ఎనీడెస్క్ యాప్ మీ ఫోన్‌లో ఉందా.. జాగ్రత్త!

online fraud

స్మార్ట్‌ ప్రపంచంలో ప్రతీ దానికి ఓ యాప్‌ ఉంటోంది. నిత్య జీవితంలోని మన పనుల్ని సులువు చేయడానికి ఈ యాప్స్‌ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. హెల్త్‌, ఎంటర్‌టైన్‌మెంట్, బిజినెస్‌, సోషల్‌.. ఇలా ప్రతి దాంట్లోనూ ఎన్నో యాప్స్‌ వస్తున్నాయి. ఆండ్రాయిడ్‌ డివైస్‌లలో అయితే ఈ యాప్స్‌కు కొదవే లేదు. ప్లే స్టోర్‌ ఓపెన్‌ చేస్తే లక్షల కొద్దీ యాప్స్‌, గేమ్స్‌ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇందులో మేలు చేసేవి ఎన్ని ఉన్నాయో కీడు చేసేవి అంతకన్నా ఎక్కువే ఉన్నాయి.

చాలా వరకు యాప్స్‌తో వైరస్‌ ముప్పు పొంచి ఉంటుంది. ఇలాగే మన ఆర్థిక లావాదేవీలను సులభతరం చేయడానికి కూడా ఎన్నో యాప్స్‌ మనకు అందుబాటులో ఉన్నాయి. దాదాపు ప్రతి బ్యాంకూ ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించి కస్టమర్లకు సేవలు అందిస్తున్నాయి. ఆయా బ్యాంక్స్‌ యాప్స్‌ వాడటం వల్ల ఎలాంటి ముప్పు లేదు. కానీ వీటి నుంచి డబ్బు దొంగిలించేందుకు ఆస్కారం ఉన్న యాప్స్‌తోనే ముప్పు పొంచి ఉంది. అలాంటివే రెండు యాప్స్‌ ఇప్పుడు భయపెడుతున్నాయి.

సాక్షాత్తూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా ఈ యాప్స్‌తో జాగ్రత్త అంటూ హెచ్చరికలు జారీ 
చేసింది. ఆర్బీఐతోపాటు ప్రముఖ బ్యాంకులైన హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ కూడా తమ కస్టమర్లకు ఇప్పటికే వార్నింగ్‌ ఇచ్చాయి. ఈ యాప్‌ గురించి పూర్తిగా తెలసుకోకుండా వాడారో మీ అకౌంట్‌లోని డబ్బు మాయమవుతుందని చెబుతున్నాయి. 

అసలేంటీ యాప్‌

ఈ యాప్‌ పేరు ఎనీడెస్క్‌ (AnyDesk). చాలా మంది ఈ యాప్‌ గురించి వినే ఉంటారు. కొంత మంది ఇప్పటికీ వాడుతూనే ఉండొచ్చు. కానీ ఈ యాప్‌ ద్వారా కొందరు వ్యక్తులు మీ డబ్బు దొంగిలిస్తున్నారన్న విషయం ఎంతమందికి తెలుసు? ఆర్బీఐ వార్నింగ్‌ ఇచ్చింది కూడా ఈ యాప్‌ గురించే. ఈ యాప్‌ను ఉపయోగించి యూపీఐ ద్వారా మీ డబ్బును దొంగిలిస్తున్నారు కొందరు మోసగాళ్లు. నిజానికి ఈ యాప్‌ డేంజర్‌ కాదు. దీనిని ఎంతోమంది ఐటీ ప్రొఫెషనల్స్‌ వాడుతున్నారు.

ఇదొక రిమోట్ కంట్రోల్ అప్లికేషన్. ఈ యాప్‌ ద్వారా ఎక్కడెక్కడో ఉన్న కంప్యూటర్లు, మొబైల్స్‌ను కనెక్ట్‌ చేయొచ్చు. అంటే ఇదొక స్క్రీన్‌ షేరింగ్‌ ప్లాట్‌ఫామ్‌. ఈ ఎనీ డెస్క్‌లాగే టీమ్‌వ్యూయర్‌ క్విక్‌సపోర్ట్‌ అనే యాప్‌ కూడా ఉంది. ఈ రెండు యాప్స్‌ ద్వారా స్క్రీన్‌ షేరింగ్‌ చేసుకోవచ్చు అని చాలా మందికి తెలుసు. 

మోసగాళ్ల వల

కానీ.. కొందరు మోసగాళ్లు ఈ యాప్‌ ద్వారానే ఆన్‌లైన్‌లో డబ్బు దొంగిలిస్తున్నారన్న విషయం తెలియదు. అసలు మోసం ఎలా జరుగుతుందంటే.. సాధారణంగా రెండు విధాలుగా ఈ మోసం జరుగుతుంది. ఒకటి ఎవరైనా వ్యక్తి తాను కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌ అంటూ మీకు ఫోన్‌ చేయడం ద్వారా.. రెండోది బాధితుడే కస్టమర్‌ కేర్‌కు కాల్‌ చేసి తన సమస్య పరిష్కరించాలని అడిగిన సందర్భంలో ఈ మోసం జరిగే అవకాశం ఉంటుంది.

సదరు వ్యక్తి ఫోన్‌ చేసి మీ ఫోన్‌లో ఎనీడెస్క్‌ లేదా టీమ్‌వ్యూయర్‌ క్విక్‌సపోర్ట్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అడుగుతాడు. ఈ రెండింట్లో ఏదైనా యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత 9 అంకెల కోడ్‌ జనరేట్‌ అవుతుంది. అవతలి వ్యక్తి మీ అకౌంట్‌లో ఉన్న డబ్బు దొంగిలించడానికి ఈ కోడే సాయపడుతుంది.

యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత ఈ 9 అంకెల కోడ్‌ చెప్పాల్సిందిగా అడుగుతారు. ఈ కోడ్‌ చెప్పి, యాప్‌ పర్మిషన్స్‌కు అనుమతి ఇవ్వగానే మీ స్క్రీన్‌ అవతలి వ్యక్తికి కనిపిస్తుంది. మీ స్క్రీన్‌ను ఎప్పటికప్పుడు చూడటమే కాదు.. డేటాను రికార్డు చేసుకునే అవకాశం కూడా సదరు వ్యక్తికి దక్కుతుంది. 

మీరు ఏం చేసినా తెలిసిపోతుంది

ఇక అప్పటి నుంచి మీరు మీ డివైస్‌లో ఏ పని చేసినా.. ఆ వ్యక్తి చూడగలుగుతాడు. మీ మొబైల్‌లో ఉన్న బ్యాంకింగ్‌ యాప్‌ లేదా యూపీఐలో మీ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ టైప్‌ చేసినా కూడా ఆ వ్యక్తికి కనిపిస్తుంది. మీ అకౌంట్‌లోని డబ్బును దొంగిలించడానికి ఇంత కంటే ఇంకేం కావాలి? ఫోన్‌ లాక్‌ చేసి ఉన్న సమయంలో కూడా ఈ ఎనీడెస్క్‌, టీమ్‌వ్యూయర్‌ క్విక్‌సపోర్ట్‌ యాప్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో పని చేస్తూనే ఉంటాయి. ఆ లెక్కన మీ మొబైల్‌లోని డేటా మొత్తం ఎప్పటికప్పుడు అవతలి వ్యక్తి చేరిపోతూనే ఉంటుంది. 

ఆండ్రాయిడ్‌ డివైస్‌లకే డేంజర్‌ ఎక్కువ

సెక్యూరిటీ పరంగా చూస్తే ఆండ్రాయిడ్‌ కంటే ఐఓఎస్‌ అన్ని విధాలుగా బెస్ట్‌ అనడంలో ఎలాంటి డౌట్‌ లేదు. ఆండ్రాయిడ్‌ డివైస్‌లో ఎలాంటి పరిమితులు లేకుండా ఎలాంటి యాప్‌నైనా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అన్నింటికీ యాక్సెస్‌ ఈజీగా లభిస్తుంది. యాప్‌ పర్మిషన్స్‌కు ఓకే చెప్పారంటే చాలు.. ఎనీడెస్క్‌ యాప్‌ ద్వారా మోసగాళ్లు మీ ఆండ్రాయిడ్‌ డివైస్‌లోని డేటానంతా చోరీ చేసేస్తారు. వాళ్లు మీ డేటా దొంగిలిస్తున్న విషయం కూడా మీకు తెలియదు. అదే ఐఫోన్‌ విషయానికి వస్తే ఐఓఎస్‌ నుంచి పీసీకి క్యాస్ట్‌ చేసే అవకాశం ఎనీడెస్క్‌కు ఉండదు. అందువల్ల ఆండ్రాయిడ్‌ ఫోన్లతో పోలిస్తే ఈ యాప్‌ ద్వారా ఐఫోన్‌ యూజర్లకు కాస్త ముప్పు తక్కువనే చెప్పాలి. 

తెలియకపోతే వదిలేయండి

ఎనీడెస్క్‌ అనే కాదు.. ఏ రిమోట్‌ డెస్క్‌టాప్‌ యాప్స్‌ గురించైనా పూర్తిగా తెలియకపోతే డౌన్‌లోడ్‌ చేయకపోవడమే మేలు. సాధారణ మొబైల్‌ ఫోన్‌ యూజర్లకు టెక్‌ ఎక్స్‌పర్ట్స్‌ ఇచ్చే సలహా కూడా ఇదే. ఈ యాప్స్‌ ఎలా పని చేస్తాయో ముందు తెలుసుకోండి. ఇక కస్టమర్‌ కేర్‌ నుంచి కాల్‌ చేస్తున్నామని చెబుతూ.. ఏదైనా యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోమని అడిగితే వెంటనే నో చెప్పేయండి. సాధారణంగా ఏ కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌ యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోమని గానీ, పాస్‌వర్డ్స్‌, కోడ్స్‌ చెప్పమనిగానీ అడగరు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, యూపీఐ యాప్స్‌ ద్వారానే ఇలాంటి మోసాలు జరుగుతుంటాయి. ఎనీడెస్క్‌లాంటి యాప్స్‌ ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు తమ రహస్య సమాచారాన్ని చూస్తున్నారన్న విషయం కూడా కస్టమర్లకు తెలియదు. 

Previous articleTop web series to watch: వెబ్‌ సిరీస్‌లో తప్పక చూడాల్సినవేవి?
Next articleinterior design of home: మీరే ఇంటీరియర్‌ డిజైనర్స్‌.. ఖర్చు లేకుండా..