వైరస్, బయో వార్ మూవీస్ పై ప్రపంచ సినిమా గురి

virus movies
Photo by Lê Minh from Pexels

కరోనా వైరస్, దాని చుట్టూ అల్లుకున్న భయాలు, అనుమానాలు ఇక ప్రపంచవ్యాప్తంగా సినిమా రంగానికి కథాంశాలుగా మారనున్నాయి. ముఖ్యంగా కరోనా వైరస్ మొదటిసారి బయటపడ్డ చైనాపై ప్రపంచ సినిమా గురి పెట్టే అవకాశాలు ఉన్నాయి. కేవలం సినిమా రంగమే కాకుండా.. నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ సర్వీసులు వెబ్ సిరీస్ లకు వైరస్ ను కథాంశంగా ఎంచుకోనున్నాయి.

వాస్తవిక ఘటనల ఆధారంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటిపకే బోలెడన్ని సినిమాలు తెరకెక్కాయి. అందులోనూ వైరస్ ఆధారంగంగా ఇప్పటికే హాలీవుడ్ తో పాటు, మన దేశంలో కూడా దక్షిణాది చిత్ర పరిశ్రమలో పలు సినిమాలు తెరకెక్కాయి.

ఇందులో కేరళలో వెలుగు చూసిన నిఫా వైరస్ పై 2019లో ‘వైరస్’ పేరుతో తెరకెక్కిన మళయాళి చిత్రం మంచి థ్రిల్లర్ గా ప్రశంసలు పొందింది. ఇక తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో సూర్య ప్రధానపాత్రలో వచ్చిన 7th సెన్స్ కూడా వైరస్ నేపథ్యంలోనే తెరకెక్కింది. ఈ చిత్రంలో భారత్ పై బయోవార్ లో భాగంగా చైనానే ఒక వైరస్ ను వదుతుంది.

కంటేజియన్ వంటి మూవీస్ అనేకం

ఇక హాలీవుడ్ లో చూస్తే 2011లో విడుదలైన కంటేజియన్ చిత్రం ప్రస్తుత కోవిడ్ పరిస్థితులను అద్దంపడుతుంది. ఈ సినిమాలో కోవిడ్ 19 అన్న మాట తప్ప.. మిగితాదంతా సేమ్ టూ సేమ్.. అయితే వైరస్ సోకగానే చనిపోవడం తప్పనిసరి అన్న భయాన్ని ఆ సినిమా కలిగింపజేస్తుంది తప్ప ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న వాతావరణాన్ని మొత్తం 9 ఏళ్లకు ముందే కళ్లకు కట్టింది.

అలాగే వైరస్ కథాంశం నేపథ్యంలో అవుట్ బ్రేక్, 93 డేస్, 28 డేస్ లేటర్, 12 మంకీస్ లాంటి పలు చిత్రాలు తెరకెక్కాయి. ఇలా వైరస్ నేపథ్యంలో ఎన్ని చిత్రాలు విడుదలైనప్పటికీ అందులో వాస్తవ ఘటనలపై తెరకెక్కినవి వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. వీటిలో అనేకం కల్పిత కథల ఆధారంగానే తెరకెక్కాయి. వాటితోనే ఇప్పుడు కరోనా వైరస్ పరిస్థితులను పోల్చుకుంటున్నారు.

కరోనా వైరస్ చుట్టూ ఎన్నో కథలు

కల్పిత వైరస్ ల ఆధారంగా అనేక చిత్రాలు ఇప్పటికే తెరకెక్కిన నేపథ్యంలో ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పై సినీ ప్రపంచం దృషి పడకపోదు. చిత్రాలు విడుదలకాకపోవు. వీటికి కొంత సమయం పట్టవచ్చు. ఇక చిత్రాల్లో కథలు.. ఒక దేశం నుంచి ప్రపంచ వ్యాప్తంగా వైరస్ ఏ విధంగా విస్తరించింది? అసలు వైరస్  ఏ విధంగా వెలుగు చూసింది? ఎలా వ్యాప్తి చెందింది, వైరస్ సృష్టిలో, వ్యాప్తిలో కుట్ర దాగి ఉందా? ఒక వేళ కుట్ర కోణం ఉంటే ఎవరు చేశారు? ఎందుకు చేశారు? వాటి వెనక ఉన్న శక్తులు, ఉద్ధేశాలు, వాణిజ్య ప్రయోజనాలు వంటి అంశాలపై మనం సినిమాలు చూడాల్సిన రావచ్చు!

అలాగే కరోనా వైరస్ బయో వార్ అయి ఉండొచ్చని కొన్ని దేశాలు ఆరోపణలు చేస్తున్నాయి. పలు దేశాల ఆర్థిక వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసి అగ్రరాజ్యంగా ఎదిగేందుకు కుట్ర జరిగిందని కొన్ని దేశాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. బయో వార్ కథాంశంగా కూడా మరిన్ని సినిమాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

హాలీవుడ్ టార్గెట్ చైనానే?

కరోనా వైరస్ విషయంలో చైనాపై అమెరికా మండిపోయి ఉంది. ఈ వైరస్ కు కారణం చైనానే అని, వైరస్ ను పుట్టించింది ఆ దేశమే అన్నది అమెరికా ఆరోపణ. ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే పలు సందర్భాల్లో బహిరంగంగానే ఆరోపణలు చేశారు.

ప్రపంచం మొత్తం దీన్ని కరోనా వైరస్ అని పిలుస్తుంటే.. అమెరికా మాత్రం దీన్ని చైనా వైరస్ అని, వుహాన్ వైరస్ అని పిలుస్తోంది. అసలు ఇదంతా చైనానే చేసిందనేది అమెరికా వాదన. ఈ వైరస్ బయటపడ్డ తొలినాళ్లలో చైనీయులపై అమెరికన్లు మెట్రోలో దూషణలకు దిగిన సంఘటనలు కూడా మనం చూశాం.

ఇవన్నీ అమెరికన్లు చైనాపై ఎంత కోపంతో ఉన్నారనేందుకు నిదర్శనమని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ పై హాలీవుడ్ లో తెరకెక్కే చిత్రాలు నేరుగా చైనాను టార్గెట్ చేస్తాయనడంలో అతిశయోక్తి లేదు. ఇక చైనా విషయానికి వస్తే అసలు ఈ వైరస్ ను అమెరికానే తమ దేశంలో వదిలిందని ఆరోపిస్తోంది.

2019 అక్టోబర్ లో జరిగిన అంతర్జాతీయ మిలటరీ క్రీడలు సందర్భంగా అమెరికానే ఈ వైరస్ చైనా కు వచ్చేలా కుట్ర చేసిందని అరోపిస్తోంది. చైనా చేస్తున్న ఈ ఆరోపణలపై ఆ దేశంలో కూడా సినిమాలు తెరకెక్కవచ్చు.

కరోనాపై యావత్ ప్రపంచ అభిప్రాయాలు, అమెరికా ఆరోపణలు, చైనా వాదనలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయలు, ఎవరికెన్ని అనుమానాలు ఉన్నా అవన్నీ రానున్న రోజుల్లో తెరకెక్కమానవు. ఇలా రాబోయే రోజుల్లో కరోనా వైరస్, చైనాపైనే ప్రపంచ సినిమా గురి ఉండనుందనడంలో అతిశయోక్తి లేదు.

ఇవీ చదవండి

  1. బెస్ట్ వెబ్ సిరీస్ ఏంటి?
  2. ఇన్ సైడ్ ఎడ్జ్ వెబ్ సిరీస్ రివ్యూ 
Previous articleYama kupam book review: యమకూపం – ఆ వేశ్యల వెనక రాబందులు ఎవరు?
Next article..ఇదే రాణా ప్రేయసి మిహీకా బజాజ్ ఫిలాసఫీ