వాయు కాలుష్యం కారణగా ఇంట్లో స్వచ్ఛమైన గాలి పీల్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ప్రపంచీకరణ ముసుగులో ఇప్పుడు మనిషి ముందుకెళ్తున్నాడా లేక వెనక్కి వెళ్తున్నాడా తెలియని పరిస్థితి. అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసం భవిష్యత్ తరాల మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది.
ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో రోజురోజుకూ పెరిగిపోతున్నకాలుష్యం మనుషుల ప్రాణాలు తీస్తోంది. ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా వాయు కాలుష్యం కారణంగా 42 లక్షల మంది చనిపోతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మన దేశంలోనూ నగరాలు కాలుష్యకాసారాలుగా మారిపోయాయి. రాజధాని ఢిల్లీతో పాటు ఆర్థిక రాజధాని ముంబై, మన హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలాంటి నగరాల్లో కాలుష్యం ప్రమాదకరస్థాయిని మించిపోతోంది.
కాలుష్యాన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా.. సుప్రీం కోర్టే రంగంలోకి దిగి ఎన్నో ఆంక్షలు విధించినా కాలుష్యం ముప్పు మాత్రం తొలగడం లేదు. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో బయట అడుగు పెట్టాలంటే వాయు కాలుష్యం బెంబేలెత్తిస్తోంది.
అయితే బయటి సంగతి పక్కన పెట్టండి.. అసలు మీ ఇంట్లోనైనా మీరు స్వచ్ఛమైన గాలిని పీలుస్తున్నారా? ఇంట్లో గాలి స్వచ్ఛంగా లేకపోతే వచ్చే సమస్యలు, వాటిని నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోండి.
ఇంట్లో ఉక్కపోత ఎక్కువగా ఉందా?
సాధారణంగా నగరాలు, పట్టణాల్లో ఇళ్లు చాలా ఇరుగ్గా ఉంటాయి. ఇలాంటి ఇళ్లలో వెంటిలేషన్ సమస్య సర్వసాధారణం. దీని కారణంగా ఇంట్లోని గాల్లో తేమ అధికమై ఉక్కపోత వేధిస్తుంది. మీ ఇంట్లోనూ ఇలాంటి పరిస్థితే ఉందంటే.. ఇంట్లో స్వచ్ఛమైన గాలి రావడం లేదన్న విషయాన్ని గమనించాలి.
దీనివల్ల ఇంట్లోని దుమ్ము, దూళి బయటకు వెళ్లే అవకాశం కూడా ఉండదు. ఆ దుమ్ము, దూళితో కూడిన గాలినే పీల్చడం వల్ల మీరు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంటుంది. పైగా ఇంట్లో తేమ ఎక్కువగా ఉండటం వల్ల బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. ఇది కచ్చితంగా మీ ఆరోగ్యంపై ప్రభావం చూపించేదే.
ఆరోగ్య సమస్యలు
మనకు, మన ఇంట్లో వాళ్లకు తరచూ వచ్చే పలు ఆరోగ్య సమస్యలు కూడా ఇంట్లో గాలి కాలుష్యానికి సూచికలుగా పని చేస్తాయి. తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారంటే దానికి మీ బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ ఒక్కటే కారణం కాదు.
ఇంట్లోని గాలి నాణ్యత నాసిరకంగా ఉన్నాఅనారోగ్యాలు వస్తుంటాయి. ఇంట్లో స్వచ్ఛమైన గాలి లేకపోవడం వల్ల తరచూ ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయని గుర్తుంచుకోండి.
-
అలసట, నీరసం
-
ముక్కు, కళ్లు, గొంతు తడారిపోయినట్లుగా అనిపించడం
-
కడుపులో వికారంగా అనిపించడం
-
మైకం
-
తలనొప్పి
-
అలెర్జీలు
-
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు
-
ముక్కు కారడం, సైనస్
ఇతర అనారోగ్య సమస్యలు వచ్చినపుడు కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే మీరు కేవలం ఇంట్లో ఉన్నంతసేపు మాత్రమే ఈ లక్షణాలు కనిపించడం, ఆఫీసుకో, మరో ప్రాంతానికో వెళ్లినపుడు కనిపించకపోవడం లాంటివి జరిగితే కచ్చితంగా మీ ఇంట్లో గాలి నాణ్యత ఆందోళన కలిగించేదేనని గుర్తించాలి.
సమస్యకు మూలాలు గుర్తించకుండా మన ఆరోగ్యంపై ఆందోళన చెందుతూ వేలాది రూపాయలు వైద్య పరీక్షలకు వెచ్చిస్తూ మానసిక క్షోభను అనుభవిస్తాం. అందువల్ల ముందుగా లోపం ఎక్కడ ఉందో గుర్తించండి.
ఇల్లు రిపేర్ చేయించారా?
చాలా మంది తమ ఇంటిని మరింత అందంగా, సౌలభ్యంగా ఉండేలా తీర్చిదిద్దుకోవడానికి రిపేర్లు చేస్తుంటారు. దీనివల్ల ఇల్లు బాగా కనిపిస్తుందేమోగానీ అది ఇంట్లోని గాలి నాణ్యతను దెబ్బ తీస్తుందన్న విషయం చాలా మందికి తెలియదు. ఉదాహరణకు ఇంటికి రంగులు వేయించినా, ఫ్లోరింగ్‌ను మార్చినా కొన్ని కెమికల్స్ విడుదలవుతాయి.
మీ ఇంట్లో మంచి ఎయిర్ ఫిల్టర్ లేకపోతే ఈ రసాయనాలు ఎప్పటికీ ఇంట్లోనే ఉండిపోతాయి. అలా జరగకుండా ఉండాలంటే.. రిపేర్లు పూర్తయిన వెంటనే ఇంటిని బాగా శుభ్రం చేసుకోవాలి. వీలైతే మంచి ఎయిర్ ప్యూరిఫయర్‌ను ఇంట్లోకి ఉంచుకునే ప్రయత్నం చేయాలి. దీనివల్ల గాల్లోని ప్రమాదకర అణువులు బయటకు వెళ్లిపోయి మీకు స్వచ్ఛమైన గాలి అందుతుంది.
ఇంట్లో ఎయిర్ ఫిల్టర్‌ను మారుస్తున్నారా?
స్వచ్ఛమైన నీటి కోసం ప్యూరిఫయర్లను ఇళ్లలో వాడటం సాధారణమైపోయింది. అలాగే నగరాల్లో స్వచ్ఛమైన గాలి కోసం ఇంట్లోనే ఎయిర్ ఫ్యూరిఫయర్లను ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయి. అయితే వీటిలో ఎయిర్ ఫిల్టర్లను కూడా ప్రతి మూడు నెలలకోసారి మార్చకపోతే మాత్రం ముప్పు తప్పదు.
వాటర్ ఫ్యూరిఫయర్లలో ఫిల్టర్లను ఎలా మారుస్తున్నారో.. ఎయిర్ ప్యూరిఫయర్‌లో కూడా ఫిల్టర్లను మార్చాలి. అప్పుడే ఇంట్లోని గాలి నాణ్యత మెరుగవుతుంది. అందువల్ల ఎయిర్ ఫిల్టర్‌ను సమయానుకూలంగా మార్చే అలవాటు చేసుకోండి. మరచిపోకుండా ఉండేందుకు మీ మొబైల్ ఫోన్లో ఓ రిమైండర్ కూడా పెట్టుకోండి.
ఇంట్లో మొక్కలు పెంచుదామా?
ఇంట్లో గాలిలో నాణ్యత లేదని భావించినప్పుడు ఇంట్లో పెంచే మొక్కలను సేకరించి పెంచండి. నర్సరీల్లో, ఆన్ లైన్ ఈ కామర్స్ వెబ్ సైట్లలో ఇవి లభిస్తాయి. గాలిలో నత్రజనిని సంగ్రహించి ఇవి ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. ఒకరకంగా ఎయిర్ ఫూరిఫయర్లుగా పనిచేస్తాయి. ఇలాంటి మొక్కలు పెంచినప్పుడు గాలిలో నాణ్యత పెరగడమే కాకుండా.. మనసు ఉల్లాసంగా ఉంటుంది.
వీటిని గమనించండి
-
గాలిలో నాణ్యత కొరవడి అలర్జీ బారిన పడి ఉంటే కారణాలు గుర్తించే ప్రయత్నం చేయండి.
-
దోమల నివారణకు వాడే మస్కిటో రెపెలెంట్స్, గాఢమైన ఫ్లోర్ క్లీనర్లు, ఇతర రసాయనాలు వెలువరించే ఉత్పత్తులు వాడుతున్నారో గమనించాలి.
-
రసాయనాలు కాకుండా వేప నూనె వంటి వాటిని వాడడం వల్ల దోమలను నివారించవచ్చు. గోడల రంగులు అలర్జీలకు కారణమవుతున్నాయా చూడాలి. మార్కెట్లో వీటికి ప్రత్యామ్నాయ రంగులు కూడా వచ్చాయి.
-
అలాగే నిత్యం తలుపులు మూసి ఉంచడం కాకుండా.. గాలి దారాళంగా వచ్చేలా చూస్తే మీ ఆరోగ్యం తప్పనిసరిగా మెరుగవుతుందనడంలో అతిశయోక్తి లేదు.
ఇవి కూడా చదవండి