Natural Oils for Hair growth: జుట్టు ఊడిపోతోందా? ఒత్తుగా పెర‌గాలంటే ఈ నూనెలు ట్రై చేయండి.. రిజ‌ల్ట్ ప‌క్కా!

a collection of skin care products on a pink background
జుట్టుకు పోషణ ఇచ్చే సహజమైన ఆయిల్స్ Photo by pmv chamara on Unsplash

Natural Oils for Hair growth: జుట్టు ఊడిపోతూ ప‌ల్చ‌గా మారుతోందా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా ఉండాల‌ని ఎవరు కోరుకోరు? జుట్టుకు కొన్ని రకాల నూనెలు తేమ‌ను, పోష‌ణ‌ను అందిస్తాయి. సహజ నూనెలు ప్ర‌య‌త్నించ‌డం వ‌ల‌న జుట్టు పెరగడంలో మంచి ఫ‌లితాన్ని చూడ‌వ‌చ్చు. ఆ నూనెలేంటో  తెలుసుకోండి.

1. బాదం నూనె:

జుట్టు ఒత్తుగా, న‌ల్ల‌గా పెర‌గ‌డానికి బాదం నూనె మెరుగ్గా ప‌నిచేస్తుంది. క‌నీసం వారానికి రెండు సార్లు బాదం నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి జుట్టు పెరుగుదల బాగుంటుంది. బాదంలో విట‌మిన్ ఇ ఉండ‌డం వ‌ల‌న జుట్టుకు మంచి పోష‌ణ అంది స‌హ‌జ‌మైన నిగారింపును సంత‌రించుకుంటుంది. జుట్టు చివర్లు విరిగిపోవ‌డం, ఊడిపోవడం వంటి సమస్యలకు దారితీస్తుంది. క‌నుక బాదం నూనె ఇలాంటి స‌మ‌స్య‌ల‌కు చెక్ పెడుతుంది.

2. మందార నూనె:

మందారం జుట్టు సంర‌క్ష‌ణ‌కు ఎంతగానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ప‌లు ర‌కాల జుట్టు స‌మ‌స్య‌ల‌ను నివారిస్తుంది. మందార పువ్వులు మ‌రియు మందార ఆకుల‌తో కూడా జుట్టును సంర‌క్షించ‌వ‌చ్చు. హెయిర్ ప్యాక్‌ల‌ను ఉప‌యోగించి జుట్టు ఒత్తుగా చేసుకోవ‌చ్చు. మందార నూనెను త‌యారు చేయ‌డానికి మందార పువ్వుల‌ను  బాగా ఎండ‌బెట్టి పొడి చేసుకోవాలి. ఆపై మందార పొడి, కొబ్బ‌రి నూనె వేసి మ‌రిగించాలి. త‌ర్వాత దాన్ని వ‌డ‌పోసి త‌ల‌కు రాసుకోవాలి. ఈ నూనెను వారానికి రెండు సార్లు ప‌ట్టించాలి.

3. కలోంజి నూనె:

కలోంజి నూనె ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తుంది. అలాగే జుట్టుకు కూడా మంచి పోష‌ణ‌ను అందిస్తుంది. క‌లోంజి గింజ‌లు మార్కెట్‌లో ల‌భ్య‌మ‌వుతాయి. అవి నల్ల‌గా ఆవాలు మాదిరిగా ఉంటాయి. ఇవి జుట్టును నల్ల‌గా చేయ‌డంలో స‌హ‌య‌ప‌డ‌తాయి. అలాగే  జుట్టు పెరగడంలో కూడా మంచి ఫ‌లితాల‌ను అందిస్తాయి. ముందుగా ఒ కప్పు కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెను వేడి చేయాలి. అందులో ఒక చెంచా కలోంజి గింజలు వేసి మ‌రిగించాలి. తర్వాత ఈ నూనెను వడకట్టి సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఈ నూనె జుట్టుకు జింక్, ఐరన్, పొటాషియం వంటి విటమిన్లు, ఖనిజాలను అందిస్తుంది. పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

4. ఉల్లిపాయ నూనె:

ఉల్లిపాయిలో  ఉండే పోషకాలు జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ముఖ్యంగా ఉల్లిలో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు.. జుట్టు సమస్యలను దూరం చేయడంలో చాలా మెరుగ్గా పనిచేస్తాయి. ఇవన్నీ జుట్టుకు సంబంధించిన స‌మ‌స్య‌ల‌న్నింటిని పోగొడ‌తాయి. జుట్టు  ఒత్తుగా, బలంగా, ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి. చిన్న ఉల్లిపాయలను తీసుకుని  నూనెలో వేసి బాగా మ‌రిగించాలి. అవ‌స‌ర‌మైతే కొద్దిగా క‌రివేపాకుల‌ను కూడా వేసుకోవ‌చ్చు. ఇది చల్లారిన తరువాత వడగట్టి గాజుసీసాలో భద్రపరుచుకోవాలి. ఈ నూనెను వారానికి రెండు లేదా మూడు సార్లు రాత్రి పూట జుట్టుకు పెట్టుకుని తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేయాలి.  ఇలా చేయడం వ‌ల‌న  జుట్టు ఆరోగ్యంగా పెరుగ‌డంతో పాటు నెరిసిపోకుండా ఉంటుంది.

5. కరివేపాకు నూనె:

కరివేపాకు ఆకులు జుట్టు పొడవుగా, ఒత్తుగా  మార్చ‌డంలో ఉప‌యోగ‌ప‌డతాయి. జుట్టును ప‌ట్టు కుచ్చులా త‌యారు చేస్తాయి. క్ర‌మం త‌ప్ప‌కుండా ఈ క‌రివేపాకుతో చేసిన ప్యాక్ గాని నూనె గాని  జుట్టుకు ప‌ట్టించడం వ‌ల‌న జుట్టు దీర్ఘ‌కాలికంగా మంచి నిగారింపుతో ఉంటుంది. చిన్నతనంలోనే నెరిసిపోయే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. 100 గ్రాముల నూనెలో కొన్ని కరివేపాకులను వేసి బాగా వేడిచేయాలి. చల్లారిన తరువాత వడగట్టి గాజు సీసాలో ఉంచుకోవాలి. ఈ నూనెను త‌రుచుగా రాస్తూ ఉంటే జుట్టు ప‌గుళ్లు, జుట్టు రాలిపోవడం వంటి స‌మ‌స్య‌లు తగ్గుతాయి.

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Previous articleచుక్క‌కూర ట‌మాటా క‌ర్రీ రెసిపీ.. ఇలా చేస్తే లొట్టలేసుకుని తింటారు
Next articleఇడ్లీలు మిగిలిపోయాయా! అయితే ఇలా ఉప్మా చేస్తే భలే రుచిగా ఉంటుంది