Winter season tips: వింటర్ సీజన్‌లో సరైన టిప్స్ పాటిస్తే ఎంజాయ్ చేయొచ్చు. కొద్దిగా ప్లాన్ చేసుకుంటే చాలు మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఈ వెదర్‌ను ఎంచక్కా ఆస్వాదించవచ్చు. ఇందుకు పాటించాల్సిన వింటర్ టిప్స్ మీకోసం..
Winter season tips: మీ ఇల్లును ఇలా సిద్ధం చేయండి
Winter Tip 1. వింటర్‌ను ఎదుర్కొనేందుకు వీలుగా మీ ఇంటిని రెడీ చేయండి. గాలి వెలుతురు అపారంగా వచ్చే ఇల్లయితే మీరు తప్పనిసరిగా చలి నుంచి రక్షణకు ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఇంట్లోకి గాలి బాగా వీచే చోటును అట్ట పెట్టెల కవర్‌తో గానీ, ప్లాస్టిక్ కవర్‌తో గానీ, కర్టెన్ రైజర్‌లతో గానీ రెండు మూడు నెలలు పటిష్టంగా ఉండేలా బిగించేసేయాలి. స్వల్పంగా గాలి చొరబడే వీలు కల్పించండి. లేదంటే మరీ సఫొకేషన్ ఏర్పడుతుంది. బాగా చల్లగా ఉండే ఇల్లయితే మాత్రమే హీటర్లను ఆశ్రయించాలి. లేదంటే అవసరం లేదు. హీటర్లు కూడా ఆయిల్ హీటర్ ఆప్షన్ మాత్రమే ఎంచుకోవాలి. బ్లోయర్ లాంటిది గదిలో ఆక్సిజన్‌ను కాల్చేస్తుంది. బడ్జెట్ అంత లేదనుకుంటే లైట్లతో కూడిన హీటర్లు కూడా ఉంటాయి. వాటిని ఎంచుకోవచ్చు. కానీ కరెంటు బిల్లు మాత్రం వాచిపోతుంది. ఇక స్నానానికి గీజర్ అవసరం అవుతుంది. చలికాలంలో బాగా వేడి నీటి స్నానం మేలు చేయదు. గోరువెచ్చని నీళ్లు సరిపోతాయి. అయినప్పటికీ మీ గీజర్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చెక్ చేసుకుని మరమ్మతులు అవసరమైతే చేయించండి.
Winter season tips: మీ శరీరాన్ని సిద్ధం చేయండి
Winter Tip 2. వింటర్‌ను ఎదుర్కొనేందుకు మీరు మీ శరీరాన్ని కూడా సిద్ధం చేయాలి. ముందుగా మీకు తగినన్ని ఉన్ని దుస్తులు అంటే స్వెటర్ లేదా జాకెట్ వంటివి ఉన్నాయా? చూసుకోండి. వీటితో పాటు చర్మానికి అతుక్కుపోయేలా ఉండే థర్మల్స్ కూడా మార్కెట్లో, ఆన్‌లైన్‌లో లభిస్తాయి. థర్మల్స్ అంటే బనియన్ క్లాత్‌లాగే ఉంటుంది. ఇంకాస్త మందంగా ఉంటుంది. ఫుల్ హాండ్స్ బనియన్ మాదిరిగా, అలాగే లెగ్గిన్ మాదిరిగా వస్తాయి. ఇవి చర్మానికి బిగుతుగా పట్టి ఉండడంతో గాలి లోపలకి చొరబడదు. దీంతో మీరు చల్లగాలి నుంచి రక్షణ పొందుతారు. ఇక తరచుగా బయటికి వెళ్లాల్సి వస్తే మీ చెవులను, ముక్కును కవర్ చేసుకోవడం చాలా మంచింది. చెవులకు రక్షణగా కాటన్ బాల్స్ గానీ, చెవులను కవర్ చేసేలా ఉన్నిని పట్టి ఉంచే హెడ్ ఫోన్స్ లాంటి పరికరం గానీ వాడాలి.
Winter season tips: వింటర్ వ్యాధుల నుంచి రక్షణకు
Winter Tip 3. వింటర్‌లో తరచూ వచ్చే ఆరోగ్య సమస్యలో జలుబు, దగ్గు, ఫ్లూ తరహా జ్వరాలు. వీటి నుంచి రక్షణకు ఫ్లూ వాక్సిన్ వేయించుకోవడం మంచిది. ఒకరి నుంచి మరొకరికి ఇవి సోకకుండా తరచుగా మీ చేతులు శుభ్రపరుచుకోవాలి. ఫ్లోర్ క్లీనర్లు ఉపయోగించి తరచుగా ఫ్లోర్ క్లీన్ చేసుకోవాలి. వింటర్ రాగానే ముందుగా ప్రభావం కనిపించేది చర్మం, పెదాలపైనే. పెదాల రక్షణకు వెన్న లేదా మీగడ పెరుగు బాగా పనిచేస్తుంది. ఒకవేళ లిప్ బామ్ తీసుకోవాలనుకుంటే ఏవైనా హెర్బల్స్‌తోె కూడినవి ఎంపిక చేసుకోవడం మంచిది. ఇక చర్మం పగుళ్ల బారిన పడకుండా తేలికపాటి చర్మ సంరక్షణ క్రీములను వాడుకుంటే మేలు. అలాగే సబ్బుల విషయం కూడా జాగ్రత్తగా ఉండాలి. చలికాలంలో గ్లిజరిన్ ఉన్న సోప్ అయితే మీ చర్మం పొడిబారకుండా ఉంటుంది.
Winter season tips: ఇమ్యూనిటీ పెంచుకోండిలా
Winter Tip 4. వింటర్‌లో అనారోగ్యానికి గురి కాకుండా ఉండాలంటే మీ రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉండాలి. అందుకు అవసరమైన ఫుడ్ తీసుకునేలా మీ డైట్ తీర్చిదిద్దుకోవాలి. కూరగాయలు, పండ్లు, ప్రోటీన్ ఉండే మాంసాహారం, గింజ ధాన్యాలు మీరు శీతాకాలంలో ఆరోగ్యంగా ఉండేలా కాపాడుతాయి. నువ్వులు, కొర్రలు, బెల్లం, మెంతి కూర వంటివి చలి నుంచి కాపాడుతాయి. రాత్రి పూట వరి అన్నానికి బదులుగా గోధుమ పిండి రొట్టెలు, లేదా కొర్రల అన్నం మీ శరీరాన్ని వేడిగా ఉంచుతాయి. ఉసిరి కాయ మీ ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది.
Winter season tips: ఫిట్‌నెస్ కోసం ఇలా చేయండి
Winter Tip 5. వింటర్ నుంచి రక్షణకు ముఖ్యమైన టిప్ ఫిట్‌నెస్‌తో ఉండడం. చలికాలం మీరు వ్యాయామం చేయడానికి గానీ, వాకింగ్‌కు వెళ్లడానికి గానీ మనసొప్పదు. చలికి మీరు నిద్ర నుంచి లేవకపోవచ్చు. మెలకువ వచ్చినా లేవడానికి శరీరం సహకరించకపోవచ్చు. అందువల్ల కాస్త మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుని వ్యాయామం చేస్తే లేదా నడకకు వెళితే మీరు చలికాలంలో ఫిట్‌గా ఉంటారు. ముందుగా మీరు ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి ముందు కాసేపు ఇంట్లోనే వార్మప్ అవ్వండి. మరీ బయట చలి, కాలుష్యం ఎక్కువగా ఉంటే యోగాసనాలు వేయడం మేలు. శ్వాసకోస వ్యాధుల ఇబ్బందులు ఉంటే ధ్యానం, ప్రాణాయామం వంటివి చేయడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.
Winter season tips: పెయిన్స్ నుంచి రక్షణకు ఇలా
Winter Tip 6. వింటర్ సీజన్ రాగానే చాలా మందికి పాత నొప్పులు తిరగబెడతాయి. ఈ నొప్పులు చాలా నరకంగా అనిపిస్తాయి. వీటి నుంచి ఉపశమనం కోసం మీ శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచాలి. ఉదయం, సాయంత్రం రెండు పూటలా వార్మప్ ఎక్సర్‌సైజులు చేయడం మరవొద్దు.
Winter season tips: ఈ ప్రమాదాల నుంచి జాగ్రత్త
Winter Tip 7. మీరు అధిక కొలెస్ట్రాల్, అధిక బరువుతో పాటు స్మోకింగ్, ఆల్కహాల్ వంటి అలవాట్లు కలిగి ఉంటే మీరు వింటర్ సీజన్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలి. తెల్లవారుజామున చలికి గుండె పోట్లు, ఇతర స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. మందులను అస్సలు మరవొద్దు. ఆల్కహాల్‌ను పరిమితికి మించి తీసుకోవద్దు. నీరు తక్కువగా తీసుకునే ప్రమాదం ఉన్నందున రాత్రి మీ శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఇది మంచిదికాదు. అలాగే టూ వీలర్ మీద ప్రయాణించే వారు తప్పనిసరిగా చాతీ భాగాన్ని, తల భాగాన్ని చలి నుంచి బాగా కవర్ చేసుకోవాలి.