ప్రతి ఒక్కరికి గోవా వెళ్లాలని ఉంటుంది. కానీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మధ్యతరగతి, దిగువ మధ్య తరగతికి చెందిన యువకులు వెళ్లడానికి వెనుకాడతారు. అలాంటి వారికి తక్కువ ఖర్చుతో గుర్తుండిపోయేలా విమానంలో గోవా టూర్ ఎలా వెళ్లాలో వివరించే ప్రయత్నం ఇది. సహజంగా గోవా అనగానే మిత్రులతోనే వెళతారు కాబట్టి ఇద్దరు టూర్ వెళితే ఎంత ఖర్చవుతుందన్నది ఈ కథనంలో డియర్ అర్బన్ డాట్ కామ్ అందిస్తోంది. హనీమూన్ ట్రిప్ గా వెళ్లేవారికీ ఇది ఉపయోగపడుతుంది.
సింహభాగం విమాన ప్రయాణానికే..
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే వారికి హైదరాబాద్ విమానాశ్రయం నుంచి విమాన ప్రయాణం చేయడం ఉత్తమం. విజయవాడ, విశాఖ పట్నం, తిరుపతి నుంచి ఎక్కువ విమానాలు గోవాకి వెళ్లవు కాబట్టి అక్కడ నుంచి ధర ఎక్కువగా ఉంటుంది. అందుకే హైదరాబాద్ విమానాశ్రయం ఉత్తమ ఎంపిక అవుతుంది.
నెల లేదా రెండు నెలల ముందు విమాన ప్రయాణానికి కావాల్సిన టికెట్లు బుక్ చేసుకుంటే వెళ్లేందుకు రూ. 1800, వచ్చేందుకు రూ. 1800 ఉంటుంది. అన్ని టాక్సులు కలుపుకుని రానూపోనూ ఒక్కక్కరికి రూ. 4 వేలకే విమాన టికెట్లు వస్తాయి. దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ నుంచైనా హైదరాబాద్ రావడానికి సుమారు రూ. 500 వరకు అవుతుంది.
దాని ప్రకారం చూసుకుంటే ఇద్దరి వ్యక్తులకు విమాన ఛార్జులు ఒక్కొక్కరికి రూ. 4 వేల చొప్పున రూ. 8 వేలు, బయటప్రాంతం నుంచి రావడానికి రూ. 1000, హైదరాబాద్ సిటీ నుంచి శంషాబాద్ లోని విమానాశ్రాయన్ని చేరుకోవడానికి క్యాబ్ రూ. 700, మొత్తం కలిపి గోవా విమానాశ్రయం వరకు చేరుకుని తిరిగి రావడానికి ఇద్దరికీ రూ. 9700 అవుతుంది.
హోటల్ లో ఎలాంటి వసతులు ఉండాలి…
గోవాలో అకామిడేషన్ కే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి. దాని కోసం సీజన్ బట్టి చూసుకుని హోటల్ ఎంపిక చేయాలి. తీసుకునే హోటల్ లో తప్పకుండా స్విమ్మింగ్ ఫూల్ ఉండేలా చూసుకుంటే ఒక మంచి అనుభవం ఉంటుంది. బీచ్ లో ఉప్పునీటితో ఎంత సేపు ఆడుకున్నా.. మామూలు నీటిలో కాసేపు సేదతీరితో ఆ ఫీల్ బావుంటుంది. అందుకే స్విమ్మింగ్ ఫూల్ ఉండేలా చూసుకోవాలి.
విమానాశ్రయానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉండే కాలంగేట్ ప్రాంతంలో మన బస ఉంటే బావుంటుంది. ఎందుకంటే గోవాలో చాలా బీచ్ లు ఉన్నా ’బాగా‘ బీచ్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. నీళ్లల్లోకి దిగేందుకు వీలైన బీచ్ లలో బాగా ముందుంటుంది. లోతు తక్కువగా, నీళ్లల్లో ఆడేందుకు అనువుగా అనుకూలంగా ఉండే ప్రాంతమంది. అందుకే పర్యాటకుల్లో ఎక్కుమంది అక్కడే బస చేసేందుకు ఇష్టపడుతూ ఉంటారు. స్విమ్మింగ్ పూల్, మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ వంటి వసతులు ఉండాలంటే సుమారుగా రూ. 1800 వరకు వెచ్చించాల్సి వస్తుంది.
ఎలా ప్లాన్ చేసుకోవాలి..
ఉదాహరణకు మనం శుక్రవారం నుంచి ఆదివారం దాక గోవాలో ఉండేలా ప్లాన్ చేసుకుంటే దానికి అనుగుణంగా రెండు రోజులకు హోటల్ రూం బుక్ చేసుకోవచ్చు. అంటే మీరు శుక్రవారం ఉదయం మనం చెకిన్ అయ్యేలా చూసుకోవాలి. మళ్లీ ఆదివారం ఉదయం చెక్ అవుట్ అయ్యేలా బుక్ చేసుకోవాలి. అంటే ఇద్దరు వ్యక్తులకు రెండు రోజులకు గాను రూ. 3600 వరకు ఛార్జ్ చేస్తారు. ఏసీ సౌకర్యం ఉన్న ఒక బెడ్ రూం, ఒక లివింగ్ రూం, అటాచ్డ్ బాత్ రూం, బాల్కానీ ఉంటుంది. ఇద్దరికి చక్కగా సరిపోతుంది. అయితే మనం ఇంకో ఖర్చు గురించి చెప్పుకోలేదు. అదే గోవా ఎయిర్ పోర్టు నుంచి కాలంగేట్ ప్రాంతానికి క్యాబ్ కి రూ. 1100 ఛార్జ్ చేస్తారు.
గోవాలో సైట్ సీయింగ్ ఇలా ప్లాన్ చేయండి..
మూడు రోజులు ఎప్పుడు ఎక్కడికి వెళితే బావుంటుంది.. మొదటి రోజు అంటే మీరు శుక్రవారం వెళ్లారనుకుందాం. అదే రోజు హోటల్ లో చెకిన్ అయిన తరువాత దగ్గర్లో రెండు బీచ్ లున్నాయి. ఒకటి ’కాలంగేట్‘ బీచ్, రెండోది దాని దగ్గర్లోనే ఉండే ’బాగా‘ బీచ్.
ఈ రెండు ప్రముఖమైనవే కాబట్టి ఆ రోజుకు ఆ రెండు బీచ్ లు కవర్ చేసి, నీళ్లల్లో దిగి ఎంజాయ్ చేయొచ్చు. అయితే హోటల్ రూం నుంచి బీచ్ కి వెళ్లేందుకు ఎటువంటి వాహనం లేకుండానే చక్కగా నడిచి వెళ్లిపోవచ్చు. చాలా దగ్గరగా ఉంటుంది. అదే విధంగా కాలంగేట్ బీచ్ నుంచి బాగా బీచ్ కి నడిచి వెళ్లొచ్చు. అంటే ఆ రోజు లోకల్ లో తిరిగేందుకు వాహనం అవసరం లేదన్నమాట. ఆ రోజు బోజనం చేసేందుకు బీచ్ లోనే రెస్టారెంట్స్ ఉంటాయి. అక్కడే తినేయొచ్చు. ఒక్కో వ్యక్తికి సుమారు రూ. 200 అవుతుంది. లేదంటే రెండు కి.మీ పరిధిలోనే కె.ఎఫ్.సి., మెక్ డొనాల్డ్స్, సబ్ వే వంటి అంతర్జాతీయ సంస్థల రెస్టారెంట్లు కూడా ఉంటాయి. వాటితోపాటు ఉడిపి, పంజాబీ దాబాలు కూడా అందుబాటులోనే ఉంటాయి.
లోకల్ టూర్ ఇలా..
ఈ రెండు బీచ్ లలోనే వాటర్ గేమ్స్ ఉంటాయి. దాదాపు ఆరు రకాలు ఉంటాయి. వీటికి రకరకాల రుసుములు ఉంటాయి. తరువాత ఉండే రెండు రోజు నార్త్ గోవా డే టూర్ ఒక రోజు, సౌత్ గోవా డే టూర్ ఒక రోజు వెళ్లొచ్చు. ఒక్కక్కరికి ఏసీ బస్ లో రూ. 350 ఛార్జ్ చేస్తారు. రెండు రోజులకు ఇద్దరికి కలిపి రూ. 1400 ఖర్చు అవుతుంది. కాలంగేట్ నుంచే టూర్ మొదలవుతుంది.
మరుసటి రోజు ఉదయం 8.30కి టూర్ స్టార్ట్ అవుతుంది. కాలంగేట్, బాగా బీచ్ దగ్గర్లోనే పికప్ పాయింట్ ఉంటుంది.
సౌత్ గోవాలో చూపించే ప్రదేశాలు..
1. మిరామర్ బీచ్, 2. డోనా పౌలా, 3. బామ్ జీసస్ ఆఫ్ బాసిలికా(గోవాలో పురాతనమైన చర్చ్), 4. ST కెతెడ్రల్ , 5. మంగూషి టెంపుల్, 6. శంతదుర్గా దేవాలయం, వీటితోపాటు రివర్ క్రూయీజ్ కి వెళ్లాలి అనుకున్నవాళ్లని తీసుకెళతారు. దానికి ప్రత్యేకంగా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ ట్రిప్ లో భోజనం వాళ్లు పెట్టరు. మనమే కొనుగోలు చేసుకోవాలి. https://goatoursplanner.com/ సైట్ వాళ్లు దీన్ని ఆఫర్ చేస్తున్నారు. ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు.
నార్త్ గోవాలో చూపించే ప్రదేశాలు..
1. అగుడా ఫోర్డ్, 2. వాగటార్ బీచ్, 3. అంజునా బీచ్, 4. మర్జింబీచ్, 5. అశ్వమ్ బీచ్ చూపిస్తారు. శని, ఆది వారాల్లో ఆ రెండు ట్రిప్స్ పూర్తి చేస్తే దాదాపు గోవాలో చూసే ముఖ్యమైన బీచ్ లు, ప్రదేశాలు పూర్తి అవుతాయి.
అయితే ఆదివారం ట్రిప్ కి వెళ్లే సమయంలో హోటల్ లో చెకవుట్ చేసి లగేజ్ తీసుకుని ట్రిప్ కి వెళ్లి అటు నుంచే అటే నేరుగా విమానాశ్రయానికి వెళిపోవచ్చు.
అంటే శుక్రవారం ఉదయం గోవా వచ్చేలా, ఆదివారం రాత్రి తిరిగి వెళ్లేలా ప్రయాణ టికెట్లు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే పూర్తిస్థాయిలో మూడు రోజులు ఎంజాయ్ చేయొచ్చు.
బైక్స్ పైనా వెళ్లొచ్చు…
ఇలా వాళ్లు ఇచ్చిన ఫిక్స్ డ్ టూర్ కి వెళ్లకుండా మనకు నచ్చివ విధంగా వెళ్లాలి అనుకుంటే స్కూటీ అద్దెకు తీసుకోవచ్చు. రోజుకు మామూలు రోజుల్లో రూ. 300 తీసుకుంటారు. అదే సీజన్ లో అయితే రూ. 500 వరకు ఛార్జ్ చేస్తారు. దాంట్లో రూ. 300 పెట్రోల్ పోయిస్తే నార్త్, సౌత్ గోవా వాళ్లు చెప్పినట్లు గూగుల్ మ్యాప్ పెట్టుకుని సులభంగా వెళ్లొచ్చు.. ఇంకా ఎక్కువ ప్రదేశాలు కూడా కవర్ చేయొచ్చు.. కావాల్సిన చోట ఎక్కుసేపు ఉండొచ్చు. మనకి నచ్చిన చోట తక్కువ సేపు ఉండేలా మనమే సొంతంగా ప్లాన్ చేసుకోవచ్చు… అంటే టూర్ కి రూ. 1400 ఖర్చు పెట్టే బదులు బైక్ తీసుకుంటే రూ. 1000లోపే అవుతుంది.
కాకపోతే బైక్ తీసుకునే వారు తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలి. డ్రైవింగ్ లైసెన్స్ తప్పని సరిగా ఉండాలి. హెల్మెట్ బైక్స్ అద్దెకు ఇచ్చేవాళ్లే ఇస్తారు కాబట్టి మనం డ్రైవింగ్ లైసెన్స్ ఉండేలా చూసుకుంటే చాలు. మరోవైపు రాష్ డ్రైవింగ్ చేసినా, దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా భారీ స్థాయిలో జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఆ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
ఒక్కొక్కరికి రూ. 10 వేలు..
మొత్తం రూ.19900 అంటే ఒక్కొక్కరికి రూ. 10వేల లోపే గోవా ట్రిప్ పూర్తి చేయొచ్చు. హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుంచి తిరిగి వెళ్లే టప్పుడు ప్రీపెయిడ్ ట్యాక్సీలు కాకుండా బస్సు లేదా, బయటకు వస్తే చాలా మంది క్యాబ్ డ్రైవర్లు సిద్దంగా ఉంటారు. అయితే వాళ్ల కోసం పార్కింగ్ దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది. ఇద్దరికి ఎంజీబీఎస్ కి రూ. 500లో తీసుకెళతారు. ఆర్టీసీ బస్సులో కూడా వెళ్లొచ్చు. ఖర్చుల జాబితా కింద మరొకసారి పరిశీలించండి.
ఖర్చు | రూపాయల్లో |
విమాన ఛార్జీలు ఇద్దరికి | 8,000 |
స్వస్థలం నుంచి హైదరాబాద్ కు సుమారు | 1,000 |
సిటీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి | 700 |
గోవా నుంచి హోటల్ రూంకి | 1,100 |
హోటల్ రూంకి రెండు రోజులకు | 3,600 |
నార్త్, సౌత్ గోవా ట్రిప్స్ ఇద్దరికి | 1,400 |
కాలంగేట్ నుంచి గోవా విమానశ్రయానికి | 1,100 |
హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుంచి సిటీకి | 500 |
హైదరాబాద్ నుంచి సొంత ప్రాంతానికి | 1,000 |
భోజనానికి ఇద్దరికి మూడురోజులు | 1,500 |
మొత్తం | 19,900 |
ఇవి కూడా చదవండి