ఏపీలో అద్భుతమైన 10 బీచ్‌లు.. ఈ సమ్మర్‌లో టూర్ ప్లాన్ చేయండి

a view of a beach from a rocky cliff
వైజాగ్ బీచ్‌లోని ఒక దృశ్యం Photo by Vizag Explore on Unsplash

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనే అంద‌మైన బీచ్‌లు ఉండగా, ఎక్కడికో దూరంగా టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఈ వేస‌వికి సాగ‌ర‌ తీరాలే బెస్ట్ టూరిజం స్పాట్స్ అని చెప్పొచ్చు. పైగా ఖర్చు కూడా తక్కువే. మీరు  కూడా ఒక‌సారి కుటుంబంతో క‌లిసి ఈ బీచ్‌ల‌ను సంద‌ర్శించండి. బీచ్‌ అన‌గానే పెద్ద‌లు, పిల్ల‌లు కేరింత‌ల‌తో ఆడుకునే ఒక మంచి విహార‌ తీరం. స‌ముద్రపు అల‌లు కాళ్ల‌కు తాకుతుంటే ఎంతో ఆనందంగా, మ‌న‌సుకు హాయిగా అనిపిస్తుంది. సాగ‌ర‌తీరాన  తాకే సొగసరి అలలు ప్ర‌పంచాన్ని మైమ‌రిచిపోయేలా చేస్తాయి. సమయం ఇట్టే గడిచిపోతుంది. అక్కడ ఎంత సేపు ఉన్నా అల‌స‌ట ద‌రిచేర‌దు. అంద‌రూ క‌లిసి అల‌ల‌తో  ఆడుకుంటూ మంచి వాతావ‌ర‌ణాన్ని పొంద‌గ‌లుగుతాం. 

అందుకే, సాగ‌ర‌తీరాల‌లో ఉన్నంత హాయి మ‌రెక్క‌డా అనిపించ‌దు. అంతేకాదు వేస‌విలో ప‌ర్యాట‌కుల‌ను ఎక్కువగా ఆక‌ర్షించేవి కూడా ఈ బీచ్‌లే.  మ‌రి అలాంటి అంద‌మైన, ఆక‌ర్ష‌ణీయ‌మైన విశాల సముద్ర తీరంలో వినోదాన్ని పంచే బీచ్‌లు చాలానే ఉన్నాయి. వీటిలో అత్యధిక బీచ్‌లు విశాఖ జిల్లాలోనే ఉన్నాయి. పైగా బీచ్‌ల‌లో ఫెస్టివ‌ల్స్ కూడా నిర్వ‌హించ‌డం వ‌ల‌న అవి మ‌రింత ఆక‌ర్షిస్తున్నాయి. మ‌రి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన బీచ్‌ల‌ వివరాలు ఇప్పుడు మీ కోసం అందిస్తున్నాం. ఇందులో మీకు న‌చ్చిన వాటిని ఎంచుకుని ఈ వేస‌విని ఎంజాయ్ చేయండి.

1. రుషికొండ బీచ్ –  విశాఖ‌ప‌ట్నం

విశాఖ అంటేనే అందమైన బీచ్‌ల‌తో అతి సుంద‌రంగా క‌నిపించే న‌గ‌రం. ఈ న‌గ‌రంలో  ఉన్న బీచ్‌లు ప్ర‌తీఏటా ఎంతోమంది ప‌ర్యాట‌కుల తాకిడితో సంద‌డిగా మారుతుంటాయి. ఇందులో రుషికొండ బీచ్ అత్యంత ప్రాముఖ్య‌త క‌లిగిన‌ది. ఇది న‌గ‌రానికి 8 కిమీల దూరంలో ఉంటుంది. ఈ సాగ‌ర తీరానికి వెళ్లిన ప్ర‌తీసారీ  మీకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. అర్ధచంద్రాకారంలో ఉండే ఈ బీచ్‌లో రిసార్టులు, వినోద కేంద్రాలు, స్పీడ్ బోట్లు, విండ్ సర్ఫింగ్, స్విమ్మింగ్ వంటివి అందుబాటులో ఉంటాయి. ఇక్క‌డే ల‌వ్ ఫెస్టివ‌ల్‌ నిర్వ‌హిస్తుంటారు.

2. బరువా బీచ్: శ్రీ‌కాకుళం

శ్రీకాకుళం జిల్లాలోని ప్ర‌త్యేక‌త  మహేంద్రతనయ నది సమీపంలో ఉన్న బరువా బీచ్‌. ఇది  ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. ఇక్క‌డి సువిశాల‌మైన ఇసుక తిన్నెలు, సూర్యోదయం, సూర్యాస్తమయాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ప‌ర్యాట‌కుల‌కు మ‌రుపురాని గుర్తుల‌ను పంచుతాయి. సోంపేటకు ఈ బీచ్ చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే  ఈ బీచ్ సమీపంలోని పురాతన ఆలయాలు, లైట్ హౌస్‌లు మిమ్మల్ని తప్పకుండా ఆకట్టుకుంటాయి. శ్రీ‌కాకుళానికి 106 కిలోమీట‌ర్ల దూరంలో ఈ బారువా బీచ్ ఉంటుంది. ఇక్క‌డి స‌మీపాన కొబ్బ‌రితోట‌లు ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ర్షిస్తాయి.

3. భీమిలి బీచ్ – విశాఖ‌ప‌ట్నం

విశాఖ జిల్లాలో ఉన్న మ‌రొక అంద‌మైన బీచ్ భీమిలి బీచ్. భీమిలిని  భీమునిపట్నం అని కూడా పిలుస్తారు. గోస్తానీ నది పాయ ఇక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది. విశాఖపట్నం నుంచి 47  కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. ఈ బీచ్ అందాలు ప‌ర్యాట‌కుల‌ను  కట్టిపడేస్తాయి. స‌మీపాన సుందరమైన దృశ్యాలు కనువిందుగా ఉంటాయి. ఇక్క‌డి ఆహ్ల‌ద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం టూరిస్ట్‌ల‌ను స్వ‌ర్గ‌లోకాల‌కు తీసుకువెళుతుంది. ఇక్క‌డ స్విమ్మింగ్ చేయ‌డం కూడా సుర‌క్షితంగానే ఉంటుంది. ప‌చ్చ‌ని చెట్లు, ఆల‌యాలు ప్ర‌శాంత‌త‌కు మారు పేరు.

4. మంగినపూడి బీచ్ – మ‌చిలీప‌ట్నం

విజయవాడకు 75 కిమీల దూరంలో మచిలీపట్నానికి 11 కిలోమీట‌ర్ల దూరంలో ఈ బీచ్ ఉంది. సెలవు రోజుల్లో ఇక్క‌డ  ఇసుక రాల‌నంత జ‌నం ఉంటారు. టూరిస్ట్‌లు కూడా ఇక్క‌డ‌కు భారీగానే వ‌స్తుంటారు.  2004 సునామీ తర్వాత ఈ బీచ్ అత్యంత ప్రమాదకరంగా మారింది. దీంతో ఇందులో స్నానాలు చేయడం ప్రమాదకరమని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇక్క‌డ సమీపంలో ఉన్న చిలకలపూడి గిల్ట్ నగల తయారీకి ప్రసిద్ధి.

5. ఆర్కే బీచ్ – విశాఖ‌ప‌ట్నం

విశాఖ నగరంలో మొద‌ట‌గా చెప్ప‌ద‌గిన బీచ్‌ల‌లో ఆర్కే బీచ్ ముఖ్యమైనది. నిత్యం న‌గ‌రవాసుల‌తో,  పర్యాటకులతో కిటకిటాలడే ఈ బీచ్ ఎంతో  ఫేమ‌స్. అయితే ఇక్క‌డ  స్నానం చేయడం ప్రమాదకరం. ఈ బీచ్ సమీపంలో ఉన్న రామకృష్ణ మిషన్ పేరు పైనే ఈ బీచ్‌కు రామ‌కృష్ణ బీచ్‌ అని పేరొచ్చింది. ఇక్కడి నుంచి డాల్ఫిన్ నోస్ పర్వతం చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్క‌డ బోట్‌రైడ్ చేయ‌డానికి  కూడా అనుమ‌తి ఉంది.

6. యారాడా బీచ్ – విశాఖ‌ప‌ట్నం

ఈ బీచ్ కూడా వైజాగ్ న‌గ‌రానికి అతి ద‌గ్గ‌ర‌లో ఉన్నందున అక్క‌డి న‌గ‌ర‌వాసుల‌ను, ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఇది 15 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. ఈ సాగ‌ర‌తీరానికి చుట్టూ కొండ‌లు, ప‌చ్చ‌ని చెట్లు, అంద‌మైన ప్ర‌కృతి దృశ్యాలు  క‌ళ్ల‌కు ఇంపుగా క‌నిపిస్తాయి. అలాగే ఈ స‌ముద్ర‌తతీరాన అంద‌మైన సూర్యాస్త‌మ‌యం మైమ‌రిపిస్తుంది.

7. ఉప్పాడ బీచ్ – కాకినాడ

అంద‌మైన ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌లో కాకినాడ కూడా ఒక‌టి. ఇక్క‌డ ఉప్పాడ బీచ్ కూడా ప్ర‌సిద్ది చెందింది. ఈ బీచ్‌ను ఏటా ఎంతోమంది ప‌ర్య‌ట‌కులు సంద‌ర్శిస్తుంటారు. అలాగే అక్క‌డి స్తానికులు  వీలున్న ప్ర‌తీసారి ఈ సాగ‌ర‌తీరంలో  విహ‌రిస్తుంటారు. ఈ కాకినాడలో పర్యాట‌కుల‌ను ఆక‌ర్షించేవి కోరంగి అభయార‌ణ్యాలు, మ‌డ అడ‌వుల అందాలు, ఇంకా అక్క‌డ స‌మీపంలో ఉన్న ప్ర‌కృతి వ‌నాలు టూరిస్ట్‌ల‌ను మైమ‌ర‌పిస్తుంటాయి. అంతేకాకుండా కాకినాడ‌లో క‌మ్మ‌ని ఆంధ్రా భోజ‌నం, కాకినాడ కాజా, ఆత్రేయ‌పురం పూత‌రేకులు ఎంతో ఫేమ‌స్. వీటిని  ఒక్క‌సారైనా రుచి చూడాల్సిందే. అలాగే ఇక్క‌డ చేప‌లు, రొయ్య‌లు విరివిగా ల‌భిస్తాయి.

8. ఓడరేవు బీచ్:

విజయవాడకు 100 కిమీల దూరంలో చీరాలకు 6 కిమీల దూరంలో, గుంటూరుకు 35 కి.మీల దూరంలో ఈ బీచ్ ఉంది. ఉదయం సాయంత్రం వేళల్లో ఈ బీచ్‌కు సమీపంలో ఉన్న జాలర్లు సముద్రంలోకి వేటకు వెళ్తుంటారు. వారు పట్టుకున్న చేపలను ఇక్కడికి వచ్చే పర్యటకులకు అమ్ముతారు. జాలర్లు పర్యటకులను సైతం పడవల్లో ఎక్కించుకుని సముద్రంలోకి తీసుకెళ్తారు. ఇక్క‌డి స్థానికులు వారానికి ఒక్క‌సారైనా ఈ బీచ్‌లో గ‌డుపుతారు.

9. సూర్య‌లంక బీచ్ – బాప‌ట్ల

గుంటూరు జిల్లాలోని బాపట్లకు 9 కిలోమీట‌ర్ల దూరంలో ఈ బీచ్ ఉంది. ఇది నగరానికి దూరంగా ఉండటం వల్ల సాధారణ రోజుల్లో రద్దీ ఉండదు. కేవలం వారాంతాల్లో మాత్రమే రద్దీ కనిపిస్తుంది. ఇక్క‌డ స‌మీపాన ఆల‌యాలు, బ్రిటీష్ క‌ట్ట‌డాలు చూడ‌ద‌గిన‌వి. ఈ బీచ్‌లో రిసార్ట్‌లు, స్టాల్స్ కూడా అందుబాటులో ఉంటాయి.

10. పేరుపాలెం బీచ్ – ప‌శ్చిమ‌గోదావ‌రి

ఇది ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఫేమ‌స్ అయిన బీచ్. ఈ సాగ‌ర‌తీరం ప‌ర్య‌ట‌కుల‌ను ఎంతో మ‌నోహ‌ర‌మైన ప్ర‌కృతి అందాల‌కు దాసోహం చేస్తుంది. ఈ బీచ్ ద‌గ్గ‌ర‌లో వెంక‌టేశ్వర దేవాల‌యాం,  వేలాంగ‌ణి మాతా దేవాల‌యాలు ముఖ్య‌మైన‌వి.

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Previous articleకోడిగుడ్డు జున్నుకూర: ఒకసారి తింటే విడిచిపెట్టలేని రెసిపీ
Next articleఈ వారం ఓటీటీ విడుదల: 20కి పైగా సినిమాలు.. స్ట్రీమింగ్ ఎందులో అంటే!