Ugadi Pachadi Recipe: ఉగాది పచ్చడి ఎలా చేస్తారు? ఏయే పదార్థాలు కావాలి?

A Happy Ugadi puja tray Telugu Hindu New Year Vaisakhi
ఉగాది పచ్చడి"A Happy Ugadi puja tray Telugu Hindu New Year Vaisakhi" by Kalyan Kanuri is licensed under CC BY-SA 2.0

Ugadi Pachadi Recipe: ఉగాది రానే వచ్చింది. మరి ఉగాది పచ్చడి ఎలా చేస్తారు? ఏయే పదార్థాలు అవసరం? ఇవన్నీ మీకు తెలుసా? ఏం వర్రీ అవకండి. ఇవన్నీ ఈ వసంత రుతువులో ప్రకృతి ప్రసాదించే వరాలే. ఉగాది వేళ కోయిల కుహూకుహూ రాగాలు, ప‌క్షుల కిల‌కిల‌లు, రంగు రంగుల పువ్వులు, క‌మ్మ‌ని వేప‌పూత సుగంధం, మామిడి పిందెల సోయ‌గంతో ప్ర‌కృతి శోభిల్లుతుంది. 

తెలుగు ప్ర‌జ‌లంతా ఎంతో వేడుక‌గా చేసుకునే తెలుగు సంవ‌త్ప‌రాది పండుగ ఉగాది. ప్ర‌తి ఇంట ముగ్గుల ముంగిళ్లు, ప‌చ్చ‌ని తోర‌ణాలు, పిండి వంట‌ల‌తో వ‌సంతానికి స్వాగ‌తం ప‌లుకుతూ స్నేహితుల‌తో, కుటుంబంతో, బంధు మిత్రులతో ఆనందాల‌ను పంచుకుంటారు. శ్రీ క్రోధి నామ సంవ‌త్స‌రం జీవితంలో సుఖ, సంతోషాల‌ను క‌లిగించాల‌ని త‌మ ఇష్ట‌దైవాన్ని ఆరాధిస్తారు. ఎన్నో భావోద్వేగాల‌ను త‌న‌లో ఇముడ్చుకున్న ష‌డ్రుచుల ఉగాది ప‌చ్చ‌డిని నైవేద్యంగా భ‌గ‌వంతునికి స‌మ‌ర్పించి ఇంటిళ్ల‌ిపాది ఆ ప‌చ్చ‌డిని తింటే ఆయురారోగ్యాలు క‌లుగుతాయ‌ని తెలుగు ప్ర‌జ‌ల న‌మ్మ‌కం.

ఉగాది ప‌చ్చ‌డి ప‌ర‌మార్థం:

ఉగాది అన‌గానే ఆరు రుచుల‌తో చేసుకునే ప‌చ్చ‌డి ప్ర‌త్యేకం. తీపి, చేదు, వ‌గ‌రు, పులుపు, కారం, ఉప్పు ఇలా ఇన్ని ర‌కాల రుచుల మేళ‌వింపు మ‌రే సంద‌ర్భంలోనూ ఉండ‌దు. జీవితంలో సుఖ దు:ఖాలను ఎదుర్కొంటూ వాటిని సమానంగా తీసుకోవాలన్నదే దీని పరమార్థం. సుఖ సంతోషాలు ఉన్నట్టే కష్టనష్టాలు, బాధలు, సవాళ్లు ఉంటాయని, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఈ షడ్రుచులకు అర్థం. ఈ ష‌డ్రుచుల ఉగాది ప‌చ్చ‌డిని ఇలా త‌యారుచేసుకోండి.

ఉగాది పచ్చడికి కావ‌ల‌సిన ప‌దార్థాలు:

ప‌చ్చి మామిడికాయ (స‌న్నని త‌రుగు) – ఒక క‌ప్పు

వేప‌పువ్వు (పూరేకులు మాత్రమే) – 1/2 క‌ప్పు

కొత్త చింత‌పండు గుజ్జు – 1/2 క‌ప్పు

బెల్లం త‌రుగు – 1/2 క‌ప్పు 

ఉప్పు – చిటికెడు 

మిరియాల పొడి – 1/4 స్పూన్

జీల‌క‌ర్ర – 1/2 స్పూన్ 

ఉగాది పచ్చడి త‌యారీ విధానం:

మామిడికాయ త‌రుగును వెడ‌ల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి. దానిలో వేప‌పూత (రెండు చేతుల మ‌ధ్య సున్నితంగా న‌లిపి చెరిగితే వ‌చ్చే పువ్వు రేకులు), కొత్త చింత‌పండు గుజ్జు, కొత్త బెల్లం త‌రుగు, ఉప్పు, మిరియాల పొడి, జీల‌క‌ర్ర‌, ఇష్ట‌మైతే అర‌టిపండు ముక్క‌లు వేసి అన్నీ క‌లిసేలా చేతితోనే క‌ల‌పాలి. అంతే ష‌డ్రుచుల ఉగాది పచ్చడి రెడీ. సంవ‌త్సరాది నుంచి మ‌ళ్లీ వ‌చ్చే ఉగాది వ‌ర‌కూ జీవితంలో అనేక సంతోషాలను, ఒడిదుడుకుల‌ను, సవాళ్ల‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలనే సందేశమే ఈ ప‌చ్చ‌డి అర్థం.

Previous articleతిరుప‌తి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. సమ్మర్ స్పెష‌ల్ ట్రైన్స్ రెడీ
Next articleఉగాది నేతి బొబ్బ‌ట్లు రెసిపీ: ఇలా చేయండి.. ఇట్టే నోట్లో క‌రిగిపోవాల్సిందే