అణచివేత సాధారణమైనప్పుడు ఆత్మగౌరవం కోసం పోరాడటం అసాధారణంగానే కనిపిస్తుంది. వేట కుక్కలన్నీ ఏకమై దాడికి యత్నించినప్పుడు అడుగు వేయకుండా ఉండటమే తిరుగుబాటు అవుతుందన్నది అక్షర సత్యం. అవును, ఈ `ఏడుతరాల` కథలు మన గడ్డపై కూడా ఉన్నాయని నమ్మక తప్పదు.
నేను ఇటీవల చదివిన బుక్కుల్లో చాలా రోజుల తర్వాత ఎంతగానో ఆత్మసంతృప్తిని కల్గించినది ఈ `వీరయ్య` పుస్తకమని స్పష్టంగా చెబుతాను. ఒక మంచి పుస్తకం చదివి ఆస్వాదిస్తే, అది ఇచ్చే ఆనందమెంటో అనుభవిస్తే గానీ చెప్పలేం. ఈ వీరయ్య పుస్తకం మాత్రం నన్ను ఏడుతరాలు(ఆంగ్లంలో రూట్స్), ‘మా నాయన బాలయ్య’ తర్వాత ఇంత స్థాయిలో ఉద్వేగ, భావోద్వేగానికి గురి చేసిందని చెప్పగలను.
పొట్ట చేత్తో పట్టుకుని సముద్రాల అవతలున్న ప్రాంతానికి ఓడెక్కిన ఓ బక్క రైతు కూలీ, తన రక్తమాంసాలను.. అక్కడి చెరుకు తోటలకు ఎరువుగాను.. కన్నీటిని పంటకి నీరుగాను.. తమ చెమటను చెరుకుగడకు తీపిగాను ఎక్కించిన తీరు చదివితే కచ్చితంగా కదిలిపోతాం.
కాదు… కాదు. మనల్ని కదిలించేలా చేశాడా పుస్తక రచయిత గుబిలి కృష్ణ. మనకి ఏమాత్రం తెలియకుండానే, కండ్లు కడలిని తలపిస్తాయి. అలల తాకిడి లేని నిశ్శబ్ద సముద్రం మాదిరి మనల్నిఒక్కసారిగా మౌనం ఆవహిస్తుంది.
మీ తాత పేరు ఏమిటి నాయనా? అని ప్రశ్నిస్తే నేనైతే అంతవరకే జవాబు చెప్పగలను. అటు తర్వాత మీ తాత వాళ్ళ నాయన పేరు ఏమిటీ? అని అడిగితే.. నాకు తెలియదని బిక్క మొఖం వేస్తాను. కానీ, ఈ పుస్తక రచయిత గుబిలి కృష్ణ మాత్రం తన తాత వాళ్ళ తండ్రి గురించిన అంశాలను తెలుసుకునేందుకు చేపట్టిన చర్యలు, తీసుకున్న శ్రమ నిజంగా ప్రశంసనీయం.
రచయిత గుబిలి కృష్ణ తన తాత ముత్తాల మూలాలన్ని వెతుక్కుంటూ దక్షిణాఫ్రికా చరిత్రపుటల్లోకి తవ్వుకుంటూ వెళ్ళిపోయి, అక్కడినించి, ఘనీభవించిన.. తమ కుటుంబ పాతతరాల కన్నీటి బిందువుల్ని అక్షరాలుగా పేర్చి ‘వీరయ్య’గా మన ముందు పెట్టాడు.
ఈ పుస్తకం… ఏకబిగిన చదవడమంటే గొప్ప అనుభూతి పొందడమే. పుస్తకం చదువుతుంటే గుండె తట్టుకోలేదు. కండ్లలోనే కన్నీరు ఇంకిపోతుంది. ఈ పుస్తకం వల్ల నాకు రెండు విషయాలు తెలిశాయి. ఒకటి… మనిషి మీద సాటి మనిషి చేసే దాష్టీకం. రెండవది, నాగరికుల చేతుల్లో అనాగరికంగా నలిగిన ఒక మనిషి కష్టాలకు ఎదురొడ్డి ! మానవ జాతికంతటికీ కాంతి దీపస్తంభమవడం.
సారూప్యత వెనక బానిసత్వపు మూలాలు
సాధారణంగా మనం ఇతర ఖండాల్లోని సెలబ్రెటీల పేర్లు మన దేశ పేర్లులాగే వినిపించినప్పుడు ఏదో సారూప్యత ఉందా? అని కూడా యోచన చేయకుండానే ఆ విషయాన్ని విస్మరిస్తుంటాం. ఇంకేదో దేశానికి భారత మూలాలున్న వ్యక్తి ప్రజా ప్రతినిధిగా గెలిచాడంటే వావ్… వండర్‌ఫుల్ అనుకునే మరచిపోతుంటాం.
కానీ వాళ్ళకి మనలాంటి పేర్లే ఎందుకు ఉన్నాయని, వాళ్ళంతా అక్కడికి ఎందుకు వలస వెళ్ళిపోయారని… దానికి కారణాలేంటన్నది మాత్రం అస్సలంటే అస్సలు దృష్టి పెట్టము. ఒక వేళ ఆలోచించినా అందుకు మనకు సమాధానం ఎప్పుడూ దొరకదు. దొరకలేదు.
కానీ ఈ “వీరయ్య” పుస్తకంతో మనకి సమాధానాలు లభించడమే కాదు, ఎంతో విషాదకరమైన, మనం ఎప్పుడో మరిచిపోయిన లక్షలాదిమంది భారతీయుల చరిత్ర తెలిసింది. ఇందులో అంశాలన్నీ చదివిన తర్వాత నా రెండు చేతులపై ఉన్న రోమాలు నిక్కపొడిచాయంటే అతిశయోక్తి కాదు.
నాగరిక దేశంగా పేరొందిన బ్రిటిష్ పాలకులు నల్లజాతి ప్రజానీకాన్నిబానిసత్వం పేరుతో ఏ విధంగా వారి శ్రమని దోచుకున్నారని, వారిని ఎంతస్థాయిలో హింసించారన్న విషయం అవగతం అవుతుంది. `కూలీ` అన్న పదానికి అర్థం ఏ విధమైన నైపుణ్యం లేనివాడని మిరియమ్ వెబ్‌స్టర్ ఇంగ్లీషు డిక్షనరీ చెబుతోంది.
కూలీల బానిసత్వాన్ని ప్రపంచమంతా రద్దు చేసినప్పటికీ ఇండెంచర్ అనే కొత్త పద్ధతిలో కొన్ని లక్షలమంది భారతీయులను వారు ఆక్రమించుకున్న ఇతర దేశాల్లోని చెరుకు ఎస్టేట్‌ల్లో పని చెయ్యడానికి బానిసల స్థానంలో బ్రిటిష్ వారు తీసుకెళ్ళారు. అలా వెళ్ళిన వారిలో వీరయ్య అనే తెలుగువాడు ఈ పుస్తక కథనాయకుడు.
ఆయన జీవితాన్ని, చర్రితనూ తవ్వుకుంటూ వెళ్ళిన అతని మునిమనవడు గుబిలి కృష్ణ రాసిన ఈ “వీరయ్య” పుస్తకం అలెక్స్ హేలీ “రూట్స్” తో పోల్చదగినదనడంలో సందేహం లేదు. ఇంకా చెప్పాలంటే, గ్రీక్ ఎపిక్ కథల్లో `సిసిఫస్` అనే రాజు అనుభవించిన శిక్ష మాదిరి ఈ పుస్తక రచయిత తన పూర్వీకుల కోసం చేపట్టిన శోధన ఉందని తొలుత నాకు అనిపించింది.
ఒక గట్టి నమ్మకంతో ప్రయతాన్ని ప్రారంభించడం, విఫలమై, నిస్పృహకు గురి కావడం, మళ్ళీ ప్రయత్నాలను షురూ చేయడం ఇలా ఆయనకు సుమారు రెండు దశాబ్ధాలు అయిందంటే నమ్మకుండా ఉండలేం. కానీ, చివరికి ఆయన అనుకున్నది దొరకబట్టి తాను మాత్రం `సిసిఫస్` కాదని నిరూపించాడు రచయిత గుబిలి కృష్ణ.
కొర్లపాడు నుంచి నటాల్..
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడకి సమీపాన గల కొర్లపాడు 1882లో జన్మించిన వీరయ్య అనే యువకుడి కుటుంబంలో జరిగిన ఓ ఘటన తన జీవిత స్థితిగతులనే పూర్తిగా మార్చి వేస్తుంది.
తన తల్లిదండ్రులపై అలిగి ఆ ప్రాంతం నుంచి విజయవాడ పట్టణానికి వెళ్ళిపోతాడు. అక్కడ పని కోసం చూస్తుండగానే ఇండెంచరు పద్ధతిలో ఇతర దేశాలకు బ్రిటీష్ పాలకులు కూలీలను తీసుకెళుతున్నారని తెలుసుకుంటాడు.
అయితే, ముందుగా మంచి వేతనం, రేషన్ సదుపాయం కల్పిస్తామని చెప్పడంతో ఆయన అందులో చేరి, చైన్నై మీదుగా సుమారు రెండు నెలలు ఓడలో ప్రయాణించి దక్షిణాఫ్రికాలోని నటాల్ ప్రాంతానికి చేరతాడు. అక్కడికి చేరిన తర్వాత గానీ మన పుస్తక కథనాయకుడు వీరయ్యకి అసలు సినిమా తెలియదు.
తన లాగే సుమారు 13 లక్షల మంది ఇక్కడికి వచ్చి మోసపోయారని, ఇక తిరిగి వెళ్ళే పరిస్థితి లేదని గ్రహిస్తాడు. పొద్దు ఉన్నంత సేపు పొలంలో చెఱకు తోటల్లో పని చేసి వారికొచ్చే అరకొర రేషన్ తో బతుకు వెళ్ళదీయడమే అవుతుంది తన రోజువారీ వ్యవహారం.
నాటి సాంప్రదాయ సమాజపు రథచక్రంలో మహిళలు కూడా వారితో కూలీలుగా వచ్చారని, వారి మధ్య అక్కడ ఉండే సంబంధాలను సైతం వీరయ్య బేరీజు వేసుకుంటాడు. అయితే, నటాల్‌లో చేరిన కొన్ని సంవత్సరాల తర్వాత వీరయ్య మరొక కంపెనీకి మారతాడు.
ఇక అక్కడి నుంచి మన కథానాయకుడు మరో ఉద్యోగంలో పదోన్నతి పొందుతాడు. పెద్ద ఎత్తున డబ్బు సంపాదిస్తాడు. అక్కడే తెలుగు అమ్మాయి రాజమ్మను ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. నలుగురు కొడుకులు, ఒక అమ్మాయికి జన్మనిచ్చి మంచి జీవితాన్ని కొనసాగిస్తుంటాడు.
బారిస్టర్ చేసి అక్కడి సమస్యలపై పోరాడుతున్న భారత స్వతంత్ర సమరయోధుడు మహాత్మాగాంధీని సైతం అక్కడే వీరయ్య కలుసుకుంటాడు. భారత్ నుంచి వచ్చిన లక్షలాది ఇండెంచరు కూలీల కోసం పోరాడాలని ఆయనకు విజ్ఞప్తి చేస్తాడు. ఆ దేశంలో వీరయ్య ఎంత ఉన్నతమైన జీవితాన్ని కొనసాగించినా తన సొంత ఊరులోని వారికి చెప్పకుండా వచ్చేశాన్న వెలితి మాత్రం ఆయనను ఎప్పుడూ వెంటాడేది.
25 ఏళ్లకు స్వస్థలానికి..
సుమారు 25 సంవత్సరాలకు పైగా అక్కడ ఉన్న తర్వాత 1932లో ఆయన ఇండియాకు వచ్చి తన కుటుంబీకులను కలుసుకోవాలని నిర్ణయించుకొని పెట్టా బేడాతో అందరినీ తీసుకొని బయలుదేరుతాడు. కానీ, ఇక్కడికి వచ్చాక ఆయనకు అన్నీ చేదు పరిస్థితులు ఎదురవుతాయి. తన నాన్న, అమ్మ, అక్క అందరూ చనిపోయారని తెలుసుకొని తీవ్ర మనోవేధనకి గురవుతాడు.
కొంతమంది సాయంతో తన చిన్నక్క, చెల్లి బతికి ఉందని తెలుసుకొని వారిని కలుస్తాడు. ఈ క్రమంలో బంధువుల పేరుతో ఎంతోమంది వచ్చి తన దగ్గర డబ్బును అవసరాల పేరుతో లాగే ప్రయత్నం చేస్తుంటారు. ఇదంతా గమనిస్తున్న వీరయ్య భార్య ఆయన్ని ఎప్పటికప్పుడూ వారిస్తుంటూనే ఉంటుంది.
తన కూతురు ఇక్కడి పరిస్థితులకు విసిగి పోయి తన భర్తను తీసుకొని ఆంధ్ర నుంచి మళ్ళీ దక్షిణాఫ్రికాలోని నటాల్‌కి తిరిగి పయనం అవుతుంది. వీరయ్య మాత్రం తన భార్య మాటని వినిపించుకోకపోవడంతో ఆర్థికంగా చతికిల పడిపోయాక, నిజామాబాద్‌లోని బోధన్ షుగర్ కంపెనీలో పనికి కుదురుతాడు.
ఈ క్రమంలోనే తన మూడో కుమారుడు అనారోగ్యంతో మృతి చెందడంతో కుప్పకూలిపోయిన వీరయ్య.. నిత్యం దిగులుపడుతూ మంచానికి పరిమితం అవుతాడు. దక్షిణాఫ్రికాలో అష్ట ఐశ్వర్యాలను అనుభవించే తాను.. తల్లిదండ్రులు, కుటుంబీకుల కోసం వచ్చి ఇన్ని కష్టాలను ఎదుర్కొంటున్నానేంటీ? అంటూ ఏనాడు ఆలోచన చేయడు.
మళ్ళీ దక్షిణాఫ్రికా వెళదామని అనుకున్నా దేశాల మధ్య నెలకొన్న కొత్త రాజకీయ పరిస్థితులు ఆయనకు సహకరించవు. ఈ బాధలన్నింటీనీ దిగమింగుకుంటూనే వీరయ్య 1952లో కన్నుమూయడంతో కథ ముగుస్తుంది.
అయితే, తన తాతలాగే ఇప్పటికీ గల్ఫ్ దేశాలకి వలస వెళుతున్న ఎంతోమంది కూలీల పరిస్థితులపై పోరాటం చేస్తూ వారికి అండగా నిలుస్తున్న బసంత్‌రెడ్డి గురించి పుస్తకంలో చెప్పి మనకి ప్రస్తుత విషయాలపై కూడా అవగాహన కల్పించారు కృష్ణ.
చివరగా, ఇంత వేధనభరిత కథని అక్షరీకరించేందుకు తమ కుటుంబాన్ని మళ్ళీ కలిపేందుకు(గెట్-టూ-గెదర్) కృష్ణ పడిన శ్రమ ఈ చిన్ని విశ్లేషణలో చెప్పడం సాధ్యం కాదు. మొత్తం విషయం తెలుసుకోవాలంటే పుస్తకం ఆసాంతం చదవాల్సిందే డ్యూడ్. పుస్తకం అమెజాన్ లో అందుబాటులో ఉంది.
– రచయిత : ఎస్వీ, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
ఇవి కూడా మీకు నచ్చుతాయి: