాత తండ్రి కూడా సుజాత ప్రేమను ఇవే కారణాలతో కాదంటాడు. కానీ ట్రైలర్ లో చూపించినట్టుగా ఇదేమీ ప్రధాన అంశం కాదు.
సుజాత తండ్రికి సుజాతపైన అపారమైన ప్రేమ ఉంటుంది. ఎంత ప్రేమంటే మరో బిడ్డ పుట్టి మాట్లాడితే సుజాత ఎక్కడ చిన్నబోతుందోనని ఇక పిల్లలు వద్దనుకునేంత ప్రేమ. మరో మతానికి చెందిన యువకుడు తన కూతురిని ప్రేమిస్తున్నాడని, లవ్ జిహాద్లో దించుతున్నాడని తండ్రి అపోహపడతాడే తప్ప తన కూతురి ప్రేమను తెలుసుకోలేకపోతాడు.
సుజాత సూఫీని పిచ్చిగా ప్రేమిస్తుంది. తనకు పెళ్లయి పదేళ్లయినా, పాప ఉన్నా మరిచిపోలేనంత ప్రేమ. గుండెల్లో గూడుకట్టుకున్నంత ప్రేమ. ఆ మూగ ప్రేమను మాటల్లో వ్యక్తపరచలేం. అంతటి ప్రేమను అర్థం చేసుకోగలగాలంటే అంతకంటే ఎక్కువ ప్రేమించి ఉండాలి. రాజీవ్ ప్రేమ కూడా అలాంటిదే.
నటీనటుల పెర్ఫార్మెన్స్ :
సినిమాలో సుజాత కథక్ డాన్సర్. ఓచోట అదితీరావు హైదరీ కథక్ నృత్య ప్రదర్శన చూసి ఈ సినిమాకు హీరోయిన్గా ఎంపికచేసినట్టు ప్రొడ్యూసర్ విజయ్ చెప్పారు. అదితీరావు అందం.. మూగమ్మాయిగా అభినయం ఆకట్టుకుంటుంది. దేవ్ మోహన్ నటన చాలా సహజంగా ఉంది. అదితీ, దేవ్మోహన్ల కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. జయసూర్య కూడా ఓ ప్రేమికురాలి భర్త పాత్రలో చక్కగా నటించాడు.
టెక్నీషియన్ల పనితీరు :
డైరెక్టర్ నరనిపూఝా షానవాస్‌కు ఇదే మొదటి సినిమా. కానీ చక్కగా తెరకెక్కించాడు. గతంలో కేరీ వంటి పలు షార్ట్ ఫిల్మ్స్ తీసిన అనుభవం ఉంది. క్లైమాక్స్ సన్నివేశం ఒక మాస్టర్ పీస్‌లాగా ఉంది. కెమెరా పనితీరు బాగుంది. మ్యూజికల్ లవ్ స్టోరీగా నిలిచేలా తగిన సంగీతాన్ని ఎం.జయచంద్రన్ అందించాడు. నేపథ్య సంగీతం బాగుంది.
సూఫియుం సుజాతయుం మూవీలో వాదిక్కలు వెల్లరిప్రావు .. వాకుకుండు ముట్టడుకిటు.. అనే పాట హైలైట్. అల్హందులిల్లా సాంగ్ కూడా ఆకట్టుకుంటుంది.